ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ఆరంభించింది. పేరు, జెర్సీతో పాటు ఆటతీరును కూడా మార్చుకుని సమిష్టి కృషితో విజయం సాధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ విజయ ఢంకా మోగించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆది నుంచి కష్టాలే ఎదురయ్యాయి. ఓపెనర్, సారథి రోహిత్ శర్మ(14) వెంటనే వెనుదిరిగాడు. డికాక్(27), సూర్యకుమార్ యాదవ్(2)లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓ వైపు రన్‌రేట్ పెరుగుతుండగా.. మరో వైపు యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో రోహిత్ సేన ఓటమి లాంఛనమైంది. 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబడాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, తెవాటియా, బౌల్ట్, అక్షర్‌లు తలో వికెట్ సాధించారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్ అయ్యర్(16) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో శిఖర్ ధావన్-ఇన్‌గ్రామ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది. అయితే ధావన్(43: 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఇన్‌గ్రామ్(47: 32బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్)లు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. ఆపై రిషభ్ పంత్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. అటు తర్వాత మరింత వేగంగా ఆడాడు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్పర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గాన్ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్ పాండ్యా, బెన్ కట్టింగ్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment