ధోనీపై కోల్‌కతా కన్ను!
ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఫినిష్ చేయాలంటే ధోనీ ఉండాల్సిందే అంటారు. కొండంత లక్ష్యం ఎదురుగా ఉన్నా.. చివరి రెండు మూడు ఓవర్లలోనే మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసి తన జట్టుకు విజయాన్ని అందించగల సామర్థ్యం జార్ఖండ్ డైనమైట్ సొంతం. ఈ సీజన్‌లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఇప్పటివరకు ధోనీ తన సిసలైన ప్రదర్శన చూపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్లో ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే, అంతకుముందు, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లన్నింటిలో ధోనీ పెర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. దాంతో జట్టు యాజమాన్యం అతడిమీద ప్రత్యక్షంగానే విమర్శలు మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుంచి దూరం పెట్టడమే కాక, స్టీవ్ స్మిత్ లేనప్పుడు కూడా ధోనీని కాకుండా రహానేను కెప్టెన్‌గా చేశారు.
అయితే వికెట్ల వెనక శరవేగంగా కదిలే విషయంలో గానీ, మెరుపువేగంతో చివరి ఓవర్లలో పరుగుల వర్షం కురిపించడంలో గానీ ధోనీకి సాటి మరెవ్వరూ లేరన్న విషయం తెలిసిందే. ఎలాంటి సమయంలోనైనా జట్టును గెలిపించేవాడే అసలైన ఫినిషర్ అని కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించడం వెనక విషయం చాలానే ఉందంటున్నారు. వచ్చే సీజన్‌కు అంటే.. 2018లో ధోనీని తమ జట్టులోకి లాక్కోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది. ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్‌విన్నర్‌గా పేరుపొందిన ధోనీని తీసుకోవడానికి అన్నిజట్లూ పోటీ పడతాయనడంలో డౌటేమీ లేదు. అందుకే ఈసారి ధోనీ మీద కోల్‌కతా కన్నేస్తోంది. ఈ విషయాన్ని జట్టు యజమాని షారుక్ ఖాన్ కూడా పరోక్షంగా నిర్ధారించేశాడు. ''ధోనీ వేలానికి రావాలే గానీ.. నా పైజమా కూడా అమ్మేసి అయినా కొనేసుకుంటా'' అని వ్యాఖ్యానించాడు. దాంతో ఇక ఈసారి ధోనీ జెర్సీ రంగు మారడం ఖాయమనే అనిపిస్తోంది.