IPL 2017
-
నాడు పూణే ఫైనల్ చేరడానికి ధోనినే కారణం..స్మిత్ కాదు
న్యూఢిల్లీ: 2017 ఐపీఎల్ ఎడిషన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు ఫైనల్ చేరడానికి మహేంద్రసింగ్ ధోనినే కారణమని, అందులో నాటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాత్ర ఏమీ లేదని మాజీ పూణే ఆటగాడు రజత్ భాటియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో స్టీవ్ స్మిత్‌కు ధోనికి పోలికేంటని, అసలు స్మిత్‌ను ధోనీతో పోల్చడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో టాప్ 10 కెప్టెన్లలో కూడా స్మిత్ ఉండడని పేర్కొన్నాడు. గతేడాది స్మిత్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కాగా, రజత్ భాటియా తన ఐపీఎల్ కెరీర్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై 2015లో రెండేళ్లు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 2016, 2017 సీజన్లలో ఆయా జట్ల ఆటగాళ్లు నూతన ఫ్రాంఛైజీలైన గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఈ క్రమంలో పూణే కెప్టెన్‌గా స్మిత్, వికెట్ కీపర్‌గా ధోని వ్యవహరించారు. ఆ టోర్నీలో పూణే.. లీగ్ దశలో 9 విజయాలు సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై, రన్నరప్‌గా నిలిచింది. చదవండి: అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్ -
ఆ లెక్కన ట్రోఫీ సన్‌రైజర్స్‌దే!
సాక్షి, హైదరాబాద్ : గత సీజన్ సెంటిమెంట్ పునరావృతమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌నే ఐపీఎల్ ట్రోఫీ వరించనుంది. 2017 సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు జట్లే ఫైనల్‌కు చేరాయి. అంతేకాకుండా టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టుకే టైటిల్ దక్కింది. ఆ సీజన్లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉన్న అప్పటి జట్టు రైజింగ్ పుణెతో క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పుణె జట్టులో ధోని ఉండటం విశేషం. క్వాలిఫైయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో పుణెతో తలపడి ఉత్కంఠ పోరులో టైటిల్‌ను సొంతం చేసుకుంది. హిస్టరీ రిపీట్.. ఈ సీజన్లో టాప్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం రెండో స్థానంలో ఉన్న ధోని సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ క్వాలిఫైర్-2 మ్యాచ్ కూడా అప్పటిలా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నెగ్గితే చరిత్ర పునరావృతం అవుతోంది. ఆ లెక్కన టైటిల్ సన్‌రైజర్స్‌నే వరించే అవకాశం ఉంది. -
ముంబై ఇండియన్స్ సరిగ్గా ఇదే రోజు
హైదరాబాద్ : ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఉత్కంఠ పోరులో అనూహ్య విజయన్నందుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. స్టీవ్ స్మిత్ సారథ్యంలోని అప్పటి జట్టు రైజింగ్ పుణె ఆఖరి వరకు పోరాడి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ డ్రామాను తలిపించింది. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్ ఫైనల్ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. పుణె విజయాన్ని లాగేసిన జాన్సన్.. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్ చేసిన జాన్సన్ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియాన్ అవుటయ్యాడు. దీంతో ముంబై విజయం సాధించింది. కొంప ముంచిన అతి జాగ్రత్త.. రైజింగ్ పుణే సూపర్ జెయింట్... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టీ20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్ స్మిత్ చేతులెత్తేశాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. ఈ సీజన్లో నిరాశపరిచిన రోహిత్ సేన మేటి ఆటగాళ్లతో.. ఢిఫెండింగ్ చాంపియన్‌గా ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కూడా కనబర్చలేకపోయింది. టోర్నీ ఆరంభంలోనే వరుస ఓటములను మూటగట్టుకున్న ముంబై అనూహ్యంగా విజృంభించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ముంబై నెలకు కొట్టిన బంతిలా పుంజుకుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
2 పరుగులు తీద్దామని కొడితే.. సిక్సర్ వెళ్లింది!
ఐపీఎల్ పదో సీజన్ మొత్తం తీవ్రంగా నిరాశపరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తాము ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద ఆడిన చిట్టచివరి మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా కోరీ ఆండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన షాట్ ఎవరూ మర్చిపోలేరు. నిజానికి ఈ టోర్నమెంటు మొత్తమ్మీద కోహ్లీ కేవలం నాలుగే అర్ధసెంచరీలు చేశాడు. తొమ్మిదో సీజన్లో అయితే ఏకంగా 11 సార్లు 50కి పైగా పరుగులు కోహ్లీ ఖాతాలో పడ్డాయి. సీజన్ ప్రారంభంలో భుజానికి గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు కూడా కోహ్లీ దూరంగా ఉన్నాడు. చివరిమ్యాచ్‌లో మాత్రం మళ్లీ తనదైన ఆటతీరు కనబరిచాడు. అయితే.. కోహ్లీ కొట్టిన సిక్సర్లలో ఒకటి చూస్తే మాత్రం అసలు ఎవరూ తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. అప్పటికి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడుతున్న కోహ్లీ.. కోరీ ఆండర్సన్ బౌలింగ్‌లో ఓ చిత్రమైన షాట్ కొట్టాడు. ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి ఏదో చిన్న షాట్ కొట్టినట్లుగా కొడితే, అది కాస్తా ఏకంగా 67 మీటర్ల దూరం వరకు గాల్లోనే ప్రయాణించి సిక్సర్‌గా మారింది. ఆ షాట్ ఆడిన తర్వాత కోహ్లీ ఎందుకో నవ్వుకున్నాడు. ఆ నవ్వు ఎందుకో మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది. వాస్తవానికి తాను ఫీల్డర్ల మధ్య నుంచి బాల్ కొట్టి, రెండు పరుగులు తీయాలని అనుకున్నానని, కానీ కోరీ క్రాస్-సీమ్ బాల్ వేయడంతో తాను సంతోషంగా దాన్ని కొట్టానని, అనుకోకుండా అది సిక్స్ వెళ్లిపోయిందని కోహ్లీ మ్యాచ్ అయిపోయాక ప్రజంటేషన్ సమయంలో చెప్పాడు. అయితే మొత్తమ్మీద ఈ సీజన్లో మాత్రం కోహ్లీ ఆటతీరు గానీ, ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ గానీ ఏమాత్రం బాగోకపోవడం మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. -
ధోనీ వయసు పెరుగుతోందా తగ్గుతోందా?
-
ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా?
మహేంద్ర సింగ్ ధోనీ.. కాగితాల్లో లెక్కల ప్రకారం అతడి వయసు 35 సంవత్సరాలు. కానీ అతడి ఫిట్నెస్ లెవెల్స్, వికెట్ల వెనక చురుగ్గా చిరుతలా కదిలే విధానం చూస్తే మాత్రం పాతికేళ్ల కుర్రాళ్లు కూడా అతడి ముందు బలాదూర్‌గానే కనిపిస్తారు. నిజంగా అసలు ధోనీ వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా అనే అనుమానం సగటు ప్రేక్షకులతో పాటు అతడి అభిమానులకు కూడా కలుగుతోంది. వికెట్ల వెనక ధోనీ ఉన్నాడంటే బౌలర్‌కు కొండంత బలం. వందలో వెయ్యోవంతు అవకాశం వచ్చినా బ్యాట్స్‌మన్ ఇక ఇంటికి వెళ్లాల్సిందే. శుక్రవారం నాటి మ్యాచ్‌లో తనలో ఉన్న అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలను ధోనీ మరోసారి ప్రదర్శించాడు. కనురెప్ప వాల్చి మళ్లీ తెరిచేలోగా బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మ్యాజిక్ చూసి ప్రేక్షకులు స్టేడియంను హోరెత్తించారు. అయితే, ధోనీ అంత ప్రయత్నించినా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఢిల్లీ జట్టులో అత్యంత ప్రమాదకారి అయిన మార్లన్ శామ్యూల్స్‌ను ఔట్ చేసిన విధానం చూసి జనమంతా ఔరా అన్నారు. డాన్ క్రిస్టియన్ వేసిన షార్ట్ డెలివరీని శామ్యూల్స్ పైకి లేపాడు. వాస్తవానికి అది వికెట్ కీపర్‌కు అందేంత దూరం కానే కాదు. కానీ ధోనీ ఒక్కసారిగా ఎడమ పక్కకు స్ట్రెచ్ అయ్యి, గాల్లోకి లేచి ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు. ఇంకా తాను కొట్టిన షాట్‌కు ఆ బాల్ ఎక్కడికో వెళ్లి పడుతుందనుకున్న శామ్యూల్స్.. ఒక్కసారిగా షాకై పెవిలియన్ బాట పట్టాడు. ఇక మరో హిట్టర్ కోరీ ఆండర్సన్‌ను ధోనీ ఔట్ చేసిన తీరు అతడి మెరుపు వేగాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించింది. పుణె జట్టులోని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా కొట్టిన బంతిని కొట్టడానికి ఆండర్సన్ విఫలయత్నం చేసి క్రీజ్ నుంచి ఒక కాలు బాగా బయటపెట్టి రెండోకాలు గాల్లోకి లేపాడు. చిరుత వేగంతో కదిలిన ధోనీ.. వెంటనే అరక్షణంలో ధోనీ అతడిని స్టంప్ చేశాడు. అంపైర్లు కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేక థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. ధోనీ కదలడం, వికెట్ పడకపోవడం ఉంటాయా..! -
