కొత్త పేరు... సరికొత్త రూపు, రంగుతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌ను ఘనంగా ప్రారంభించింది. తనకే చెల్లిన రీతిలో యువ రిషభ్ పంత్ చెలరేగిపోవడంతో ఆ జట్టు అద్భుత విజయంతో బోణీ చేసింది. ఢిల్లీ భారీ స్కోరును ఛేదించే క్రమంలో యువరాజ్ ముందుండి కొంత పోరాడినా చివరకు ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు.
ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (27 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత అర్ధసెంచరీ సాధించగా... ఇంగ్రామ్ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్ (36 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్రామ్, పంత్ దెబ్బకు ఆరుగురు ముంబై బౌలర్లు కనిష్టంగా 10 ఎకానమీ చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
పంత్ విధ్వంసం...
వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం తనను తాను నిరూపించుకునే ప్రయత్నం, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. తొలి ఐదు బంతుల్లో ఒకే పరుగు చేసిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కటింగ్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదిన తర్వాత హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6 కొట్టాడు. మెక్లీనగన్ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ బుమ్రానూ పంత్ వదల్లేదు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ కొట్టిన అతను... బుమ్రానే వేసిన 20వ ఓవర్లో కూడా మరో భారీ సిక్స్ బాదాడు. ఈ రెండు ఓవర్ల మధ్య జమ్మూ కశ్మీర్‌కు చెందిన కొత్త బౌలర్ రసిఖ్ సలామ్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడం విశేషం. 18 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన క్యాపిటల్స్ తర్వాతి పది ఓవర్లలో 131 పరుగులు సాధించింది. ఇందులో పంత్ జోరు మొదలైన తర్వాత చివరి 6 ఓవర్లలో వచ్చిన 99 పరుగులు ఉన్నాయి.
ఇంగ్రామ్, ధావన్ కూడా...
సుదీర్ఘ కాలం తర్వాత సొంత టీమ్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన శిఖర్ ధావన్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న 13వ బంతికి తొలి ఫోర్ కొట్టిన ధావన్... మెక్లీనగన్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో అలరించాడు. చివరకు హార్దిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు ఇంగ్రామ్ ఇన్నింగ్స్ కూడా హైలైట్‌గా నిలిచింది. 2011 ఐపీఎల్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను ఇప్పుడు పునరాగమనం చేశాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను... హార్దిక్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. కృనాల్ ఓవర్లో అతను మూడు ఫోర్లతో జోరును ప్రదర్శించడం విశేషం.
ఆకట్టుకున్న యువీ...
ముంబై తరఫున సీనియర్ యువరాజ్ సింగ్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డ అతను ఆ తర్వాత ఆకట్టుకునే స్ట్రోక్స్ ఆడాడు. అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో జోరు మొదలు పెట్టిన యువీ... అక్షర్ మరో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు.
బుమ్రాకు గాయం...
ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి బంతికి పేసర్ బుమ్రా గాయపడ్డాడు. పంత్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా అతని ఎడమ చేయి సహకరించలేదు. నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న అతను బాధతో విలవిల్లాడాడు. సరిగ్గా ఏం జరిగిందో తెలియకపోగా, అతని గాయంపై ముంబై స్పష్టతనివ్వలేదు. తమ ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్‌కు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం!
Comments
Please login to add a commentAdd a comment