సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అస్థానా (ఫైల్) , దేవేంద్రను కోర్టుకు తెస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ/ముంబై: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గ పోరు మంగళవారం కోర్టుకు చేరింది. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా, అరెస్టవ్వడంతోపాటు సస్పెండైన డీఎస్పీ దేవేంద్ర కుమార్‌లు ఢిల్లీ హైకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కోర్టు దేవేంద్రను 7 రోజుల కస్టడీకి అప్పంచింది. అస్థానాపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ కొసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి అక్కర్లేదని తెలిపింది. అస్థానాకు సీబీఐలో ఉన్న అధికారాలను ఆ సంస్థ మంగళవారం తొలగించింది. కేంద్ర ప్రభుత్వమే సీబీఐని నాశనం చేస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపించాయి. అస్థానా, దేవేంద్రల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వజీరీ మంగళవారం విచారించి, అస్థానాపై మాత్రమే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పారు. అలాగే అస్థానా, దేవేంద్రల పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ, సిబ్బంది, శిక్షణ విభాగాలను జస్టిస్ నజ్మీ ఆదేశించారు.
ఈ కేసుకు సంబంధించిన రికార్డులతోపాటు తమ మొబైల్ రికార్డులను కూడా భద్రంగా ఉంచుకోవాలని అస్థానా, దేవేంద్రలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం తెలిసిందే.
ఆయనో చెదపురుగు: సీబీఐ
సీబీఐ తరఫు న్యాయవాది రాఘవాచార్యులు తన వాదన వినిపిస్తూ అస్థానాను చెదపురుగుతో పోల్చడంతో కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దనీ, కోర్టులో అలాంటి వాటికి చోటులేదని మందలించింది. అస్థానాపై ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ మంగళవారం మరిన్ని ఆరోపణలు చేర్చింది. అస్థానా తరఫు న్యాయవాది వాదిస్తూ ఒక నిందితుడి వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా అస్థానాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు.
అస్థానాపై బలవంతంగా చర్యలను తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని ఆయన కోర్టును కోరారు. అటు సీబీఐ ప్రత్యేక కోర్టులో దేవేంద్రను అధికారులు మంగళవారం ప్రవేశపెట్టి, ఆయనపై నేరారోపణలు చేయదగిన ఆధారాలు దొరికినందున ఆయనను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలనీ కోరారు. విచారణను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడిన బృందంలో దేవేంద్ర ఒకరని ఆరోపించారు. దేవేంద్రపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కొత్తగా మరిన్ని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చేందుకు కూడా వారు జడ్జి అనుమతి కోరగా, వారంపాటు కస్టడీలో విచారించేందుకు సీబీఐ న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ అనుతించారు. దేవేంద్ర బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు.
సొంత అవినీతిని కప్పిపుచ్చేందుకే: అస్థానా
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన సొంత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తనను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని అస్థానా ఆరోపించారు. కొన్ని అక్రమ లక్ష్యాలను సాధించేందుకు సీబీఐలోని ఓ వర్గం అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తూ, సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తూ తనను బలిపశువును చేసిందని దేవేంద్ర పేర్కొన్నారు.
తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ హైకోర్టులో విడివిడిగా వేసిన పిటిషన్లలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై సతీశ్‌ను తమ బృందం అరెస్టు చేయా ల్సి ఉందనీ, అందుకు తాము సిద్ధమవుతున్న తరుణంలో మరో వర్గం అదే సతీశ్‌తో తప్పు డు వాంగ్మూలం ఇప్పించి తామే లంచం అడిగినట్లు ఆరోపణలు చేయించి కేసులు పెట్టారని వారిరువురు పేర్కొన్నారు. అలోక్ వర్మ, ఇతర అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తున్నారన్నారు.
సీబీఐ నాశనానికి మోదీయే కారణం: కాంగ్రెస్
దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ విచ్ఛిన్నం, నాశనం కావడానికి, అప్రతిష్టను మూటగట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ కార్యకలాపాల్లో ఆయన ప్రత్యక్షంగానే జోక్యం చేసుకున్నారంది. సీబీఐ, రా చీఫ్‌లను మోదీ సోమవారం తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడి విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.
ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేసి ఉంటే సీబీఐ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉండేవి కావని విమర్శించారు. సీబీఐలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మౌనంగానే ఉన్నారనీ, అవినీతిపరులపై ఆయన చర్యలు తీసుకోవాలని పవార్ కోరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేస్తూ సీబీఐ వంటి ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్గీ ఘోర, పాపాత్మక విధానాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గత నాలుగేళ్లలో వ్యవస్థల్లోకి అనేక మంది నకిలీ అధికారులు ప్రవేశించారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment