హత్య కేసు నిందితుడితో వేదికపై యోగి
గోరఖ్‌పూర్: భార్య సారాసింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడంతోపాటు అతడిని ఆశీర్వదించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇబ్బందుల్లో పడ్డారు. మహరాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అమన్మణి త్రిపాఠి(35) శనివారం జరిగిన ఓ సమావేశంలో యోగికి కొన్ని సీట్ల దూరంలోనే కూర్చున్నారు. కార్యక్రమం మధ్యలో యోగికి నమస్కరించడంతోపాటు పాదాభివందనం చేసిన త్రిపాఠి కొన్ని కాగితాలను సీఎంకు అందించారు. దీంతో సభకు హాజరైన బీజేపీ శ్రేణులు విస్తుపోయాయి.
భార్య సారాను కట్నం కోసం వేధించడంతోపాటు చంపేసి కారు ప్రమాదంలో చనిపోయినట్లు నకిలీ సాక్ష్యాలు సృష్టించినందుకు సీబీఐ ఇంతకు ముందు త్రిపాఠిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పూర్ యూనిట్ ప్రతినిధి సత్యేంద్ర సిన్హా మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులెవరైనా సీఎంకు పాదాభివందనం చేయవచ్చని, ఇందులో తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. త్రిపాఠి తండ్రి అమర్మణి త్రిపాఠి నౌతన్వాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ములాయం హయాంలో మంత్రిగా పనిచేశారు. అమర్మణితోపాటు ఆయన భార్య ప్రస్తుతం మధుమితా శుక్లా హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నారు.