gorakhpur jail
-
ఆ జైలులో ఖైదీలకు హెచ్ఐవీ..!
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు. వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
సీఎం స్నేహితుడికి బెదిరింపులు
గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్): జైల్లో ఉన్నా బెదిరింపులు, వసూళ్లతో జనాన్ని భయపెడుతున్న ఓ బడా గూండాను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం సీనియర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్నేహితుడైన డాక్టర్ ఎస్ఎస్ షాహి స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతుంటారు. ఈయనకు గత జూన్ 28, 29 తేదీల్లో ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. తాను రామాశ్రయ్ యాదవ్ అని డియోరియా జిల్లా జైలు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తనకు వెంటనే రూ.20 లక్షలు చెల్లించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు.. గోరఖ్‌పూర్ జిల్లా కేంద్ర కారాగారంలో సంజయ్ యాదవ్ అనే ఖైదీ చేసినట్లు తేల్చారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు కారణమని భావిస్తూ జిల్లా సీనియర్ ఎస్పీ ఆర్పీ పాండేను బదిలీ చేసి, అమిత్ కుమార్ పాతక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, డాక్టర్ షాహికి పోలీసు రక్షణ కల్పించింది. -
మాజీ మంత్రి గారి రాజభోగాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో కవయిత్రి మధుమిత శుక్ల హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి గారి రాజభోగాలు మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూశాయి. అనారోగ్యం పేరుతో స్థానిక ఆసుపత్రిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వైనం సంచలనం సృష్టించింది. అంతేకాదు ఆసుపత్రి ఆవరణలో దర్బారు వెలగబెడుతూ వుండడం ఈ మాజీ అమాత్యుల వారి జీవనశైలిని, వారికి ఊడిగం చేస్తున్న పోలీసుల వైఖరి విమర్శలకు తావిచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి అమర్మణి త్రిపాఠి మరోసారి చిక్కుల్లో పడ్డారు. కవయిత్రి మధుమిత శుక్ల హత్య కేసులో దోషులుగా తేలిన అమర్మణి, ఆయన భార్య మధుమణి గోరఖ్ పూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. కారాగారంలో ఉన్నప్పటికీ రాజభోగాలుకు ఏ మాత్రం కొదవలేదు. మందీ మార్బలానికీ అస్సలు లోటు లేదు. అయితే జైలుగోడల మధ్య ఉండాల్సిన ఈ దంపతులు ఇద్దరూ అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో జైలు బయట రాజభోగాలు అనుభవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. దీంతోపాటు అమర్మణి ఆదేశాలను శిరసావహిస్తూ ఆయన సేవలో తరిస్తున్నాడో పోలీసు ఉన్నతాధికారి. సదరు పోలీసు అనుమతి లేనిదే మరే ఆఫీసర్ అమర్మణిని కలిసే అవకాశం లేదు. గత రెండేళ్లుగా పకడ్బందీగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు తేలింది. స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో మంత్రిగారి గుట్టు రట్టయింది. పోలీసు దుస్తుల్లో వెళ్లిన మీడియా ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారాన్నిబట్టబయలుచేశారు. మరోవైపు మన న్యాయ, చట్టవ్యవస్థలు అవినీతి మయంగా మారిపోయాయని రాష్ట్ర మాజీ డీజీపి కెల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో న్యాయ, పోలీసు వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టి కనపడుతోందని విమర్శించారు. ప్రభుత్వం అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందన్నారు. అందుకే అమర్మణిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మధుమతి శుక్ల సోదరి నిధి శుక్ల డిమాండ్ చేశారు. మళ్లీ అమర్మమణి దంపతులను కటకటాల వెనక్కి పంపిస్తారనే ఆశాభావాన్నిఆమె వ్యక్తం చేశారు. కాగా అమర్మణి త్రిపాఠి, అతని భార్య మధుమణి సహా మరో ఇద్దరికి, మధుమిత హత్య కేసులో డెహ్రాడూన్ కోర్టు 2003 మేలో జీవితఖైదు శిక్ష విధించింది. కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ ఇలా అన్ని పార్టీలను చుట్టేసిన అమర్మమణి మరో ముప్పయి పైగా నేరారోపణలు ఉన్నాయి.