సాగర తీరంలో తాడోపేడో | Sunrisers Hyderabad faced 2nd playoff with delhi capitals | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో తాడోపేడో

Published Wed, May 8 2019 12:24 AM | Last Updated on Wed, May 8 2019 12:24 AM

Sunrisers Hyderabad faced 2nd playoff with delhi capitals - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ (692 పరుగులు); కగిసొ రబడ (25 వికెట్లు)... బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఐపీఎల్‌–12 సీజన్‌ టాపర్లు వీరు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను వార్నర్‌ ఒంటిచేత్తో ముందుకు నడిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ను పదునైన పేస్‌తో రబడ ఒడ్డున పడేశాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ కాబట్టి గెలిస్తేనే లీగ్‌లో ముందుకెళ్లే అవకాశం ఉన్న స్థితిలో రెండు జట్లూ వీరు లేకుండానే తలపడబోతున్నాయి. బలాబలాలు విశ్లేషించి చూస్తే... బ్యాటింగ్‌లో పటిçష్టంగా ఉన్న ఢిల్లీ ముందు హైదరాబాద్‌ కొంత డీలాగా కనిపిస్తోంది. కానీ, బౌలింగ్‌ బలగంతో ప్రత్యర్థిని కట్టిపడేసే సన్‌రైజర్స్‌ తేలిగ్గా తలొగ్గకపోవచ్చు. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేరుతో పాటు ఆటతీరూ మార్చుకుని ఏడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్‌ చేరిన ఢిల్లీ... గతేడాది రన్నరప్‌ హైదరాబాద్‌ సాగరతీరాన అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్‌–12లో భాగంగా బుధవారం రెండు జట్ల మధ్య ఇక్కడి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఢిల్లీ టాపార్డర్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంటే, హైదరాబాద్‌ బౌలింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. లీగ్‌ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే ప్లే ఆఫ్స్‌ చేరగా, సన్‌రైజర్స్‌కు అదృష్టం తోడై బయటపడింది. అనూహ్యంగా మారిన వేదికపై కీలకమైన మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. 

అదే హైదరా‘బాధ’... 
ముందు బెయిర్‌స్టో, తర్వాత వార్నర్‌ దూరమవడం, ప్రత్యామ్నాయంగా షకీబుల్‌ హసన్‌ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారిపోయింది. ఈ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు తోడు భువనేశ్వర్, రషీద్‌ ఖాన్‌ వంటి బౌలర్లతో ఓ దశలో హైదరాబాద్‌ అత్యంత పటిష్ఠంగా కనిపించింది. ఎప్పుడైతే ఓపెనర్లు వెళ్లిపోయారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. నెట్‌ రన్‌రేట్‌ ఆదుకోవడంతో లీగ్‌ చరిత్రలో తొలిసారిగా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ రన్‌రేట్‌ కూడా వార్నర్, బెయిర్‌స్టోల దూకుడైన ఆట పుణ్యమే. ఇప్పుడు ఈ బలహీనతలన్నీ అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించే గప్టిల్, వృద్ధిమాన్‌ సాహాలపై పెద్ద బాధ్యతే ఉంది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే, నాలుగో స్థానంలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌ సానుకూలాంశం. వీరి తర్వాత విజయ్‌ శంకర్, నబీ, యూసుఫ్‌ పఠాన్‌ స్కోరును నడిపించాలి. భువీ పొదుపుగానే బౌలింగ్‌ చేస్తున్నా, మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అతడు తిరిగి లయ అందుకుంటే జట్టుకు మేలు. పేసర్లు థంపి, ఖలీల్‌ మెరుగ్గా రాణిస్తున్నారు. విజయ్‌ మాత్రం పరుగులిస్తున్నాడు. ఫీల్డింగ్‌లో జట్టుకు తిరుగులేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంచి నా తేల్చినా అంతా

బ్యాట్స్‌మెన్‌ చేతుల్లోనే.  ఢిల్లీ ఢీకొట్టేలా... 
గతేడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన శిఖర్‌ ధావన్‌... ఈసారి ఢిల్లీ ఫ్లే ఆఫ్స్‌ చేరడంలో కీలకంగా నిలిచాడు. యువ ఓపెనర్‌ పృథ్వీ షా తడబడుతున్నా ధావన్‌ జోరుతో ఆ ప్రభావం కనిపించడం లేదు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడితే భారీ స్కోరు ఖాయం. వీరు విఫలమైతేనే ఇబ్బందికరం. హిట్టర్లయినప్పటికీ నిలకడ కొరవడిన ఇంగ్రామ్, రూథర్‌ఫర్డ్‌ల  నుంచి ఎక్కువ ఆశించలేం. బౌలింగ్‌లో రబడ లోటును ఎడమ చేతివాటం పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పూడ్చాడు. ఇషాంత్‌ కచ్చితత్వం చూపుతున్నాడు. అక్షర్‌ పటేల్, అమిత్‌ మిశ్రా స్పిన్‌ ప్రభావవంతంగా ఉంది. జట్టులోని వారు ఏదో ఒక దశలో గట్టెక్కిస్తుండటంతో ఢిల్లీ ఇక్కడివరకు వచ్చింది. బ్యాటింగ్‌ త్రయం (ధావన్‌–అయ్యర్‌–పంత్‌) చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటుంది. 

విశాఖ వాసులకు భలే ఛాన్సులే 
అందాల విశాఖపట్నం వాసులకు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల నిర్వహణ రూపంలో ఐపీఎల్‌ మెరుపులను చూసే భాగ్యం దక్కింది. లీగ్‌కు సంబంధించి... మామూలు పరిస్థితుల్లో అయినా ఇక్కడ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. కానీ, చెన్నై స్టేడియంలో స్టాండ్స్‌ వివాదం కారణంగా అనూహ్యంగా వైజాగ్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు వేదికైంది. పైగా ఒకటి కాదు రెండు మ్యాచ్‌లు అవి కూడా కీలకమైనవి జరుగనుండటంతో స్థానికుల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. అన్నింటికి మించి వాతావరణం పూర్తి ప్రశాంతంగా ఉండే వేళ రాత్రి 7.30కు మ్యాచ్‌లు ప్రారంభం కానుండంతో నగర వాసులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వీరే కీలకం 
విలియమ్సన్‌
పిచ్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధించే విలియమ్సన్‌... సంప్రదాయ షాట్లతో అంతే వేగంగా చాప కింద నీరులా స్కోరును నడిపిస్తాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుపై చివరి వరకు నిలిచి దీనిని మరోసారి నిరూపించాడు. 

మనీశ్‌ పాండే
కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతడిని వన్‌డౌన్‌లో పంపడం జట్టుకు మేలు చేసింది. దూకుడుగానూ ఆడగలడు. 

భువనేశ్వర్‌
మిగతా ఇద్దరు పేసర్లు సందీప్‌ శర్మ, సిద్ధార్థ కౌల్‌ ఈసారి విఫలమైనా భువనేశ్వర్‌ మాత్రం ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వికెట్లు (11) మాత్రం తక్కువ తీశాడు. 

రషీద్‌
ఈ సీజన్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు లొంగినా మొత్తమ్మీద ఇతడి బౌలింగ్‌  ఆడటం కష్టమే. 

ధావన్‌
ఫ్రాంచైజీ మారినా, బ్యాటింగ్‌లో అదే నిలకడ చూపుతూ ఈ సీజన్‌లో 450 పరుగులు చేశాడు. పవర్‌ ప్లే ఓవర్లలో చకచకా పరుగులు సాధిస్తున్నాడు. 

అయ్యర్‌ 
కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 442 పైగా పరుగులు చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

పంత్‌
దూకుడైన బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చేసే పంత్‌... ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు అంత నష్టం. ఈ సీజన్‌లో 401 పరుగులు చేశాడు. 

అమిత్‌ మిశ్రా
ఐపీఎల్‌లో 150కిపైగా వికెట్లు తీసిన ఈ వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ మ్యాచ్‌ మలుపుతిప్పే స్పెల్‌ వేయగలడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement