Devendra Kumar
-
కృష్ణా: కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్ మ్యారేజ్
సాక్షి, కృష్ణా: కాబోయే కలెక్టర్.. కాబోయే ఎస్పీల వివాహం నిరాడంబరంగా జరిగింది. అదీ రిజిస్టర్ మ్యారేజ్‌గా సింపుల్‌గా దండలు మార్చుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని ఛాంబర్ వీళ్ల వివాహానికి వేదిక అయ్యింది. వీళ్లిద్దరిదీ రాజస్థాన్ కావడం గమనార్హం. ఈ కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వివాహం తర్వాత కొత్త జంట గుడ్లవల్లేరు వేమవరంలోని శ్రీకొండాలమ్మ ఆలయాన్ని దర్శించారు. ఇదిలా ఉండగా.. దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. -
4 కోట్లు కావాలని అడిగింది..
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మను డబ్బుల కోసం బెదిరించిన కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేటీఎం వైస్ ప్రెసిడెంట్ సోనియా ధావన్‌తో పాటు ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే కుట్రకు తెర లేపారని పోలీసులు తెలిపారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సోనియా ఈ బెదిరింపుల డ్రామాకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. పేటీఎం కార్పొరేట్ కమ్యూనికేషన్స్/పీఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా.. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ప్రాపర్టీ డీలర్ అయిన సోనియా భర్త రూపక్ జైన్, పేటీఎం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి దేవేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ శేఖర్, ఆయన సోదరుడు అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన రోహిత్ కోమల్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సొంత కంపెనీ ఏర్పాటుకు ప్లాన్ ‘ఇల్లు కొనుక్కోవడానికి రూ. 4 కోట్లు ఇవ్వాలని రెండు నెలల క్రితం తన యజమానిని సోనియా ధావన్ కోరింది. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నించార’ని గౌతమ్‌బుద్ధ నగర్ ఎస్ఎస్పీ అజయ్‌పాల్ శర్మ తెలిపారు. ‘పేటీఎం కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న సోనియాకు సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలు తెలుసు. దేవేంద్ర కుమార్ సహాయంతో ఏడాది క్రితం కీలక సమాచారాన్ని సంపాదించింది. ఈ సమాచారంతో సొంతంగా కంపెనీ పెట్టాలని కూడా ఆమె భావించినట్టు’ సెక్టార్ 20 ఎస్హెచ్ఓ మనోజ్ పంత్ చెప్పారు. మాకేమి తెలీదు విజయ్ శేఖర్‌ను బెదిరించిన వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని సోనియా, ఆమె భర్త పేర్కొన్నారు. దేవేంద్ర మాత్రం తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడు. ‘కంపెనీకి సంబంధించిన డేటాను వారికి కాపీ చేసి ఇచ్చాను. అది ఎటువంటి సమాచారమే నాకు తెలియదు. నన్ను ఈ వివాదంలో ఇరికించిన వారిలో ఆమె(సోనియా) ఒకరు’ అని కోర్టు ప్రాంగణంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో దేవెంద్ర చెప్పాడు. ముగ్గురు నిందితులకు గౌతమ్‌బుద్ధ నగర్‌లోని జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పదిశాతం ఇస్తామని చెప్పి... కోల్‌కతాకు చెందిన నాలుగో నిందితుడు రోహిత్.. దేవేంద్ర స్నేహితుడని పోలీసులు తెలిపారు. విజయ్ శేఖర్‌ను ఫోన్లో బెదిరించి రూ. 10 కోట్లు వసూలు చేస్తే అందులో 10 శాతం వాటా ఇస్తామని ఆశ చూపినట్టు వెల్లడించారు. అతడికి ఫోన్ నంబర్లు కూడా దేవేంద్ర సమకూర్చాడని, రోహిత్‌ను కలుసుకునేందుకు గత నెలలో పలుమార్లు కోల్‌కతాకు వెళ్లినట్టు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏముంది? విజయ్ శేఖర్ సోదరుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 11.52 నిమిషాలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే పేటీఎం సంబంధించిన రహస్య సమాచారం బయట పెడతామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘అజయ్‌కు సెప్టెంబర్ 20న రోహిత్ ఫోన్ చేశాడు. తర్వాత విజయ్‌కు వాట్సప్ కాల్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడ’ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే సోనియాను కుట్రపూరితంగా ఇరికించారని ఆమె తరపు న్యాయవాది ప్రశాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. -
కోర్టుకు చేరిన సీబీఐ పోరు
న్యూఢిల్లీ/ముంబై: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గ పోరు మంగళవారం కోర్టుకు చేరింది. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా, అరెస్టవ్వడంతోపాటు సస్పెండైన డీఎస్పీ దేవేంద్ర కుమార్‌లు ఢిల్లీ హైకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కోర్టు దేవేంద్రను 7 రోజుల కస్టడీకి అప్పంచింది. అస్థానాపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ కొసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి అక్కర్లేదని తెలిపింది. అస్థానాకు సీబీఐలో ఉన్న అధికారాలను ఆ సంస్థ మంగళవారం తొలగించింది. కేంద్ర ప్రభుత్వమే సీబీఐని నాశనం చేస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపించాయి. అస్థానా, దేవేంద్రల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వజీరీ మంగళవారం విచారించి, అస్థానాపై మాత్రమే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పారు. అలాగే అస్థానా, దేవేంద్రల పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ, సిబ్బంది, శిక్షణ విభాగాలను జస్టిస్ నజ్మీ ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులతోపాటు తమ మొబైల్ రికార్డులను కూడా భద్రంగా ఉంచుకోవాలని అస్థానా, దేవేంద్రలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం తెలిసిందే. ఆయనో చెదపురుగు: సీబీఐ సీబీఐ తరఫు న్యాయవాది రాఘవాచార్యులు తన వాదన వినిపిస్తూ అస్థానాను చెదపురుగుతో పోల్చడంతో కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దనీ, కోర్టులో అలాంటి వాటికి చోటులేదని మందలించింది. అస్థానాపై ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సీబీఐ మంగళవారం మరిన్ని ఆరోపణలు చేర్చింది. అస్థానా తరఫు న్యాయవాది వాదిస్తూ ఒక నిందితుడి వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. అస్థానాపై బలవంతంగా చర్యలను తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని ఆయన కోర్టును కోరారు. అటు సీబీఐ ప్రత్యేక కోర్టులో దేవేంద్రను అధికారులు మంగళవారం ప్రవేశపెట్టి, ఆయనపై నేరారోపణలు చేయదగిన ఆధారాలు దొరికినందున ఆయనను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలనీ కోరారు. విచారణను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడిన బృందంలో దేవేంద్ర ఒకరని ఆరోపించారు. దేవేంద్రపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కొత్తగా మరిన్ని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చేందుకు కూడా వారు జడ్జి అనుమతి కోరగా, వారంపాటు కస్టడీలో విచారించేందుకు సీబీఐ న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ అనుతించారు. దేవేంద్ర బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు. సొంత అవినీతిని కప్పిపుచ్చేందుకే: అస్థానా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన సొంత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తనను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని అస్థానా ఆరోపించారు. కొన్ని అక్రమ లక్ష్యాలను సాధించేందుకు సీబీఐలోని ఓ వర్గం అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తూ, సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తూ తనను బలిపశువును చేసిందని దేవేంద్ర పేర్కొన్నారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ హైకోర్టులో విడివిడిగా వేసిన పిటిషన్లలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై సతీశ్‌ను తమ బృందం అరెస్టు చేయా ల్సి ఉందనీ, అందుకు తాము సిద్ధమవుతున్న తరుణంలో మరో వర్గం అదే సతీశ్‌తో తప్పు డు వాంగ్మూలం ఇప్పించి తామే లంచం అడిగినట్లు ఆరోపణలు చేయించి కేసులు పెట్టారని వారిరువురు పేర్కొన్నారు. అలోక్ వర్మ, ఇతర అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తున్నారన్నారు. సీబీఐ నాశనానికి మోదీయే కారణం: కాంగ్రెస్ దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ విచ్ఛిన్నం, నాశనం కావడానికి, అప్రతిష్టను మూటగట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ కార్యకలాపాల్లో ఆయన ప్రత్యక్షంగానే జోక్యం చేసుకున్నారంది. సీబీఐ, రా చీఫ్‌లను మోదీ సోమవారం తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడి విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేసి ఉంటే సీబీఐ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉండేవి కావని విమర్శించారు. సీబీఐలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మౌనంగానే ఉన్నారనీ, అవినీతిపరులపై ఆయన చర్యలు తీసుకోవాలని పవార్ కోరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేస్తూ సీబీఐ వంటి ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్గీ ఘోర, పాపాత్మక విధానాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గత నాలుగేళ్లలో వ్యవస్థల్లోకి అనేక మంది నకిలీ అధికారులు ప్రవేశించారని దుయ్యబట్టారు. -
