Kolkata Knightriders
-
IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు. -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్, ఆనన్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ యాజమాని, బాలీవుడ్ బాదుషా షారుఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు అతని కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సైతం కేకేఆర్‌ను సపోర్ట్ చేసేందుకు వచ్చారు. ముఖ్యంగా లక్నో కీలక ఆటగాడు ఆయూష్ బదోని ఔటయ్యాక షారుఖ్,సుహానా,అనన్య సంబరాల్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు. pic.twitter.com/fdC6JLf9Lf — Sitaraman (@Sitaraman112971) April 14, 2024 -
LSG VS KKR: ప్రత్యేక జెర్సీల్లో లక్నో ప్లేయర్స్.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 7) లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు ప్రత్యేకమైన జెర్సీలలో కనపించనున్నారు. ఆదివారం (మే 8) మదర్స్ డే ను పురస్కరించుకుని లక్నో ఆటగాళ్లు.. ఇవాళ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో వారి తల్లి పేరు గల జెర్సీలను ధరించనున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లులకు తాము ఇచ్చే నివాళి ఇది అని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ట్విటర్లో వెల్లడించింది. “This one’s for you, Maa.” Now THAT’s how you prepare for Mother’s Day - the #SuperGiant way! #AbApniBaariHai💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/H4CNkJZ6LF — Lucknow Super Giants (@LucknowIPL) May 7, 2022 ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తన తల్లి రాజేశ్వరి పేరుతో ఉండే జెర్సీని ధరించనుండగా.. అవేశ్ ఖాన్ (షబీనా ఖాన్), కృనాల్ పాండ్యా (నళిని), దీపక్ హుడా (జజ్బీర్ హుడా) రవి బిష్ణోయ్ (సోహ్ని దేవి), అయుష్ బదోని (విభా బదోని) లు తమతమ తల్లుల పేర్లతో ఉండే జెర్సీలను ధరించనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ ట్విటర్లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఆదివారం (మే 8) మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీల్లో కనిపించనున్నారు. గతేడాది కరోనా వారియర్స్‌కు మద్దతుగా బ్లూ కలర్ జెర్సీ ధరించిన ఆర్సీబియన్లు.. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గో గ్రీన్’ నినాదంతో గ్రీన్ కలర్ జెర్సీలను ధరించనున్నారు. చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. అచ్చిరాని జెర్సీతో బరిలో దిగనున్న ఆర్సీబీ -
దటీజ్ "జూనియర్ ఏబీ".. బంతిని చూడకుండానే భారీ సిక్సర్
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బుధవారం(ఏప్రిల్ 6) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఆడిన బ్రెవిస్ 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు బాదిన ఓ సిక్సర్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇన్నింగ్స్ 8 ఓవర్ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో.. బంతిని చూడకుండానే బ్రెవిస్ అద్భుతమైన సిక్స్ బాదాడు. కాగా అదే ఓవర్లో ఐదో బంతికి బ్రెవిస్ స్టంపౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం. బ్రెవిస్ సిక్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దక్షణాఫ్రికాకు చెందిన ఈ యువ ఆటగాడిని అభిమానులు "జూనియర్ ఏబీగా" పిలుచుకుంటున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో కూడా బ్రెవిస్ అదరగొట్టాడు. ఐపీఎల్లో మెగా వేలంలో అతడిని రూ. 3కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: IPL 2022: బుమ్రాకు అక్షింతలు.. నితీష్ రాణాకు జరిమానా! pic.twitter.com/qGIdoAGcka — Jemi_forlife (@jemi_forlife) April 6, 2022 -
టాలీవుడ్ హీరోయిన్, ఈ యంగ్ క్రికెటర్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?
ఓ యంగ్ క్రికెటర్ టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకి వారెవంటే టాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఉగాది సందర్భంగా ప్రియాంక షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేశాడు. దీనికి ప్రియాంక ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. కాగా ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్, హాట్‌లుక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు ఉంటుంది. ఈ క్రమంలో ఉగాది సందర్భంగా ఆమె తన ఫొటోలను షేర్ చేస్తూ ‘బూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక ఈ ఫొటోలో క్రీమ్ కలర్ షోల్డర్ కట్ టాప్ ధరించి కర్టన్ వెనకాల కుర్చోని ఉంది. ఈ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక హు? యూ? అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ‘మీ ఓవరాక్షన్ ఆపండి మాకు అంతా తెలుసు, మీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కూడా అవుతున్నారు’, ‘ఏంటి ఇది వెంకటేశ్ భయ్యా.. ఏం జరుగుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆయన ఎవరో తెలియదా ఇండియన్ క్రికెటర్, నెక్ట్ జనరేషన్‌కు కాబోయే క్రికెట్ సూపర్ స్టార్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరూ ప్రియాంక వెంకటేశ్ అయ్యర్‌ని క్యూట్ అంటుందంటూ స్పందిస్తున్నారు. చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రియాంకా జవాల్కర్ విజయ్ దేవరకొండతో టాక్సివాలా మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) -
జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని నేరుగా కలుసుకుని సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి కామెంట్లు చేస్తూ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది.(చదవండి: ‘కేదార్ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’) క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ కాగా, సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. (చదవండి: సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సీఎస్కే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు. ధోని చిన్నారి కూతురు జీవాపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే తనపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అయితే ధోని ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు. -
కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్
కోల్‌కతా: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఇప్పుడు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ సీజన్ అనంతరం చీఫ్‌కోచ్ జాక్వస్ కలిస్ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో మెకల్లమ్‌కు కోచింగ్ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కూడా మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. లీగ్‌లో మెకల్లమ్.. 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్ నుంచి 2018 వరకు కేకేఆర్‌తో పాటు, కొచ్చి టస్కర్ కేరళ, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు. -
కోల్‌కతా ఇంటికి... హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు...
120 బంతుల ఇన్నింగ్స్‌లో సింగిల్ కూడా తీయని డాట్ బంతులు 60... మొత్తం ఇన్నింగ్స్‌లో మూడంటే మూడే ఫోర్లు... ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా దీనమైన బ్యాటింగ్ ఇది... సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగడంతో బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన నైట్‌రైడర్స్ ముందే ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలకు ఊపిరి పోసింది. ప్రత్యర్థిని ఓడించి ముంబై చేసిన మేలుతో నాలుగో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 9 విజయాలు, 18 పాయింట్లతో టాప్–3 జట్లు సమానంగా ఉన్నా, తాజా విజయం తర్వాత రోహిత్ సేన రన్‌రేట్ కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో తర్వాతి మూడు టీమ్‌లు సమంగా నిలిచినా మెరుగైన రన్‌రేట్‌లో ‘ఆరెంజ్ ఆర్మీ’ ముందంజ వేసింది. ఐపీఎల్ చరిత్రలో 12 పాయింట్లు మాత్రమే సాధించిన టీమ్ సెమీస్/ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముంబై: గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2019లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. తమతో పోటీలో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆదివారం ఇక్కడి వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడం రైజర్స్‌కు టాప్–4లో అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. క్రిస్ లిన్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) నెమ్మదైన ఇన్నింగ్స్ జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మలింగ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు), సూర్య కుమార్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. లిన్ మినహా... ఓపెనర్ లిన్ ఆరంభంలో చూపించిన దూకుడు మినహా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మొత్తం పేలవంగా సాగింది. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 49 పరుగులకు చేరింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా ... వరుస ఓవర్లలో గిల్, లిన్లను ఔట్ చేసి కోల్‌కతాను దెబ్బ తీశాడు. అంతే... ఆ తర్వాతి నుంచి కోల్‌కతా కష్టాలు మొదలయ్యాయి. 7–12 మధ్య ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్ 16 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే పరిస్థితి అర్థమవుతుంది! మలింగ వేసిన 13వ ఓవర్లో కోల్‌కతాకు పెద్ద దెబ్బ పడింది. నాలుగో బంతికి దినేశ్ కార్తీక్ ఔట్ కాగా... సీజన్ ఆసాంతం జట్టు గెలుపు భారాన్ని మోసిన ఆండ్రీ రసెల్ (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. సిక్సర్‌తో ఖాతా తెరిచిన డి కాక్ దూకుడు కొనసాగించి జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. డి కాక్ ఔటయ్యాక... రోహిత్, సూర్యకుమార్ సునాయాసంగా పరుగులు సాధించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. -
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అనుకూలం
ఐపీఎల్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అనుకూలాంశం ఉంది. ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవడానికి కేవలం విజయం సాధిస్తే సరిపోతుందా? లేక ఎన్ని ఓవర్లలో లక్ష్య ఛేదన చేయాలి, ఎన్ని పరుగుల తేడాతో గెలవాలి అన్న విషయంపై కోల్‌కతా జట్టుకు స్పష్టత వస్తుంది. పంజాబ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతంగా నెగ్గింది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ గెలుపుతో కోల్‌కతా జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగి ఉంటుంది. గతవారం ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై 200 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించిన కోల్‌కతా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ముంబై జట్టును గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో హార్దిక్ తన జట్టును గెలిపించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో గెలిచి లీగ్ దశను టాప్ ర్యాంక్‌తో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్‌ను విజయంతో ముగించాలని పంజాబ్ ఆశిస్తోంది. పంజాబ్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవడంతో క్రిస్ గేల్, లోకేశ్ రాహుల్ విధ్వంసకర ఆటతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. ఈ ఇద్దరితోపాటు ధోని ఆటను కూడా ఆస్వాదించాలని పంజాబ్ ప్రేక్షకులు మైదానానికి వస్తారనడంలో సందేహం లేదు. -
పంజాబ్‌పై కోల్‌కతా విజయం
-
కోల్‌కతా... లిన్ గిల్గింత
లీగ్‌లో ఎనిమిదో ఓటమితో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దాదాపు బయటికెళ్లిపోయింది. ఇదే సమయంలో ఆరో గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తదుపరి దశ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఒకింత పెద్దదైన లక్ష్యం కళ్ల ముందున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన కోల్‌కతా మ్యాచ్‌ను ఏకపక్షంగా వశం చేసుకుంది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ తమ వంతుగా, దూకుడుగా ఆడటంతో ఆ జట్టుకు లక్ష్య ఛేదనలో ఇబ్బందే లేకపోయింది. మొహాలీ: ఐపీఎల్–12లో పడుతూ లేస్తూ సాగిన పంజాబ్ ప్రయాణం ప్లే ఆఫ్స్ చేరకుండానే ముగిసింది! ఈ దిశగా ఏ మూలనో మిణుకుమిణుకుమంటున్న ఆ జట్టు ఆశలను వారి సొంతగడ్డ పైనే కోల్‌కతా ఆవిరి చేసింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ స్యామ్ కరన్ (24 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (27 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు కనబర్చారు. సందీప్ వారియర్ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. యువ ఓపెనర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ... మరో ఓపెనర్ క్రిస్ లిన్ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫటాఫట్ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పూరన్ దూకుడు... కరన్ దంచుడు సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు సహా 10 పరుగులు వచ్చినా తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. ఇబ్బందిగా కనిపించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (2)ను స్లో బంతితో, గేల్ (14)ను షార్ట్ బాల్‌తో సందీప్ బోల్తా కొట్టించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు 41/2తో నిలిచింది. వస్తూనే బౌండరీతో ఖాతా తెరిచిన మయాంక్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడుతుండగా, పూరన్ విజృంభించాడు. గర్నీ బౌలింగ్‌లో సిక్స్.. రసెల్, చావ్లా ఓవర్లలో రెండేసి సిక్స్‌లు, ఫోర్లు దంచాడు. 40 బంతుల్లో 69 పరుగులతో మంచి రన్‌రేట్‌తో దూకుడు మీదున్న ఈ జోడీని నితీశ్ రాణా విడదీశాడు. చావ్లాను లక్ష్యంగా చేసుకున్న పూరన్‌ను నిలువరించేందుకు రాణాను రంగంలోకి దించడం ఫలితాన్నిచ్చింది. అతడి బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయిన పూరన్ మిడ్ వికెట్లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే మయాంక్... రింకూ సింగ్ చురుకైన ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. ఆరంభం నుంచి ఊపు కనబర్చిన కరన్‌కు మన్దీప్ సింగ్ (17 బంతుల్లో 25; ఫోర్, సిక్స్) తోడయ్యాడు. వీరు ఐదో వికెట్‌కు 24 బంతుల్లోనే 38 పరుగులు జోడించి స్కోరు పడిపోకుండా చూశారు. 151/6...! 19వ ఓవర్ తొలి బంతికి అశ్విన్ (0) ఔటయ్యేటప్పటికి పంజాబ్ స్కోరిది. కరన్ క్రీజులో ఉన్నా గర్నీ, రసెల్ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పంజాబ్ సాధారణ స్కోరే చేసేలా కనిపించింది. కానీ, కరన్ కథ మార్చాడు. ఇన్నింగ్స్ చివరి 11 బంతుల్లో 9 బంతులను ఎదుర్కొన్న అతడు ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. తలా కొంత దంచేశారు... ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ ఎక్కడా వేగం తగ్గలేదు. ఓపెనర్లలో శుబ్‌మన్ సంయమనం చూపగా, లిన్ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ పంజాబ్‌కు వణుకు పుట్టించాడు. అర్షదీప్ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు, అశ్విన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. ఆండ్రూ టై ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి భారీ షాట్ ఆడబోయి టైకే క్యాచ్ ఇచ్చాడు. పవర్ ప్లే అనంతరం నైట్ రైడర్స్ 62/1తో నిలిచింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాక గిల్ జూలు విదిల్చాడు. అప్పటివరకు బంతికో పరుగు చొప్పున చేస్తున్న అతడు... అశ్విన్ వేసిన 13వ ఓవర్లో విరుచుకుపడి రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. 48 బంతుల్లో 74 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం దీంతో ఒక్కసారిగా 42 బంతుల్లో 54 పరుగులుగా మారిపోయింది. 36 బంతుల్లోనే గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం టై బౌలింగ్‌లో రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో లక్ష్యం మరింత తేలికైంది. కరన్ ఓవర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో షాట్లు కొట్టి అనుకున్నదానికంటే ముందే మ్యాచ్‌ను ముగించాడు. కీలకమైన మ్యాచ్‌లో అదీ సొంతగడ్డపై బౌలింగ్ తేలిపోవడం పంజాబ్‌ను దెబ్బతీసింది. హైదరాబాద్, కోల్‌కతా మధ్యలో రాజస్తాన్ ప్లే ఆఫ్ ముంగిట పాయింట్ల పరంగా (13 మ్యాచ్‌ల్లో 12) ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమంగా ఉన్నాయి. అయితే, రన్‌రేట్‌లో హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. శనివారం బెంగళూరుపై గెలిస్తే సన్‌రైజర్స్ 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా రన్‌రేట్ లెక్కలను చూసుకుంటూ నెగ్గాల్సి వస్తుంది. బహుశా పరుగుల్లో భారీ తేడాతోనో, లక్ష్యాన్ని చాలా ముందుగానో ఛేదించాల్సి రావొచ్చు. హైదరాబాద్ ఓడితే మాత్రం... కోల్‌కతాకు ఫ్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే ముంబైపై గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ... హైదరాబాద్, కోల్‌కతా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఢిల్లీపై రాజస్తాన్ నెగ్గితే ఆ జట్టు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్‌ను సంపాదిస్తుంది. -
కోల్‌కతా తడాఖా
నైట్‌రైడర్స్ తరఫున నలుగురే బ్యాటింగ్‌కు దిగారు. కానీ... చేసింది 232 పరుగులు! ఈ సీజన్లోనే అత్యధిక స్కోరిది. ఔటైన ఇద్దరు (గిల్, లిన్)... ఔట్ కాని ఒక్కడు (రసెల్) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌండరీల్ని అవలీలగా బాదేశారు. 20 ఓవర్లయ్యాక చూస్తే కొండంత స్కోరు కోల్‌కతాది. హార్దిక్ పోరాడినా ముంబై దీనిని అందుకోలేక పోయింది. ముఖ్యంగా తనను వన్‌డౌన్‌లో దింపితే అవతలి జట్టుకు ఎంత నష్టమో రసెల్ నిరూపించాడు. కోల్‌కతా: ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు కోల్‌కతా మిసైల్ బ్యాట్స్‌మన్ రసెల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకే వరుసగా ఓడుతున్నాం’ అని విమర్శించాడు. అందుకేనేమో వెంటనే కళ్లు తెరిచిన నైట్‌రైడర్స్ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంది. రసెల్‌ను వన్‌డౌన్‌లో దించింది. అంతే సిక్సర్ల ఉప్పెనే! గెలిచి రేసులో నిలవాల్సిన పోరులో కోల్‌కతా ‘ధనాధన్’లాడించింది. గెలిస్తే ముందడుగు వేసే స్థితిలో ఉన్న ముంబైని నిలువరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 34 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్రిస్ లిన్ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు. దీంతో మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓడింది. హార్ధిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) బెదరగొట్టాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. రసెల్, గర్నీ, నరైన్‌లు తలా 2 వికెట్లు తీశారు. రసెల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. దిగినాడో... దంచాడే! ముంబై టాస్ నెగ్గి తప్పు చేసింది. కోల్‌కతాకు బ్యాటింగ్ అప్పజెప్పింది. లిన్‌తో జతగా ఓపెనింగ్ చేసిన శుబ్‌మన్ గిల్ నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌కు బౌండరీలతో శ్రీకారం చుట్టాడు. శరణ్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు బాదాడు. నాలుగో ఓవర్లో లిన్ రెండు బౌండరీలతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్ 10 పరుగులకు తగ్గలేదు. మలింగ, రాహుల్ చహర్, బుమ్రా ఎవరు బౌలింగ్ వేసినా ఫోర్లు, సిక్సర్లే! 9 ఓవర్లు ముగిసేసరికి వికెటే కోల్పోకుండా 89 పరుగులు చేసింది. లిన్ 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. జోరుమీదున్న ఈ జోడీకి పదో ఓవర్లో చుక్కెదురైంది. లిన్‌ను చహర్ ఔట్ చేయడంతో 96 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటే రసెల్ వన్‌డౌన్‌లోకి రావడంతో బౌలర్ల భరతం పట్టేందుకు తెరలేచింది. గిల్ అర్ధశతకం... ఆద్యంతం దూకుడుగానే కనిపించిన గిల్ జిగేల్మనే ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్‌కు అందిన బంతిని బౌండరీగా, చెత్త బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో శుబ్‌మన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసెల్‌తో రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాక నిష్క్రమించాడు. తర్వాత దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) జత కలువగా రసెల్ వన్‌సైడ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 74 పరుగులు జోడించడం విశేషం. ముంబై తడబాటు... ఈ సీజన్లోనే కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. రెండో ఓవర్లోనే డికాక్ (0) డకౌట్ కాగా, నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (12) ఆట ముగిసింది. ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన లూయిస్ (15), సూర్యకుమార్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు ఆడగలిగినా... రసెల్ వీళ్లిద్దరిని ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (20; 2 ఫోర్లు) 21 బంతులాడినా మెరిపించలేకపోయాడు. రెండు బౌండరీలు కొట్టిన పొలార్డ్... నరైన్ ఉచ్చులో పడ్డాడు. తర్వాత పాండ్యా బ్రదర్స్ ఆటకు వేగం తెచ్చారు. హార్దిక్ అదరగొట్టాడు... హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. చావ్లా వరుస ఓవర్లలో (10, 12వ) రెండేసి సిక్స్‌ల చొప్పున బాదాడు. నరైన్, గర్నీ ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక బౌండరీ సాయంతో వేగంగా అర్ధసెంచరీ చేశాడు. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా బంతిని అదేపనిగా సిక్స్‌లుగా మలిచాడు. 16వ ఓవర్ వేసేందుకు చావ్లా రాగా సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో 4, 6తో 14 పరుగులు జతచేశాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగుతున్న హార్దిక్‌ను గర్నీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. చావ్లా ఆఖరి ఓవర్లో కృనాల్ (24) ఔటయ్యాడు. అతని ఆటే ‘హైలైట్స్’ ఇన్నింగ్స్ బ్రేక్‌లోనో, మ్యాచ్ పూర్తయ్యాకో టీవీల్లో మనకు కనిపిస్తాయే... ఆ హైలైట్స్! అవి రసెల్ ఆటలోనే కనిపించాయి. మూడు బంతులాడినా పరుగే చేయని ఈ మిసైల్ తర్వాత ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చహర్ వేసిన 12వ ఓవర్లో బౌండరీతో మొదలైన హిట్టింగ్‌కు అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ మీదుగా, బౌన్సర్ వేస్తే అప్పర్ కట్‌తో థర్డ్‌మ్యాన్ దిశగా ఎక్కడ బంతి వేసినా... అది సిక్స్‌గానే ఫిక్సయింది. చహర్ 13 ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. బంతి పదేపదే బౌండరీ లైన్ అవతలికే వెళ్లిపోవడంతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. హార్దిక్ పాండ్యా 18వ ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదితే 20 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ బుమ్రా వేస్తే సిక్స్, ఫోర్ 15 పరుగులు! మలింగ ఆఖరి ఓవర్లో 6, 4, 4, 0, 0, 6 ఇరవై పరుగులు లభించాయి. -
రాజస్తాన్‌ను గెలిపించిన టీనేజర్
ప్లే ఆఫ్స్ రేసు ముంగిట... అది కూడా సొంతగడ్డపై... కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద షాక్. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆ జట్టుకు అనూహ్య ఓటమి. పేలవ బ్యాటింగ్‌తో తొలుత తమ చేజారినట్లే కనిపించిన మ్యాచ్‌ను... కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50 బంతుల్లో 97; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో నిలిపినా, సాధారణ స్కోరును స్పిన్నర్లు పీయూష్ చావ్లా (3/20), సునీల్ నరైన్ (2/25) కాపాడినట్లే కనిపించినా... రాజస్తాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం. 17 ఏళ్ల అసోం కుర్రాడు రియాన్ పరాగ్ (31 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అసాధారణ పోరాటానికి కోల్‌కతా తలొంచక తప్పలేదు. సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ క్రికెటర్లు... ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి రాయల్స్‌ను విజేతగా నిలిపారు. కోల్‌కతా: ఓటమి తప్ప మరే దారీ లేదన్న దశలో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమే చేసింది. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడిన రాయల్స్ కుర్రాళ్లు పరాగ్, ఆర్చర్... కోల్‌కతాకు వరుసగా ఆరో పరాజయం ఖాయం చేశారు. రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 3 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను దినేశ్ కార్తీక్ అజేయ ఇన్నింగ్స్‌తో నడిపించాడు. రాయల్స్ పేసర్ వరుణ్ ఆరోన్ (2/20) ధాటికి ఇతర బ్యాట్స్‌మెన్ ఓ మాదిరిగానూ ఆడకున్నా కార్తీక్ ఒంటరి పోరాటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్తాన్‌కు ఓపెనర్లు అజింక్య రహానే (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (15 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) మంచి పునాది వేశారు. ప్రత్యర్థి స్పిన్నర్ల దెబ్బకు ఓ దశలో కుదేలైన రాజస్తాన్‌ను ఏడో వికెట్‌కు 21 బంతుల్లో 44 పరుగులు జోడించి పరాగ్, ఆర్చర్ గెలుపు బాట పట్టించారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన స్థితిలో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఆర్చర్ ఫోర్, సిక్స్ కొట్టి ముగించేశాడు. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి నెగ్గింది. ఆరోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. 11 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ఇది వరుసగా ఆరో పరాజయం. ఈడెన్‌లో నాలుగోది కావడం గమనార్హం. ఈ ఓటమితో ఆ జట్టు లీగ్‌లో ముందడుగేయడం కష్టమే. మరోవైపు రాయల్స్‌కు ఇది నాలుగో విజయం. అతడొక్కడు మినహా... పవర్ ప్లేలో 32/2, పది ఓవర్లకు 49/3... ఇదీ సగం ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు. తొలి ఓవర్లోనే ఓపెనర్ లిన్ (0)ను బౌల్డ్ చేసిన ఆరోన్... ఐదో ఓవర్లో మరో ఓపెనర్, శుబ్‌మన్ గిల్ (14) వికెట్లను గిరాటేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రాణా (21)ను శ్రేయస్ గోపాల్ వెనక్కు పంపాడు. ఐదులోపు రన్‌రేట్‌తో సాగుతున్న ఇన్నింగ్స్‌కు గోపాల్ వేసిన 11వ ఓవర్లో కార్తీక్ సిక్స్, హ్యాట్రిక్ ఫోర్లు, సునీల్ నరైన్ (11) సిక్స్ కొట్టడంతో ఊపు వచ్చింది. 15వ ఓవర్ చివరి బంతికి కోల్‌కతా సరిగ్గా 100 పరుగులు చేసింది. సమయోచితంగా ఆడిన కార్తీక్ అర్ధ సెంచరీ (35 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. లైఫ్‌లు దక్కినా విధ్వంసక ఆటగాడు రసెల్ (14 బంతుల్లో 14; 1 సిక్స్) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కార్తీక్ మెరుపులతో చివరి 10 ఓవర్లలో 126 పరుగులు వచ్చాయి. ఆఖరి ఐదు ఓవర్లలోనే 75 పరుగులు దక్కాయి. మొదట వారు... తర్వాత వీరు రాయల్స్ ఓపెనర్లలో రహానే ఫోర్లతో పరుగులు రాబట్టగా, స్ట్రయిట్ సిక్సర్లతో సంజు ధాటిని చూపాడు. ఆంధ్ర క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ వేసిన ఐదో ఓవర్లో రహానే సిక్స్, రెండు ఫోర్లు సహా 17 పరుగులు రాబట్టడంతో స్కోరు 50 దాటింది. కానీ, పవర్ ప్లే చివరి ఓవర్లో నరైన్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం, పీయూష్ చావ్లా గూగ్లీకి శామ్సన్, నరైన్ స్ట్రయిట్ డెలివరీని ఎదుర్కొనలేక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (2) పేలవంగా బౌల్డవడంతో జట్టు కష్టాల్లో పడింది. 6 నుంచి 10 ఓవర్ల మధ్య ఆ జట్టు 25 పరుగులే చేసింది. చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్లకు యత్నించి స్టోక్స్ (11), బిన్నీ (11) వెనుదిరిగారు. అప్పటికి స్కోరు 98/5. విజయ సమీకరణం 45 బంతుల్లో 78. గోపాల్ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) హ్యాట్రిక్ ఫోర్లతో కొంత ఒత్తిడి తగ్గించాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ఔటైనా... పరాగ్, ఆర్చర్ ప్రశాంతంగా ఆడుతూ పని పూర్తి చేశారు. ఔరా కార్తీక్ ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ‘దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్’ అనడం సబబేమో! జట్టు స్కోరు 31/2తో ఉండగా సరిగ్గా ఆరో ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్... ఆసాంతం నిలిచాడు. ఎదుర్కొన్న ఏడో బంతికి కానీ ఖాతా తెరవని అతడు... కుదురుకున్నాక తనదైన శైలిలో భారీ షాట్లు కొట్టాడు. 10 బంతుల్లో 3 పరుగులతో ఉన్న దశలో శ్రేయస్ గోపాల్ ఓవర్లో ఓవర్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టి జోరందుకున్నాడు. ఆర్చర్ బంతిని అద్భుతమైన టైమింగ్‌తో ఫ్లిక్ చేసి సిక్స్‌గా పంపిన తీరు, ఆఫ్‌సైడ్ ఆఫ్ స్టంప్‌పై అరోన్ వేసిన షార్ట్ బాల్‌ను ఓవర్ పాయింట్ దిశగా, ఆర్చర్ బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా స్టాండ్స్‌లోకి కొట్టిన వైనం, ఉనాద్కట్ ఓవర్లో డీప్ స్వే్కర్ లెగ్ వైపు బాదిన సిక్స్ ముచ్చటగొలిపాయి. చివరి ఓవర్లో పూర్తిగా క్రీజులోకి జరిగి బ్యాక్‌ఫుట్‌పై కొట్టిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి. 96 పరుగులతో 20 ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న అతడు మరో భారీ షాట్‌తో సెంచరీ చేయడం ఖాయమనుకున్నా బంతి సరిగా కనెక్ట్ కాకపోవడంతో సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు. -
తండ్రీ తనయ.. ‘సన్’ విజయ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయంతో ముందడుగు వేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం వార్నర్ తన కూతురును భుజాలపై ఎక్కించుకొని స్టేడియంలో సందడి చేశారు. హీరో విక్టరీ వెంకటేశ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మ్యాచ్‌కు హాజరై ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. సాక్షి, హైదరాబాద్ :భాగ్యనగరంలో ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. సెలవుదినం కావడంతో క్రికెట్ వీరాభిమానులంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. వార్నర్–బెయిర్‌స్టో జోడీ అందించిన పరుగుల విందును మనసారా ప్రేక్షకులు ఆస్వాదించారు. సామాన్యులతో పాటు స్టార్లు కూడా ఈ మ్యాచ్‌లో అలరించారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన సోదరి ఆనమ్‌తో కలసి మ్యాచ్‌లో సందడి చేయగా... సినీ హీరో వెంకటేశ్ సన్‌రైజర్స్ జెండాతో అభిమానులను ఉత్తేజపరిచాడు. -
సన్ ధనాధన్
సన్‌రైజర్స్ పుంజుకుంది. సొంతగడ్డపై మరో గెలుపు అందుకుంది. వార్నర్, బెయిర్‌స్టో మెరుపులకు... యువ పేసర్ ఖలీల్ అహ్మద్ నిప్పులు చెలరేగే బంతులు తోడవ్వడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రైజర్స్ పైచేయి సాధించింది. బాదడమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగుతోన్న వార్నర్–బెయిర్‌స్టో జోడీ మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ చిన్నబోయింది. సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ జోరు కనబరుస్తోంది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన రైజర్స్... మళ్లీ విజయాల బాట పట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి హైదరాబాద్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. సునీల్ నరైన్ (8 బంతుల్లో 25; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ కేవలం 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆంధ్ర పేసర్ పృథ్వీరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని అందుకున్నాడు. అదిరిపోయిన ఆరంభం... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. నదీమ్ వేసిన రెండో ఓవర్లో లిన్ 4, 6... నరైన్ 6 బాదడంతో నైట్‌రైడర్స్ 18 పరుగులు రాబట్టింది. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో మరింతగా చెలరేగిన నరైన్ చివరికి అతనికే చిక్కి పెవిలియన్ చేరాడు. తొలి మూడు బంతుల్లో 6, 4, 4 బాది నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో 16 బంతుల్లోనే నైట్‌రైడర్స్ తొలి వికెట్‌కు 42 పరుగుల్ని జోడించింది. ఆదుకున్న లిన్... నరైన్ ఔటయ్యాక హైదరాబాద్ బౌలర్లు కోల్‌కతాపై ఒత్తిడి పెంచారు. క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ (3)ను ఖలీల్ ఔట్ చేయగా... నితీశ్ రాణా (11) భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌటయ్యాడు. దీంతో 73 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కోల్‌కతా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఈ దశలో లిన్, రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పెంచారు. సందీప్ ఓవర్లో లిన్ బౌండరీ బాదగా... రింకూ సిక్సర్‌తో అలరించాడు. దీంతో 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 116/4. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన రింకూ సింగ్ సందీప్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరుసటి బంతికే ఔటయ్యాడు. అప్పటి వరకు సింగిల్స్‌కే మొగ్గుచూపుతూ 45 బంతుల్లో బౌండరీతో అర్ధశతకాన్ని అందుకున్న లిన్ కూడా విలియమ్సన్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 18వ ఓవర్ వేసిన రషీద్ కేవలం ఒకే పరుగు ఇచ్చి స్కోరును కట్టడి చేశాడు. 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన రసెల్ (9 బంతుల్లో 15; 2 సిక్సర్లు)ను భువీ ఔట్ చేశాడు. చివరి ఓవర్లో కరియప్ప (3 బంతుల్లో 9; 1 సిక్స్) సిక్స్ బాదడంతో కోల్‌కతా 150 పరుగులు దాటగలిగింది. మళ్లీ వారిద్దరే.. అరంగేట్ర బౌలర్ పృథ్వీరాజ్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ సిక్సర్‌తో రైజర్స్ మెరుపులు మొదలయ్యాయి. అదే ఓవర్లో బెయిర్‌స్టో రెండు బౌండరీలతో చెలరేగాడు. చావ్లా ఓవర్లో 4, 6తో అతను 11 పరుగులు రాబట్టాడు. ఇక తనవంతు అన్నట్లుగా నరైన్ ఓవర్లో భారీ సిక్సర్‌గా బాదిన వార్నర్... కరియప్పకు 6, 4, 6తో చుక్కలు చూపించాడు. దీంతో పవర్‌ప్లేలో రైజర్స్ 72 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ, లేదా సిక్సర్ అన్నట్లుగా వీరిద్దరూ బ్యాట్ ఝళిపించారు. పాపం కరియప్ప ఈసారి బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. అతను వేసిన తొమ్మిదో ఓవర్ తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదిన బెయిర్‌స్టో నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో ఈ సీజన్లో వార్నర్–బెయిర్‌స్టో జోడీ నాలుగో సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ క్రమంలో వార్నర్, బెయిర్స్టోలిద్దరూ 28 బంతుల్లోనే అర్ధశతకాల్ని అందుకున్నారు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 109కి చేరింది. తర్వాత నరైన్ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా 4, 6తో జోరు కనబరిచాడు. కానీ మరుసటి ఓవర్లోనే పృథ్వీరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో జట్టు విజయానికి 46 బంతుల్లో 29 పరుగులు అవసరం. మరోవైపు 12, 13 ఓవర్లలో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బెయిర్‌స్టో... విలియమ్సన్ (8) అండతో 15వ ఓవర్లో చెలరేగిపోయాడు. చావ్లా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో 4, 6, 6 బాది మరో 30 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. -
ఈ‘డెన్’లో విరాట్ షో
-
కోహ్లి... శతకలహరి
తమ సొంతగడ్డపై బెంగళూరు జట్టు కోల్‌కతాపై 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడిపోయింది. అదే జట్టు ఇప్పుడు కోల్‌కతాలో అదే ప్రత్యర్థిపై 213 పరుగులు చేసి గెలిచింది. రసెల్, నితీశ్ రాణా సిక్సర్లతో ఆఖరి ఓవర్‌దాకా హోరెత్తించినా చివరకు కోహ్లి సేన గెలిచి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. కోల్‌కతా: బెంగళూరు భారీస్కోరైతే చేసింది... కానీ చచ్చీచెడి గెలిచింది. కోల్‌కతా హిట్టర్లు రసెల్, రాణా సిక్సర్లతో ఊపేసిన ఈ మ్యాచ్ ఆఖరి మూడు బంతుల్లో బెంగళూరుకు గెలుపు మలుపు తీసుకుంది. చివరకు రాయల్ చాలెంజర్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి (58 బంతుల్లో 100; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టగా, మొయిన్ అలీ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడింది. నితీశ్ రాణా (46 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), రసెల్ (25 బంతుల్లో 65; 2 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అస్వస్థతతో ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ బరిలోకి దిగలేదు. క్లాసెన్, స్టెయిన్ బెంగళూరు తుది జట్టులోకి వచ్చారు. మెల్లిగా మొదలై... ఉప్పెనలా మారి! టాస్ నెగ్గిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు ఆటకు కోహ్లి, పార్థివ్ పటేల్ శ్రీకారం చుట్టారు. ఆరంభంలో ఆట చాలా నెమ్మదించింది. తొలి ఓవర్లో 3, రెండో ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో 2 బౌండరీలు కొట్టిన పార్థివ్ (11)ను నరైన్ ఔట్ చేశాడు. కోహ్లికి జతయిన అ„Š దీప్... ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో సిక్సర్ బాదగా, కోహ్లి ఫోర్ కొట్టాడు. కెప్టెన్ క్రీజులో ఉన్నా... బెంగళూరు 8 ఓవర్లలో 50 పరుగులే చేసింది. మరుసటి ఓవర్లో అ„Š దీప్ (13)ను రసెల్ ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 59/2. మొయిన్ అలీ రాకతో ఆట స్వరూపమే మారింది. వచ్చీరాగానే సిక్సర్ బాదాడు. 10 ఓవర్లలో 2 వికెట్లకు 70 పరుగులు చేసింది. రసెల్ ఓవర్లో కోహ్లి, చావ్లా బౌలింగ్‌లో మొయిన్ భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు జోరందుకుంది. ప్రత్యేకించి మొయిన్... కుల్దీప్ బౌలింగ్‌నైతే చీల్చి చెండాడాడు. కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కుల్దీప్ స్పిన్నేస్తే... మొయిన్ దంచేస్తే... బెంగళూరు 15 ఓవర్లు ముగిసేసరికి 122/2 స్కోరు చేసింది. కోహ్లి అర్ధసెంచరీ మీదుంటే... మొయిన్ అలీ జోరు మీదున్నాడు. కుల్దీప్ 16వ ఓవర్ వేసేందుకు వచ్చాడు. స్ట్రయిక్‌లో ఉన్న అలీ 4, 6, 4, 6, వైడ్, 6తో చెలరేగాడు. 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీని మెరుపువేగంతో పూర్తి చేశాడు. 27 పరుగులు కొట్టాక ఆఖరి బంతికీ భారీషాటే ఆడాడు. కానీ బౌండరీ దగ్గర ప్రసిధ్ కృష్ణ చేతికి చిక్కాడు. ఒక్క ఓవర్‌తో జట్టు స్కోరు 149/3కి చేరింది. స్టొయినిస్ జతకాగా... తర్వాత గర్నీ ఓవర్‌ను కోహ్లి ఆడుకున్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో మరో సిక్సర్ కొట్టిన చాలెంజర్స్ కెప్టెన్... ప్రసిధ్ వేసిన 19వ ఓవర్లో దంచేశాడు. 6, 4తో కలిపి 15 పరుగులు చేయగా, స్టొయినిస్ బౌండరీతో 19 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో స్టొయినిస్ బౌండరీ, సిక్సర్ బాదగా... కోహ్లి ఫోర్ కొట్టి 57 బంతుల్లోనే (9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాన్ని పూర్తి చేశాడు. ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ ఆఖరి ఐదు ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయిన బెంగళూరు ఏకంగా 91 పరుగులు చేయడం విశేషం. తొలి 10 ఓవర్లలో 70/2 స్కోరైతే... చివరి 10 ఓవర్లలో 143 పరుగులు చేసింది. స్టెయిన్ దెబ్బ... భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను స్టెయిన్ దెబ్బ తీశాడు. తన తొలి ఓవర్లో లిన్ (1)ను, మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 5వ) శుబ్‌మన్ గిల్ (9)ను ఔట్ చేశాడు. నరైన్ (18) సైనీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 33 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన జట్టును నితీశ్ రాణా ఆదుకున్నాడు. ఒక దశలో స్కోరు మందగించింది. తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులే చేసింది. ఉతప్ప (9) కూడా విఫలమవగా... రాణాకు రసెల్ జతయ్యాక బంతులు సిక్సర్లకు బలయ్యాయి. దీంతో భారీస్కోరైనా రసవత్తరంగా మారింది. 14 ఓవర్లు ముగిసేదాకా 101/4 స్కోరుతో ఉన్న కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ నుంచి రసెల్ గర్జన మొదలైంది. దీంతో కోహ్లి శిబిరంలో ఆందోళన కూడా పెరిగింది. చహల్ వేసిన ఆ ఓవర్లో రసెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దీంతో 20 పరుగులొచ్చాయి. 16వ ఓవర్ వేసేందుకు వచ్చి సైనీకి ఇదే ఇనుభవం ఎదురైంది. కానీ ఈసారి రాణా ఆ పని చేశాడు. 1 ఫోర్, 2 సిక్సర్లు బాదడంతో 17 పరుగులు జతయ్యాయి. సిరాజ్ వేసిన 17 ఓవర్లో రసెల్ మరో సిక్సర్, ఫోర్‌తో 15 పరుగులు రావడంతో జట్టు స్కోరు 153/4కు చేరింది. ఇక మూడు ఓవర్లు మిగిలాయి. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 61 పరుగులు కావాలి. స్టెయిన్ బౌలింగ్‌లో రాణా చెలరేగాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చేశాయి. ఇక కావాల్సిన పరుగులు 43 అయితే బంతులు 12! స్టొయినిస్ బౌలర్... 3 బంతులు బాగానే వేశాడు. కానీ తర్వాతి 3 బంతుల్ని రసెల్ 6, 6, 6గా తరలించాడు. ఆఖరి ఓవర్‌కు 24 పరుగులు చేయాల్సి వుండగా... కోహ్లి బంతి మొయిన్ అలీకిచ్చాడు. రెండు బంతులెదుక్కొన్న రాణా పరుగు తీసి రసెల్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్ కొట్టిన రసెల్ ఒక బంతి బీట్ అయ్యాడు. ఐదో బంతికి రనౌటయ్యాడు. రాణా సిక్సర్‌తో ఆట ముగించగా... బెంగళూరు విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఈ‘డెన్’లో విరాట్ షో ఈ‘డెన్’లో మ్యాచ్ అంతా కోహ్లి మ్యాజికే! ముందు ఓపిగ్గా ఆడినా... తర్వాత బౌండరీలతో ఊపేసినా... చివరకు శతక్కొట్టినా... అద్భుతమైన క్యాచ్‌లు పట్టినా... ఈడెన్ గార్డెన్స్‌లో ‘విరాట్’పర్వమే కనబడింది. అంతేకాదు. తన సరదాలహరి కూడా ఈడెన్ ప్రేక్షకుల్ని రంజింపజేసింది. 18వ ఓవర్ వేసిన నరైన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కోహ్లి పరుగు తీసి నాన్ స్ట్రయిక్‌లోకి వచ్చాడు. బంతి వేసేందుకు వచ్చిన నరైన్ బంతిని సంధించలేదు. ‘మన్కడింగ్’ అనుకొని కోహ్లి క్రీజ్‌లోకి బ్యాట్ పెడుతూ ఫోజు ఇచ్చాడు. ఇది అందరినీ నవ్వించింది. ►5 ఐపీఎల్లో కోహ్లికిది ఐదో సెంచరీ. ఆరు సెంచరీలతో గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్, వాట్సన్ మూడేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. ►1ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్‌గా తాహిర్ (59–ఢిల్లీ; ముంబైపై 2016 వైజాగ్‌లో) పేరిట ఉన్న చెత్త రికార్డును కుల్దీప్ సమం చేశాడు. -
తాహిర్ తడాఖా
కోల్‌కతా: అనుభవజ్ఞులతో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్–12 సీజన్లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. తొలుత కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ (51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) కదంతొక్కగా... 40 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అనంతరం చెన్నై జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. సురేశ్ రైనా (42 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరి 2 ఓవర్లలో చెన్నై విజయం కోసం 24 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హ్యారీ గుర్నె వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి రైనా సింగిల్ తీశాడు. ఆ తర్వాత జడేజా వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో చెన్నై ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు సాధించింది. ఇక చివరి ఓవర్లో గెలుపు కోసం చెన్నై 8 పరుగులు చేయాల్సి ఉండగా... చావ్లా వేసిన ఈ ఓవర్ తొలి బంతిని జడేజా బౌండరీ దాటించాడు. ఆ తర్వాత మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అంతకుముందు కోల్‌కతా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో తాహిర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, రసెల్‌లను వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. అనంతరం సెంచరీ చేస్తాడనుకున్న క్రిస్ లిన్‌ను కూడా ఔట్ చేశాడు. చెన్నై ప్లేయర్ డు ప్లెసిస్ మొత్తం నాలుగు క్యాచ్‌లు పట్టగా ఇందులో ఉతప్పను ఔట్ చేసిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. తాహిర్ బౌలింగ్‌లో ఉతప్ప భారీ షాట్ ఆడగా... లాంగాఫ్ నుంచి 25 గజాల వరకు ముందుకు పరుగెత్తి డు ప్లెసిస్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. -
ఢిల్లీ గర్జన
కోల్‌కతా గడ్డ ఈడెన్‌లో ఢిల్లీ గర్జించింది. శిఖర్ ధావన్ తన జట్టు గెలిచేదాకా నిలవగా, అతనికి రిషభ్ పంత్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్పిన్, పేస్ తేడా లేకుండా ప్రతీ బౌలర్‌ను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కోవడంతో ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా: చాన్నాళ్ల తర్వాత శిఖర్ ధావన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గెలిచే దాకా క్రీజు వీడకుండా పోరాడాడు. దీంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధిం చాడు. రసెల్ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (63 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రాణించిన శుబ్‌మన్ టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి బంతికే ఓపెనర్ జో డెన్లీ (0) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్‌లో అతను డకౌటయ్యాడు. మరోవైపు ఐపీఎల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రాబిన్ ఉతప్ప (30 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రబడా వేసిన నాలుగో ఓవర్లో ఉతప్ప మూడు బౌండరీలతో స్కోరుకు ఊపుతెచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో ఇషాంత్ బౌలింగ్‌లో శుబ్‌మన్ 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 41/1. కీమో పాల్ బౌలింగ్‌లో రాబిన్ సిక్స్ బాదగా, శుబ్‌మన్ ఫోర్ కొట్టాడు. కానీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు ఓవర్ల వ్యవధిలో రాబిన్ వికెట్‌ను కోల్పోయిన నైట్‌రైడర్స్ 14 పరుగులే చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 72/2 స్కోరు చేసింది. శుబ్‌మన్ 34 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. రసెల్ సిక్సర్లు రసెల్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చారు. 13వ ఓవర్లో నితీశ్ రాణా (11)ను మోరిస్ ఔట్ చేయడంతో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇతను రాగానే జట్టు స్కోరు వందకు చేరింది. కానీ క్రీజ్‌లో పాతుకుపోయిన శుబ్‌మన్, కెప్టెన్ కార్తీక్ (2) నిష్క్రమించారు. ఆ తర్వాత రసెల్ జోరు పెంచాడు. మోరిస్, రబడ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులే సాధ్యమయ్యాయి. ధనాధన్‌తో మొదలై... లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్లో ఒక పరుగే చేసింది. కానీ రెండో ఓవర్ నుంచి ధనాధన్ మొదలైంది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో పృథ్వీ షా (7 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) రెండు భారీ సిక్సర్లు బాదాడు. ప్రసిధ్ కృష్ణ మరుసటి ఓవర్లో ధావన్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అయితే 17 పరుగులు వచ్చిన ఇదే ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా ఔటయ్యాడు. ధావన్ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఈ సారి రసెల్ బౌలింగ్ చేయగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఢిల్లీ 4.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఆరో ఓవర్ వేసిన రసెల్ 2 పరుగులిచ్చి శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ జాగ్రత్తగా ఆడటంతో మధ్యలో కొన్ని ఓవర్లు పరుగుల్ని కట్టడి చేశాయి. మళ్లీ పదో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన ధావన్ 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 2 వికెట్లను కోల్పోయి 88 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్పిన్నర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. శిఖర్–రిషబ్లిద్దరు మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గెలుపుతీరం వద్ద పంత్ నిష్క్రమించగా, ఇంగ్రామ్ (6 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి సిక్సర్‌తో ముగించాడు. టి20 కెరీర్లో తొలి సెంచరీని చేజార్చుకున్న ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (97 నాటౌట్) నమోదు చేశాడు. -
చెన్నై చెడుగుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్... ఈ సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో 18 బంతుల్లోనే 53 పరుగులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జట్టు. అలాంటి జట్టుతో చెన్నై చెడుగుడు ఆడుకుంది. 20 ఓవర్లు ఆడినా... 108 పరుగులకు మించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది.ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రోజు ‘పసుపు సేన’ది. కాబట్టే చెపాక్‌లో ‘సూపర్’ కింగ్స్ అజేయంగా నిలిచింది. చెన్నై: సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురేలేకుండా సాగిపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఒకే ఒక్కడు ఆండ్రీ రసెల్ (44 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. 0, 6, 11, 0... కోల్‌కతా టాపార్డర్ స్కోరిది! ఆట మొదలైందో లేదో... ఇంకా సీట్లలోకి ప్రేక్షకులు పూర్తిగా కూర్చోకముందే నైట్‌రైడర్స్ పతనం ఫటాఫట్‌గా మొదలైంది. చెన్నై పేసర్ దీపక్ చహర్ నిప్పులు చెరిగాడు. ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున లిన్ (0), నితీశ్ రాణా (0), రాబిన్ ఉతప్ప (11)లను పెవిలియన్ చేర్చాడు. ఇది చాలదన్నట్లు హర్భజన్ స్పిన్ మాయలో నరైన్ (6) పడ్డాడు. అంతే 24 పరుగులకే 4 టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఔట్. తర్వాత తాహిర్ కూడా ఓ చెయ్యి వేశాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (9)లను పెవిలియన్ పంపించాడు. ఆదుకున్న రసెల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన చెపాక్ పిచ్‌పై టెయిలెండర్లు పీయూష్ చావ్లా (8), కుల్దీప్ (0), ప్రసిధ్ కృష్ణ (0) మాత్రం ఏం చేస్తారు. 79 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి వంద కంటే ముందే ఆలౌటయ్యేందుకు కోల్‌కతా సిద్ధమైంది. కానీ ఒక్కడు పోరాటం చేశాడు. పిచ్ పూర్తిగా బౌలర్ల వశమైన తరుణంలో రసెల్ నిలబడ్డాడు. కానీ మిస్సైల్ షాట్లు మాత్రం అంత ఈజీగా రాలేదు. బంతిని బలంగా బాదే క్రమంలో అతను కొద్దిసేపు కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినా మొండిగా కడదాకా బ్యాట్‌ను ఝళిపించాడు. జట్టు స్కోరును వందకు చేర్చాడు. తను 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. హర్భజన్, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు. రాణించిన డుప్లెసిస్... సూపర్‌కింగ్స్ సునాయాస లక్ష్యఛేదన వాట్సన్ బౌండరీతో మొదలైంది. కానీ పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. 2 ఫోర్లు, సిక్సర్‌తో ఊపుమీదున్న వాట్సన్ (9 బంతుల్లో 17), క్రీజులో నిలబడేందుకు సాహసించిన రైనా (13 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్)లు నరైన్ ఉచ్చులో పడ్డారు. దీంతో 35 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. అందుకేనేమో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పిచ్‌ను గౌరవించారు. ఆచితూచి ఆడుతూ తమ ఆటను మెల్లిగా కొనసాగించారు. డుప్లెసిస్, రాయుడు (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) ఒకట్రెండు పరుగులతో, వీలుచిక్కినపుడు బౌండరీతో స్కోరు బోర్డును నడిపించారు. అంతేగానీ అనవసర మెరుపులకు ఆస్కారమివ్వలేదు. ఇద్దరు మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 81 వద్ద రాయుడు షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. తర్వాత కేదార్ జాదవ్ (8 నాటౌట్)తో కలిసి డుప్లెసిస్ మిగతా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. నరైన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
‘చెక్ చేయండిరా బాబు.. నమ్మలేకపోతున్నాం’
జైపూర్ : ఐపీఎల్ సీజన్12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించి కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా ఓపెనింగ్ జోడి (నరైన్- క్రిస్‌లిన్)ని విడదీసేందుకు రాయల్స్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ లిన్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్’ కారణంగానే అతనికి లైఫ్ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఛేజింగ్‌లో భాగంగా నరైన్‌తో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన క్రిస్ లిన్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్ ధవల్ కులకర్ణి నాలుగో ఓవర్ రెండో బంతి(ఇన్సైడ్ ఎడ్జ్) ద్వారా లిన్ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్ క్రిస్‌లిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్తో బెయిల్స్‌ను అంటించారేమో. స్టంప్స్‌ను బాల్ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కులకర్ణి బౌలింగ్‌లో లైఫ్ పొందిన క్రిస్‌లిన్.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో లిన్ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. Does someone want to check if the bails have been glued down? Never seen a ball hit the stumps that hard and not knock the bails off - unbelievable!#RRvKKR #HallaBol #IPL #IPL12 #ipl2019 #cricket pic.twitter.com/TLqshZ7Kvz — talesfrmthecrypt (@cricketwriter1) April 7, 2019 #RRvKKR #IPL2019 #BCCI #ICC #VIVOIPL What's point of inbuilt LEDs stumps/bails.. Even if the bails don't get dislodged the blink of LEDs should be taken into consideration.. pic.twitter.com/DJ0gDDDpI7 — Saurabh Trivedi (@saurabh7755) April 7, 2019 -
కోల్‌కతా మెరుపు విజయం
జైపూర్: కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముం దుగా రాజస్తాన్‌ను కట్టేసింది. వికెట్లున్నా పరుగుల్ని నిరోధించింది. తర్వాత సులభ లక్ష్యాన్ని వేగంగా ఛేదించింది. మందకొడి పిచ్‌పై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. లీగ్‌లో నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మొదట రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్మిత్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ గర్నీ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది. లిన్ (32 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నరైన్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వికెట్లున్నా... పరుగులేవి? రాజస్తాన్ సొంతగడ్డపై ముందుగా టాస్‌తో ఓడింది. తర్వాత పిచ్‌తో ఓడింది. ఆఖరికి ప్రత్యర్థి చేతిలో ఓడింది. నిజమే..! ఎందుకంటే సొంతపిచ్‌పై చేతిలో గంపెడు వికెట్లున్నా... గుప్పెడు పరుగుల్ని ఎక్కువగా చేయలేకపోయింది. అసలు పరుగుపెట్టేందుకే ఆపసోపాలు పడింది. ఓపెనర్ రహానే (5) వికెట్‌ను రెండో ఓవర్లో కోల్పోయింది. తర్వాత రెండో ఓపెనర్ బట్లర్ (34 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) 12వ ఓవర్లో ఔటయ్యాడు. అంటే రెండో వికెట్ భాగస్వామ్యం 10.4 ఓవర్లదాకా సాగింది. అప్పటిదాకా ఒకే వికెట్ కోల్పోయినా...ఈ 12 ఓవర్లలో చేసిందెంతో తెలుసా... 77 పరుగులు. పిచ్ పరిస్థితుల నుంచి లబ్ది పొందిన కోల్‌కతా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలబెట్టే పరుగులకు అడ్డుకట్ట వేయడం ఈ మ్యాచ్‌లోని గొప్ప విశేషం. దీంతో రాయల్స్ 15వ ఓవర్లో 100 పరుగులు చేసింది. అనుభవజ్ఞుడైన ఆసీస్ స్టార్ స్మిత్ నిలబడటంతో ఆ మాత్రమైన స్కోరు వచ్చింది. అతను 44 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. త్రిపాఠి (6) ఔటయ్యాక వచ్చిన స్టోక్స్ హిట్టరే అయినా కిందా మీదా పడుతూ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కొడితే ఒట్టు! చెలరేగిన ఓపెనర్లు ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లే సుమారు వంద పరుగులదాకా నడిపించారు. ఐపీఎల్‌తో గతంలోనే ఓపెనర్ అవతారమెత్తిన నరైన్, లిన్ ధాటిగా ఆడారు. గౌతమ్ వేసిన రెండో ఓవర్‌ను పూర్తిగా ఆడిన నరైన్ 4, 0, 6, 4, 4, 4లతో 22 పరుగులు చేశాడు. 2 ఓవర్లకే 32 పరుగులు చేసిన కోల్‌కతా 4.1 ఓవర్లలోనే 50 పరుగులను అధిగమించింది. ఇద్దరు కలిసి ఇక సిక్సర్ల మోత మోగించడంతో జట్టు 8.1 ఓవర్లలోనే 90 పరుగులకు చేరింది. మరో పరుగు జతయ్యాక 91 స్కోరు వద్ద నరైన్ ఔటయ్యాడు. అయినాసరే 10వ ఓవర్ పూర్తికాక ముందే (9.3) జట్టు స్కోరు వందకు చేరింది. లిన్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత బంతికే అతనూ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా 13.5 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చారు. గోపాల్‌కు 2 వికెట్లు దక్కాయి. -
కోల్‌కతా కుమ్మేసింది
