గౌతం గంభీర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో గౌతం గంభీర్ కచ్చితంగా ఉంటాడు. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని సొంతజట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ ( కేకేఆర్) తీసుకోక పోవడంపై తీవ్ర విమర్శలు, భిన‍్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు సీజన్లలో కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్స్ అందించిన క్రికెటర్‌కు అవమానం జరిగిందంటూ కొందరు కేకేఆర్ ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. అయితే దీనిపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వివరణ ఇచ్చుకున్నారు. గంభీర్‌కు సారీ చెబుతూ కేకేఆర్ టీమ్ వదులుకోవడానికి ఆ క్రికెటరే కారణమని అది ఎలాగో వివరించాడు. సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.
‘ఈ వేలంలో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ గంభీర్‌ను తీసుకోవాలని ముందుగానే కేకేఆర్ యాజమాన్యం ప్లాన్ చేసుకుంది. అతడిపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కానీ వేలానికి ముందు గంభీర్ తమకు కొన్ని విషయాలు చెప్పాడు. తన కోసం వేలంలో ఆసక్తి చూపించవద్దని, ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవద్దన్నాడు. గంభీర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. అతడు దేని కోసం ఎదురుచూస్తున్నాడో మాకు తెలియదు. దీంతో గౌతీకి ఏ విధంగా సాయం చేయలేకపోయామని, సారీ గంభీర్ అంటూ’ కేకేఆర్‌తో తమ ఏడేళ్ల అనుబంధాన్ని సీఈఓ గుర్తుచేసుకున్నాడు. కేకేఆర్ ఫ్యాన్స్ గంభీర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.2.8 కోట్లతో సొంతం చేసుకుంది. దీంతో గంభీర్ తిరిగి సొంతగూటికి చేరినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment