వాళ్లిద్దరూ లేకపోవడం వల్లే ఓడిపోయాం
టి 20 మ్యాచ్‌లో 180కి పైగా పరుగులు అంటే తక్కువ స్కోర్ ఏమీ కాదు. అంత చేసినా కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓడిపోవడంతో గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తట్టుకోలేకపోతున్నాడు. ప్రత్యర్థి జట్టులో ఒక్క వికెట్‌ను కూడా తమవాళ్లు పడగొట్టలేకపోవడంతో రగిలిపోతున్నాడు. అనుభవం లేని బౌలర్ల కారణంగానే ఇలా అయ్యిందని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో ఇద్దరూ లేకపోవడం తమ జట్టు విజయావకాశాలను దారుణంగా దెబ్బ తీసిందని రైనా అన్నాడు.
రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 184 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే ఒక్క వికెట్‌కూడా కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. కెప్టెన్ గౌతమ్ గంభీర్‌కు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ లిన్ తోడు కావడంతో ఇద్దరూ చెలరేగిపోయారు. గుజరాత్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించారు.
తాము చేసింది తక్కువ స్కోరేమీ కాదని, అయితే బౌలర్లు మాత్రం రాబోయే మ్యాచ్‌లలో బాగా మెరుగుపడాల్సి ఉందని సురేష్ రైనా అన్నాడు. మొదటి ఆరు ఓవర్లు తమవాళ్లు సరిగా బౌలింగ్ చేయలేదని, అనుభవలేమి స్పష్టంగా కనిపించిందని చెప్పాడు. వికెట్ నెమ్మదిస్తుందని తాను అనుకున్నాను గానీ అది అలాగే ఉండిపోయిందని తెలిపాడు. జడేజా, బ్రావో లేకపోవడం చాలా ప్రభావం చూపించిందని, అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలరని రైనా అన్నాడు. టి20 ఫార్మాట్‌లో జడేజా మరింత బాగా బౌలింగ్‌చేస్తాడని తెలిపాడు. కనీసం రెండు వారాల పాటు జడేజా విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా ఇవ్వడంతో ఐపీఎల్ తొలి అంచె మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక వెస్టిండీస్‌కు చెందిన బ్రావో కూడా తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించిన విషయం తెలిసిందే.