మాజీ మంత్రి గారి రాజభోగాలు | Murder convict former UP minister Amarmani Tripathi leads a luxurious life in Gorakhpur hospital | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి గారి రాజభోగాలు

Published Wed, Oct 7 2015 12:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

మాజీ మంత్రి గారి రాజభోగాలు

మాజీ మంత్రి గారి రాజభోగాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ లో కవయిత్రి  మధుమిత శుక్ల హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి గారి రాజభోగాలు  మీడియా స్టింగ్ ఆపరేషన్లో వెలుగు చూశాయి. అనారోగ్యం పేరుతో స్థానిక ఆసుపత్రిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వైనం సంచలనం సృష్టించింది. అంతేకాదు ఆసుపత్రి ఆవరణలో దర్బారు వెలగబెడుతూ వుండడం ఈ మాజీ అమాత్యుల వారి జీవనశైలిని,  వారికి ఊడిగం చేస్తున్న పోలీసుల వైఖరి విమర్శలకు తావిచ్చింది.  దీంతో ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి అమర్మణి త్రిపాఠి మరోసారి చిక్కుల్లో పడ్డారు.

కవయిత్రి మధుమిత శుక్ల హత్య కేసులో దోషులుగా తేలిన అమర్మణి, ఆయన భార్య మధుమణి గోరఖ్ పూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. కారాగారంలో ఉన్నప్పటికీ రాజభోగాలుకు ఏ మాత్రం కొదవలేదు. మందీ మార్బలానికీ అస్సలు లోటు లేదు.  అయితే జైలుగోడల మధ్య ఉండాల్సిన ఈ దంపతులు ఇద్దరూ అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు.  ట్రీట్మెంట్ పేరుతో  జైలు బయట రాజభోగాలు అనుభవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. దీంతోపాటు అమర్మణి ఆదేశాలను శిరసావహిస్తూ ఆయన సేవలో తరిస్తున్నాడో పోలీసు ఉన్నతాధికారి. సదరు పోలీసు అనుమతి లేనిదే మరే ఆఫీసర్ అమర్మణిని కలిసే అవకాశం లేదు. గత రెండేళ్లుగా పకడ్బందీగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు తేలింది. స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్లో మంత్రిగారి గుట్టు రట్టయింది.  పోలీసు దుస్తుల్లో వెళ్లిన మీడియా ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారాన్నిబట్టబయలుచేశారు.

మరోవైపు మన న్యాయ, చట్టవ్యవస్థలు అవినీతి మయంగా మారిపోయాయని రాష్ట్ర మాజీ డీజీపి కెల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో న్యాయ, పోలీసు వ్యవస్థ  వైఫల్యం కొట్టొచ్చినట్టి కనపడుతోందని విమర్శించారు. ప్రభుత్వం అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందన్నారు. అందుకే అమర్మణిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మధుమతి శుక్ల సోదరి నిధి శుక్ల డిమాండ్ చేశారు. మళ్లీ అమర్మమణి దంపతులను కటకటాల వెనక్కి పంపిస్తారనే ఆశాభావాన్నిఆమె వ్యక్తం చేశారు.

కాగా అమర్మణి త్రిపాఠి, అతని భార్య మధుమణి సహా మరో ఇద్దరికి, మధుమిత హత్య కేసులో డెహ్రాడూన్  కోర్టు 2003 మేలో జీవితఖైదు  శిక్ష విధించింది.  కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ ఇలా అన్ని పార్టీలను చుట్టేసిన  అమర్మమణి మరో  ముప్పయి పైగా  నేరారోపణలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement