కోర్టు నుంచి వెలుపలికి వస్తున్న సోనియా, రూపక్ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మను డబ్బుల కోసం బెదిరించిన కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేటీఎం వైస్ ప్రెసిడెంట్ సోనియా ధావన్‌తో పాటు ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే కుట్రకు తెర లేపారని పోలీసులు తెలిపారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సోనియా ఈ బెదిరింపుల డ్రామాకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. పేటీఎం కార్పొరేట్ కమ్యూనికేషన్స్/పీఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా.. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ప్రాపర్టీ డీలర్ అయిన సోనియా భర్త రూపక్ జైన్, పేటీఎం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి దేవేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ శేఖర్, ఆయన సోదరుడు అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన రోహిత్ కోమల్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
సొంత కంపెనీ ఏర్పాటుకు ప్లాన్
‘ఇల్లు కొనుక్కోవడానికి రూ. 4 కోట్లు ఇవ్వాలని రెండు నెలల క్రితం తన యజమానిని సోనియా ధావన్ కోరింది. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నించార’ని గౌతమ్‌బుద్ధ నగర్ ఎస్‌ఎస్‌పీ అజయ్‌పాల్ శర్మ తెలిపారు. ‘పేటీఎం కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న సోనియాకు సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలు తెలుసు. దేవేంద్ర కుమార్ సహాయంతో ఏడాది క్రితం కీలక సమాచారాన్ని సంపాదించింది. ఈ సమాచారంతో సొంతంగా కంపెనీ పెట్టాలని కూడా ఆమె భావించినట్టు’ సెక్టార్ 20 ఎస్‌హెచ్‌ఓ మనోజ్ పంత్ చెప్పారు.
మాకేమి తెలీదు
విజయ్ శేఖర్‌ను బెదిరించిన వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని సోనియా, ఆమె భర్త పేర్కొన్నారు. దేవేంద్ర మాత్రం తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడు. ‘కంపెనీకి సంబంధించిన డేటాను వారికి కాపీ చేసి ఇచ్చాను. అది ఎటువంటి సమాచారమే నాకు తెలియదు. నన్ను ఈ వివాదంలో ఇరికించిన వారిలో ఆమె(సోనియా) ఒకరు’ అని కోర్టు ప్రాంగణంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో దేవెంద్ర చెప్పాడు. ముగ్గురు నిందితులకు గౌతమ్‌బుద్ధ నగర్‌లోని జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
పదిశాతం ఇస్తామని చెప్పి...
కోల్‌కతాకు చెందిన నాలుగో నిందితుడు రోహిత్.. దేవేంద్ర స్నేహితుడని పోలీసులు తెలిపారు. విజయ్ శేఖర్‌ను ఫోన్‌లో బెదిరించి రూ. 10 కోట్లు వసూలు చేస్తే అందులో 10 శాతం వాటా ఇస్తామని ఆశ చూపినట్టు వెల్లడించారు. అతడికి ఫోన్ నంబర్లు కూడా దేవేంద్ర సమకూర్చాడని, రోహిత్‌ను కలుసుకునేందుకు గత నెలలో పలుమార్లు కోల్‌కతాకు వెళ్లినట్టు చెప్పారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
విజయ్ శేఖర్ సోదరుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 11.52 నిమిషాలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే పేటీఎం సంబంధించిన రహస్య సమాచారం బయట పెడతామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘అజయ్‌కు సెప్టెంబర్ 20న రోహిత్ ఫోన్ చేశాడు. తర్వాత విజయ్‌కు వాట్సప్ కాల్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడ’ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే సోనియాను కుట్రపూరితంగా ఇరికించారని ఆమె తరపు న్యాయవాది ప్రశాంత్ త్రిపాఠి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment