కూలీ కొడుకును.. నాకు ఐపీఎల్ ఛాన్సా..!
న్యూఢిల్లీ: తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే చాన్స్ వస్తుందని అసలు ఊహించలేదని తమిళనాడు ద్వితీయ శ్రేణి ఆటగాడు సంజయ్ సింగ్ యాదవ్ అంటున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి తన తండ్రి రామ్ సింగ్ యాదవ్, కుటుంబసభ్యులు బతుకుదెరువు కోసం తమిళనాడులోని హోసూరుకు వలసవచ్చారని తెలిపాడు. రోజువారి కూలీ కొడుకును అయిన తాను ఈ స్థాయికి చేరుకోవడంపై హర్షం వ్యక్తంచేశాడు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రామ్ సింగ్ కు కొడుకును క్రికెట్ అకాడమీ చేర్పించడం కూడా ఓ కలలాంటిదే. తాను తమిళనాడు టీఎన్ సీఏ లీగ్స్ లో సెకండ్ డివిజన్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించేవాడనని.. అయితే ఐపీఎల్ లో ఆడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ తనది ఎడమచేతి వాటం అని సంజయ్ తెలిపాడు.
ఐపీఎల్-10లో తాను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఆడబోతున్నందుక ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ‘ టీఎస్ సీఎల్ లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని. అందులో తన ప్రదర్శనతో తమిళనాడు ట్వంటీ20లకు ఎంపికయ్యాను. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.10 లక్షల కాంట్రాక్టుతో నన్ను జట్టులోకి తీసుకుంది. కేకేఆర్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కిటుకులు నేర్చుకుంటున్నాను. ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్ల నైపుణ్యాన్ని చాలా దగ్గర నుంచి గమనించే చాన్స్ దక్కింది. విరాట్ కోహ్లీ, అశ్విన్ లతో పాటు విదేశీ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లు తన అభిమాన క్రికెటర్లు’ అని ఆల్ రౌండర్ సంజయ్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
సంజయ్ చాలా పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన క్రికెటర్. కోచింగ్ కు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ ఇండియా క్రికెట్ అకాడమీ కోచ్ ప్రేమ్ నాథ్.. సంజయ్ కి అండగా నిలిచాడు. సంజయ్ ఆటతీరును, నైపుణ్యాన్ని గుర్తించిన ప్రేమ్ నాథ్ సంజయ్ నుంచి ఎలాంటి ఫీజు ఆశించకుండానే కోచింగ్ ఇచ్చాడు. స్పోర్ట్స్ కోటాలో లయోలా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. పూట గడవని ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఏకంగా అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. అంతా కలలా ఉందంటాడు సంజయ్. తానేంటో నిరూపించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.