కోహ్లీ కుమ్ముడు గ్యారంటీ: సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ పదో సీజన్లో పెద్దగా మెరుపులు చూపించకపోయినా.. దాన్నుంచి బయటపడి ఎలా విజృంభించాలో అతడికి బాగా తెలుసని ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. తగినంత పాం లేకపోవడం ప్రతి క్రికెటర్‌తోనూ జరుగుతుందని, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విషయం తీసుకుంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం ఒకేలా ఆడలేదని చెప్పాడు. మీడియా ప్రశ్నలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయని, సమయంతో పాటే ఫాం కూడా మారుతుందని వీరూ అన్నాడు. బ్యాడ్ ఫాం నుంచి మళ్లీ గుడ్ ఫాంలోకి రావడమే మంచి ప్లేయర్‌కు హాల్‌మార్క్ లాంటిదని విశ్లేషించాడు. 92.7 బిగ్ ఎఫ్ఎం చానల్ నిర్వహించిన కార్యక్రమంలో.. ఐపీఎల్ పదో సీజన్లో ఆర్సీబీ జట్టు గురించి అడిగిన ప్రశ్నలకు సెహ్వాగ్ ఈ విధంగా బదులిచ్చాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి 27 సగటు, 64 పరుగుల అత్యధిక స్కోరుతో కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 250 పరుగులు మాత్రమే చేశాడు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు కోహ్లీయే నేతృత్వం వహించనున్నాడు. టి20లు ఆడినంత మాత్రాన మళ్లీ 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సెహ్వాగ్ కచ్చితంగా చెప్పాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ కూడా అయిన సెహ్వాగ్.. తమ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుందా లేదా అనేది ఇతర జట్ల మీద కూడా ఆధారపడి ఉందని తెలిపాడు. పుణె, హైదరాబాద్, కోల్‌కతా మూడు జట్లు ఓడిపోతే తమకు క్వాలిఫై అయ్యేందుకు ఒక చాన్స్ ఉంటుందన్నాడు. అదే సమయంలో తమ జట్టు రన్‌రేట్ బాగా ఉండాలని, అప్పుడే క్వాలిఫై అవుతామని వివరించాడు. -
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
-
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
ముంబై: ఐపీఎల్10లో భాగంగా వాంఖెడే మైదానంలో నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ అద్బుతంగా క్యాచ్ పట్టి ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాచ్ పట్టినతీరు చూస్తే ఆహా అనాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్ లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడగా ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గప్టిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు. తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గప్టిల్ అది అసాధ్యమని.. ఆ తర్వాత క్షణాల్లో కేవలం ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆపై బౌండరీ లైన్ ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకోవడంపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ముంబై స్కోరు 106 పరుగుల వద్ద సిమ్మన్స్ (32 బంతుల్లో 59: 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. గప్టిల్ పట్టిన క్యాచ్‌కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్దులయ్యారు. ఈ క్యాచ్‌తో గప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో గప్టిల్ చిరుతలా మైదానంలో వేగంగా కదిలి మరో రెండు క్యాచులు పట్టి నితీశ్ రాణా, రోహిత్ శర్మలు ఔట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. మెరుగైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా ఉత్కంఠపోరులో ముంబైపై 7 పరుగుల తేడాతో పంజాబ్ నెగ్గిన విషయం తెలిసిందే. What a beautiful catch... Amazingly done by #Guptill — Abhinav Joshi (@ABHlNAV) 11 May 2017 Woah....! Martin Guptill superman catch✈✈ Catch of the season.😎#MIvKXIP pic.twitter.com/XQ3bByi51v — Sourav Rawat (@SouravRawat_17) 11 May 2017 -
రెండు సెంచరీలు... ప్చ్!
