బిజీగా కోహ్లీ.. జట్టుతో కలిసి జీపు ప్రయాణం
రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి మైదానంలో అయితే దిగలేదు గానీ.. జట్టు జెర్సీ వేసుకుని బిజీగానే గడిపేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భుజానికి గాయం కావడంతో అప్పటినుంచి క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నా, జట్టుతో కలిసి ఫొటోషూట్లు, ప్రకటనలలో బిజీగానే ఉంటున్నాడు. తాజాగా తన ట్విట్టర్ పేజీలో కోహ్లీ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో తన జట్టు సభ్యులను కొంతమందిని ఒక వింటేజ్ జీపులో ఎక్కించుకుని అలా కొంతదూరం తిప్పడం కనిపిస్తుంది. ఫ్రంట్ సీట్లో కోహ్లీ పక్కనే క్రిస్ గేల్ కూర్చోగా.. వెనకాల ఎస్ అరవింద్, షేన్ వాట్సన్, ఏబీ డివీలియర్స్ ముగ్గురూ ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఓపెన్ టాప్ జీపును స్వయంగా కెప్టెన్ కోహ్లీయే డ్రైవ్ చేయడం గమనార్హం.
రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా ఒక బౌండరీని ఆపే సందర్భంలో కోహ్లీ భుజానికి గాయమైంది. దాంతో ధర్మశాల టెస్టుకు కూడా అతడు దూరం కాగా, అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించి బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీతో పాటు మరో స్టార్ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కూడా దూరం కావడంతో షేన్ వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆర్‌సీబీ జట్టులో ఈ కీలక ఆటగాళ్లిద్దరితో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడట్లేదు. ఇక కేఎల్ రాహుల్ మొత్తం టోర్నమెంటుకే దూరమయ్యాడు. గాయాలపాలైన వీళ్లంతా అసలు ఈ సీజన్‌లో ఆడతారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో కోహ్లీ, డివీలియర్స్ ఇద్దరూ లేకపోవడంతో సన్‌రైజర్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఆర్‌సీబీ ఓడిన విషయం తెలిసిందే.
Shoot time. Driving the boys around.