సీఎం స్నేహితుడికి బెదిరింపులు
గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్): జైల్లో ఉన్నా బెదిరింపులు, వసూళ్లతో జనాన్ని భయపెడుతున్న ఓ బడా గూండాను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం సీనియర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఉత‍్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్నేహితుడైన డాక్టర్ ఎస్‌ఎస్ షాహి స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతుంటారు. ఈయనకు గత జూన్ 28, 29 తేదీల్లో ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. తాను రామాశ్రయ్ యాదవ్ అని డియోరియా జిల్లా జైలు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.
తనకు వెంటనే రూ.20 లక్షలు చెల్లించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు.. గోరఖ్‌పూర్ జిల్లా కేంద్ర కారాగారంలో సంజయ్ యాదవ్ అనే ఖైదీ చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు కారణమని భావిస్తూ జిల్లా సీనియర్ ఎస్పీ ఆర్‌పీ పాండేను బదిలీ చేసి, అమిత్ కుమార్ పాతక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, డాక్టర్ షాహికి పోలీసు రక్షణ కల్పించింది.