జడ్డూ కమింగ్ బ్యాక్... జోష్‌లో గుజరాత్
ఐపీఎల్ పదో సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బోణీ కొట్టని గుజరాత్ లయన్స్.. శుక్రవారం నాడు రాజ్‌కోట్‌లోని తమ సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మీద గెలుస్తామన్న ఆశతో ఉంది. అందుకు ప్రధాన కారణం.. ఆ జట్టులోని ఏస్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పునరాగమనమే. వేలుకు సంబంధించిన సమస్య ఉండటంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని జడేజాకు బీసీసీఐ మెడికల్ టీమ్ చెప్పింది. ఆ రెండు వారాలు అయిపోవడంతో అతడు మళ్లీ లయన్స్ టీమ్ బౌలింగ్ ఎటాక్‌లో చేరబోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైన గుజరాత్ జట్టు.. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుతో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పది వికెట్ల తేడాతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఓడిన విషయం తెలిసిందే.
జడేజా మళ్లీ జట్టులోకి రావడానికి పుణెతో కంటే మంచి మ్యాచ్ మరోటి ఉండబోదని అనుకుంటున్నారు. స్టీవ్ స్మిత, బెన్ స్టోక్స్ లాంటి వాళ్లకు బౌలింగ్ చేయడానికి జడేజా బాగా ఉత్సాహపడుతుంటాడు. గత సీజన్‌లో తమ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని, జడేజా అందుబాటులో లేకపోవడంతో ఈసారి జట్టు సమతౌల్యత బాగా దెబ్బ తిందని కోచ్ హీత్ స్టీక్ అన్నాడు. జడేజా, బ్రావో ఇద్దరూ తమకు చాలా కీలకమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లని.. జట్టు విజయంలో వాళ్ల పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. జడ్డూ వచ్చేయడం, బ్రావో కూడా వచ్చే వారంలో చేరడంతో ఇక తమ జట్టు జూలు విదిలిస్తుందని అన్నాడు.
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లలో జడేజా మంచి పెర్ఫామెన్స్ చూపించి టెస్టుల్లో నెంబర్ వన ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో కలిపి 25 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టులలో స్టీవ్ స్మిత్ వికెట్ జడేజాకే దక్కడం విశేషం. దాంతో ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్ క్రీడాకారులు జడేజాపై తీవ్రంగా స్లెడ్జింగ్‌కు దిగారు.