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్‌తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. -
అటకెక్కిన 7.63 లక్షల కోట్ల ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దరిద్రంగా ఉంది. ఈ కారణంగా గతేడాదిలో అంటే 2017, ఏప్రిల్ నెల నుంచి 2018 మార్చి వరకు 12 నెలల కాలంలో 7.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను కంపెనీలు మూలన పడేశాయి. గత మూడు నెలల కాలంలోనే ఆ ప్రాజెక్టుల్లో 40 శాతం అంటే, 3.3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు మూలనపడ్డాయి. ఇంతగా ప్రాజెక్టులు మూలన పడడం దేశ చరిత్రలతోనే ఇది మొదటి సారి. ఈ వివరాలను ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం వరకు పాలనాపరమైన అనుమతులు రావడంలో జాప్యం జరిగి ప్రాజెక్టులు మూలన పడితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దిగజారి డిమాండ్ పడిపోవడంతో కొత్త ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం లేదని ఇండియా రేటింగ్ అండ్ రీసర్చ్కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న కంపెనీల్లో కూడా ఎక్కువ కంపెనీలు 71.8 శాతానికి మించిన సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఈ విషయం ఆర్బీఐ 2017, జూలై–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన త్రైమాసిక అధ్యయనంలో వెల్లడైంది. విద్యుత్, ఉక్కు రంగాల్లో డిమాండ్‌కన్నా ఉత్పత్తి ఎక్కువగా ఉండడంలో ఆ రంగాలు కూడా ఆశించిన పురోగతిని సాధించలేకపోతున్నాయని, కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయని మరో ఆర్థిక విశ్లేషకుడు తెలిపారు. విద్యుత్ రంగంలో మిగులు సరఫరా వల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అలాగే ఖర్చు పెరగడం, డిమాండ్ పడిపోవడంతో ఉక్కు రంగం కూడా మందగమనంతో నడుస్తోందని, రానున్న నెలల్లో ఈ రెండు రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ఊపిరి పోసుకునే అవకాశాలు లేవని పేరు బహిర్గతం వెల్లడించడానికి ఇష్టపడని నిపుణుడు తెలిపారు. భారతీయ కంపెనీల ఆర్థికాభివద్ధి గతేడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 16.4 శాతం ఉండగా, అది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 13.9 శాతానికి పడిపోయిందని సీఎంఐఈ డేటా తెలియజేస్తోంది. కార్పొరేట్ అప్పులు కూడా గతేడాది మార్చి నెల నాటికి ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. -
అన్నను చంపేసి...ఇంట్లోనే పూడ్చేశాడు
కర్నూలు : జోళదరాశి గ్రామంలో ఓ వ్యక్తి తమ్ముడి చేతిలో హతమైన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరెడ్డి సమాచారం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎద్దుల ఇసాక్, యోహాన్, కంబగిరి రాముడు అన్నదమ్ములు. యోహాన్‌కు భారతి, రాజు(22), వసంత సంతానం. కంబగిరిరాముడుకు దేవేంద్రకుమార్, శ్రావణ్‌కుమార్ సంతానం. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే యోహాన్, ఆయన భార్య దానమ్మ మృతి చెందటంతో కంబగిరిరాముడు తన పిల్లలతోపాటు అన్న పిల్లల పోషణ బాధ్యతను తీసుకున్నాడు. ఆరవ తరగతి వరకు చదువుకున్న రాజు, శ్రావణ్‌కుమార్ పేదరికం నేపథ్యంలో చదువుకు స్వస్తి చెప్పి గౌండా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజు పాణ్యం మండలం కౌలూరులో ఉంటున్న అక్క, బావల వద్దకు వెళ్లి అక్కడే పనిచేసుకునేవాడు. ఏడాది క్రితం కంబగిరి రాముడు అక్కడికి వెళ్లి రాజును ఇంటికి పిలుచుకొచ్చాడు. అప్పటి నుంచి రాజు స్వగ్రామంలోనే ఉంటూ గౌండా పనికి వెళుతున్నాడు. మద్యానికి బానిసైన శ్రావణ్‌కుమార్ అన్నతో తరుచూ గొడవ పడేవాడు. ఇటీవల రాజు కొత్త బైక్ కొన్నాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి బైక్ విషయంలో అన్నతో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో పక్కన ఉన్న కట్టెతో అన్న తలపై బలంగా కొట్టడంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లో పూడ్చి పరారీ రాజు మృతి విషయం బయటకు పొక్కకుండా శ్రావణ్‌కుమార్ ఇంట్లోనే బండ పరుపు తొలగించి గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చి ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం అన్నను చంపిన విషయాన్ని నంద్యాలలో ఉంటున్న తల్లి ఇంద్రావతికి నిందితుడు ఫోన్ ద్వారా తెలియజేశాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే విషయాన్ని శివవరంలో ఉన్న బంధువులకు తెలిపింది. వారు జోళదరాశిలోని హతుడి బంధువులకు సమాచారం చేరవేయడంతో తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఇసుక కుప్ప కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు హత్య జరిగిన విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితుడు నేరుగా కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. -
సీఎం జిల్లాలో ‘రక్షణ’ కరువు
=రెండు వారాల క్రితం ఇద్దరు పోలీసుల హతం =ఇప్పటికీ పట్టుబడని హంతకులు =నాలుగు రోజుల క్రితం ఇద్దరు అటవీశాఖాధికారుల హత్య =మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి జిల్లాలో రక్షణాధికారులకే రక్షణ లేకుండాపోయింది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వారి ప్రాణాలే గాలిలో కలసిపోతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో అడుగడుగునా రాజకీయ జోక్యం పెరిగిపోయి పాలనా వ్యవ స్థ నిర్వీర్యం కావడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క హంతకులు, మరోపక్క స్మగ్లర్లు రెచ్చిపోయి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నా ఇటు నుంచి సరైన స్పందన కానరావడం లేదు. ఒకప్పుడు ప్రశాంతమైన జిల్లాగా పేరొందిన చిత్తూరు పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ నెల ఒకటవ తేదీ రాత్రి పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్, హోంగార్డు దారుణ హ త్యకు గురయ్యారు. యువతిని తీసుకుని కొందరు ఆటో లో అనుమానాస్పదంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు వెంబడించిన కానిస్టేబుల్ జవ హర్లాల్ నాయక్, హోంగార్డు దేవేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి, రాళ్లతో కొట్టి చంపేశారు. చంపిందెవరు? ఎందుకు ? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ దర్యాప్తు అధికారుల వద్ద సమాచారం లేదు. పోలీసులే చిత్తూరు జిల్లాలో హత్యకు గురయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని దుండగుల చేతిలో హతం కావడం పోలీసు ప్రతిష్టకే సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి వారం రోజుల్లో నిందితులను పట్టుకుం టామంటూ చేసిన ప్రకటనలు నేటికీ ఆచరణరూరం దాల్చలేదు. రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి ఒక కానిస్టేబుల్, హోంగార్డు ఎందుకు వెళ్లారు? ఏ అధికారి వీరిని పంపించారు? రాత్రంతా వీరి జాడ తెలియకపోతే ఎం దుకు సంబంధిత ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు స్పందించలేదన్న ప్రశ్నలకు జవాబులే లేవు. ఇక ఇటీవల తిరుమల శేషాచల అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకొనేందుకు వెళ్లిన అటవీశాఖాధికారులు శ్రీధర్, డేవిడ్‌లు చిత్రహింసలకు గురై మరణించారు. అటవీశాఖాధికారులను చూడగానే పారిపోయే స్మగ్లర్లు ఎదురుదాడికి ఎందుకు దిగారు? ఏకంగా హత్యలకే ఎందుకు తెగబడ్డారు? అంటే స్మగ్లర్లకు అధికార పార్టీ నేతల నుంచి అందుతున్న అండదండలే కారణమని సాటి అటవీశాఖ అధికారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కురిపిస్తున్న కోట్ల రూపాయలకు కక్కుర్తిపడ్డ కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి అనుయాయులు స్మగ్లర్లకు అండగా ఉన్న కారణంగానే అధికారులపై దాడులు జరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటవీశాఖాధికారుల హత్యల తరువాత ఆ శాఖాధికారు లు, పోలీసులు స్మగ్లర్ల అంతుచూసేందుకు రంగంలోకి దిగి కొందరిని అరెస్టు చేశారు. అయితే, కొందరు పాలకపక్ష పెద్దలు ఈ హత్యల పట్ల ఏమాత్రం విచారం వ్యక్తం చేయకపోగా, అరెస్టయిన స్మగ్లర్లకు బెయిల్ ఇప్పించేందు కు డబ్బు సమకూర్చారనే కథనాలు వినిపిస్తున్నాయి. ము ఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గమే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాగా మారింద ని, ఆయన తరపున జిల్లాలో పనులు చక్కబెడుతున్న ఆయన సోదరుడే స్మగ్లింగ్‌కు సూత్రధారి అని కాంగ్రెసేతర పక్షాలన్నీ ఆరోపిస్తున్నా నిష్పక్షపాతంగా విచారణ జరిపే వాతావరణమే కనిపించడం లేదు. పీలేరు నుంచి ఎర్రచందనం చెట్లను నరికేందుకు వందల సంఖ్యలో వెళ్లిన కూలీ లను పిలిచి విచారించే సాహసమే అధికారులు చేయడం లేదు. ప్రభుత్వ ఈ నిర్లిప్త వైఖరే దుండగులు, స్మగ్లర్లకు అండగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.