కోల్‌కతా గడ్డ ఈడెన్‌లో ఢిల్లీ గర్జించింది. శిఖర్ ధావన్ తన జట్టు గెలిచేదాకా నిలవగా, అతనికి రిషభ్ పంత్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్పిన్, పేస్ తేడా లేకుండా ప్రతీ బౌలర్‌ను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కోవడంతో ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది.
కోల్‌కతా: చాన్నాళ్ల తర్వాత శిఖర్ ధావన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గెలిచే దాకా క్రీజు వీడకుండా పోరాడాడు. దీంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధిం చాడు. రసెల్ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (63 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
రాణించిన శుబ్‌మన్
టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి బంతికే ఓపెనర్ జో డెన్లీ (0) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్‌లో అతను డకౌటయ్యాడు. మరోవైపు ఐపీఎల్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రాబిన్ ఉతప్ప (30 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రబడా వేసిన నాలుగో ఓవర్లో ఉతప్ప మూడు బౌండరీలతో స్కోరుకు ఊపుతెచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో ఇషాంత్ బౌలింగ్‌లో శుబ్‌మన్ 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 41/1. కీమో పాల్ బౌలింగ్‌లో రాబిన్ సిక్స్ బాదగా, శుబ్‌మన్ ఫోర్ కొట్టాడు. కానీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు ఓవర్ల వ్యవధిలో రాబిన్ వికెట్‌ను కోల్పోయిన నైట్‌రైడర్స్ 14 పరుగులే చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 72/2 స్కోరు చేసింది. శుబ్‌మన్ 34 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు.
రసెల్ సిక్సర్లు
రసెల్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చారు. 13వ ఓవర్లో నితీశ్ రాణా (11)ను మోరిస్ ఔట్ చేయడంతో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇతను రాగానే జట్టు స్కోరు వందకు చేరింది. కానీ క్రీజ్‌లో పాతుకుపోయిన శుబ్‌మన్, కెప్టెన్ కార్తీక్ (2) నిష్క్రమించారు. ఆ తర్వాత రసెల్ జోరు పెంచాడు. మోరిస్, రబడ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులే సాధ్యమయ్యాయి.
ధనాధన్‌తో మొదలై...
లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్లో ఒక పరుగే చేసింది. కానీ రెండో ఓవర్ నుంచి ధనాధన్ మొదలైంది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో పృథ్వీ షా (7 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) రెండు భారీ సిక్సర్లు బాదాడు. ప్రసిధ్ కృష్ణ మరుసటి ఓవర్లో ధావన్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అయితే 17 పరుగులు వచ్చిన ఇదే ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా ఔటయ్యాడు. ధావన్ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఈ సారి రసెల్ బౌలింగ్ చేయగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఢిల్లీ 4.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఆరో ఓవర్ వేసిన రసెల్ 2 పరుగులిచ్చి శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ జాగ్రత్తగా ఆడటంతో మధ్యలో కొన్ని ఓవర్లు పరుగుల్ని కట్టడి చేశాయి. మళ్లీ పదో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన ధావన్ 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 2 వికెట్లను కోల్పోయి 88 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్పిన్నర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. శిఖర్–రిషబ్‌లిద్దరు మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గెలుపుతీరం వద్ద పంత్ నిష్క్రమించగా, ఇంగ్రామ్ (6 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి సిక్సర్‌తో ముగించాడు. టి20 కెరీర్‌లో తొలి సెంచరీని చేజార్చుకున్న ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (97 నాటౌట్) నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment