మీ ‘డెన్‌’లో మా వంతు... | gujarat lions beat kkr | Sakshi
Sakshi News home page

మీ ‘డెన్‌’లో మా వంతు...

Published Sat, Apr 22 2017 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

మీ ‘డెన్‌’లో మా వంతు... - Sakshi

మీ ‘డెన్‌’లో మా వంతు...

కోల్‌కతాను చిత్తు చేసిన గుజరాత్‌
4 వికెట్లతో లయన్స్‌ విజయం
గెలిపించిన సురేశ్‌ రైనా  


సరిగ్గా రెండు వారాల క్రితం సొంత మైదానం రాజ్‌కోట్‌లో కోల్‌కతా భీకర బ్యాటింగ్‌ దెబ్బకు గుజరాత్‌ జట్టు పది వికెట్లతో చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఆ మ్యాచ్‌కు సరైన రీతిలో లయన్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. వరుస విజయాలతో నైట్‌రైడర్స్‌కు పెట్టని కోటలా ఉన్న ఈడెన్‌ గార్డెన్స్‌లోనే వారిని దెబ్బ తీసి సత్తా చాటింది. పదో సీజన్‌ లీగ్‌ దశలో ప్రత్యర్థితో లెక్క సరి చేసింది. ముందుగా ఉతప్ప, నరైన్‌ల దూకుడైన బ్యాటింగ్‌తో కోల్‌కతా భారీ స్కోరు సాధించగా... ఓపెనింగ్‌ మెరుపులకు తోడు కెప్టెన్‌ రైనా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌ మళ్లీ కోలుకునేలా చేసింది.  

కోల్‌కతా: ఐపీఎల్‌–10లో గుజరాత్‌ లయన్స్‌ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాబిన్‌ ఉతప్ప (48 బంతుల్లో 72; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... సునీల్‌ నరైన్‌ (17 బంతుల్లో 42; 9 ఫోర్లు, 1 సిక్స్‌), గంభీర్‌ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం గుజరాత్‌ 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సురేశ్‌ రైనా (46 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మెకల్లమ్‌ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఫించ్‌ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడు కనబర్చారు.

నరైన్‌ మెరుపులు...
ప్రవీణ్‌ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు... ఫాల్క్‌నర్‌ వేసిన రెండో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు... థంపి వేసిన మూడో ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6... మూడు ముక్కల్లో సునీల్‌ నరైన్‌ బ్యాటింగ్‌ దూకుడు ఇది! మూడోసారి ఓపెనర్‌గా దిగిన అతను మరోసారి తన బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్క సింగిల్‌ కూడా తీయకుండా బౌండరీలతో అతను గుజరాత్‌ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దాంతో కోల్‌కతాకు అద్భుత ఆరంభం లభించింది. చివరకు ఈ విధ్వంసాన్ని ఆపేందుకు లయన్స్‌ కెప్టెన్‌ రైనా స్వయంగా బౌలింగ్‌కు దిగాల్సి వచ్చింది. తాను వేసిన రెండో బంతితో నరైన్‌ను అవుట్‌ చేసి రైనా తన జట్టుకు ఊరట అందించాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి కొన్ని చక్కటి షాట్లతో కోల్‌కతా జోరును కొనసాగించారు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జోడించిన తర్వాత గంభీర్‌ వెనుదిరిగాడు. అనంతరం మనీశ్‌ పాండే (21 బంతుల్లో 24; 2 ఫోర్లు)తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్‌ను నడిపించాడు. గత మ్యాచ్‌లో అద్భుత ఆటతో తన జట్టును గెలిపించిన పాండే, ఇక్కడ మాత్రం పరుగులు చేయడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. జడేజా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. థంపి వేసిన మరో ఓవర్లో కూడా అతను వరుసగా ఒక ఫోర్, సిక్స్‌ బాదాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ఉతప్ప, పాండే తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ (4 బంతుల్లో 11 నాటౌట్‌; 2 ఫోర్లు) మరికొన్ని పరుగులు జోడించాడు.  

శుభారంభం...
భారీ ఛేదనను గుజరాత్‌ కూడా దీటుగా మొదలు పెట్టింది. షకీబ్‌ వేసిన తొలి ఓవర్లో మెకల్లమ్‌ రెండు ఫోర్లు కొట్టగా, నరైన్‌ వేసిన రెండో ఓవర్లో ఫించ్‌ 2 ఫోర్లు, సిక్సర్‌ బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. షకీబ్‌ తర్వాతి ఓవర్లో మళ్లీ చెలరేగిన ఫించ్‌ మరో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. ఈ దశలో కూల్టర్‌నీల్‌ తన తొలి ఓవర్లోనే ఫించ్‌ను వెనక్కి పంపి నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అయితే తర్వాతి మూడు బంతుల్లో మెకల్లమ్‌ 4, 6, 4 పరుగులు రాబట్టి ధాటిని కొనసాగించాడు. ఐదు ఓవర్ల తర్వాత వచ్చిన వర్షంతో మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆట మళ్లీ ప్రారంభమయ్యాక మరో ఫోర్‌ కొట్టిన మెకల్లమ్, వోక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

తర్వాతి ఓవర్లోనే దినేశ్‌ కార్తీక్‌ (3) కూడా అవుట్‌ కావడంతో గుజరాత్‌ కష్టాలు పెరిగాయి. 15 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను పఠాన్‌ వదిలేయడంతో బతికిపోయిన రైనా... తన పోరాటాన్ని కొనసాగిస్తూ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో ఆరు బంతుల వ్యవధిలో ఇషాన్‌ (4), స్మిత్‌ (5) అవుట్‌ కావడంతో గుజరాత్‌ పరిస్థితి మరింత దిగజారింది. అయితే ఈ దశలో జడేజా (13 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) అండగా రైనా చెలరేగిపోయాడు. కూల్టర్‌నీల్‌ వేసిన 17వ ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్సర్‌ బాది లయన్స్‌ను విజయం వాకిట్లో నిలపగా, మిగతా పనిని జడేజా పూర్తి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement