ముంబైదే టాప్
♦ కోల్‌కతాపై 9 పరుగులతో గెలుపు
♦ రాణించిన రాయుడు
ఇప్పటికే ‘ప్లే–ఆఫ్’కు చేరిన ముంబై కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ సత్తా చాటింది. కోల్‌కతాను వారి సొంతగడ్డపై ఓడించి లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. ఇపుడిక మిగిలిన ఒక బెర్త్ కోసం రైజింగ్ పుణే, పంజాబ్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు చేరుతుంది.
కోల్‌కతా: ఐపీఎల్‌లో ముంబై టాప్ లేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. వచ్చిన ‘ఒక్క’ అవకాశాన్ని అర్ధ సెంచరీగా మలిచిన సౌరభ్ తివారి (43 బంతుల్లో 52; 9 ఫోర్లు), గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేయగలిగింది. మనీశ్ పాండే (33 బంతుల్లో 33; 2 ఫోర్లు), గ్రాండ్ హోమ్ (16 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ టి20ల్లో 100వ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2012 తర్వాత సొంత మైదానంలో కోల్‌కతా ఛేజింగ్ చేస్తూ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రాయుడు, తివారి ఫిఫ్టీ–ఫిఫ్టీ
ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్‌లో తొలిసారి చాన్స్ దక్కించుకున్న సౌరభ్ తివారి ఓపెనర్‌గా రాణించాడు. సిమన్స్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత అంబటి రాయుడుతో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో భారీ షాట్లు ఆడే క్రమంలో రాయుడు, పొలార్డ్ (13; 1 సిక్స్) ఔటయ్యారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాను ముంబై పేసర్లు బెంబేలెత్తించారు. నరైన్ (0) సౌతీ బౌలింగ్‌లో డకౌట్ కాగా... ఇన్నింగ్స్ కుదుటపడుతున్న తరుణంలో గంభీర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను జాన్సన్... లిన్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను వినయ్ పెవిలియన్ చేర్చారు. ఉతప్ప (2) కరణ్ స్పిన్ ఉచ్చులో పడ్డాడు. సిక్సర్లతో విరుచుకుపడిన యూసుఫ్ ఫఠాన్ (7 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేకపోయాడు. మనీశ్, గ్రాండ్‌హోమ్‌లు పోరాడినా ముంబై పేస్‌కు తలవంచారు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సౌరభ్ రనౌట్ 52; సిమన్స్ (సి) నరైన్ (బి) బౌల్ట్ 0; రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) అంకిత్ 27; రాయుడు (స్టంప్డ్) ఉతప్ప (బి) కుల్దీప్ 63; పొలార్డ్ (సి) పఠాన్ (బి) బౌల్ట్ 13; హార్దిక్ నాటౌట్ 1; కృనాల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 173.
వికెట్ల పతనం: 1–12, 2–69, 3–130, 4–168, 5–170. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–2, గ్రాండ్‌హోమ్ 2–0–16–0, ఉమేశ్ 4–0–40–0, నరైన్ 4–0–37–0, కుల్దీప్ 3–0–25–1, అంకిత్ 3–0–14–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నరైన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 0; లిన్ (సి) సబ్–సుచిత్ (బి) వినయ్ 26; గంభీర్ (సి) కరణ్ శర్మ (బి) జాన్సన్ 21; ఉతప్ప (సి) రోహిత్ (బి) కరణ్ శర్మ 2; మనీశ్ పాండే (సి) సబ్–సుచిత్ (బి) హార్దిక్ 33; యూసుఫ్ పఠాన్ (సి) హార్దిక్ (బి) వినయ్ 20; గ్రాండ్‌హోమ్ (బి) హార్దిక్ 29; కుల్దీప్ (సి) రాయుడు (బి) సౌతీ 16; ఉమేశ్ నాటౌట్ 4; బౌల్ట్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–0, 2–41, 3–53, 4–53, 5–87, 6–128, 7–149, 8–158. బౌలింగ్: సౌతీ 4–1–39–2, జాన్సన్ 4–0–30–1, కరణ్ శర్మ 3–0–26–1, వినయ్ 3–0–31–2, కృనాల్ 2–0–14–0, హార్దిక్ 4–0–22–2.