సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దరిద్రంగా ఉంది. ఈ కారణంగా గతేడాదిలో అంటే 2017, ఏప్రిల్ నెల నుంచి 2018 మార్చి వరకు 12 నెలల కాలంలో 7.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను కంపెనీలు మూలన పడేశాయి. గత మూడు నెలల కాలంలోనే ఆ ప్రాజెక్టుల్లో 40 శాతం అంటే, 3.3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు మూలనపడ్డాయి. ఇంతగా ప్రాజెక్టులు మూలన పడడం దేశ చరిత్రలతోనే ఇది మొదటి సారి. ఈ వివరాలను ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ వెల్లడించింది.
కొన్నేళ్ల క్రితం వరకు పాలనాపరమైన అనుమతులు రావడంలో జాప్యం జరిగి ప్రాజెక్టులు మూలన పడితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దిగజారి డిమాండ్ పడిపోవడంతో కొత్త ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడం లేదని ఇండియా రేటింగ్ అండ్ రీసర్చ్‌కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న కంపెనీల్లో కూడా ఎక్కువ కంపెనీలు 71.8 శాతానికి మించిన సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఈ విషయం ఆర్బీఐ 2017, జూలై–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన త్రైమాసిక అధ్యయనంలో వెల్లడైంది.
విద్యుత్, ఉక్కు రంగాల్లో డిమాండ్‌కన్నా ఉత్పత్తి ఎక్కువగా ఉండడంలో ఆ రంగాలు కూడా ఆశించిన పురోగతిని సాధించలేకపోతున్నాయని, కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయని మరో ఆర్థిక విశ్లేషకుడు తెలిపారు. విద్యుత్ రంగంలో మిగులు సరఫరా వల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అలాగే ఖర్చు పెరగడం, డిమాండ్ పడిపోవడంతో ఉక్కు రంగం కూడా మందగమనంతో నడుస్తోందని, రానున్న నెలల్లో ఈ రెండు రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ఊపిరి పోసుకునే అవకాశాలు లేవని పేరు బహిర్గతం వెల్లడించడానికి ఇష్టపడని నిపుణుడు తెలిపారు.
భారతీయ కంపెనీల ఆర్థికాభివద్ధి గతేడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 16.4 శాతం ఉండగా, అది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 13.9 శాతానికి పడిపోయిందని సీఎంఐఈ డేటా తెలియజేస్తోంది. కార్పొరేట్ అప్పులు కూడా గతేడాది మార్చి నెల నాటికి ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment