బెంగళూరు జి‘గేల్‌’ | Chris Gayle becomes first player to score 10000 T20 runs ... | Sakshi
Sakshi News home page

బెంగళూరు జి‘గేల్‌’

Published Wed, Apr 19 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

బెంగళూరు జి‘గేల్‌’

బెంగళూరు జి‘గేల్‌’

గుజరాత్‌ లయన్స్‌పై 21 పరుగులతో గెలుపు
గెలుపుమెరిసిన క్రిస్‌ గేల్‌
38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు
టి20ల్లో పది వేల పరుగులు పూర్తి
మెకల్లమ్‌ ఒంటరి పోరాటం వృథా  


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్రిస్‌ గేల్‌ బ్యాట్‌ ఎట్టకేలకు గర్జించింది.. సరైన ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోతున్నాననే కసి బాగానే పనిచేసిందేమో.. తన మునుపటి జోరును ప్రదర్శించి గుజరాత్‌ లయన్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. మైదానం నలువైపులా భారీ సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులకు కనువిందు చేసిన ఈవిధ్వంసకారుడు టి20 క్రికెట్‌ ఫార్మాట్‌లో పది వేల పరుగులు పూర్తి చేసిన ఒకే ఒక్కడిగా రికార్డు సృష్టించాడు. అటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు భారీ స్కోరు సాధించింది.. ఆ తర్వాత బౌలర్లు మిగతా పని చేయడంతో బెంగళూరు జట్టు లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు బ్రెండన్‌ మెకల్లమ్‌ ఒంటరి పోరాటానికి సహకారం లేకపోవడంతో సొంత వేదికపై గుజరాత్‌ లయన్స్‌కు ఓటమి తప్పలేదు.

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌ పదో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస పరాజయాలకు బ్రేక్‌ పడింది. ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఫలితంగా గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 21 పరుగులు తేడాతో గెలిచింది. సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (50 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా... కేదార్‌ జాదవ్‌ (16 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో చెలరేగారు. ధవల్‌ కులకర్ణి, బాసిల్‌ థంపీలకు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్‌ లయన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. మెకల్లమ్‌ (44 బంతుల్లో 72; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. చహల్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గేల్‌కు దక్కింది.

గేల్, కోహ్లి ధనాధన్‌...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు గేల్, కోహ్లి శుభారంభాన్నిచ్చారు. పవర్‌ప్లే ముగిసేసరికి 45 పరుగులే చేసినా... ఆ తర్వాత గేల్‌ విజృంభణకు స్కోరుబోర్డు ఉరకలెత్తింది. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20ల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కిన గేల్‌... రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో విశ్వరూపం చూపించాడు. చివరి నాలుగు బంతులను 4,4,6,6గా మలచడంతో ఆ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. ఇందులో చివరి బంతిని బౌండరీ లైన్‌ దగ్గర మెకల్లమ్‌ కుడివైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో పట్టుకున్నాడు. అయితే రీప్లేలో అతని పొడుగాటి టోపీ లైన్‌కు తాకినట్టు తేలడంతో గేల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. 23 బంతుల్లో మరో భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసిన గేల్‌ 11వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అతడి తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు బాసిల్‌ థంపి బ్రేక్‌ వేశాడు.

13వ ఓవర్‌లో గేల్‌ ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం కోహ్లి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాక... స్వల్ప వ్యవధిలోనే కులకర్ణి బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే బెంగళూరు రన్‌రేట్‌ ఏమాత్రం తగ్గకుండా హెడ్, జాదవ్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జాదవ్‌ చివరి రెండు ఓవర్లలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టడంతో జట్టు స్కోరు 200 మార్కును దాటింది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జత చేరాయి.

మెకల్లమ్‌ పోరాడినా..
లక్ష్యం భారీగా ఉండటంతో వేగంగా ఆడే క్రమంలో గుజరాత్‌ లయన్స్‌ రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ స్మిత్‌ (1) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అలరించిన కెప్టెన్‌ రైనా (8 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నాలుగో ఓవర్‌లో అవుటయ్యాడు. వీరిద్దరిని చహల్‌ వెనక్కి పంపాడు. అయితే మెకల్లమ్‌ తన దూకుడును తగ్గించకుండా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. చెత్త బంతులను సిక్సర్లుగా మలుస్తూ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ వరుస ఓవర్లలో ఫించ్‌ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (1) అవుట్‌ కావడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ప్రమాదకరంగా మారుతున్న మెకల్లమ్‌ను చహల్‌ తన చివరి ఓవర్‌లో అవుట్‌ చేయడంతో లయన్స్‌ గెలుపుపై ఆశలు వదులుకుంది. అయితే ఆఖర్లో ఇషాన్‌ కిషన్‌ కాస్త అలజడి రేకెత్తించాడు. 19వ ఓవర్‌లో తను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగి 21 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం ఉండగా... లయన్స్‌ 4 పరుగులే చేసి ఓడింది.

1 టి20ల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా క్రిస్‌ గేల్‌.
10 గేల్, కోహ్లిల మధ్య సెంచరీ భాగస్వామ్యాలసంఖ్య. టి20ల్లో ఇదే అత్యధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement