IPL 2024: రోహిత్‌ శర్మను సీఎస్‌కే కెప్టెన్‌గా చూడాలని ఉంది..! | Ambati Rayudu With Rohit Sharma Play For CSK In 2025 | Sakshi
Sakshi News home page

IPL 2024: రోహిత్‌ శర్మను సీఎస్‌కే కెప్టెన్‌గా చూడాలని ఉంది..!

Published Mon, Mar 11 2024 4:49 PM | Last Updated on Mon, Mar 11 2024 5:06 PM

Ambati Rayudu With Rohit Sharma Play For CSK In 2025 - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తన మాజీ కెప్టెన్‌ (ముంబై ఇండియన్స్‌) రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయుడు రోహిత్‌పై తన మనసులో దాగి వున్న విషయాలను బహిర్గతం చేశాడు. తన మరో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైరయ్యాక రోహిత్‌ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాలని  ఆకాంక్షించాడు. ఇదే సందర్భంగా రాయుడు రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌కు మరో ఐదారేళ్లు ఐపీఎల్‌ ఆడగల సత్తా ఉందని ఆకాశానికెత్తాడు. ధోని తర్వాత రోహిత్‌ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని అన్నాడు.   

రోహిత్‌ కావాలనుకుంటే విశ్వవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లోనైనా కెప్టెన్సీ చేపట్టగలడని తెలిపాడు. రోహిత్‌ గడిచిన పదేళ్లలో ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. రోహిత్‌ మరో సీజన్‌ పాటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా కొనసాగాల్సి ఉండిందని అన్నాడు. రోహిత్‌ విషయంలో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తొందరపడిందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్‌ ఇంకా టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎంఐ యాజమాన్యం కెప్టెన్‌గా హార్దిక్‌ ట్రాక్‌ రికార్డును పరిగణలోకి తీసుకుని ఉంటుందని తెలిపాడు.

గుజరాత్‌ పరిస్థితులతో పోలిస్తే ముంబై ఇండియన్స్‌ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ముంబై ఇండియన్స్‌కు ముందుండి నడిపించడం ఆషామాషీ విషయం కాదని పరోక్షంగా తన మద్దతు రోహిత్‌ శర్మకు తెలిపాడు. అంతిమంగా కెప్టెన్సీ చేపట్టాలా వద్దా అన్నది రోహిత్‌ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు.  అంబటి రాయుడు.. రోహిత్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు.. ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు. ఈ తెలుగు క్రికెటర్‌ గతేడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

కాగా, 36 ఏళ్ల రోహిత్‌ శర్మ 2013-2020 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇంతటి విజయవంతమైన కెప్టెన్‌ను ముంబై ఇండియన్స్‌ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తొలగించి, అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్‌ ఇ‍ష్టపూర్వకంగానే ముంబై ఇండియన్స్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని కొందరంటుంటే, మరికొందరేమో హార్దిక్‌ పాండ్యా కోసం ఎంఐ యాజమాన్యం హిట్‌మ్యాన్‌ను అవమానించిందని అనుకుంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement