Sanjay Yadav
-
సీఎం స్నేహితుడికి బెదిరింపులు
గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్): జైల్లో ఉన్నా బెదిరింపులు, వసూళ్లతో జనాన్ని భయపెడుతున్న ఓ బడా గూండాను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం సీనియర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్నేహితుడైన డాక్టర్ ఎస్ఎస్ షాహి స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతుంటారు. ఈయనకు గత జూన్ 28, 29 తేదీల్లో ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. తాను రామాశ్రయ్ యాదవ్ అని డియోరియా జిల్లా జైలు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తనకు వెంటనే రూ.20 లక్షలు చెల్లించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు.. గోరఖ్‌పూర్ జిల్లా కేంద్ర కారాగారంలో సంజయ్ యాదవ్ అనే ఖైదీ చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు కారణమని భావిస్తూ జిల్లా సీనియర్ ఎస్పీ ఆర్పీ పాండేను బదిలీ చేసి, అమిత్ కుమార్ పాతక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, డాక్టర్ షాహికి పోలీసు రక్షణ కల్పించింది. -
కూలీ కొడుకును.. నాకు ఐపీఎల్ ఛాన్సా..!
న్యూఢిల్లీ: తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే చాన్స్ వస్తుందని అసలు ఊహించలేదని తమిళనాడు ద్వితీయ శ్రేణి ఆటగాడు సంజయ్ సింగ్ యాదవ్ అంటున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి తన తండ్రి రామ్ సింగ్ యాదవ్, కుటుంబసభ్యులు బతుకుదెరువు కోసం తమిళనాడులోని హోసూరుకు వలసవచ్చారని తెలిపాడు. రోజువారి కూలీ కొడుకును అయిన తాను ఈ స్థాయికి చేరుకోవడంపై హర్షం వ్యక్తంచేశాడు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రామ్ సింగ్ కు కొడుకును క్రికెట్ అకాడమీ చేర్పించడం కూడా ఓ కలలాంటిదే. తాను తమిళనాడు టీఎన్ సీఏ లీగ్స్ లో సెకండ్ డివిజన్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించేవాడనని.. అయితే ఐపీఎల్ లో ఆడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ తనది ఎడమచేతి వాటం అని సంజయ్ తెలిపాడు. ఐపీఎల్-10లో తాను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఆడబోతున్నందుక ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ‘ టీఎస్ సీఎల్ లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని. అందులో తన ప్రదర్శనతో తమిళనాడు ట్వంటీ20లకు ఎంపికయ్యాను. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.10 లక్షల కాంట్రాక్టుతో నన్ను జట్టులోకి తీసుకుంది. కేకేఆర్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కిటుకులు నేర్చుకుంటున్నాను. ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్ల నైపుణ్యాన్ని చాలా దగ్గర నుంచి గమనించే చాన్స్ దక్కింది. విరాట్ కోహ్లీ, అశ్విన్ లతో పాటు విదేశీ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లు తన అభిమాన క్రికెటర్లు’ అని ఆల్ రౌండర్ సంజయ్ యాదవ్ చెప్పుకొచ్చాడు. సంజయ్ చాలా పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన క్రికెటర్. కోచింగ్ కు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ ఇండియా క్రికెట్ అకాడమీ కోచ్ ప్రేమ్ నాథ్.. సంజయ్ కి అండగా నిలిచాడు. సంజయ్ ఆటతీరును, నైపుణ్యాన్ని గుర్తించిన ప్రేమ్ నాథ్ సంజయ్ నుంచి ఎలాంటి ఫీజు ఆశించకుండానే కోచింగ్ ఇచ్చాడు. స్పోర్ట్స్ కోటాలో లయోలా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. పూట గడవని ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఏకంగా అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. అంతా కలలా ఉందంటాడు సంజయ్. తానేంటో నిరూపించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
నోట్ల రద్దు: కన్నీళ్లు పెట్టిన విదేశీ మహిళ
పణజి: విదేశీ పర్యాటకులకూ నోట్ల కష్టాలు తప్పడం లేదు. పాత పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు ఓ మంచి మనిషి సాయం చేశాడు. పాత నోట్లు తీసుకుని ఆమెకు కొత్త నోట్లు ఇచ్చాడు. నవంబర్ 10న గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సామాను ఎక్కువగా ఉండడంతో విదేశీ వనిత రూ.1600 చెల్లించాల్సి వచ్చింది. ఆమె దగ్గర రూ. 500, రూ. వెయ్యి నోట్లు మాత్రమే ఉండడంతో అవి తీసుకునేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించారు. చిల్లర ఇవ్వాలని చాలా మందిని ఆమె అడిగినా ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. విదేశీ మహిళ బాధను చూసిన ఓ వ్యక్తి ఆమెకు కొత్త రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అయితే తర్జనభర్జన తర్వాత ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ నోటు తీసుకున్నారు. ఈ ఉదంతాన్ని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదశ్ రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. దేశ ప్రజలకే కాకుండా విదేశీయులు కూడా నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలియజెప్పడానికే ఈ ఘటనను వెలుగులోకి తెచ్చినట్టు సంజయ్ తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.