నోట్ల రద్దు: కన్నీళ్లు పెట్టిన విదేశీ మహిళ
పణజి: విదేశీ పర్యాటకులకూ నోట్ల కష్టాలు తప్పడం లేదు. పాత పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు ఓ మంచి మనిషి సాయం చేశాడు. పాత నోట్లు తీసుకుని ఆమెకు కొత్త నోట్లు ఇచ్చాడు. నవంబర్ 10న గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
సామాను ఎక్కువగా ఉండడంతో విదేశీ వనిత రూ.1600 చెల్లించాల్సి వచ్చింది. ఆమె దగ్గర రూ. 500, రూ. వెయ్యి నోట్లు మాత్రమే ఉండడంతో అవి తీసుకునేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించారు. చిల్లర ఇవ్వాలని చాలా మందిని ఆమె అడిగినా ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. విదేశీ మహిళ బాధను చూసిన ఓ వ్యక్తి ఆమెకు కొత్త రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అయితే తర్జనభర్జన తర్వాత ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ నోటు తీసుకున్నారు.
ఈ ఉదంతాన్ని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదశ్ రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. దేశ ప్రజలకే కాకుండా విదేశీయులు కూడా నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలియజెప్పడానికే ఈ ఘటనను వెలుగులోకి తెచ్చినట్టు సంజయ్ తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.