extortion call
-
‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’
బంజారాహిల్స్: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ చెప్పడంతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. టోలీచౌకీ సమీపంలోని హకీంపేట్‌లో నివసించే ఎమ్మెల్యే కౌసర్ గత నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళుతున్నాడు. అదే సమయంలో 9102563387 నెంబర్ నుంచి ఆయనకు ఫోన్‌కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చిన్నకొడుకు జాఫర్‌ను కిడ్నాప్ చేస్తామంటూ హెచ్చరించి నిందితుడు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆందోళన చెందిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమకు నో చెప్పిందని టెకీపై కత్తితో దాడి) -
4 కోట్లు కావాలని అడిగింది..
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మను డబ్బుల కోసం బెదిరించిన కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేటీఎం వైస్ ప్రెసిడెంట్ సోనియా ధావన్‌తో పాటు ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే కుట్రకు తెర లేపారని పోలీసులు తెలిపారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సోనియా ఈ బెదిరింపుల డ్రామాకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. పేటీఎం కార్పొరేట్ కమ్యూనికేషన్స్/పీఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా.. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ప్రాపర్టీ డీలర్ అయిన సోనియా భర్త రూపక్ జైన్, పేటీఎం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి దేవేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ శేఖర్, ఆయన సోదరుడు అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన రోహిత్ కోమల్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సొంత కంపెనీ ఏర్పాటుకు ప్లాన్ ‘ఇల్లు కొనుక్కోవడానికి రూ. 4 కోట్లు ఇవ్వాలని రెండు నెలల క్రితం తన యజమానిని సోనియా ధావన్ కోరింది. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నించార’ని గౌతమ్‌బుద్ధ నగర్ ఎస్ఎస్పీ అజయ్‌పాల్ శర్మ తెలిపారు. ‘పేటీఎం కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న సోనియాకు సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలు తెలుసు. దేవేంద్ర కుమార్ సహాయంతో ఏడాది క్రితం కీలక సమాచారాన్ని సంపాదించింది. ఈ సమాచారంతో సొంతంగా కంపెనీ పెట్టాలని కూడా ఆమె భావించినట్టు’ సెక్టార్ 20 ఎస్హెచ్ఓ మనోజ్ పంత్ చెప్పారు. మాకేమి తెలీదు విజయ్ శేఖర్‌ను బెదిరించిన వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని సోనియా, ఆమె భర్త పేర్కొన్నారు. దేవేంద్ర మాత్రం తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడు. ‘కంపెనీకి సంబంధించిన డేటాను వారికి కాపీ చేసి ఇచ్చాను. అది ఎటువంటి సమాచారమే నాకు తెలియదు. నన్ను ఈ వివాదంలో ఇరికించిన వారిలో ఆమె(సోనియా) ఒకరు’ అని కోర్టు ప్రాంగణంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో దేవెంద్ర చెప్పాడు. ముగ్గురు నిందితులకు గౌతమ్‌బుద్ధ నగర్‌లోని జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పదిశాతం ఇస్తామని చెప్పి... కోల్‌కతాకు చెందిన నాలుగో నిందితుడు రోహిత్.. దేవేంద్ర స్నేహితుడని పోలీసులు తెలిపారు. విజయ్ శేఖర్‌ను ఫోన్లో బెదిరించి రూ. 10 కోట్లు వసూలు చేస్తే అందులో 10 శాతం వాటా ఇస్తామని ఆశ చూపినట్టు వెల్లడించారు. అతడికి ఫోన్ నంబర్లు కూడా దేవేంద్ర సమకూర్చాడని, రోహిత్‌ను కలుసుకునేందుకు గత నెలలో పలుమార్లు కోల్‌కతాకు వెళ్లినట్టు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏముంది? విజయ్ శేఖర్ సోదరుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 11.52 నిమిషాలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే పేటీఎం సంబంధించిన రహస్య సమాచారం బయట పెడతామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘అజయ్‌కు సెప్టెంబర్ 20న రోహిత్ ఫోన్ చేశాడు. తర్వాత విజయ్‌కు వాట్సప్ కాల్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడ’ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే సోనియాను కుట్రపూరితంగా ఇరికించారని ఆమె తరపు న్యాయవాది ప్రశాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. -
సీఎం స్నేహితుడికి బెదిరింపులు
గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్): జైల్లో ఉన్నా బెదిరింపులు, వసూళ్లతో జనాన్ని భయపెడుతున్న ఓ బడా గూండాను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం సీనియర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్నేహితుడైన డాక్టర్ ఎస్ఎస్ షాహి స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతుంటారు. ఈయనకు గత జూన్ 28, 29 తేదీల్లో ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. తాను రామాశ్రయ్ యాదవ్ అని డియోరియా జిల్లా జైలు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తనకు వెంటనే రూ.20 లక్షలు చెల్లించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు.. గోరఖ్‌పూర్ జిల్లా కేంద్ర కారాగారంలో సంజయ్ యాదవ్ అనే ఖైదీ చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు కారణమని భావిస్తూ జిల్లా సీనియర్ ఎస్పీ ఆర్పీ పాండేను బదిలీ చేసి, అమిత్ కుమార్ పాతక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, డాక్టర్ షాహికి పోలీసు రక్షణ కల్పించింది. -
హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు
ముంబై: ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సందీప్ సాహు.. లక్నోకు చెందిన నిరుద్యోగిగా గుర్తించారు. సందీప్ అండర్ వరల్డ్ డాన్ బాబ్లూ శ్రీవాస్తవ పేరుతో ఫోన్ చేసి మహేశ్ భట్ కుటుంబాన్ని బెదిరించాడు. తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మహేశ్ భట్ కూతురు, హీరోయిన్ ఆలియా భట్, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ ఫోన్ లో బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహాయంతో 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బంధువుల నుంచి తీసుకున్న రూ. 6 లక్షల అప్పుతీర్చేందుకు అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారంలో నష్టం రావడంతో గతేడాది ముంబైకి వచ్చిన సందీప్ సినిమాల్లో నటించాలని ప్రయత్నించాడు. అవకాశాలు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు వెల్లడించారు. -
హీరోయిన్ను చంపేస్తామంటూ బెదిరింపులు
బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. మర్యాదగా 50 లక్షల రూపాయలు ఇచ్చారో సరే.. లేకపోతే మీ కూతురు ఆలియా భట్‌ను, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మహేష్ భట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి, భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీసు శాఖలోని యాంటీ ఎక్స్టార్షన్ సెల్ (ఏఎన్సీ)కి బదిలీ చేశారు. తాను ఒక గ్యాంగ్ లీడర్ని అని చెప్పుకొని అతడు బెదిరించినట్లు చెబుతున్నారు. మొదట అదేదో ఉత్తుత్తి బెదిరింపు అని మహేష్ భట్ వదిలేశారు. అయితే, వరుసపెట్టి వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా సందేశాలు పంపుతూ, తన బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించాడు. తాను ఆలియా, సోనీలను చంపేస్తానని, వాళ్ల శరీరాల్లోకి పలు రౌండ్ల బుల్లెట్లు కాలుస్తానని అన్నాడు. మరికొన్ని మెసేజిలు కూడా పంపి, ఆ తర్వాత ఆపేశాడు. లక్నోకు చెందిన ఒక బ్యాంకు శాఖలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించాడు. తన భార్య, కుమార్తెల ప్రాణాలకు ముప్పు ఉండటంతో మహేష్ భట్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగానే పరిగణించి, భట్ కుటుంబం నివసించే ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇంతకుముందు కూడా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం భట్ కుటుంబాన్ని చంపేయడానికి కుట్ర పన్నగా, వారిని 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. -
అమూల్ ఎండీకి మాఫియా డాన్ బెదిరింపు!
అహ్మదాబాద్: అమూల్ పాలు ఈ పేరు వినే ఉంటారు కదా..! ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీకి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి పూజారి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి 25 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోధీ ఫిర్యాదు మేరకు కేసును అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కు అప్పగించినట్లు ఆనంద్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు. తాను ఫెడరేషన్ మీటింగ్ లో ఉన్నప్పుడు తొలిసారి ఫోన్ కాల్ వచ్చినట్లు సోధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలర్ తనను తాను రవి పూజారిగా చెప్పి తాను ఆస్ట్రేలియాలో ఉంటానని పరిచయం చేసుకున్నారని తెలిపారు. తొలుత ఏదో వ్యాపారం పనిమీద ఫోన్ చేసి ఉంటారని భావించానని, అతడి నెంబరును మరో అధికారి మొబైల్ యాప్‌లో చెక్ చేయగా, అతను గ్యాంగ్ స్టర్ అని తెలిసినట్లు చెప్పారు. తనకు రూ. 25 కోట్లు ఇవ్వకపోతే కాల్చిపారేస్తామని బెదిరించినట్లు వివరించారు. ఈ సంస్థపై ఆధాపడి 36 లక్షల పేద కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నించానని కానీ, పూజారి అవన్నీ తనకేం పట్టవనీ డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు తెలిపారు. మే మొదటివారంలో సోధీకి పూజారి మరో మూడు మార్లు ఫోన్ చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే ఎన్ పటేల్ తెలిపారు. ఫోన్లన్నీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) తో చేయడం వల్ల వ్యక్తి నంబర్‌ను కచ్చితంగా పట్టుకోలేమని వివరించారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మాత్రం ఫోన్లు వచ్చినట్లు గుర్తించమన్నారు. గత ఏడాది నవంబర్, జనవరిలో పూజరి బెదిరించిన వ్యక్తుల కేసులను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.