కోల్‌కతా కోటలో నైట్‌రైడర్స్ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్ తనకే సాధ్యమైన రీతిలో భీకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలిపించింది. బౌలర్ల సమష్టి వైఫల్యంతో ముందే మ్యాచ్‌పై కింగ్స్ ఎలెవన్ ఆశలు కోల్పోగా... మయాంక్, మిల్లర్ మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 28 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్‌కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేయగా...చివర్లో ఆండ్రీ రసెల్ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (40 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించేందుకు అవి సరిపోలేదు. రసెల్ విధ్వంసం... కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మరో 5.3 ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో రసెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తాను ఆడిన తొలి 7 బంతుల్లో అతను చేసింది 5 పరుగులే! అయితే ఆ తర్వాత అతని వీర విధ్వంసం మొదలైంది. టై వేసిన ఓవర్లో వరుసగా నాలుగు బంతులను 6, 4, 4, 6లుగా మలచి రసెల్ చెలరేగిపోయాడు. తర్వాతి ఓవర్లో షమీ బాధితుడయ్యాడు. అతని ఓవర్లో కూడా వరుసగా 6, 6, 6, 4 బాదాడు. సరిగ్గా చెప్పాలంటే తాను ఆడిన వరుస ఎనిమిది బంతుల్లో రసెల్ 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు రాబట్టాడు. టై బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా... బౌండరీ వద్ద మయాంక్ పట్టిన చక్కటి క్యాచ్‌తో రసెల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. నోబాల్‌తో బతికిపోయి... రసెల్ స్కోరు 3 వద్ద ఉండగా షమీ అద్భుత యార్కర్‌తో అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే తన తప్పేమీ లేకపోయినా షమీని దురదృష్టం వెంటాడింది. నిబంధనల ప్రకారం ఆ సమయంలో 30 గజాల సర్కిల్లో కనీసం నాలుగు ఫీల్డర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. దాంతో అంపైర్ ‘నోబాల్’గా ప్రకటించడంతో రసెల్ బతికిపోయాడు. షమీ తర్వాతి ఓవర్లో కోల్‌కతా ఏకంగా 25 పరుగులు కొల్లగొట్టింది. రాణా సిక్సర్ల జోరు... నితీశ్ రాణా కూడా దూకుడైన ఆటతో చెలరేగి నైట్‌రైడర్స్‌కు భారీ స్కోరు అందించాడు. అశ్విన్ బౌలింగ్‌ను అతను చితక్కొట్టాడు. అశ్విన్ రెండో, మూడో ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాదిన అతను... చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తర్వాతి ఓవర్ వేసిన పార్ట్‌టైమర్ మన్దీప్ సింగ్‌ను వదలకుండా 2 సిక్సర్లు కొట్టాడు. విలోన్ వేసిన మరుసటి ఓవర్లో కూడా రాణా అదే ధాటిని కొనసాగించాడు. వరుస బంతుల్లో 4, 6, 4 కొట్టాడు. 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. కోల్‌కతా టీమ్ వెటరన్ ఉతప్ప కూడా చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 41 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ చేశాడు. పాపం వరుణ్... ‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ కనీస ధరకు 42 రెట్లు ఎక్కువ మొత్తానికి (రూ. 8.4 కోట్లు) వరుణ్ చక్రవర్తిని పంజాబ్ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అతనికి తొలి టి20/ఐపీఎల్ మ్యాచ్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు (25) ఇచ్చిన బౌలర్‌గా అతను నిలిచాడు. వరుణ్ మొదటి ఓవర్లో సునీల్ నరైన్ వరుసగా 6, 2, 4, 6, 6తో చెలరేగాడు. అతని రెండో ఓవర్లో ఉతప్ప రెండు ఫోర్లు బాదగా, మూడో ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి రాణా వికెట్ తీయడం ఊరట! మయాంక్, మిల్లర్ మాత్రమే... భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ (1) మళ్లీ విఫలం కాగా... క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు గేల్ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరితో పాటు సర్ఫరాజ్ (13) కూడా వెనుదిరిగాక గెలిపించే భారం మయాంక్, మిల్లర్లపై పడింది. నరైన్ ఓవర్లో మిల్లర్ వరుసగా 6, 4 కొట్టగా...మయాంక్ వరుసగా మరో రెండో ఫోర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మయాంక్‌ను చావ్లా బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (47 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్ చివరి వరకు నిలిచినా పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. -
రసెల్ దెబ్బకు సన్ డౌన్
విజయానికి చివరి 3 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. ఐపీఎల్లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. కానీ ఆండ్రీ రసెల్ పవర్ హిట్టింగ్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలాంటి లక్ష్యాన్ని అందుకుంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన 18వ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాదిన రసెల్... భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో మరో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 40 పరుగులు వచ్చేశాయి. షకీబ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా... ఈ సారి నేనున్నానంటూ శుబ్‌మన్ గిల్ 2 సిక్సర్లతో చెలరేగి 2 బంతుల ముందే ఆట ముగించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పలకరించగా ...సొంతగడ్డపై కేకేఆర్ సంబరాల్లో మునిగిపోయింది. కోల్‌కతా: ఐపీఎల్ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన వినోదం లభించింది. కోల్‌కతా, హైదరాబాద్ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్ మెరుపులు లీగ్‌లో జోష్ తెచ్చాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో 37వ అర్ధసెంచరీతో ఘనంగా పునరాగమనం చేయగా, విజయ్ శంకర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, ఉతప్ప (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ జోరు... బాల్ ట్యాంపరింగ్‌తో గత ఏడాది లీగ్‌కు దూరమైన వార్నర్ మళ్లీ తన సత్తాను ప్రదర్శించాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అతను తన రాకను తెలియజేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి కోల్‌కతా ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. అయితే రీప్లేలో నాటౌట్ అని స్పష్టంగా తేలడంతో కోల్‌కతా రివ్యూ కోల్పోయింది. ఆ తర్వాత నరైన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్... రసెల్ మొదటి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. ఈ సిక్సర్‌తో 31 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం 68 పరుగుల వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కార్తీక్ వదిలేశాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో ఎట్టకేలకు వార్నర్ ఆటను రసెల్ ముగించాడు. అతని ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన తర్వాత మరో బలమైన షాట్‌కు ప్రయత్నించగా కవర్స్‌లో ఉతప్ప అద్భుత క్యాచ్ పట్టడంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. బెయిర్‌స్టో మొదటి మ్యాచ్... ఇంగ్లండ్ తరఫున గత కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోకు తొలిసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్లలో వేర్వేరు జట్ల తరఫున 99 టి20లు ఆడిన అతనికి ఆదివారం మ్యాచ్ 100వ టి20 కావడం విశేషం. చావ్లా బౌలింగ్‌లో చక్కటి సిక్సర్‌తో తొలి బౌండరీ రాబట్టిన అతను ఆ తర్వాత మరో మూడు ఫోర్లు కొట్టాడు. వార్నర్, బెయిర్‌స్టో కలిసి 77 బంతుల్లో 118 పరుగులు జోడించారు. మరోవైపు భారత జట్టులో వరుస అవకాశాలు లభించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన విజయ్ శంకర్ ఐపీఎల్లో కూడా దానిని చూపించాడు. నరైన్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. 27 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బతికిపోయిన అతను అదనంగా మరో 13 పరుగులు జోడించగలిగాడు. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలోనే క్రిస్ లిన్ (7) వికెట్ కోల్పోయింది. అయితే నితీశ్ రాణా, ఉతప్ప భాగస్వామ్యం ఆ జట్టును రేసులో నిలిపింది. సందీప్ శర్మ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ కొట్టి రాణా దూకుడు ప్రదర్శించగా, ఉతప్ప కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 58 బంతుల్లో 80 పరుగులు జోడించారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (2) విఫలం కాగా, 35 బంతుల్లో రాణా అర్ధ సెంచరీ చేశాడు. లైట్స్ ఆఫ్! ఈడెన్ గార్డెన్స్‌లో ఒక ఫ్లడ్ లైట్ టవర్ పని చేయకపోవడంతో 16వ ఓవర్లో ఆట ఆగిపోయింది. దాదాపు 13 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలైంది. భువనేశ్వర్ రెండోసారి... సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో భువీ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి మాత్రమే. 2016–17 రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను యూపీకి కెప్టెన్‌గా పని చేశాడు. -
నైట్‌రైడర్స్ దూకుడు
రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ కెప్టెన్సీలో కొత్త జట్టుతో అద్భుత ప్రదర్శన కనబర్చి తొలిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 2014లో కూడా దానిని పునరావృతం చేసింది. రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని చెన్నై తర్వాత ఈ ఘనత సాధించిన మరో జట్టుగా నిలిచింది. ఈ టీమ్‌లో 2012లో విజేతగా నిలిచిన జట్టులోని వారే ఎక్కువ మంది ఉండి కీలక పాత్ర పోషించారు. అనూహ్యమైన ఆటతీరుతో లీగ్ దశలో ఏకంగా 11 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరకు ఫైనల్లో చతికిల పడింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బోర్డుతో విభేదాల కారణంగా పుణే వారియర్స్ తప్పుకోవడంతో లీగ్ మొదలైన కొత్తలో ఉన్నట్లుగా మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్ జరగడం విశేషం. యూఏఈలో.... ఐపీఎల్ మొదలైన తర్వాత రెండోసారి 2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2009లాగే మళ్లీ దక్షిణాఫ్రికాలో నిర్వహించాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు తెచ్చింది. అయితే ఈసారి ఫ్రాంచైజీలు దానిని వ్యతిరేకించాయి. ఆర్థికపరంగా, నిర్వ హణాపరంగా 2009లో తమకు చాలా సమస్యలు తలెత్తాయని చెప్పడంతో చివరకు రెండు దశలుగా లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తొలి 20 మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, తర్వాతి 40 మ్యాచ్‌లు భారత్‌లో జరిగాయి. ఫైనల్ ఫలితం... క్వాలిఫయర్–1లో పంజాబ్‌ను ఓడించి కోల్‌కతా... క్వాలిఫయర్ 2లో చెన్నైని ఓడించి పంజాబ్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. వృద్ధిమాన్ సాహా (115 నాటౌట్) అద్భుత సెంచరీ, మనన్ వోహ్రా (67) అర్ధ సెంచరీ సహాయంతో ముందుగా పంజాబ్ 4 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత కోల్‌కతా మరో 3 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లకు 200 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. ‘మ్యా¯Œ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (94) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు శతకాలు... టోర్నీలో మూడు సెంచరీలు నమోదయ్యాయి. సెహ్వాగ్ (122), సాహా (115), లెండిల్ సిమ¯Œ ్స (100) ఈ ఘనత సాధించగా... 4 అర్ధ సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్ 95, 95, 90, 89 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. లీగ్‌లో అత్యధికంగా మ్యాక్స్‌వెల్ 36 సిక్సర్లు బాదడం మరో విశేషం. వేలం విశేషాలు... 2014 సీజన్లో మళ్లీ కొత్తగా వేలం జరిగితే... మొదటిసారి ఆటగాళ్లకు డాలర్లు రూపంలో కాకుండా రూపాయలుగా చెల్లించారు. అన్నింటికంటే ప్రధాన మార్పు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్స్ విషయంలో జరిగింది. అప్పటి వరకు వారిని వేలంలో ఉంచకుండా నిర్ణీత మొత్తం అందజేసిన గవర్నింగ్ కౌన్సిల్ వారికీ వేలంలో చేరే అవకాశం ఇచ్చింది. దీని వల్ల భారత జట్టుకు ఆడకపోయినా ప్రత్యేక ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు భారీ మొత్తం అందుకునే అవకాశం దక్కింది. వీరిలో అత్యధికంగా కరణ్ శర్మ (రూ. 3.75 కోట్లు)కు దక్కాయి. ఇద్దరు మినహా... లీగ్‌లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి కోల్‌కతా విజయంలో భాగంగా నిలిచిన 17 మంది ఆటగాళ్లలో మన్వీందర్ బిస్లా, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతావారంతా అంతర్జాతీయ క్రికెటర్లు కావడం విశేషం. -
కోల్‌కథ మార్చుకుంది
తొలి మూడు సీజన్లలో టాప్–5లో కూడా నిలవని కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరుకొని ఎలిమినేటర్ మ్యాచ్‌లో నిష్క్రమించింది. 2012 ఐదో సీజన్లో మాత్రం అందరి అంచనాలను తారుమారు చేసి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని నైట్‌రైడర్స్ జట్టు తుది పోరులో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి సగర్వంగా ట్రోఫీని చేజిక్కించుకుంది. విజేత హోదాలో కోల్‌కతాకు వెళ్లిన ఆ జట్టుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరగడం విశేషం. ఆ టోర్నీ విశేషాలు క్లుప్తంగా... తొమ్మిది జట్లతో... 2011 సీజన్లో తొలిసారి పది జట్లతో లీగ్ నిర్వహించగా 2012లో ఆ సంఖ్య తొమ్మిదికి పడిపోయింది. నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ సమర్పించనందుకు కొచ్చి టస్కర్ కేరళ జట్టును బీసీసీఐ లీగ్ నుంచి తొలగించింది. లీగ్ మొత్తం హోరాహోరీగా సాగింది. 76 మ్యాచ్‌ల్లో 19 మ్యాచ్‌ల ఫలితాలు ఆఖరి ఓవర్లో... ఇందులో రెండు మ్యాచ్‌ల ఫలితాలు చివరి బంతికి వచ్చాయి. మరో ఆరు మ్యాచ్‌ల ఫలితాల్లో పరుగుల వ్యత్యాసం పదిలోపే ఉంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (22 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (21 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (20 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (17 పాయింట్లు) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి చాంపియన్స్ లీగ్‌తోపాటు ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించాయి. ప్లే ఆఫ్ క్వాలిఫయర్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18 పరుగులతో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 38 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. అనంతరం క్వాలిఫయర్–2లో చెన్నై సూపర్ కింగ్స్ 86 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచి ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరుకు సిద్ధమైంది. చెన్నైలో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. మైక్ హస్సీ (43 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సురేశ్ రైనా (38 బంతుల్లో 73; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం కోల్‌కతా జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మాన్విందర్ బిస్లా (48 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాక్వస్ కలిస్ (49 బంతుల్లో 69; 7 ఫోర్లు, సిక్స్) రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించి కోల్‌కతా విజయానికి పునాది వేశారు. పరుగుల ప్రవాహం... ఐదో సీజన్లో బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలర్ల హవా కూడా నడించింది. మొత్తం 22,453 పరుగులు నమోదవ్వడమే కాకుండా 857 వికెట్లు పడ్డాయి. ఇందులో పేస్ బౌలర్లు 537 వికెట్లు తీయగా... స్పిన్నర్లకు 241 వికెట్లు లభించాయి. లీగ్‌లో అత్యధికంగా ఆరు సెంచరీలు, రికార్డుస్థాయిలో 96 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. క్రిస్ గేల్, మురళీ విజయ్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, కెవిన్ పీటర్సన్ ఒక్కో సెంచరీ చేశారు. షారుఖ్‌పై నిషేధం... ఈ సీజన్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బహిరంగంగా ధూమపానం చేసినందుకు రాజస్తాన్ పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అనంతరం వాంఖడే స్టేడియం సెక్యూరిటీ గార్డ్‌తో గొడవ పడినందుకు షారుఖ్ ఖాన్‌పై ముంబై క్రికెట్ సంఘం వాంఖడే మైదానంలో ప్రవేశం లేకుండా అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఐదుగురు క్రికెటర్లు మోనిశ్ మిశ్రా, షలబ్ శ్రీవాస్తవ, టీపీ సుధీంద్ర, అమిత్ యాదవ్, అభినవ్ బాలి స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ వారిని సస్పెండ్ చేసింది. వీరు గుర్తున్నారా..! ఐపీఎల్–5 సీజన్ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కలిస్, బ్రెండన్ మెకల్లమ్, మర్చంట్ డి లాంగె, హాడిన్ , బ్రెట్ లీ, ఇయాన్ మోర్గాన్ , సునీల్ నరైన్ , ప్యాటిన్సన్ , షకీబ్ అల్ హసన్ , ర్యాన్ డషెట్ విదేశీ ఆటగాళ్లు కాగా... గంభీర్, బాలాజీ, జైదేవ్ ఉనాద్కట్, షమీ, యూసుఫ్ పఠాన్ , సంజూ సామ్సన్ , మనోజ్ తివారీ భారత జట్టుకు ఆడారు. సరబ్జిత్ లడ్డా, రజత్ భాటియా, దేబబ్రత దాస్, మాన్విందర్ బిస్లా, చిరాగ్ జాని, ఇక్బాల్ అబ్దుల్లా, ప్రదీప్ సాంగ్వాన్ , ఐరిష్ సక్సేనాలకు ఇప్పటి వరకు జాతీయ సీనియర్ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సునీల్ నరైన్ కోల్‌కతా నైట్‌రైడర్స్; 24 వికెట్లు అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): క్రిస్ గేల్ బెంగళూరు; 733 అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): మోర్నీ మోర్కెల్ ఢిల్లీ; 25 వికెట్లు -
వచ్చే ఐపీఎల్‌కు స్టార్క్ దూరం
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్‌ను వచ్చే ఏడాది ఐపీఎల్లో కొనసాగించేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆసక్తి చూపించలేదు. అతడితో ఉన్న ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. స్టార్క్‌కు ఈ విషయాన్ని సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేసింది. ‘కోల్‌కతా జట్టు యాజమాన్యం నన్ను వచ్చే ఏడాది కొనసాగించడం లేదని రెండు రోజుల క్రితం మెసేజ్ పంపించింది. అంటే ఆ సమయంలో నేను ఖాళీగా ఉండబోతున్నాను’ అని స్టార్క్ వెల్లడించాడు. 2018 వేలంలో రూ. 9.4 కోట్ల భారీ మొత్తానికి స్టార్క్‌ను నైట్‌రైడర్స్ తీసుకున్నా... గాయం వల్ల అతను టోర్నీ ఆరంభానికి ముందే దూరమయ్యాడు. -
భారత ఆటగాళ్లే కీలకం
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే నాకౌట్ మ్యాచ్ సొంతగడ్డపై ఆడే అవకాశం రావడం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అతి పెద్ద బలంగా చెప్పవచ్చు. ఈడెన్ అభిమానులు పెద్ద ఎత్తున నైట్‌రైడర్స్‌కు అండగా నిలుస్తారు కాబట్టి రాజస్తాన్‌కు అంత సులువు కాదు. సహజంగానే ఆరంభంలో కెప్టెన్‌గా కొంత తడబాటు తర్వాత దినేశ్ కార్తీక్ స్ఫూర్తిదాయక నాయకత్వంతో జట్టును నాకౌ ట్స్ వరకు నడిపించా డు. యువ ఆటగాళ్ల నుంచి అతను మంచి ప్రదర్శన రాబట్టిన తీరు అసలైన నాయకత్వానికి మంచి ఉదాహరణ. వారికి మంచి అవకాశాలు ఇవ్వడమే కాదు... తప్పులు చేసినా వాటినుంచి నేర్చుకునేలా చేయడం, ఫలితంపైనే కాకుండా వారి ప్రతిభపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగించాడు. ఈ కోణంలో చూస్తే శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ అతని నాయకత్వంలో ఎంతో ఎదిగారని నాకనిపిస్తోంది. తన అసలు ప్రతిభ ప్రదర్శించేందుకు తగినన్ని ఓవర్లు లభించకపోయినా శుబ్‌మన్ గిల్ ఆకట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న తక్కువ బంతుల్లోనే చక్కటి షాట్లు ఆడటమే కాదు, మ్యాచ్ పరిస్థితులను బట్టి స్పందించగలనని నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో అతను గొప్ప ఆటగాడిగా ఎదగుతాడు. నరైన్, రసెల్, లిన్వంటి విదేశీయులు కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించినా భారత ఆటగాళ్ల పాత్ర కూడా చాలా ఉంది. మరోవైపు రాజస్తాన్ కుర్రాళ్లలో కూడా ఇదే పట్టుదల కనిపించింది. స్టోక్స్, బట్లర్ వెళ్లిపోయిన తర్వాత బెంగళూరుతో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగారు. సంజు శామ్సన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయినా... అతని సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ అతనికే జట్టులో ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆర్చర్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయత్నం విఫలం అయింది కాబట్టి ఆ స్థానంలో శామ్సన్ను ఉపయోగించుకోవచ్చు. గత మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్, త్రిపాఠి చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ సారి కూడా వారు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. తమ స్థాయి కి తగిన గుర్తింపు లభించని రెండు అత్యుత్తమ జట్లు పంచే వినోదంలో ఫలితంతో సంబంధం లేకుండా ఈడెన్ అభిమానులు తడిసి ముద్దవడం ఖాయం. -
ఎవరిదో ఇంటిదారి?
కోల్‌కతా: ఓ వైపు ఆల్‌రౌండర్లతో కూడిన జట్టు... మరోవైపు కుర్రాళ్లపైనే ఆధారపడ్డ జట్టు... ఇంటికా? ముందుకా? తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రహానే సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్ సమరానికి రెడీ అయ్యాయి. ఇరు జట్ల మధ్య బుధవారం జరి గే పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధిస్తుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎలా చూసిన నైట్‌రైడర్సే ఫేవరెట్. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో కార్తీక్ సేన సమతౌల్యంగా ఉంది. పైగా ఇంటాబయటా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ను సునాయాసంగానే ఓడించింది. ప్లేఆఫ్స్‌కు చేరిన మిగతా 3 జట్లకు లేని అదనపు బలం (సొంతగడ్డపై ఆడనుండటం) కోల్‌కతాకు బాగా కలిసి రానుంది. ఈ ఎలిమినేటర్‌లో గెలిస్తే క్వాలిఫయర్–2 కూడా ఈడెన్ గడ్డపైనే జరగనుండటం నైట్‌రైడర్స్‌కు కచ్చితంగా వరమే! కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్... దినేశ్ కార్తీక్ సారథిగా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అతను ఈ సీజన్లో54.78 సగటుతో 438 పరుగులు చేసి కోల్‌కతా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్ ఆల్‌రౌండర్ పాత్రలో ఒదిగిపోతున్నాడు. ఆరంభంలో అసాధారణ స్థాయిలో రాణిస్తున్న ఇతన్ని ప్రత్యర్థి బౌలర్లు పవర్ ప్లే వరకు ఉంచినా కష్టమే. ఓపెనింగ్‌లో నరైన్, లిన్ శుభారంభాలిచ్చిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా తేలిగ్గా గెలిచింది. రసెల్ వీరవిహారం జట్టుకు మిసైల్ బలం కానుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో అతను సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైనం అద్భుతం. బ్యాటింగ్‌లో వీరితో పాటు రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్లు జట్టు భారీస్కోరుకు బాటలు వేయగల సమర్థులు. బౌలింగ్‌లో సియర్లెస్, ప్రసిధ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు. నిలకడలేమితో రాయల్స్... రాయల్స్ నిలకడలేమితో సతమతమవుతోంది. బట్లర్ వీరోచిత విన్యాసంతో నెగ్గుకొచ్చిన ఈ జట్టుకు అతను స్వదేశం చేరడం పెద్ద లోటు. పాక్‌తో టెస్టు కోసం బట్లర్ తిరిగి ఇంగ్లండ్ వెళ్లాడు. శామ్సన్ ఒకటి అర మినహా సీజన్ అంతా అకట్టుకోలేకపోయాడు. భారీ లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటి రాయల్స్ జట్టుకు లేదనే చెప్పాలి. ప్రస్తుతం నైట్‌రైడర్స్‌ను గెలవాలంటే తప్పకుండా జట్టంతా కలిసి సర్వశక్తులు ఒడ్డాల్సిందే. రహానే, షార్ట్, త్రిపాఠి సమష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించగలదు. బౌలింగ్‌లో ఆర్చర్ వైవిధ్యం జట్టుకు కలిసివస్తోంది. శ్రేయస్ గోపాల్ గత మ్యాచ్‌లో బెంగళూరు భరతం పట్టాడు. అలాంటి ప్రదర్శనే ఇక్కడా పునరావృతం కావాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. జట్లు (అంచనా) కోల్‌కతా నైట్‌రైడర్స్: దినేశ్ కార్తీక్ (కెప్టెన్), సునీల్ నరైన్, లిన్, రాబిన్ ఉతప్ప, రసెల్, నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, సియర్లెస్, ప్రసిధ్ కృష్ణ. రాజస్తాన్ రాయల్స్: రహానే (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, సంజూ శామ్సన్, షార్ట్, కృష్ణప్ప గౌతమ్, ఆర్చర్, క్లాసెన్, కులకర్ణి, శ్రేయస్ గోపాల్, ఉనాద్కట్, లాఫ్లిన్. -
కోల్‌కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్‌కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్‌తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్‌కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్‌కతా రన్‌రేట్ దూసుకుపోయింది. పవర్‌ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్‌కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్‌వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్‌వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్‌వైట్ 2.4–0–21–2. -
అందుకు మేము అర్హులం కాదు : కోహ్లి
బెంగళూరు : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగేనని అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతీ మ్యాచ్ నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుకున్న దాని కన్నా మంచి స్కోర్ సాధిస్తున్నాం. కానీ ఓటమి తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లో వికెట్లు కోల్పోతున్న తరుణంలో 165 పరుగులు చేసినా ఎక్కువే అనుకున్నాం. కానీ అదనంగా పది పరుగులు లభించాయి. మంచి స్కోర్ సాధించినప్పటికీ మ్యాచ్ కాపాడుకోలేకపోయామని’ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా ఫీల్డింగ్ సరిగా లేదు. సింగిల్స్‌ను బౌండరీలుగా మార్చడాన్ని ఆపలేకపోయాం. ఇలా అయితే విజయానికి మేము అర్హులం కాదు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత శ్రమించాల్సి ఉందని’ ఆర్సీబీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అయితే రెండు వరుస ఓటములతో డీలా పడ్డ కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో పవర్‌ప్లేలో 51 పరుగులు వచ్చాయి. లిన్ 7 పరుగుల వద్ద ఉన్నపుడు అతను ఇచ్చిన క్యాచ్‌ను మురుగన్ అశ్విన్ వదిలేశాడు. తనకు లభించిన లైఫ్‌ను చక్కగా వినియోగించుకున్న లిన్.. ఆర్సీబీ ఓటమిని శాసించాడు. -
లిన్... గెలిపించెన్
బెంగళూరు: ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 200లకు పైగా పరుగులు చేసి కూడా పరాజయం పాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో 175 పరుగులనూ కాపాడుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... మెకల్లమ్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రసెల్ (3/31)కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలో దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ లిన్ (52 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), ఉతప్ప (21 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్తీక్ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సిరాజ్, మురుగన్ అశ్విన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. లిన్ మెరుపులు... రెండు వరుస ఓటములతో డీలా పడ్డ కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో పవర్‌ప్లేలో 51 పరుగులు వచ్చాయి. లిన్ 7 పరుగుల వద్ద ఉన్నపుడు అతను ఇచ్చిన క్యాచ్‌ను మురుగన్ అశ్విన్ వదిలేశాడు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించాక నరైన్ ఔటైనా లిన్... ఉతప్పతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ జోడీ బౌండరీలతో విరుచుకుపడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 88/1తో నిలిచింది. మరో ఇరవై పరుగులు జోడించాక మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగాడు. ఈ క్రమంలో లిన్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో రాణా (15) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిన రసెల్ (0) తొలి బంతికే ఔటవ్వడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. ఈ సమయంలో విజయానికి 3 ఓవర్లలో 29 పరుగులు అవసరం కాగా... లిన్‌తో కలిసి కార్తీక్ చెలరేగాడు. సౌతీ వేసిన 18వ ఓవర్లో 14 పరుగులు, ఆ తర్వాత సిరాజ్ ఓవర్లో 11 పరుగులు రావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 4కు చేరింది. చివరి ఓవర్ తొలి బంతిని శుబ్‌మన్ గిల్ (5 నాటౌట్) బౌండరీకి తరలించి లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డికాక్ (సి) శుబ్‌మన్ (బి) కుల్దీప్ 29; మెకల్లమ్ (సి) కార్తీక్ (బి) రసెల్ 38; కోహ్లి నాటౌట్ 68; వోహ్రా (బి) రసెల్ 0; మన్దీప్ సింగ్ (సి) శివమ్ (బి) రసెల్ 19; గ్రాండ్‌హోమ్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–67, 2–74, 3–75, 4–140. బౌలింగ్: చావ్లా 3–0–22–0, నరైన్ 4–0–38–0, జాన్సన్ 3–0–38–0, శివమ్ 3–0–21–0, కుల్దీప్ 4–0–20–1, రసెల్ 3–0–31–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ నాటౌట్ 62; నరైన్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) మురుగన్ అశ్విన్ 27; రాబిన్ ఉతప్ప (సి) సౌతీ (బి) అశ్విన్ 36; రాణా రిటైర్డ్ హర్ట్ 15; రసెల్ (సి) డికాక్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 23; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–59, 2–108, 3–139, 4–171. బౌలింగ్: సౌతీ 4–0–34–0, ఉమేశ్ యాదవ్ 3.1–0–36–0, యజువేంద్ర చహల్ 4–0–29–0, మొహమ్మద్ సిరాజ్ 4–0–40–2, మురుగన్ అశ్విన్ 4–0–36–2. -
మళ్లీ గెలుపు బాట పట్టేదెవరు?
ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతుల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎలా కోలుకుంటుందనేది ఆసక్తికరం. శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్ దినేశ్ కార్తీక్ జట్టును విజయం నుంచి దూరం చేసింది. ఛేదనకు అవసరమైన రీతిలో ఆ జట్టుకు ఆరంభమే లభించలేదు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షార్ట్ బాల్‌కు ఔట్ కావడాన్ని బట్టి చూస్తే రాయల్ చాలెంజర్స్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించవచ్చు. సునీల్ నరైన్ అప్పటి వరకు అన్ని వైపుల షాట్లు కొట్టినా నేరుగా శరీరంపైకి వచ్చిన బంతిని ఆడలేకపోయాడు. షార్ట్ బంతిని మెరుగ్గా ఆడటంలో ఉతప్పకు మంచి నైపుణ్యం ఉంది. అతను బెంగళూరులో సొంత ప్రేక్షకుల సమక్షంలో రాణించాలని కోరుకుంటున్నాడు. మైదానంలో ఏ మూలకైనా సిక్సర్ కొట్టి ప్రత్యర్థిని భయపెట్టగల రసెల్ కూడా జట్టులో ఉన్నాడు. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ పయనం పడుతూ లేస్తూ సాగుతోంది. నిజానికి వారి భారీ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఎలాంటి పెద్ద లక్ష్యమైనా వారి ముందు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ నిలకడలేమితో పాటు టాపార్డర్‌లో మంచి ఆరంభాలు లభించకపోవడమే వారికి సమస్యగా మారింది. కలలో కూడా ఊహించలేని తరహా షాట్లు ఆడుతూ డివిలియర్స్ ప్రత్యర్థి ఆటగాళ్లు ఊపిరి ఆగిపోయేలా చేస్తున్నాడు. అయితే డెత్ బౌలింగ్ వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ధోని దూకుడు మీద ఉన్న సమయంలో చివరి ఓవర్లలో అండర్సన్ బౌలింగ్ చేయడం సరైన వ్యూహం అనిపించుకోదు. ఇటీవలే మళ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెట్టిన అండర్సన్లో స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేసే ఆత్మవిశ్వాసం లోపించడం సహజం. ఫలితంగానే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఆ జట్టు చేజార్చుకుంది. గత మ్యాచ్‌లలో భారీ ఓటముల తర్వాత ఇరు జట్లు కూడా మళ్లీ మ్యాచ్ గెలిచి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు కాబట్టి మరో హోరాహోరీ పోరు ఖాయం. -
చెన్నై... దంచెన్
సొంతగడ్డపై తొలి మ్యాచ్... అటు దండిగా అభిమానుల మద్దతు... ఇంకేం చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు భారీ లక్ష్యం కూడా కరిగిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. చెన్నై: సీజన్లో తొలిసారి 200 పరుగుల పైగా లక్ష్యం ఎదురైనా... చెన్నై సూపర్ కింగ్స్ వెరవలేదు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ (19 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), అంబటి రాయుడు (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో ఆ జట్టు 203 లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ఆండ్రీ రసెల్ (36 బంతుల్లో 88 నాటౌట్; 1 ఫోర్, 11 సిక్స్‌లు) అసాధారణ ఆటతో నిలబెట్టాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 27 బంతుల వ్యవధిలో 10 సిక్స్‌లు... తొలి ఓవర్లో 18 పరుగులు సాధించి కోల్‌కతాకు ఓపెనర్లు సునీల్ నరైన్ (4 బంతుల్లో 12; 2 సిక్స్‌లు), లిన్ (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) బుల్లెట్ ఆరంభాన్నిచ్చారు. హర్భజన్ రెండో ఓవర్లోనే నరైన్ ఆట కట్టించినా వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తగ్గకపోవడంతో ఇన్నింగ్స్ మంచి రన్‌రేట్‌తోనే సాగింది. అతడితో పాటు లిన్, నితీశ్ రాణా (16), రింకూ సింగ్ (2) వెంటవెంటనే వెనుదిరగడంతో పది ఓవర్లకు జట్టు 89/5తో నిలిచింది. ఈ దశలో కార్తీక్, రసెల్ ఆచితూచి ఆడారు. చివర్లో ఉపయోగపడతాడని అట్టిపెట్టిన బ్రేవోను 14వ ఓవర్లో బౌలింగ్‌కు దించడంతోనే అంతా తారుమారైంది. ఆ ఓవర్లో రసెల్ సిక్స్ సహా 10 పరుగులు చేశాడు. ఠాకూర్ వేసిన 16, 20వ ఓవర్లలో రెండేసి, బ్రేవో వేసిన 17, 18వ ఓవర్లలో మూడేసి చొప్పున సిక్స్‌లు బాదిన రస్సెల్... జట్టు స్కోరును 200 దాటించాడు. అతడు 27 బంతుల వ్యవధిలో 10 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆ ముగ్గురి జోరుతో... వాట్సన్, రాయుడు పోటాపోటీగా ఆడుతూ 5.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించడంతో ఛేదనను చెన్నై దీటుగా ఆరంభించింది. రైనా (14), ధోని (28 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) విఫలమైనా బిల్లింగ్స్ చక్కటి షాట్లతో లక్ష్యం దిశగా నడిపించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు అవుటయ్యాడు. సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా ఉండగా చివరి ఓవర్ వేసిన వినయ్ కుమార్ లైన్ తప్పాడు. ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన జడేజా మ్యాచ్‌ను ముగించాడు. డుప్లెసిస్ పైకి బూటు... కావేరి నదీ జలాల బోర్డు ఏర్పాటు ఆందోళనల కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. టాస్కు 13 నిమిషాలు ఆలస్యమైంది. స్టేడియం పరిసరాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని టిక్కెట్ ఉన్నవారినే లోపలకు పంపారు. స్టేడియంలోని ఓ వ్యక్తి డు ప్లెసిస్పైకి బూటు విసిరాడు. చుట్టూ ఉన్నవారు కావేరి వివాదంపై నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఐపీఎల్‌కు స్టార్క్ దూరం
కుడి కాలు గాయం కారణంగా ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరమయ్యాడు. ఇదే కారణంతో శుక్రవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన నాలుగో టెస్టులో స్టార్క్ బరిలో దిగలేదు. అతడు వెంటనే స్వదేశానికి పయనమవుతాడని, ఐపీఎల్ ఆడడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఐపీఎల్లో స్టార్క్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాల్సి ఉంది. వేలంలో అతడిని రూ.9.4 కోట్లకు కోల్‌కతా తీసుకుంది. -
'ముంబై' చలో హైదరాబాద్
►ఐపీఎల్–10 ఫైనల్లో ముంబై ఇండియన్స్ ►క్వాలిఫయర్–2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం ►రేపు హైదరాబాద్‌లో రైజింగ్ పుణేతో టైటిల్ పోరు ►నాలుగు వికెట్లతో మెరిసిన కరణ్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి నిరూపించుకుంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి కేకేఆర్‌పై నెగ్గిన ముంబై ఐపీఎల్–10 ఫైనల్లో అడుగుపెట్టింది. కరణ్ శర్మ మాయాజాలం... బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు విలవిల్లాడిన గంభీర్ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సునాయాస లక్ష్యాన్ని కాస్త తడబడుతూనే ముంబై ఛేదించగలిగింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఓటమి లేకపోవడం విశేషం. ఇక ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే తుదిపోరులో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలర్లు రాజ్యమేలిన ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇషాంక్ జగ్గి (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) మాత్రమే కాస్త పోరాడగలిగారు. కరణ్ శర్మ నాలుగు, బుమ్రా మూడు, జాన్సన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి. కరణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలర్ల ధాటికి విలవిల టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను ముంబై బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఏ దశలోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. దీంతో ఇదే మైదానంలో పవర్‌ప్లేలో 105 పరుగులతో రికార్డు సృష్టించిన ఈ జట్టు ఈసారి అవమానకర రీతిలో బ్యాటింగ్ చేసింది. తమ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్న లిన్ (4)ను రెండో ఓవర్లోనే బుమ్రా అవుట్ చేయగా.. నరైన్ (10 బంతుల్లో 10; 1 సిక్స్)ను కరణ్ శర్మ ఐదో ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు. ఇక తదుపరి ఓవర్లో రాబిన్ ఉతప్ప (1)ను బుమ్రా అవుట్ చేయడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ప్లేలో ఈ సీజన్లో కోల్‌కతాకు ఇదే అత్యల్ప స్కోరు. ఏడో ఓవర్లో కరణ్ శర్మ కెప్టెన్ గంభీర్ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), గ్రాండ్‌హోమ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో కోల్‌కతా 31 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాంక్ జగ్గి జట్టుకు ఆపద్బాంధవ పాత్ర పోషించారు. కృనాల్ వేసిన ఓ ఓవర్లో సిక్స్ బాదిన సూర్యకుమార్ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో జగ్గి కూడా రెండు ఫోర్లు బాదినా 15వ ఓవర్లో అతడిని అవుట్ చేసి కరణ్ శర్మ మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా 17వ ఓవర్లో జాన్సన్.. చావ్లా (2), కూల్టర్‌నీల్ (6) వికెట్లను తీయగా మరుసటి ఓవర్లో నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ను బుమ్రా బోల్తా కొట్టించడంతో కోల్‌కతా భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఆరంభంలో తడబడినా... లక్ష్యం తక్కువగానే ఉన్నా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ అంత సజావుగా ఏమీ సాగలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు మూడు వికెట్లకు 36 పరుగులు... సునాయాసంగా బ్యాటింగ్ చేయగలదనుకున్న ముంబై టాప్ ఆర్డర్‌ను కోల్‌కతా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పీయూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిమన్స్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఎల్బీగా వెనుదిరగ్గా ఆ తర్వాతి ఓవర్లో ఉమేశ్.. పార్థివ్ (9 బంతుల్లో 14; 3 ఫోర్లు)ను అవుట్ చేసి ఒక్కసారిగా ఆందోళన పెంచాడు. ఆరో ఓవర్లో చావ్లా... రాయుడు (6)ను కూడా అవుట్ చేయడంతో మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఈ స్థితిలో కెప్టెన్ రోహిత్, కృనాల్ నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటుకు లోనుకాకుండా వీరు జాగ్రత్తగా ఆడారు. 9వ ఓవర్ నుంచి క్రమంగా పరుగుల వేగం పెరిగింది. చావ్లా వేసిన ఆ ఓవర్లో కృనాల్ రెండు ఫోర్లు బాది జోరు కనబరిచాడు. అతడి మరుసటి ఓవర్లోనూ తను రెండు ఫోర్లు రాబట్టగా రోహిత్ ఓ సిక్సర్ సంధించడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఓ నిర్లక్ష్యపు షాట్‌కు రోహిత్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పొలార్డ్ (9 నాటౌట్) అండతో కృనాల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టును గట్టెక్కించాడు. -
పుణేతో తలపడేది ఎవరు?
►నేడు కోల్‌కతా, ముంబై మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ►గెలిచిన జట్టు ఫైనల్‌కు... ►రాత్రి 8.00 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చరిత్ర చూసుకుంటే అంతా వారికే అనుకూలం... ఐపీఎల్లో ముఖాముఖి ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఏకంగా 15 మ్యాచ్‌ల్లో విజయాలు.. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చిత్తు చేశారు.. ఇదీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్కున్న ట్రాక్ రికార్డు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై తమ ఘనచరిత్రను మరోసారి ఆవిష్కృతం చేసి తుది పోరుకు అర్హత సాధించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ముంబైతో తమ ప్రస్థానం ఎలా ఉన్నా ఈ కీలక సమరంలో పైచేయి సాధించాలని నైట్‌రైడర్స్ కసితో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గంభీర్ బృందం తమలోని లోపాలను సరిదిద్దుకుని ఎదురుదాడికి దిగేందుకు వేచిచూస్తోంది. బెంగళూరు: ఐపీఎల్ పదో సీజన్లో టైటిల్ పోరుకు ముందు మరో కీలక సమరం. నేడు (శుక్రవారం) జరిగే రెండో క్వాలిఫయర్‌లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఉప్పల్ మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబై తొలి క్వాలిఫయర్‌లో పుణే చేతిలో చిత్తు కాగా... ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంప్ సన్‌రైజర్స్‌పై కోల్‌కతా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య గత చరిత్రను తీసుకుంటే మాత్రం ముంబై పైచేయిలో ఉంది. ఈ సీజన్లో ముంబైపై కోల్‌కతా గెలిచింది లేదు. వాస్తవానికి ఐపీఎల్–10లో ముంబైకి తొలి విజయం కూడా కేకేఆర్‌పైనే వచ్చింది. ఇదే జోరుతో నేటి మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో చేరాలని ముంబై భావిస్తోంది. మరోవైపు ఇలాంటి ప్రతికూలతలను అధిగమించి సత్తా చాటుకోవాలని గంభీర్‌సేన ఆశిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ప్రత్యర్థికి సమ ఉజ్జీగా కనిపిస్తున్న కోల్‌కతా గట్టిపోటీనిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా జరిగిన తొమ్మిది సీజన్లలో ఐపీఎల్ టైటిల్‌ను ఈ రెండు జట్లూ రెండేసి సార్లు గెలుచుకోవడం విశేషం. అయితే బుధవారంలాగే నేడు కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. శుభారంభాలతో జోరు ముంబై ఓపెనర్లలో పార్థివ్ పటేల్ మంచి ఫామ్‌లో ఉండగా, లెండిల్ సిమన్స్ కూడా ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ తమ ఆటతో జట్టుకు శుభారంభాలను అందించి మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడిని తగ్గిస్తున్నారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్, రాయుడు, పొలార్డ్ జట్టును భారీ స్కోరువైపు తీసుకెళుతున్నారు. అయితే తమ చివరి మ్యాచ్‌లో వీరు పుణే బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. ఒక్క పార్థివ్ మినహాయించి బ్యాటింగ్ ఆర్డర్ అంతా విఫలమైంది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావీయకూడదనే ఆలోచనలో ఉంది. హార్దిక్, కృనాల్ పాండ్యా సోదరులు ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్‌లో పేస్ త్రయం మలింగ, మెక్లీనగన్, బుమ్రా చెలరేగిపోతున్నారు. స్పిన్‌లో అనుభవజ్ఞుడైన హర్భజన్‌పై జట్టు ఆధారపడుతోంది. దూకుడే మంత్రం ముంబై మాదిరిగానే కేకేఆర్ కూడా సమర్థులైన ఓపెనర్లను కలిగి ఉంది. క్రిస్ లిన్‌తో కలిసి ఓపెనర్లు గంభీర్, నరైన్, ఉతప్ప అద్భుతంగా ఆడుతున్నారు. లిన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. పించ్ హిట్టర్‌గా నరైన్ సూపర్ సక్సెస్‌లో ఉన్నాడు. 15 బంతుల్లో అర్ధసెంచరీ చేసి రికార్డుల కెక్కాడు. అతని నుంచి జట్టు మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్ ఇప్పటికే 16 వికెట్లతో జోరు మీదున్నాడు. కూల్టర్‌నీల్ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆదుకుంటున్నాడు. నరైన్ తన స్పిన్‌తో తికమకపెట్టేవాడే. ముంబై ఓపెనర్లను త్వరగా దెబ్బతీసి ఒత్తిడి పెంచితే జట్టుకు విజయావకాశాలుంటాయి. మనీశ్ పాండే గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం కోల్‌కతా బ్యాటింగ్‌పై ప్రభావం చూపించవచ్చు. జట్లు: (అంచనా) ముంబై ఇండియన్స్: రోహిత్ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్, పొలార్డ్, రాయుడు, హార్దిక్, కృనాల్, హర్భజన్, మెక్లీనగన్, మలింగ, బుమ్రా. కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), లిన్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్, నరైన్, సూర్యకుమార్/ఇషాంక్ జగ్గీ, కుల్దీప్ యాదవ్, చావ్లా, కూల్టర్‌నీల్, ఉమేశ్ యాదవ్, బౌల్ట్. ►నాకౌట్ దశలో కోల్‌కతాతో ఒకే సారి (2011) తలపడిన ముంబై ఆ మ్యాచ్‌లో గెలిచింది. -
సన్‌రైజర్స్ ఖేల్ ఖతం
-
సన్‌రైజర్స్ ఖేల్ ఖతం
⇒ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ ⇒ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో చిత్తు ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం.. తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు ఫట్.. అయినా గౌతం గంభీర్ సమయోచిత బ్యాటింగ్‌తో గతేడాది ఎలిమినేటర్‌లో జరిగిన ఓటమికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అటు మందకొడి పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు తెగ ఇబ్బంది పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తగిన మూల్యం చెల్లించుకుంది. వార్నర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ లీగ్ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు: భారీ వర్షం మూడు గంటలపాటు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ పైచేయి సాధించింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. అంతకుముందు చిన్నస్వామి మైదానంలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (26 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు. కూల్టర్‌నీల్‌కు మూడు, ఉమేశ్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. వర్షం అంతరాయంతో రాత్రి 12.35 గంటలకు అంపైర్లు మైదానాన్ని పరీక్షించి ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా 5.2 ఓవర్లలో 48 పరుగులు చేసి నెగ్గింది. గంభీర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పరుగులు కష్టంగా: టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు పిచ్ నుంచి ఆశించిన సహకారం అందలేదు. మందకొడిగా ఉండడంతో పరుగులు తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. దీనికి తోడు ఉమేశ్‌యాదవ్ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాటు ఐదో ఓవర్లో శిఖర్ ధావన్ (13 బంతుల్లో 11; 1 ఫోర్) వికెట్‌తో దెబ్బతీశాడు. దీంతో పవర్‌ప్లేలో కేవలం మూడు ఫోర్లు మాత్రమే రాగా జట్టు 30 పరుగులు చేయగలిగింది. ఇది ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. తొమ్మిదో ఓవర్లో జట్టుకు వార్నర్ రూపంలో తొలి సిక్స్ లభించగలిగింది. ఈ తరుణంలో జట్టుకు వార్నర్, విలియమ్సన్ ద్వారా చక్కటి భాగస్వామ్యం ఏర్పడింది. నిదానంగా ఆడుతూనే వీరిద్దరు క్రమంగా ఎదురుదాడికి దిగడంతో పరుగుల వేగం పెరిగింది. పదో ఓవర్లో విలియమ్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి వరుస ఓవర్లలో అవుట్ కావడం సన్‌రైజర్స్‌ను షాక్‌కు గురిచేసింది. 12వ ఓవర్లో విలియమ్సన్‌ను కూల్టర్‌నీల్.. ఆ తర్వాతి ఓవర్లో వార్నర్‌ను చావ్లా అవుట్ చేయడంతో జట్టు సంబరాల్లో మునిగింది. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగి కొద్దిసేపటికే యువరాజ్ (9), ధాటిగా ఆడుతున్న విజయ్‌శంకర్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), జోర్డాన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరడంతో జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. గంభీర్ జోరు: 48 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. రెండో బంతినే లిన్ (6) సిక్స్‌గా మలిచినా మరుసటి బంతికే భువనేశ్వర్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. నాలుగో బంతికి యూసుఫ్ లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. జోర్డాన్ వేసిన రెండో ఓవర్లోనే ఉతప్ప (1) భారీ షాట్ ఆడి ధావన్‌కు క్యాచ్ ఇవ్వగా గంభీర్ ఓ సిక్స్ బాదాడు. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో గంభీర్ 4,6 బాది ఒత్తిడిని తగ్గిస్తూ 14 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్లో 2 పరుగులు కావాల్సి ఉండగా సునాయాసంగా నెగ్గింది. -
గెలిచేదెవరు..వెళ్లేదెవరు..
►కోల్‌కతాతో హైదరాబాద్ పోరు నేడు ►జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ వేటలో అసలైన పోరాటానికి సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీకి సై అంటోంది. సన్‌రైజర్స్ బలమంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లోనే ఉంది. అతను బాగా ఆడిన మ్యాచ్‌ల్లో జట్టు సునాయాసంగా గెలిచింది. ఈ సీజన్లో అతను అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతున్నాడు. వార్నర్‌ను ఆరంభంలోనే ఔట్ చేస్తేనే కోల్‌కతా పట్టు సాధిస్తుంది. లేదంటే అతను పది ఓవర్లు ఆడినా నైట్‌రైడర్స్‌కు కష్టాలు తప్పవు. ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా హైదరాబాద్ బ్యాటింగ్‌ను నడిపిస్తున్నాడు. ఐపీఎల్–10లో అత్యధిక పరుగుల జాబితాలో వార్నర్ (604) తర్వాతి స్థానం శిఖర్ ధావన్ (468)దే. వీరిద్దరితో పాటు మిడిలార్డర్లో ఆదుకునేందుకు... ప్రత్యర్థులతో ఆడుకునేందుకు యువరాజ్ సింగ్ ఉండనే ఉన్నాడు. భళా... బౌలర్లు ఇక బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్‌కు తిరుగులేదు. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సిరాజ్‌లతో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. భువీ 25 వికెట్లతో బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యం గా డెత్ ఓవర్లలో అతను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. హైదరా బాదీ యువ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా తన సత్తా చాటుకున్నాడు. గుజరాత్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతను 4 వికెట్లు తీసి రైజర్స్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈ సీజన్లో 17 వికెట్లు తీసిన అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌నే నమ్ముకొని... మరోవైపు కోల్‌కతా ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా... మిగతా మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ సత్తాతోనే విజయాలు సాధిస్తూ వచ్చింది. సీనియర్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ గంభీర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో వార్నర్, ధావన్‌ల తర్వాత మూడో స్థానం గంభీర్‌దే. తాజాగా క్రిస్ లిన్ కోల్‌కతా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలతో దుమ్మురేపాడు. ఓపెనర్‌గా వస్తున్న సునీల్ నరైన్ అడపాదడపా భారీ షాట్లతో వేగవంతమైన శుభారంభాన్నిస్తున్నాడు. మిడిలార్డర్లో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, గ్రాండ్‌హోమ్‌లు బాధ్యతల్ని పంచుకుంటే జట్టు భారీస్కోరు చేయగలదు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ రాణిస్తున్నాడు. నెహ్రా ఔట్ సన్‌రైజర్స్ పేసర్ ఆశిష్ నెహ్రా గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ‘నెహ్రా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు’ అని హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ వెల్లడించారు. ఈ సీజన్లో 6 మ్యాచ్‌లాడిన నెహ్రా 8 వికెట్లు తీశాడు. జట్లు (అంచనా) కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, లిన్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, గ్రాండ్‌హోమ్, సునీల్ నరైన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, క్రిస్ వోక్స్, ఉమేశ్ యాదవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, విజయ్ శంకర్, విలియమ్సన్, యువరాజ్, నమన్ ఓజా, హెన్రిక్స్, రషీద్ ఖాన్, సిరాజ్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్. -
ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం..
కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ కోల్‌కతా: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తమ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలుస్తుందని, ట్రోఫీతో ఈడెన్ గార్డెన్‌కి తిరిగొస్తామని జట్టు యజమాని షారూక్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్ షెడ్యూల్ వల్ల తాజా సీజన్ మ్యాచ్‌లకు హాజరుకాలేకపోయిన షారూక్, శనివారం కోల్‌కతా–ముంబై జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ను మాత్రం తిలకించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ‘ప్రతి మ్యాచ్‌లోనూ మాకు అభిమానుల మద్దతు లభిస్తోంది. మా శక్తిమేర కృషి చేసి ట్రోఫీ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తాం. కొన్ని మ్యాచుల్లో గెలుపు వరకూ వెళ్లి ఓడిపోయాం. రాబోయే మూడు కీలక మ్యాచుల్ని (ఎలిమినేటర్, ప్లే ఆఫ్, ఫైనల్) గెలిచి విజేతలుగా నిలుస్తాం. కోల్‌కతాలో ముంబైతో జరిగిన మ్యాచే చివరిది. ఈ సీజన్లో మళ్లీ ఇక్కడ ఆడే అవకాశం లేదు. కానీ మేం ట్రోఫీతో ఈడెన్ గార్డెన్‌కు తిరిగొస్తాం. జట్టు గెలుపు, ఓటముల్లో కోల్‌కతా అభిమానులు మాకెప్పుడూ అండగానే ఉన్నారు.’ అని షారూక్ అన్నాడు. -
ముంబైదే టాప్
-
ముంబైదే టాప్
-
ముంబైదే టాప్
♦ కోల్‌కతాపై 9 పరుగులతో గెలుపు ♦ రాణించిన రాయుడు ఇప్పటికే ‘ప్లే–ఆఫ్’కు చేరిన ముంబై కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ సత్తా చాటింది. కోల్‌కతాను వారి సొంతగడ్డపై ఓడించి లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. ఇపుడిక మిగిలిన ఒక బెర్త్ కోసం రైజింగ్ పుణే, పంజాబ్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు చేరుతుంది. కోల్‌కతా: ఐపీఎల్లో ముంబై టాప్ లేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వచ్చిన ‘ఒక్క’ అవకాశాన్ని అర్ధ సెంచరీగా మలిచిన సౌరభ్ తివారి (43 బంతుల్లో 52; 9 ఫోర్లు), గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేయగలిగింది. మనీశ్ పాండే (33 బంతుల్లో 33; 2 ఫోర్లు), గ్రాండ్ హోమ్ (16 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ టి20ల్లో 100వ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2012 తర్వాత సొంత మైదానంలో కోల్‌కతా ఛేజింగ్ చేస్తూ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాయుడు, తివారి ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో తొలిసారి చాన్స్ దక్కించుకున్న సౌరభ్ తివారి ఓపెనర్‌గా రాణించాడు. సిమన్స్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత అంబటి రాయుడుతో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో భారీ షాట్లు ఆడే క్రమంలో రాయుడు, పొలార్డ్ (13; 1 సిక్స్) ఔటయ్యారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాను ముంబై పేసర్లు బెంబేలెత్తించారు. నరైన్ (0) సౌతీ బౌలింగ్‌లో డకౌట్ కాగా... ఇన్నింగ్స్ కుదుటపడుతున్న తరుణంలో గంభీర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను జాన్సన్... లిన్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను వినయ్ పెవిలియన్ చేర్చారు. ఉతప్ప (2) కరణ్ స్పిన్ ఉచ్చులో పడ్డాడు. సిక్సర్లతో విరుచుకుపడిన యూసుఫ్ ఫఠాన్ (7 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేకపోయాడు. మనీశ్, గ్రాండ్‌హోమ్‌లు పోరాడినా ముంబై పేస్‌కు తలవంచారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సౌరభ్ రనౌట్ 52; సిమన్స్ (సి) నరైన్ (బి) బౌల్ట్ 0; రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) అంకిత్ 27; రాయుడు (స్టంప్డ్) ఉతప్ప (బి) కుల్దీప్ 63; పొలార్డ్ (సి) పఠాన్ (బి) బౌల్ట్ 13; హార్దిక్ నాటౌట్ 1; కృనాల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–130, 4–168, 5–170. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–2, గ్రాండ్‌హోమ్ 2–0–16–0, ఉమేశ్ 4–0–40–0, నరైన్ 4–0–37–0, కుల్దీప్ 3–0–25–1, అంకిత్ 3–0–14–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నరైన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 0; లిన్ (సి) సబ్–సుచిత్ (బి) వినయ్ 26; గంభీర్ (సి) కరణ్ శర్మ (బి) జాన్సన్ 21; ఉతప్ప (సి) రోహిత్ (బి) కరణ్ శర్మ 2; మనీశ్ పాండే (సి) సబ్–సుచిత్ (బి) హార్దిక్ 33; యూసుఫ్ పఠాన్ (సి) హార్దిక్ (బి) వినయ్ 20; గ్రాండ్‌హోమ్ (బి) హార్దిక్ 29; కుల్దీప్ (సి) రాయుడు (బి) సౌతీ 16; ఉమేశ్ నాటౌట్ 4; బౌల్ట్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–41, 3–53, 4–53, 5–87, 6–128, 7–149, 8–158. బౌలింగ్: సౌతీ 4–1–39–2, జాన్సన్ 4–0–30–1, కరణ్ శర్మ 3–0–26–1, వినయ్ 3–0–31–2, కృనాల్ 2–0–14–0, హార్దిక్ 4–0–22–2. -
కోల్‌కతాపై కింగ్స్ ఎలెవన్ గెలుపు
-
పంజాబ్ రేసులోనే...
-
పంజాబ్ రేసులోనే...
∙ కోల్‌కతాపై కింగ్స్ ఎలెవన్ గెలుపు ∙ లిన్ పోరాటం వృథా ∙ రసవత్తరంగా ప్లే–ఆఫ్ రేస్ మొహాలి: ఐపీఎల్ లీగ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. కీలకమైన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ బౌలర్లు పంజా విసిరారు. లిన్ ధాటికి ఎదురొడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేయగల్గింది. క్రిస్ లిన్ ( 52 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్, యూసుఫ్ పఠాన్ రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బౌలర్ మోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మ్యాక్స్‌వెల్... తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ 3 ఓవర్లదాకా చప్పగానే సాగింది. ఓపెనర్లు గప్టిల్ (12), మనన్ వోహ్రా (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) వేగం పెంచిన వెంటనే కోల్‌కతా బౌలర్లు పెవిలియన్ చేర్చారు. నరైన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వోహ్రా అదే జోరులో ఉమేశ్ యాదవ్ మరుసటి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాదాడు. కానీ అదే ఓవర్లో వోహ్రా, తర్వాతి నరైన్ ఓవర్లో గప్టిల్ ఔటయ్యారు. కాసేపటికి మార్‡్ష (11)ను వోక్స్ బౌల్డ్ చేశాడు. 56 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన దశలో వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ మొదట జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. కుల్దీప్ ఓవర్లోనూ రెండు భారీ సిక్సర్లు బాదినప్పటికీ మరో షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రాహుల్ తేవటియా (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. లిన్ మళ్లీ ఫిఫ్టీ... కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ తన సూపర్ ఫామ్ చాటాడు. నరైన్ (10 బంతుల్లో 18; 4 ఫోర్లు)తో కలిసి లిన్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. వీళ్లిద్దరు సగటున ఓవర్‌కు 10 పరుగులు చేశారు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద నరైన్‌ను మోహిత్ శర్మ బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ సహకారంతో లిన్ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్లో నాలుగు మ్యాచ్‌లాడిన లిన్‌కు ఇది మూడో అర్ధసెంచరీ కావడం విశేషం. అయితే పరుగు తేడాతో గంభీర్ (8), రాబిన్ ఉతప్ప (0) నిష్క్రమించారు. ఒకే ఓవర్లో రాహుల్ తెవటియా వీళ్లిద్దరిని పెవిలియన్‌కు పంపడం కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీసింది. తర్వాత క్రీజ్‌లోకి మనీశ్ పాండే (23 బంతుల్లో 18; 1 ఫోర్) అండతో లిన్ తన ధాటిని కొనసాగించాడు. కీలక తరుణంలో పాండేను హెన్రీ ఔట్ చేయగా, కీలకదశలో లిన్ రనౌట్ కావడంతో కోల్‌కతా విజయంపై ఆశలు వదులుకుంది. -
పంజాబ్ పుంజుకునేనా..?
►నేడు కోల్‌కతాతో తలపడనున్న కింగ్స్ ►ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా పంజాబ్ పోరాటం ►జోరుమీదున్న నైట్‌రైడర్స్ మొహాలీ: ప్లే ఆఫ్ బెర్తే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరాడనుంది. నాకౌట్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లన్నీ తప్పక నెగ్గాల్సిన ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాక్స్‌వెల్‌సేన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖారారు చేసుకున్న కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తోంది. పంజాబ్‌కు చావోరేవో.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాల కోసం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పుణే, హైదరాబాద్‌కు మంచి అవకాశాలుండగా.. పంజాబ్ పరిస్థితి మాత్రం చావోరేవోలాగా మారింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌సేన ఐదు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరుకోవాలంటే పంజాబ్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఈక్రమంలో మంగళవారం కోల్‌కతాతో మ్యాచ్ పంజాబ్‌కు కీలకంగా మారింది. నిజానికి ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించి ఉంటే మ్యాక్స్వెల్సేనకు నాకౌట్‌కు సులభంగా అర్హత సాధించడానికి అవకాశం ఉండేది. అయితే పేలవమైన ఫీల్డింగ్‌తోపాటు పసలేని బౌలింగ్‌తో ఆ మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం పాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌లో హషీమ్ ఆమ్లా సొగసైన సెంచరీతో ఆకట్టుకున్నా అది వృథాగా మారింది. ఈ సీజన్లో ఆమ్లాకిది రెండోసెంచరీ కావడం విశేషం. అతనితోపాటు షాన్మార్‡్ష, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సత్తచాటడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. అయితే బౌలర్ల వైఫల్యంతో సదరు మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన ఆమ్లా 60 సగటుతో 420 పరుగులు చేశాడు. వీటిలో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌పై చేసిన రెండు సెంచరీలు ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ (219 పరుగులు) స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. షాన్ మార్‡్ష అకట్టుకుంటున్నాడు. మనన్ వోహ్రా, అక్షర్‌పటేల్, వృద్ధిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, డేవిడ్ మిల్లర్ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అక్షర్ పటేల్ (13 వికెట్లు), మోహిత్ శర్మ (9), వరుణ్ అరోన్ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. పంజాబ్ బౌలింగ్ మరింత పదును తేలాల్సి ఉంది. ఇరుజట్లు ఈ సీజన్లో పరస్పరం ఓసారి తలపడగా ఎనిమిది వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆజట్టుపై నెగ్గడంతో ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్ వైపు అడుగులు వేయాలని పంజాబ్ కృతనిశ్చయంతో ఉంది. కోల్‌కతా కుమ్ముడు... ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి జోరుమీదుంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో 16 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా.. పంజాబ్‌పై విజయం సాధించి 18 పాయింట్లతో అధికారికంగా నాకౌట్ దశకు చేరుకోవాలనుకుంటుంది. మరోవైపు వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు సునీల్ నరైన్, క్రిస్ లిన్ విధ్వంసక అర్ధసెంచరీలతో జోరు చూపించడంతో బెంగళూరు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ఉఫ్‌మని ఊదేసింది. వీరి దూకుడుకు ఐపీఎల్ టోర్నీలో కొన్ని రికార్డులు గల్లంతవడం విశేషం. మరోవైపు కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ తమ ఓపెనర్లపై ప్రశంసలు జల్లు కురిపించాడు. కెరీర్ మొత్తంలో తాను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదేనని పేర్కొన్నాడు. ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే గౌతం గంభీర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 425 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మనీశ్ పాండే ఆకట్టుకుంటున్నాడు. ఇక ఓపెనర్ అవతారం ఎత్తిన సునీల్ నరైన్ 196 పరుగులతో విజయవంతమయ్యాడు. క్రిస్ లిన్ చేరికతో కోల్‌కతా బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. గాయంతో దూరమైన రాబిన్ ఉతప్ప తిరిగి జట్టుతో చేరనున్నాడు. యూసుఫ్ పఠాన్, కొలిన్ గ్రాండ్‌హోమ్, సూర్యకుమార్ యాదవ్ గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో క్రిస్ వోక్స్ సత్తా చాటుతున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ (13 వికెట్లు), నాథన్ కూల్టర్‌నీల్ (11), సునీల్ నరైన్ (9), కుల్దీప్ యాదవ్ (9) ఆకట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కవచ్చు. మరోవైపు జట్టు రిజర్వ్‌బెంచ్ సత్తాను కూడా పరిశీలించేందుకు గంభీర్‌సేన ప్రయత్నిస్తోంది. అలాగే ఈ సీజన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన కోల్‌కతా.. తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. -
కోల్‌కతాపై రైజింగ్ పుణే విజయం
-
త్రిపాఠి తడాఖా
⇒ 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 ⇒ కోల్‌కతాపై రైజింగ్ పుణే విజయం కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ షోకు కోల్‌కతా చెదిరింది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టులో మేటి బ్యాట్స్‌మెన్ స్మిత్, స్టోక్స్, ధోనిలు విఫలమైన చోట అతనొక్కడే అంతా తానై నడిపించాడు. సెంచరీని చేజార్చుకున్నా... అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు త్రిపాఠి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో పుణే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. గ్రాండ్‌హోమ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి సుందర్ సింగిల్ తీయగా... రెండో బంతిని ఆడిన క్రిస్టియాన్ సిక్సర్‌గా మలిచి పుణే విజయాన్ని ఖాయం చేశాడు. త్రిపాఠికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోల్‌కతాకిది వరుసగా రెండో పరాజయం కాగా... రైజింగ్ పుణేకు ‘హ్యాట్రిక్’ విజయం. విరుచుకుపడిన త్రిపాఠి: ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే జట్టును ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ముందుండి నడిపించాడు. మరో ఓపెనర్ రహానే (11), కెప్టెన్ స్మిత్ (9), మనోజ్ తివారి (8) విఫలమైనా... ఆ ప్రభావమేమీ పడకుండా జట్టు లక్ష్యం చేరిందంటే... అది త్రిపాఠి మెరుపుల వల్లే! ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన త్రిపాఠి చూడచక్కని బౌండరీలు, చుక్కల్ని తలపించే సిక్సర్లతో అలరించాడు. దీంతో పుణే ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని అధిగమించింది. స్టోక్స్ చేసింది 14 పరుగులే అయినా... కాసేపు త్రిపాఠికి అండగా నిలిచాడు. ధోని (5) విఫలం కాగా... కోల్‌కతా బౌలర్లలో వోక్స్ 3, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. తడబడిన నైట్‌రైడర్స్: అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును పుణే పేసర్లు వణికించారు. ఓపెనర్ నరైన్ (0)ను ఉనాద్కట్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చగా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ జాక్సన్ (10) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇది మొదలు వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నైట్‌రైడర్స్ పరుగుల వేగం తగ్గింది. మనీశ్ చేసిన 37 (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) పరుగులే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్! గంభీర్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా సుందర్ బౌలింగ్‌లోనే నిష్క్రమించగా, యూసుఫ్ పఠాన్ (4) నిరాశ పరిచాడు. అతను ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో కోల్‌కతా 55 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (32 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో పాండే వరుసగా మూడు ఫోర్లు బాదగా, వరుసటి ఓవర్ వేసిన తాహిర్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. ఉనాద్కట్, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. -
అగ్రస్థానమే లక్ష్యంగా..
►నేడు పుణేతో తలపడనున్న కోల్‌కతా ∙ ►సొంతగడ్డపై బలంగా నైట్‌రైడర్స్ ∙ ►వరుస విజయాలతో సూపర్‌జెయింట్ జోరు కోల్‌కతా: సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూకుడు కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చివరిమ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో పుణేతో మ్యాచ్‌లో నెగ్గి టాప్‌ప్లేస్‌ను కైవసం చేసుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. మరోవైపు రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న పుణే అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. టాప్ ఆర్డరే బలం.. రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్లో మంచి జోరుమీదుంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో పుణేతో మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కోల్‌కతా బలం అంతా టాప్ ఆర్డర్‌లోనే ఉంది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన గంభీర్ 55 సగటుతో 387 పరుగులు చేశాడు. దీంతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప (384 పరుగులు), మనీశ్ పాండే (304 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సునీల్ నరైన్ ఓపెనర్ అవతారంలో ఓ మోస్తరుగా రాణించాడు. కోల్‌కతా విజయం సాధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువగా గంభీర్, నరైన్, ఉతప్ప, మనీశ్ పాండే రాణించారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కోల్‌కతా టాప్ఆర్డర్ విఫలమైంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు టాప్ ఆర్డర్ నుంచి సరైన భాగస్వామ్యం రాలేదు. గంభీర్, నరైన్ విఫలమైనా ఉతప్ప, మనీశ్ పాండే పోరాడారు. అయితే వారికి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. ముఖ్యంగా జట్టు ఆశలు పెట్టుకున్న యూసుఫ్ పఠాన్ చేతులెత్తేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ నిరాశపర్చాడు. దీంతో భారీ తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతాకు ఇది ఒక కుదుపులాగా పరిణమించింది. దీంతో తమ జట్టు కూర్పుపై మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆరోస్థానంలో సూర్యకుమార్, జాక్సన్ స్థానంలో ఇషాంక్ జగ్గీని బరిలోకి దింపితే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతోన్న కొలిన్ గ్రాండ్‌హోమ్ స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే నాథన్ కూల్టర్‌నీల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లతో సత్తాచాటాడు. మరోవైపు క్రిస్ వోక్స్ కూడా 11 వికెట్ల (10 మ్యాచ్‌లు) ఆకట్టుకుంటున్నాడు. ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ మాత్రమే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. ఈక్రమంలో సాధ్యమైనంత త్వరగా తను గాడిలో పడాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా బౌలింగ్ విఫలమైంది. దీంతో ఈ సీజన్లో తొలిసారి కోల్‌కతాపై ఓ జట్టు 200 పరుగుల మార్కును సాధించింది. దీంతో ఈ విభాగంపై జట్టు మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు కోల్‌కతా మరో విజయం సాధిస్తే ఎనిమిది విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు కైవసం చేసుకోవడంతోపాటు తిరిగి అగ్రస్థానాన్ని అలంకరిస్తుంది. దీంతో పుణేతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలని కృత నిశ్చయంతో ఉంది. అలాగే ఈ సీజన్లో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో బుధవారం మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పుణే దూకుడు.. ఈ సీజన్ ప్రథమార్థంలో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన పుణే.. అనంతరం గాడిన పడింది. చివరగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించింది. ఓడిన ఈ ఒక్కమ్యాచ్ కోల్‌కతా చేతిలోనే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన పుణే.. ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 12 పాయింట్లతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. ఈక్రమంలో కోల్‌కతాతో బుధవారం మ్యాచ్ ఆడనుంది. జట్టు విషయానికొస్తేసారథి స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ లయన్స్‌తో చివరిమ్యాచ్‌లో విఫలమైనా.. ఇప్పటికీ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన స్మిత్ 324 పరుగులు సాధించి జట్టు తరఫున టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ త్రిపాఠి (259 పరుగులు), అజింక్య రహానే (215 పరుగులు), ఎంఎస్ ధోని (199 పరుగులు), మనోజ్ తివారీ (182 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్‌లో ఈ సీజన్లోనే ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సత్తాచాటాడు. లయన్స్‌పై విధ్వంసక సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన దశలో ధోనితో కలిసి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిలో సైతం జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అదరగొడుతున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో సత్తా చాటాడు. జయదేవ్ ఉనాద్కట్ పది వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, డాన్ క్రిస్టియాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై పుణే ఇప్పటివరకు విజయం సాధించలేదు. గతేడాది రెండు మ్యాచ్‌ల్లోనూ, ఈ సీజన్లో జరిగిన మ్యాచ్ కలిపి మొత్తం మూడుసార్లు పుణే పరాజయం పాలైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతాను పుణే ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. మరోవైపు కోల్‌కతాపై విజయం సాధిస్తే పుణే ప్లే ఆఫ్‌కు మరింత చేరువవతుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం కోసం స్మిత్‌సేన సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. -
హైదరాబాద్‌కు మరో విజయం
-
వార్నర్ విశ్వరూపం
► మెరుపు సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ కెప్టెన్ ► హైదరాబాద్‌కు మరో విజయం ► 48 పరుగులతో చిత్తుగా ఓడిన కోల్‌కతా ► రాణించిన సిరాజ్, కౌల్, భువనేశ్వర్ డేవిడ్ వార్నర్ బ్యాట్ మరోసారి గర్జించింది. పవర్ షాట్లు, రివర్స్ స్వీప్‌లు, పుల్ షాట్లు, పంచింగ్ డ్రైవ్‌లు... ఒకటేమిటి ఇలా ప్రతీ అస్త్రాన్ని వాడుతూ అతను వీర విధ్వంసమే సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే శతకం బాది తన సత్తా ప్రదర్శించడంతో సన్‌రైజర్స్‌కు మరో భారీ విజయం దక్కింది. వార్నర్ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సునాయాసంగా తలవంచింది. భారీ స్కోరును ఛేదించలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పూర్తిగా చతికిల పడ్డారు. హైదరాబాద్: సొంత మైదానంలో సన్‌రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 48 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మైదానంలో ‘సన్’ జట్టుకిది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 126; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో ఇది ఐదో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 39; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడారు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ 43 బంతులు... అద్భుత బ్యాటింగ్‌తో సీజన్ ఆరంభం నుంచి రైజర్స్‌ను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ వార్నర్ ఈసారి మరింతగా రెచ్చిపోయాడు. ఒక్క బౌలర్‌ను కూడా వదిలి పెట్టకుండా విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అన్ని వైపులా అతను బాదిన సిక్సర్లు ఆకాశంలో తారాజువ్వల్లా దూసుకుపోయాయి. ఎదుర్కొన్న నాలుగో బంతిని ఫోర్ కొట్టిన వార్నర్ ఆ తర్వాత ఆగలేదు. కొన్ని సార్లు అతడికి అదృష్టం కూడా కలిసొచ్చింది. 13 పరుగుల వద్ద మిడాన్‌లో వోక్స్‌కు క్యాచ్ పట్టే అవకాశం వచ్చినా... తప్పుడు అంచనాతో అతను ఆ అవకాశం చేజార్చాడు. వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన వార్నర్, పఠాన్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో సిక్స్‌తో 25 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. కుల్దీప్ వేసిన మరో ఓవర్లో రైజర్స్ కెప్టెన్ పండగ చేసుకుంటూ వరుసగా 4, 6, 6 పరుగులు రాబట్టాడు. 86 పరుగుల వద్ద అతను ఇచ్చిన మరో సునాయాస క్యాచ్‌ను వోక్స్ వదిలేశాడు.ఉమేశ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా రెండు పరుగులు చేసి సెంచరీ మార్క్‌ను అందుకున్న వార్నర్, నరైన్ బౌలింగ్‌లో మూడు వరుస బౌండరీలతో జోరు కొనసాగించాడు. వార్నర్ ఆరుగురు కోల్‌కతా బౌలర్ల బౌలింగ్‌లో కనీసం ఒక సిక్సర్ అయినా కొట్టడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. విలియమ్సన్ కూడా... మరో ఎండ్‌లో ఎక్కువగా బంతులు ఆడే అవకాశం రాని శిఖర్ ధావన్ (30 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) వార్నర్‌కు తగిన సహకారం అందించాడు. 13 పరుగుల వద్ద అతడిని స్టంపౌట్ చేసే అవకాశాన్ని ఉతప్ప చేజార్చాడు. చివర్లో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్, వోక్స్ ఓవర్లో మూడు బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా స్కోరు 200 పరుగులు దాటింది. ఉతప్ప మినహా...: భారీ ఛేదన చేసే క్రమంలో గంభీర్ (11) తొలి ఓవర్లో రెండు ఫోర్లతో శుభారంభం చేశాడు. అయితే రెండో ఓవర్లో సిరాజ్ 144 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని ఆడలేక నరైన్ (1) వెనుదిరిగాడు. కౌల్ కూడా తన ఓవర్లోనే గంభీర్‌ను అవుట్ చేయడంతో కోల్‌కతా కష్టాలు పెరిగాయి. ఈ దశలో ఉతప్ప, పాండే కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దూకుడుగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 51 బంతుల్లో 78 పరుగులు జోడించారు. ఉతప్ప కొన్ని భారీ షాట్లతో అలరించాడు. అయితే భువీ చక్కటి బంతితో పాండేను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, సిరాజ్ వేసిన బంతికి ఉతప్ప వెనుదిరిగాడు. ఉతప్ప అవుటయ్యే సమయానికి విజయానికి 45 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన కోల్‌కతా ఆ తర్వాత చేతులెత్తేసింది. వర్షం వచ్చినా...: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు ముగిసిన తర్వాత వచ్చిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే వానతో 46 నిమిషాల సమయం నష్టపోయినా... మొత్తం ఓవర్లలో ఎలాంటి కోత పడలేదు. -
కోల్‌కతా కుమ్ముడు
-
కోల్‌కతా కుమ్ముడు
►వరుస విజయాలతో ‘టాప్’ స్థానం పదిలం ►ఢిల్లీపై ఏడు వికెట్లతో ఘనవిజయం ►రాణించిన గంభీర్, ఉతప్ప, కౌల్టర్‌నీల్.. ►సంజూ సామ్సన్ అర్ధసెంచరీ వృథా కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎదురేలేకుండా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించింది. శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గంభీర్‌సేన ఏడు వికెట్లతో గెలుపొందింది. స్థానిక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. జట్టులో సంజూ సామ్సన్ మెరుపు అర్ధసెంచరీ (38 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నమోదు చేయగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 47, 4 ఫోర్లు, ఓ సిక్సర్) ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా 16.2 ఓవర్లలో మూడు వికెట్లకు 161 పరుగులు చేసి ఛేదించింది. జట్టులో గౌతం గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (52 బంతుల్లో 71 నాటౌట్, 11 ఫోర్లు)తో ముందుండి జట్టును నడుపగా.. రాబిన్ ఉతప్ప విధ్వసంకర అర్ధసెంచరీ (33 బంతుల్లో 59, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఈ సీజన్లో ఏడో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా 14 పాయింట్లతో పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెరిసిన సామ్సన్ టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సామ్సన్, కరుణ్ నాయర్ (15) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. నరైన్ బౌలింగ్‌లో నాయర్ నిష్క్రమించగా తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో సామ్సన్ 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్ సామ్సన్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో కూల్టర్‌నీల్ ఒకే ఓవర్లో రిషభ్ పంత్ (6), శ్రేయస్‌లను ఔట్‌చేసి చావుదెబ్బ తీశాడు. కోరె అండర్సన్ (2) రనౌట్ కావడంతో ఢిల్లీ 23 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో రన్‌రేట్ మందగించింది. గౌతీ అజేయ పోరాటం అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కడదాకా నడిపించాడు. నరైన్ (4) వికెట్ ఆరంభంలోనే కోల్పోగా... తర్వాత వచ్చిన ఉతప్పతో కలిసి గర్జించాడు. ఉతప్ప 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను సమన్వయ లోపంతో మిశ్రా, సామ్సన్ జారవిడిచారు. దీంతో బతికిపోయిన ఉతప్ప సిక్సర్లతో ఢిల్లీ బౌలర్ల భరతం పట్టాడు. గతమ్యాచ్కు రిప్లేలా వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. దూకుడుగా ఆడిన ఉతప్ప 24 బంతుల్లో, గంభీర్ 39 బంతుల్లో అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఏ దశలోనూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించాక ఉతప్ప నిష్క్రమించగా, మిగతా లాంఛనాన్ని మనీశ్ (5), జాక్సన్ (12 నాటౌట్)లతో గంభీర్ పూర్తి చేశాడు. ఈడెన్ గడ్డపై కోల్‌కతా చేజింగ్‌లో వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2012 తర్వాత ఛేదనలో ఇక్కడ ఓడనేలేదు. గంభీర్ ఐపీఎల్లో 4 వేల పరుగులు పూర్తిచేశాడు. ఓవరాల్‌గా టీ20 కెరీర్లో 6 వేల క్లబ్లో చేరాడు. రైనా, కోహ్లి, రోహిత్‌ల తర్వాత ఈ ఘనతకెక్కిన నాలుగో బ్యాట్స్‌మన్ గౌతమ్. -
పుణేపై కోల్‌కతా ఘనవిజయం
-
ఉతప్ప ఉతికేశాడు
-
ఉతప్ప ఉతికేశాడు
⇒47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 87 ⇒పుణేపై కోల్‌కతా ఘనవిజయం ⇒గంభీర్ అర్ధసెంచరీ పుణే: రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో... బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో అగ్ర స్థానానికి చేరుకుంది. గౌతీ, ఉతప్పల జోరుకు రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది. మరోవైపు ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నెగ్గడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ (37 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. కుల్దీప్యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 184 పరుగులు చేసి నెగ్గింది. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవానులకు సంతాప సూచకంగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ లయన్స్ తలపడుతుంది. స్మిత్ జోరు... మొదట బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, త్రిపాఠి మరోసారి శుభారంభాన్ని అందించారు. మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన త్రిపాఠి.. ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో జోరును కనబరిచాడు. దీంతో జట్టు పవర్ ప్లేలో 57 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్లో రహానే భారీ సిక్సర్ బాదాడు. ఏడో ఓవర్లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను యూసుఫ్ వదిలేసినా మరుసటి ఓవర్లోనే తనను పీయూశ్ చావ్లా బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానేతో కలిసి కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే అర్ధ సెంచరీ వైపు సాగుతున్న రహానే... నరైన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్నంతసేపు ధోని (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. 15వ ఓవర్లో వరుసగా 4,6 బాదిన తను మరుసటి ఓవర్లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో మనోజ్ తివారి (1) కూడా అదే రీతిన అవుట్ అయినా... క్రిస్టియాన్ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), స్మిత్ చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టారు. ఉతప్ప, గంభీర్ నిలకడ... లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో దాదాపు మ్యాచ్ అంతా ఉతప్ప, గంభీర్ జోరే కనిపించింది. నరైన్ (11 బంతుల్లో 16; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే రనౌట్ అయినా ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి పుణే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి జోరుకు పుణే ఫీల్డింగ్లోపం కూడా జత కలిసింది. ఏడో ఓవర్లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను ఉనాద్కట్ వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాతి ఓవర్లో తను 4,6,6తో చెలరేగాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో గంభీర్ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేయగా 35 బంతుల్లో తను కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 16వ ఓవర్లో ఉతప్ప రెండు భారీ సిక్సర్లు సంధించడంతో లక్ష్యం మరింత తగ్గింది. అయితే వరుస ఓవర్లలో గంభీర్, ఉతప్ప అవుటైనా అప్పటికే కోల్‌కతా విజయం ఖాయమైంది. ఐపీఎల్లో గంభీర్‌కు కెప్టెన్‌గా ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. -
బెంగళూరు చెత్త రికార్డు
-
7,0,1,8,9,8,2,0,2,5,0
-
7,0,1,8,9,8,2,0,2,5,0
► 49 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు ► ఐపీఎల్లో అత్యల్ప స్కోరు నమోదు ► 82 పరుగులతో కోల్‌కతా ఘన విజయం బంతి బంతికీ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టగలిగే భీకరమైన బ్యాట్స్‌మన్ ఉన్న జట్టు... బరిలోకి దిగడమే ఆలస్యం ఫోర్లు, సిక్సర్లతో అలా అలవోకగా పరుగుల వరద పారించగల హేమాహేమీలు... కానీ ఇద్దరు బ్యాట్స్‌మెన్ గట్టిగా నిలబడి రెండు ఓవర్లలో బాదేసే పరుగులు కూడా ఇప్పుడు జట్టంతా కలిసి చేయలేకపోయింది. అటువైపు బౌలింగ్ బాగున్నా, పిచ్ ఎంత ప్రతికూలంగా మారిపోయినా... బెంగళూరు జట్టు నుంచి మాత్రం ఇంతటి ఘోర ప్రదర్శన ఊహించలేనిది. పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండా ఆర్సీబీ మోకరిల్లడం అభిమానులు నివ్వెరపోయేలా చేసింది. సొంత మైదానంలో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పరాజయాన్ని అంగీకరించకుండా పట్టుదలగా పోరాడిన కోల్‌కతా అత్యద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నలుగురు పేసర్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగడంతో ఈ ‘నైట్’ వారికి చిరస్మరణీయంగా మారిపోయింది. కోల్‌కతా: పరుగులు బాదడంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కొత్త కొత్త రికార్డులు నెలకొల్పే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు ఐపీఎల్లో అతి చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా పదేళ్ల లీగ్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. కేవలం 9.4 ఓవర్లలోనే బెంగళూరు ఆలౌట్ కావడం గమనార్హం. ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. సునీల్ నరైన్ (17 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరుపై కోల్‌కతా బౌలర్లు చెలరేగిపోయారు. గ్రాండ్‌హోమ్ (3/4), వోక్స్ (3/6), కూల్టర్ నీల్ (3/21) రాయల్ చాలెంజర్స్ పని పట్టారు. కీలక వికెట్లు తీసిన కూల్టర్ నీల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. నరైన్ ఒక్కడే... తొలి 33 బంతులు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 65/1. కానీ మిగతా 14 ఓవర్లలో ఆ జట్టు మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోయింది. ఇదీ సంక్షిప్తంగా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ స్వరూపం. ఓపెనర్‌గా కొత్త రూపంలో చెలరేగుతున్న నరైన్ ఈసారి కూడా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. అతను మినహా మిగతా బ్యాట్స్‌మన్ కలిసికట్టుగా విఫలం కావడం కేకేఆర్‌ను దెబ్బ తీసింది. బద్రీ వేసిన తొలి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్ 4, 4, 4, 6 బాదడంతో జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. అరవింద్ వేసిన మూడో ఓవర్లోనూ మూడు ఫోర్లతో జట్టు మొత్తం 14 పరుగులు రాబట్టింది. మరోవైపు గంభీర్ (11 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్)ను అవుట్ చేసి బెంగళూరుకు మిల్స్ బ్రేక్ ఇచ్చాడు. అయితే రెండు సార్లు ఆర్సీబీ అతి సులువైన రనౌట్ అవకాశాలు వృథా చేసినా... కోల్‌కతా వాటిని ఉపయోగించుకోలేకపోయింది. టపటపా... స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు ఆరంభంలోనే చేతులెత్తేసింది. కూల్టర్ నీల్ పదునైన బంతులతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే కోహ్లి (0) వెనుదిరగడంతో చాలెంజర్స్ షాక్‌కు గురైంది. ఐపీఎల్లో కోహ్లి మూడోసారి ‘గోల్డెన్ డక్’గా (ఆడిన తొలి బంతికి అవుట్ కావడం) వెనుదిరిగాడు. రెండో ఓవర్లో మన్దీప్ (1)ను ఉమేశ్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే డివిలియర్స్ (8) కూడా సహచరులను అనుసరించాడు. రెండు ఫోర్లు కొట్టి నిలదొక్కుకున్నట్లు కనిపించిన జాదవ్ (9) కూడా కూల్టర్ నీల్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో బెంగళూరు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. పవర్‌ప్లే ముగిసేవరకు 39/4తో ఉన్న బెంగళూరు వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ముందుగా గేల్ (17 బంతుల్లో 7; 1 ఫోర్), ఆ తర్వాత బిన్నీ (9) అవుటయ్యారు. మిగతా నలుగురు అవుట్ కావడానికి మరెంతో సమయం పట్టలేదు. దీంతో ఐపీఎల్లో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఆ మ్యాచ్... ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 15.1 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. అనిల్ కుంబ్లే (5/5) ధాటికి రాజస్థాన్ చేతులెత్తేసింది. అంతకు ముందు 133 పరుగులు చేసిన బెంగళూరు 75 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. -
మీ ‘డెన్’లో మా వంతు...
-
మీ ‘డెన్’లో మా వంతు...
►కోల్‌కతాను చిత్తు చేసిన గుజరాత్ ►4 వికెట్లతో లయన్స్ విజయం ►గెలిపించిన సురేశ్ రైనా సరిగ్గా రెండు వారాల క్రితం సొంత మైదానం రాజ్‌కోట్‌లో కోల్‌కతా భీకర బ్యాటింగ్ దెబ్బకు గుజరాత్ జట్టు పది వికెట్లతో చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఆ మ్యాచ్‌కు సరైన రీతిలో లయన్స్ ప్రతీకారం తీర్చుకుంది. వరుస విజయాలతో నైట్‌రైడర్స్‌కు పెట్టని కోటలా ఉన్న ఈడెన్ గార్డెన్స్‌లోనే వారిని దెబ్బ తీసి సత్తా చాటింది. పదో సీజన్ లీగ్ దశలో ప్రత్యర్థితో లెక్క సరి చేసింది. ముందుగా ఉతప్ప, నరైన్‌ల దూకుడైన బ్యాటింగ్‌తో కోల్‌కతా భారీ స్కోరు సాధించగా... ఓపెనింగ్ మెరుపులకు తోడు కెప్టెన్ రైనా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఐపీఎల్లో గుజరాత్ మళ్లీ కోలుకునేలా చేసింది. కోల్‌కతా: ఐపీఎల్–10లో గుజరాత్ లయన్స్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (48 బంతుల్లో 72; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... సునీల్ నరైన్ (17 బంతుల్లో 42; 9 ఫోర్లు, 1 సిక్స్), గంభీర్ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం గుజరాత్ 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సురేశ్ రైనా (46 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మెకల్లమ్ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడు కనబర్చారు. నరైన్ మెరుపులు... ప్రవీణ్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు... ఫాల్క్‌నర్ వేసిన రెండో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు... థంపి వేసిన మూడో ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6... మూడు ముక్కల్లో సునీల్ నరైన్ బ్యాటింగ్ దూకుడు ఇది! మూడోసారి ఓపెనర్‌గా దిగిన అతను మరోసారి తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్క సింగిల్ కూడా తీయకుండా బౌండరీలతో అతను గుజరాత్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దాంతో కోల్‌కతాకు అద్భుత ఆరంభం లభించింది. చివరకు ఈ విధ్వంసాన్ని ఆపేందుకు లయన్స్ కెప్టెన్ రైనా స్వయంగా బౌలింగ్‌కు దిగాల్సి వచ్చింది. తాను వేసిన రెండో బంతితో నరైన్‌ను అవుట్ చేసి రైనా తన జట్టుకు ఊరట అందించాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి కొన్ని చక్కటి షాట్లతో కోల్‌కతా జోరును కొనసాగించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జోడించిన తర్వాత గంభీర్ వెనుదిరిగాడు. అనంతరం మనీశ్ పాండే (21 బంతుల్లో 24; 2 ఫోర్లు)తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్‌ను నడిపించాడు. గత మ్యాచ్‌లో అద్భుత ఆటతో తన జట్టును గెలిపించిన పాండే, ఇక్కడ మాత్రం పరుగులు చేయడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. జడేజా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. థంపి వేసిన మరో ఓవర్లో కూడా అతను వరుసగా ఒక ఫోర్, సిక్స్ బాదాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ఉతప్ప, పాండే తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో యూసుఫ్ పఠాన్ (4 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) మరికొన్ని పరుగులు జోడించాడు. శుభారంభం... భారీ ఛేదనను గుజరాత్ కూడా దీటుగా మొదలు పెట్టింది. షకీబ్ వేసిన తొలి ఓవర్లో మెకల్లమ్ రెండు ఫోర్లు కొట్టగా, నరైన్ వేసిన రెండో ఓవర్లో ఫించ్ 2 ఫోర్లు, సిక్సర్ బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. షకీబ్ తర్వాతి ఓవర్లో మళ్లీ చెలరేగిన ఫించ్ మరో 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఈ దశలో కూల్టర్‌నీల్ తన తొలి ఓవర్లోనే ఫించ్‌ను వెనక్కి పంపి నైట్‌రైడర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే తర్వాతి మూడు బంతుల్లో మెకల్లమ్ 4, 6, 4 పరుగులు రాబట్టి ధాటిని కొనసాగించాడు. ఐదు ఓవర్ల తర్వాత వచ్చిన వర్షంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆట మళ్లీ ప్రారంభమయ్యాక మరో ఫోర్ కొట్టిన మెకల్లమ్, వోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే దినేశ్ కార్తీక్ (3) కూడా అవుట్ కావడంతో గుజరాత్ కష్టాలు పెరిగాయి. 15 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను పఠాన్ వదిలేయడంతో బతికిపోయిన రైనా... తన పోరాటాన్ని కొనసాగిస్తూ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో ఆరు బంతుల వ్యవధిలో ఇషాన్ (4), స్మిత్ (5) అవుట్ కావడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది. అయితే ఈ దశలో జడేజా (13 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండగా రైనా చెలరేగిపోయాడు. కూల్టర్‌నీల్ వేసిన 17వ ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్సర్ బాది లయన్స్‌ను విజయం వాకిట్లో నిలపగా, మిగతా పనిని జడేజా పూర్తి చేశాడు.