మొహాలీ: అతడు రెండుసార్లు సెంచరీ కొట్టినా జట్టు విజయం సాధించలేదు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడి శతకాలు బాదినా గెలుపు మాత్రం దక్కలేదు. ఐపీఎల్-10లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు హషిమ్ ఆమ్లా సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు పరాజయం పాలైంది. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా అద్భుతంగా ఆడి (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆమ్లా శతకం వృధా అయింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా శతకం బాదాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమ్లా శ్రమ ఫలించలేదు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆమ్లా తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుందని, తాను మంచి షాట్లు కొట్టానని చెప్పాడు. తమ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశానికి పయనమవుతున్న ఆమ్లా మిగతా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఈ సీజన్లో అతడు 10 మ్యాచులు ఆడి 420 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. -
గేల్ 0, కోహ్లీ 6, ఏబీ 10.. ఈ జట్టుకు ఏమైంది?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. పేరులో ఉన్న రాయల్టీ గానీ, చాలెంజింగ్ లక్షణాలు గానీ ఏమాత్రం కనపడని జట్టుగా ఐపీఎల్ పదో సీజన్లో దారుణాతి దారుణంగా విఫలం అవుతోంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన ఉద్దండులు అందులోనే ఉన్నారు. తుపాను ఇన్నింగ్స్ ఆడగల క్రిస్ గేల్, ఎలాంటి పరిస్థితిలోనైనా జట్టును ఒంటిచేత్తో గెలిపించగల విరాట్ కోహ్లీ, బంతిని ఎక్కడేసినా బాదేస్తా అన్నట్లుండే ఏబీ డివీలియర్స్.. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండి కూడా ఈ సీజన్లో బెంగళూరు జట్టు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. కనీసం 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేదంటే ఇంత మంది పెద్ద ఆటగాళ్లు ఉండి ఏం ప్రయోజనమని ప్రేక్షకులు వాపోతున్నారు. అసలు ఈ జట్టుకు ఏమైంది.. ఏదైనా దిష్టి తగిలిందా, లేకపోతే ఏదైనా తేడా ఉండా అని కూడా అనుమానాలు సగటు ప్రేక్షకులకు తలెత్తుతున్నాయి. సుడిగాలిలా విజృంభించే క్రిస్ గేల్.. ఈ సీజన్ మొత్తమ్మీద ఆడింది ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్. గుజరాత్ లయన్స్ జట్టు మీద రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడితే ఒక దాంట్లో డకౌట్, మిగిలిన వాటిలో డబుల్ డిజిట్‌కు వెళ్లింది కేవలం రెండు సార్లు మాత్రమే. అది కూడా మరీ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కావు. ఒకటి ముంబై ఇండియన్స్ మీద 22, మరోటి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 32.. మిగిలిన మ్యాచ్‌లలో గేల్ స్కోర్లు 8, 7, 6. కోహ్లీ కొంత పర్వాలేదనిపించినా దానివల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. కోల్‌కతా మీద మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. పంజాబ్ జట్టు మీద కేవలం 6 పరుగులే చేసి సందీప్ శర్మ చేతిలో ఔటయ్యాడు. మిగిలిన వాటిలో కూడా 10, 20, 28 పరుగులు చేశాడు. రెండుసార్లు మాత్రం అర్ధసెంచరీలు కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌లో 138 పరుగులకే పంజాబ్ జట్టును కట్టడి చేయడంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బెంగళూరు జట్టు గెలుస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, సొంత మైదానం అయినా.. ఎదురుగా ఉన్నది అతి సాధారణ లక్ష్యమే అయినా కూడా తడబడ్డారు. జట్టులో ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే! గేల్, కోహ్లీ, డివీలియర్స్ ముగ్గురినీ సందీప్ శర్మే ఔట్ చేశాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురు ప్రముఖ బ్యాట్స్‌మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అతడు గుర్తింపు పొందాడు. ఇక ఈ సీజన్లో బెంగళూరు జట్టు మీద ఆశలు పెట్టుకోవడం అనవసరమని.. కనీసం వచ్చే సీజన్‌కైనా కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. -
యువప్లేయర్‌ను ఆకాశానికి ఎత్తేసిన మాస్టర్
సెంచరీ చేయడానికి సరిగ్గా 3 పరుగుల ముందు ఔటయితే ఎవరికైనా సరే.. దుఃఖం తన్నుకొస్తుంది. అందులోనే ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న ప్లేయర్లయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీ ప్లేయర్ రిషభ్ పంత్ పరిస్థితీ అంతే. గురువారం రాత్రి గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ సరిగ్గా 97 పరుగుల వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. కానీ, ఆ క్షణంలో అతడు బాధపడినా.. ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిన ప్రశంసలు చూసి ఉప్పొంగిపోయి ఉంటాడు. 43 బంతుల్లోనే 97 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్‌ను ఐపీఎల్లో తాను చూసిన అత్యుత్తమమైనవాటిలో ఇదొకటని సచిన్ ట్వీట్ చేశాడు. కేవలం ఈ ఒక్క సీజన్లోనే కాదని, ఇప్పటి వరకు జరిగిన 10 సీజన్లలో కూడా ఇదే మంచి ఇన్నింగ్స్ అని మాస్టర్ అన్నాడు. దాంతోపాటు.. ఔటయిన తర్వాత రిషబ్ పంత్ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా టీవీ స్క్రీన్‌ను ఫొటో తీసి ఆ ఫొటో కూడా ట్వీట్ చేశారు. భారతీయ క్రికెట్‌కు ఆశాజ్యోతిగా క్రీడా పండితులు అభివర్ణిస్తున్న పంత్ ఇన్నింగ్స్ చూసి సచిన్ చాలా ముచ్చట పడ్డాడు. సరిగ్గా సెంచరీ ముంగిట ఉండగా బాసిల్ థంపి ఓ చక్కటి బంతితో పంత్‌ను బోల్తా కొట్టించాడు. అయినా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సురేష్ రైనా కూడా స్వయంగా పంత్ వద్దకు నడుచుకుంటూ వచ్చి, సెంచరీ మిస్సయినందుకు ఓదార్చాడు. చక్కటి ఇన్నింగ్స్ ఆడావంటూ అభినందించాడు కూడా. అయితే.. పంత్ ఇన్నింగ్స్ వృధాగా పోలేదు. జట్టు మెంటార్ రాహుల్ ద్రవిడ్ సహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మరీ తిరిగొస్తున్న పంత్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత కోరీ ఆండర్సన్ ఒక సిక్స్ కొట్టడంతో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్ దశకు చేరుకోడానికి ఈ విజయం ఢిల్లీకి చాలా అవసరం. One of the best Innings I have seen in the IPL & that includes all 10 seasons. @RishabPant777 pic.twitter.com/SGv3YuXwJ5 — sachin tendulkar (@sachin_rt) 4 May 2017 -
యువరాజ్ క్యాచ్ పట్టి ఉంటే..
న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై ఝూలువిదిలిచ్చింది. పటిష్ట సన్ రైజర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై టీమిండియా క్రికెటర్, ఢిల్లీ తాత్కాలిక కెప్టెన్ కరుణ్ నాయర్ హర్షం వ్యక్తంచేశాడు. జట్టులో యువకులు ఉన్నారని, ఎలాంటి భయం లేకుండా ఆడటమే సన్ రైజర్స్పై విజయానికి కారణమన్నాడు. 'బౌలర్లు శ్రమించినా సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. యువరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను మా వాళ్లు వదిలేయడంతో వారికి కలిసొచ్చింది. లైఫ్ రావడంతో యువరాజ్ విజృంభించి ఆడాడు. లేకపోతే మాకు విజయం సులువుగా సాధ్యమయ్యేది' అని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. 'డేర్ డేవిల్స్ పోరాటపటిమతో ఆకట్టుకుంది. 186 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టమని భావించాం. కానీ ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షాలో అద్బుతం చేసింది' అని మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. గాయం కారణంతో ఢిల్లీ పర్మనెంట్ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరం కావడంతో బాధ్యతలు తీసుకున్న కరుణ్ నాయర్ జట్టుకు విజయాన్ని అందించాడు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి మూడో విజయాన్ని నమోదు చేసింది. -
కోహ్లీ చేతిలో ఆ బుజ్జాయి ఎవరో తెలుసా..!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ పాపతో దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో కొన్ని నిమిషాల్లోనే లక్షల లైక్స్, వేల కామెంట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్-10 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అయితే కాస్త ఆటవిడుపు కోరుకున్నాడో ఏమో.. టీమిండియా సహచరుడు, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్బజన్ కూతురు హినయతో కబుర్లు చెబుతూ సెల్ఫీలు దిగాడు కోహ్లీ. చిన్నారి ముద్దుముద్దు మాటలతో టెన్షన్ నుంచి కాస్త ఊరట పొంది ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'చిన్నారులు ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంటారు. ఇక్కడ చూడండి.. బేబీ హినయ నా గడ్డంలో ఏదో వెతుకుతుంది. హర్బజన్, గీతాబస్రా దంపతులకు దేవుడు అంతా మంచి జరిగేలా చూడాలి' అని తన పోస్ట్‌లో కోహ్లీ రాసుకొచ్చాడు. గత మార్చి నెలలో ఎంఎస్ ధోనీ కూతురు జీవాతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేయగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న (సోమవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైంది. -
స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా
పుణే: గుజరాత్ లయన్స్ విజయం ఖాయమనుకున్న దశలో విజృంభించి అజేయ శతకంతో చెలరేగిన పుణే ఆటగాడు బెన్ స్టోక్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్లు అతడి ఆటను కొనియాడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ వన్ మ్యాన్ షోతో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన పుణే ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకుంది. ఐపీఎల్లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న స్టోక్స్ తానెంత విలువైన ఆటగాడో నిరూపించాడు. అతడి ఆటకు పుణేతో పాటు ఐపీఎల్‌లోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు దాసోహం అయ్యారు. 'జట్టుకు గొప్ప విజయం. స్టోక్స్ బ్యాటింగ్ అద్భుతం. గ్రేట్ సెంచరీ' అని పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ట్వీట్ చేశాడు. రెండో ఓవర్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎంతో ఒత్తిడిలోనూ స్టోక్స్ ట్వంటీ20 సెంచరీ చేశాడని గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొనియాడాడు. 'ఓ లెఫ్ట్ హ్యాండర్‌గా స్టోక్స్ ఆటను చూడటం గొప్పగా ఉంది. ప్రతిభ ఉన్న క్రికెటర్ అని సీరియస్ ఇన్నింగ్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. కెవిన్ పీటర్సన్, డుప్లెసిస్ కూడా స్టోక్స్ సెంచరీ చేసిన తీరును ప్రశంసించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 10 పరుగులకే మూడో వికెట్ కోల్పోవడంతో రెండో ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు స్టోక్స్. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన స్టోక్స్ చివర్లో కండరాలు పట్టేసినా పట్టుదలతో ఆడి 61 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని నమోదుచేసి జట్టుకు విజయాన్ని చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. Great win for the Supergiant tonight @benstokes38 was absolutely magnificent, great 💯 👌🏽👍🏼 @ MCA… https://t.co/WD43Hzhr6T — Steve Smith (@stevesmith49) 1 May 2017 That's as good as a t20 hundred can get! Coming in at 5 in the 2nd over under pressure. Incredible @benstokes38! #wortheverycent💰 #freak — Glenn Maxwell (@Gmaxi_32) 1 May 2017 Ben strokes ! A serious knock @benstokes38 too much talent this guy possesses! Beautiful to watch as a left hander 👌🏼 — yuvraj singh (@YUVSTRONG12) 1 May 2017 -
ధోనీపై కోల్‌కతా కన్ను!
ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఫినిష్ చేయాలంటే ధోనీ ఉండాల్సిందే అంటారు. కొండంత లక్ష్యం ఎదురుగా ఉన్నా.. చివరి రెండు మూడు ఓవర్లలోనే మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసి తన జట్టుకు విజయాన్ని అందించగల సామర్థ్యం జార్ఖండ్ డైనమైట్ సొంతం. ఈ సీజన్లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఇప్పటివరకు ధోనీ తన సిసలైన ప్రదర్శన చూపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్లో ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే, అంతకుముందు, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లన్నింటిలో ధోనీ పెర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. దాంతో జట్టు యాజమాన్యం అతడిమీద ప్రత్యక్షంగానే విమర్శలు మొదలుపెట్టింది. ఈ సీజన్లో కెప్టెన్సీ నుంచి దూరం పెట్టడమే కాక, స్టీవ్ స్మిత్ లేనప్పుడు కూడా ధోనీని కాకుండా రహానేను కెప్టెన్‌గా చేశారు. అయితే వికెట్ల వెనక శరవేగంగా కదిలే విషయంలో గానీ, మెరుపువేగంతో చివరి ఓవర్లలో పరుగుల వర్షం కురిపించడంలో గానీ ధోనీకి సాటి మరెవ్వరూ లేరన్న విషయం తెలిసిందే. ఎలాంటి సమయంలోనైనా జట్టును గెలిపించేవాడే అసలైన ఫినిషర్ అని కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించడం వెనక విషయం చాలానే ఉందంటున్నారు. వచ్చే సీజన్‌కు అంటే.. 2018లో ధోనీని తమ జట్టులోకి లాక్కోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది. ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్విన్నర్గా పేరుపొందిన ధోనీని తీసుకోవడానికి అన్నిజట్లూ పోటీ పడతాయనడంలో డౌటేమీ లేదు. అందుకే ఈసారి ధోనీ మీద కోల్‌కతా కన్నేస్తోంది. ఈ విషయాన్ని జట్టు యజమాని షారుక్ ఖాన్ కూడా పరోక్షంగా నిర్ధారించేశాడు. ''ధోనీ వేలానికి రావాలే గానీ.. నా పైజమా కూడా అమ్మేసి అయినా కొనేసుకుంటా'' అని వ్యాఖ్యానించాడు. దాంతో ఇక ఈసారి ధోనీ జెర్సీ రంగు మారడం ఖాయమనే అనిపిస్తోంది. -
కోహ్లిని డిస్టర్బ్ చేసిందెవరు?
కోల్ కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాను ‘గోల్డెన్ డక్’గా అవుటవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ‘మిస్టర్ ఫైర్’ డకౌటయ్యాడు. కౌంటర్-నీలె బౌలింగ్ లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చేతికిలోకి వచ్చిన బంతిని రెండో ప్రయత్నంలో పాండే ఒడిసిపట్టాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కోహ్లి అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. కోపంతో కాలికి కట్టుకున్న ప్యాడ్లపై బ్యాట్ తో బాదుకున్నాడు. డ్రెస్సింగ్ రూమువైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందని అంపైర్ అడగ్గా.. ప్రేక్షకుల్లో ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించారని వెల్లడించాడు. సైట్ స్క్రీన్ దగ్గర ఓ వ్యక్తి తచ్చాడుతుండాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు జోక్యం చేసుకుని సైట్ స్క్రీన్ దగ్గర అతడిని పంపించివేయడంతో కోహ్లి శాంతించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ... ‘ ఇక్కడ సైట్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉంది. దాని దగ్గర ఓ వ్యక్తి నిలబడి బౌలర్ లా విన్యాసాలు చేశాడు. దీంతో నా ఏకాగ్రత భంగం కలిగి నేను ఆటపై దృష్టి పెట్టలేకపోయాను. కానీ పెద్ద విషయం కాద’ని కోహ్లి అన్నాడు. -
గుజరాత్ లయన్స్ కు మరో షాక్
రాజ్‌కోట్: ఐపీఎల్-10లో వరుస ఓటములతో కుదేలైన గుజరాత్ లయన్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావొ ఐపీఎల్ కు దూరమయ్యాడు. గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘డ్వేన్ బ్రావొ టోర్నమెంట్ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు ఫిట్నెస్ సాధించడానికి మరికొన్ని వారాలు పడుతుంది. అతడి స్థానంలో ఎవరి తీసుకోవాలనే దానిపై మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నామ’ని రైనా తెలిపాడు. ఐపీఎల్ లో మంచి రికార్డు కలిగిన బ్రావొ దూరం కావడం గుజరాత్ లయన్స్ కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ లయన్స్ ఈరోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే ప్లాయింట్ల పట్టిక ముందుకెళుతుంది. -
పాండ్యా.. అచ్చం జడేజాలాగే!
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎప్పటికప్పుడు స్టైల్ మారుస్తుంటాడు. తాజాగా మరోసారి తన స్టైల్ మార్చి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గుజరాత్ లయన్స్ క్రీడాకారుడు, టీమిండియా సహచరుడు రవీంద్ర జడేజా ఇటీవలే తన లుక్‌ను మార్చి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో.. దానికి సమాధానం అంటూ పాండ్యా కూడా తన లుక్‌ను మార్చుకుని దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పెట్టాడు. గెడ్డం పూర్తిగా తీసేసి.. కటింగ్ కూడా పూర్తిగా మార్చి సరికొత్త స్టైల్లో కనిపించాడు. ఇంతకుముందు రవీంద్ర జడేజా కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్‌కు ముందు ఒక వీడియో పెట్టాడు. అందులో తన కొత్త 'కూల్' లుక్‌ను చూపించాడు. జడేజాను చూసి ఆర్సీబీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే అస్సలు నవ్వు ఆపుకోలేకపోయాడు. పాండ్యా కూడా దాదాపు జడేజా లాగే హెయిర్ కట్ అయితే చేయించుకున్నాడు గానీ జడేజాకు ఉన్నంత గెడ్డం గానీ, కోర మీసం గానీ పాండ్యాకు లేవు. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. శనివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. -
థంపి.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడు
కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి మీద వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాలో స్థానం సంపాదించుకుంటాడని చెప్పాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ పదో సీజన్లో బ్రావో, థంపి ఇద్దరూ గుజరాత్ లయన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. బాసిల్ థంపి చాలా టాలెంట్ ఉన్న కుర్రాడని, దాదాపు ఒక ఏడాది లోపే అతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుందని తనకు నమ్మకం ఉందని బ్రావో అన్నాడు. అతడికి మంచి టాలెంట్‌తో పాటు మంచి హృదయం, పేస్, నైపుణ్యం అన్నీ ఉన్నాయని, ఎప్పుడూ కూడా నేర్చుకోవాలని చూస్తుంటాడని చెప్పాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో వరుసపెట్టి యార్కర్లు వేసి అందరినీ థంపి బాగా ఇంప్రెస్ చేశాడు. గుజరాత్ లయన్స్ బౌలర్లందరినీ వరుసపెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఊచకోత కోస్తుంటే.. థంపి మాత్రం కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతడు వేసిన వాటిలో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆర్సీబీ తరఫున 38 బంతుల్లోనే 77 పరుగులు చేసిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో మొట్టమొదటే పెద్ద వికెట్‌ను థంపి తీసినట్లయింది. ముందుగా యార్కర్ వేసి ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. తొడ కండరాల గాయంతో బాధపడి.. ఇప్పుడే కోలుకుంటున్న బ్రావో వెంటనే థంపి వద్దకు వెళ్లి అభినందించాడు. థంపి ఎప్పుడూ సరైన ప్రశ్నలే అడుగుతుంటాడని, ఇలాంటి వాళ్లు ఉంటే భారత క్రికెట్ సరైన దిశలో వెళ్తుందని బ్రావో అన్నాడు. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, థంపి లాంటివాళ్లు బౌలింగ్ చేయడం చాలా బాగుందని, వాళ్లకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా థంపి నేర్చుకునే దశలో ఉన్నాడని, మరిన్ని గేమ్స్ ఆడి మరింత అనుభవం పొందితే బాగా రాటుతేలుతాడని తెలిపాడు. గత సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీసిన బ్రావో.. ఈసారి లేకపోవడం గుజరాత్‌ను ఇబ్బంది పెడుతోంది. -
జడ్డూ కమింగ్ బ్యాక్... జోష్‌లో గుజరాత్
ఐపీఎల్ పదో సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బోణీ కొట్టని గుజరాత్ లయన్స్.. శుక్రవారం నాడు రాజ్‌కోట్‌లోని తమ సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మీద గెలుస్తామన్న ఆశతో ఉంది. అందుకు ప్రధాన కారణం.. ఆ జట్టులోని ఏస్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పునరాగమనమే. వేలుకు సంబంధించిన సమస్య ఉండటంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని జడేజాకు బీసీసీఐ మెడికల్ టీమ్ చెప్పింది. ఆ రెండు వారాలు అయిపోవడంతో అతడు మళ్లీ లయన్స్ టీమ్ బౌలింగ్ ఎటాక్‌లో చేరబోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైన గుజరాత్ జట్టు.. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుతో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పది వికెట్ల తేడాతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఓడిన విషయం తెలిసిందే. జడేజా మళ్లీ జట్టులోకి రావడానికి పుణెతో కంటే మంచి మ్యాచ్ మరోటి ఉండబోదని అనుకుంటున్నారు. స్టీవ్ స్మిత, బెన్ స్టోక్స్ లాంటి వాళ్లకు బౌలింగ్ చేయడానికి జడేజా బాగా ఉత్సాహపడుతుంటాడు. గత సీజన్లో తమ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని, జడేజా అందుబాటులో లేకపోవడంతో ఈసారి జట్టు సమతౌల్యత బాగా దెబ్బ తిందని కోచ్ హీత్ స్టీక్ అన్నాడు. జడేజా, బ్రావో ఇద్దరూ తమకు చాలా కీలకమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లని.. జట్టు విజయంలో వాళ్ల పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. జడ్డూ వచ్చేయడం, బ్రావో కూడా వచ్చే వారంలో చేరడంతో ఇక తమ జట్టు జూలు విదిలిస్తుందని అన్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లలో జడేజా మంచి పెర్ఫామెన్స్ చూపించి టెస్టుల్లో నెంబర్ వన ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో కలిపి 25 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టులలో స్టీవ్ స్మిత్ వికెట్ జడేజాకే దక్కడం విశేషం. దాంతో ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్ క్రీడాకారులు జడేజాపై తీవ్రంగా స్లెడ్జింగ్‌కు దిగారు. -
హిస్టరీ రిపీట్ అవుతుందా?
-
మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి..
ముంబై: మాజీ ప్రేమికులు బాలీవుడ్ భామ ప్రీతి జింటా, వ్యాపారవేత్త నెస్ వాడియాలు గతంలో ఏర్పడ్డ విభేదాలను పక్కనపెట్టారు. ప్రేమ, వివాదాలను మరచిపోయి ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా కలసి పనిచేయనున్నారు. గతంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకుని కేసుల వరకు వెళ్లిన ప్రీతి, వాడియా.. తాజా ఐపీఎల్ సీజన్లో ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన సందర్భంగా ఇద్దరూ తమ జట్టు క్రికెటర్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీతి, వాడియా గతంలో దాదాపు 10 ఏళ్లు డేటింగ్ చేశారు. వ్యాపార భాగస్వాములుగా మారి 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ సహ యజమానులయ్యారు. కాగా ఆ మరుసటి ఏడాది నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఓ పార్టీలో ప్రీతిని వాడియా చెంపదెబ్బ కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇక 2014లో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. వాడియా తనను దూషించి, లైంగికంగా వేధించాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత ఇద్దరూ పూర్తిగా దూరమయ్యారు. గతేడాది ప్రీతి వ్యాపారవేత్త గుడెనఫ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రీతి, వాడియా గతాన్ని మరిచి వ్యాపార భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. -
ఏడు ఐపీఎల్ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో
ప్రస్తుత ఐపీఎల్ -10 సీజన్ లో ఆడుతున్న 8 జట్లలో ఏడు జట్లకు జియో అనుబంధ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లతో జియో ఒప్పందం చేసుకుంది. జియో నెట్ హైస్పీడ్ వై-ఫై సేవలు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు రిలయన్స్ జియో తమ హై-స్పీడ్, వై-ఫై ఇంటర్నెట్ సేవలను జియో నెట్ ద్వారా అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కోసం తమ జియో నెట్ వై-ఫై తో స్టేడియం మొత్తం కవర్ చేసింది. ఈ సేవల కోసం, ప్రేక్షలకు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-ఫై కి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది. -
ఐపీఎల్ వివాదం: సన్‌రైజర్స్‌కు ఝలక్!
హైదరాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ టోర్నమెంటు విషయంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యానికి, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ జట్టు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని హెచ్‌సీఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం ఇలాగే ప్రవర్తిస్తే.. ఈ నెల 17న ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు సహరించబోమంటూ హెచ్‌సీఏ షాకిచ్చింది. ఐపీఎల్ పదో ఎడిషన్ ఉప్పల్ స్టేడియంలో ఇటీవల ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అప్పటిలోగా టికెట్ల వివాదాన్ని పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ జెండా ఎగురవేస్తామని హెచ్‌సీఏ హెచ్చరిస్తోంది.