రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. పేరులో ఉన్న రాయల్టీ గానీ, చాలెంజింగ్ లక్షణాలు గానీ ఏమాత్రం కనపడని జట్టుగా ఐపీఎల్ పదో సీజన్‌లో దారుణాతి దారుణంగా విఫలం అవుతోంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన ఉద్దండులు అందులోనే ఉన్నారు. తుపాను ఇన్నింగ్స్ ఆడగల క్రిస్ గేల్, ఎలాంటి పరిస్థితిలోనైనా జట్టును ఒంటిచేత్తో గెలిపించగల విరాట్ కోహ్లీ, బంతిని ఎక్కడేసినా బాదేస్తా అన్నట్లుండే ఏబీ డివీలియర్స్.. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండి కూడా ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. కనీసం 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేదంటే ఇంత మంది పెద్ద ఆటగాళ్లు ఉండి ఏం ప్రయోజనమని ప్రేక్షకులు వాపోతున్నారు. అసలు ఈ జట్టుకు ఏమైంది.. ఏదైనా దిష్టి తగిలిందా, లేకపోతే ఏదైనా తేడా ఉండా అని కూడా అనుమానాలు సగటు ప్రేక్షకులకు తలెత్తుతున్నాయి.
సుడిగాలిలా విజృంభించే క్రిస్ గేల్.. ఈ సీజన్ మొత్తమ్మీద ఆడింది ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్. గుజరాత్ లయన్స్ జట్టు మీద రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడితే ఒక దాంట్లో డకౌట్, మిగిలిన వాటిలో డబుల్ డిజిట్‌కు వెళ్లింది కేవలం రెండు సార్లు మాత్రమే. అది కూడా మరీ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కావు. ఒకటి ముంబై ఇండియన్స్ మీద 22, మరోటి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 32.. మిగిలిన మ్యాచ్‌లలో గేల్ స్కోర్లు 8, 7, 6. కోహ్లీ కొంత పర్వాలేదనిపించినా దానివల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. కోల్‌కతా మీద మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. పంజాబ్ జట్టు మీద కేవలం 6 పరుగులే చేసి సందీప్ శర్మ చేతిలో ఔటయ్యాడు. మిగిలిన వాటిలో కూడా 10, 20, 28 పరుగులు చేశాడు. రెండుసార్లు మాత్రం అర్ధసెంచరీలు కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి.
శుక్రవారం నాటి మ్యాచ్‌లో 138 పరుగులకే పంజాబ్ జట్టును కట్టడి చేయడంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బెంగళూరు జట్టు గెలుస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, సొంత మైదానం అయినా.. ఎదురుగా ఉన్నది అతి సాధారణ లక్ష్యమే అయినా కూడా తడబడ్డారు. జట్టులో ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే! గేల్, కోహ్లీ, డివీలియర్స్ ముగ్గురినీ సందీప్ శర్మే ఔట్ చేశాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురు ప్రముఖ బ్యాట్స్‌మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అతడు గుర్తింపు పొందాడు. ఇక ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు మీద ఆశలు పెట్టుకోవడం అనవసరమని.. కనీసం వచ్చే సీజన్‌కైనా కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.