Lions in Gujarat
-
బెంగళూరు జి‘గేల్’
-
బెంగళూరు జి‘గేల్’
►గుజరాత్ లయన్స్‌పై 21 పరుగులతో గెలుపు ► గెలుపుమెరిసిన క్రిస్ గేల్ ►38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు ►టి20ల్లో పది వేల పరుగులు పూర్తి ►మెకల్లమ్ ఒంటరి పోరాటం వృథా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్రిస్ గేల్ బ్యాట్ ఎట్టకేలకు గర్జించింది.. సరైన ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోతున్నాననే కసి బాగానే పనిచేసిందేమో.. తన మునుపటి జోరును ప్రదర్శించి గుజరాత్ లయన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మైదానం నలువైపులా భారీ సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులకు కనువిందు చేసిన ఈవిధ్వంసకారుడు టి20 క్రికెట్ ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసిన ఒకే ఒక్కడిగా రికార్డు సృష్టించాడు. అటు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా బ్యాట్ ఝుళిపించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది.. ఆ తర్వాత బౌలర్లు మిగతా పని చేయడంతో బెంగళూరు జట్టు లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు బ్రెండన్ మెకల్లమ్ ఒంటరి పోరాటానికి సహకారం లేకపోవడంతో సొంత వేదికపై గుజరాత్ లయన్స్‌కు ఓటమి తప్పలేదు. రాజ్‌కోట్: ఐపీఎల్ పదో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఫలితంగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 21 పరుగులు తేడాతో గెలిచింది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (50 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో చెలరేగారు. ధవల్ కులకర్ణి, బాసిల్ థంపీలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. మెకల్లమ్ (44 బంతుల్లో 72; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. చహల్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గేల్‌కు దక్కింది. గేల్, కోహ్లి ధనాధన్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు గేల్, కోహ్లి శుభారంభాన్నిచ్చారు. పవర్‌ప్లే ముగిసేసరికి 45 పరుగులే చేసినా... ఆ తర్వాత గేల్ విజృంభణకు స్కోరుబోర్డు ఉరకలెత్తింది. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20ల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కిన గేల్... రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో విశ్వరూపం చూపించాడు. చివరి నాలుగు బంతులను 4,4,6,6గా మలచడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఇందులో చివరి బంతిని బౌండరీ లైన్ దగ్గర మెకల్లమ్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో పట్టుకున్నాడు. అయితే రీప్లేలో అతని పొడుగాటి టోపీ లైన్‌కు తాకినట్టు తేలడంతో గేల్ ఊపిరి పీల్చుకున్నాడు. 23 బంతుల్లో మరో భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసిన గేల్ 11వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అతడి తుఫాన్ ఇన్నింగ్స్‌కు బాసిల్ థంపి బ్రేక్ వేశాడు. 13వ ఓవర్లో గేల్ ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం కోహ్లి 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాక... స్వల్ప వ్యవధిలోనే కులకర్ణి బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అయితే బెంగళూరు రన్‌రేట్ ఏమాత్రం తగ్గకుండా హెడ్, జాదవ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జాదవ్ చివరి రెండు ఓవర్లలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టడంతో జట్టు స్కోరు 200 మార్కును దాటింది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జత చేరాయి. మెకల్లమ్ పోరాడినా.. లక్ష్యం భారీగా ఉండటంతో వేగంగా ఆడే క్రమంలో గుజరాత్ లయన్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మిత్ (1) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అలరించిన కెప్టెన్ రైనా (8 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నాలుగో ఓవర్లో అవుటయ్యాడు. వీరిద్దరిని చహల్ వెనక్కి పంపాడు. అయితే మెకల్లమ్ తన దూకుడును తగ్గించకుండా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. చెత్త బంతులను సిక్సర్లుగా మలుస్తూ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ వరుస ఓవర్లలో ఫించ్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (1) అవుట్ కావడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రమాదకరంగా మారుతున్న మెకల్లమ్‌ను చహల్ తన చివరి ఓవర్లో అవుట్ చేయడంతో లయన్స్ గెలుపుపై ఆశలు వదులుకుంది. అయితే ఆఖర్లో ఇషాన్ కిషన్ కాస్త అలజడి రేకెత్తించాడు. 19వ ఓవర్లో తను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగి 21 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరం ఉండగా... లయన్స్ 4 పరుగులే చేసి ఓడింది. ►1 టి20ల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్. ►10 గేల్, కోహ్లిల మధ్య సెంచరీ భాగస్వామ్యాలసంఖ్య. టి20ల్లో ఇదే అత్యధికం. -
గుజరాత్ తొలి విజయం
-
‘టై’తక్కలాడించాడు
►ఆండ్రూ టైకి ఐదు వికెట్లు ►హ్యాట్రిక్ సాధించిన లయన్స్ బౌలర్ ►గుజరాత్ తొలి విజయం ►7 వికెట్లతో రైజింగ్ పుణే చిత్తు ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆండ్రూ టై సంచలన బౌలింగ్‌కు తోడు మెకల్లమ్, డ్వేన్ స్మిత్ మెరుపు బ్యాటింగ్‌తో లయన్స్ విజయాల బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రైనా సేన సొంతగడ్డపై చెలరేగి జెయింట్‌కు ఝలక్ ఇచ్చింది. సమష్టి ప్రదర్శనతో గుజరాత్ సత్తా చాటగా... సీజన్లో శుభారంభం తర్వాత తడబడుతూ వచ్చిన రైజింగ్ పుణే ఖాతాలో ‘హ్యాట్రిక్’ పరాజయం చేరింది. రాజ్‌కోట్: ఐపీఎల్ కెరీర్లో 150వ మ్యాచ్ ఆడిన సురేశ్ రైనా, పదో సీజన్లో గుజరాత్ లయన్స్‌కు తొలి విజయం అందించి ఈ మ్యాచ్‌ను మరింత మధురంగా మార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ తివారి (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రూ టై (5/17) అద్భుత బౌలింగ్‌తో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. మెకల్లమ్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 53 బంతుల్లోనే 94 పరుగులు జోడించి గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా...చివర్లో రైనా (22 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. కీలక భాగస్వామ్యం... ఇన్నింగ్స్ మూడో బంతికే గుజరాత్‌కు షాక్ తగిలింది. స్లిప్‌లో రైనా ఒంటి చేత్తో అత్యద్భుత క్యాచ్ పట్టడంతో రహానే (0) వెనుదిరిగాడు. ఈ దశలో త్రిపాఠి,, స్మిత్ దూకుడైన భాగస్వామ్యం (32 బంతుల్లో 64 పరుగులు) పుణేను నిలబెట్టింది. ముఖ్యంగా ప్రవీణ్ వేసిన ఐదో ఓవర్లో సూపర్ జెయింట్ పండుగ చేసుకుంది. ఈ ఓవర్లో త్రిపాఠి తొలి మూడు బంతుల్లో 6, 6, 4 బాదగా చివరి రెండు బంతులకు స్మిత్ 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే టై తన తొలి ఓవర్లోనే త్రిపాఠిని అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. మరికొద్దిసేపటికే స్మిత్ కూడా అవుటయ్యాడు. స్టోక్స్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) జోరును టై అడ్డుకోగా... ధోని (5) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే తివారి, అంకిత్ శర్మ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జత చేసి జెయింట్‌ను ఆదుకున్నారు. చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో టై పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. తొలి మూడు బంతులకు టై వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారి, శార్దుల్ ఠాకూర్లను అవుట్ చేశాడు. ఆరంభం అదిరింది... ఛేదనను లయన్స్ విధ్వంసకర రీతిలో ప్రారంభించింది. అంకిత్ వేసిన తొలి ఓవర్లో స్మిత్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 16 పరుగులు రాగా... 2వ, 4వ ఓవర్లలో లయన్స్ 11 పరుగుల చొప్పున రాబట్టింది. ఆ తర్వాత తాహిర్ మొదటి ఓవర్లో మెకల్లమ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగిపోయాడు. తాహిర్ తర్వాతి ఓవర్ గుజరాత్‌కు మరింత కలిసొచ్చింది. మొదటి మూడు బంతుల్లో మెకల్లమ్ 4, 4, 6 కొట్టగా, స్మిత్ మరో బౌండరీ బాదడంతో ఏకంగా 20 పరుగులు లభించాయి. ఎట్టకేలకు స్మిత్‌ను ఠాకూర్ అవుట్ చేసి పుణేకు ఊరటనందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తక్కువ వ్యవధిలో మెకల్లమ్, కార్తీక్ (3) వెనుదిరిగారు. అయితే రైనా, ఫించ్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా రెండు ఓవర్ల ముందే జట్టును గెలిపించారు. ► 16 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ సింగ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. -
గుజరాత్‌కు సన్ రైజర్స్ మరో షాక్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి షాకిచ్చింది. రెండో క్వాలిఫయర్ లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన హైదరాబాద్ అదే ఫలితాన్ని మరోసారి పునరావృతం చేసి తుదిపోరుకు సిద్ధమైంది. గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ( 58 బంతుల్లో 93 పరుగులు నాటౌట్ ) ఓంటరి పోరు చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ ఏకలవ్య ద్వివేది(5), సురేష్ రైనా(1) వికెట్లను కోల్పోయినా ఆ తరువాత తేరుకుంది. బ్రెండన్ మెకల్లమ్(32;29 బంతుల్లో5 ఫోర్లు), దినేష్ కార్తీక్(26;19 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)తో ఫర్వాలేదనిపించారు. అటు తరువాత డ్వేన్ స్మిత్(1) నిరాశపరిచినా, అరోన్ ఫించ్(50;32 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా(19 నాటౌట్;15 బంతుల్లో 1ఫోర్), డ్వేన్ బ్రేవో(20; 10 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
రసవత్తర పోరు
హర్షాభోగ్లే గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సన్నద్ధమయ్యాయి. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో గుజరాత్ పటి ష్టంగా కనిపిస్తున్నప్పటికీ... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతాను నిలువరించిన హైదరాబాద్‌నూ తక్కువ అంచనా వేయలేం. గుజరాత్‌కు మెకల్లమ్, పించ్, స్మిత్, రైనాల రూపంలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పటి వరకు గుజరాత్‌ను అన్ని మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్లే నియంత్రించారు. దీనికి భిన్నంగా హైదరాబాద్ పటిష్టమైన పేస్ లైనప్‌తో బరిలోకి దిగుతుంది. ఎలిమినేటర్‌లో రాణించిన కటింగ్, హెన్రిక్స్ మరోసారి కీలకం కావచ్చు. ముస్తఫిజుర్ రూపంలో హైదరాబాద్‌కు మంచి ఆయుధం ఉంది. భువనేశ్వర్ కూడా మునుపటి రీతిలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తం మీద ఇది గుజరాత్ బ్యాట్స్‌మెన్‌కు, సన్‌రైజర్స్ బౌలర్లకు మధ్య జరిగే రసవత్తర పోరు. ఎవరు పైచేయి సాధిస్తే వారిదే ఫైనల్ బెర్తు. తరచి చూస్తే సన్ జట్టు కూర్పులో వైవిధ్యం ఉంటుంది. వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఇయాన్ మోర్గాన్, కరణ్ శర్మ ఇలా దాదాపు అంతా లెఫ్ట్ హ్యాండ ర్స్‌తో నిండి ఉంటుంది. వీరికి తగిన బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ప్రత్యర్థికి సవాలుతో కూడిన పని. ఈ కూర్పును దృష్టిలో పెట్టుకునే కోల్‌కతా షకీబుల్ హసన్‌ను చివరిమ్యాచ్‌లో తప్పించింది. రైనా కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఎంచుకోవాలి. ఏమైనా... ఆరంభంలో వికెట్లు తీయగలిగితే హైదరాబాద్‌ను కట్టడి చేయవచ్చు. మొదటి నుంచి బ్యాటింగ్ భారమంతా వార్నర్ ఒక్కడే మోస్తున్నాడు. తాజాగా శిఖర్ ధావన్, యువరాజ్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇన్నాళ్లూ బౌలింగ్ విభాగంపై, వార్నర్ పైనా ఆధారపడ్డ హైదరాబాద్‌కు వీరిద్దరూ బ్యాట్‌ను ఝుళిపించడం కలిసొచ్చే అంశం. -
విరాట్, రోహిత్‌ల పోరాటం హర్షా భోగ్లే
రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌ను లాంగ్ డిస్టెన్స్ రేస్‌తో పోల్చడం కాస్త అసహజంగా అనిపించినా సారాంశం మాత్రం ఒక్కటిగానే కనిపిస్తుంటుంది. రెండేళ్ల క్రితం అందరికన్నా ముందు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తుది పోరులో బోల్తా పడింది. తాజాగా రేసులో గుజరాత్ లయన్స్ అందరికన్నా ముందుంది. ఆరంభంలో తడబడుతూ కనిపించినా చివర్లో పుంజుకుని ఇలాంటి జట్లకు షాక్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ లాంటి జట్లు కూడా పోటీలో ఉంటాయి. అందుకే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు లీగ్ ఫినిషింగ్ దశకు వచ్చేసింది. ఈసారి ముంబై రేసులో నిలవాలంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం కీలకం. మరోవైపు కోహ్లి బృందం వరుసగా రెండు విజయాలతో రేసులో ముందుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఓడిన జట్టు మెడపై కత్తి వేలాడుతున్నట్టే. ఇద్దరు అత్యుత్తమ లక్ష్య ఛేదన మొనగాళ్లయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య జరిగే పోటీగా దీన్ని భావించాల్సి ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఒంటి చేత్తో మార్చగల సమర్థులు వీరు. అయితే గతంలోనే చెప్పుకున్నట్టు బౌలింగ్ మెరుగ్గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. ఈ విషయం తాజా లీగ్‌లో చాలాసార్లు రుజువైంది కూడా. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే ముంబై ఇండియన్స్‌కు ఎక్కువ అవకాశం ఉంది. కానీ భారీ లక్ష్యం కోసం బెంగళూరు ఛేజింగ్‌కు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. కోహ్లి దూకుడుతో పాటు డివిలియర్స్, వాట్సన్ కూడా అండగా ఉంటారు. ఈవిషయం ప్రత్యర్థికి కూడా తెలుసు. ఇక ముంబై బ్యాటింగ్ అంతా రోహిత్‌పై ఆధారపడి ఉండడం కలవరపరిచే విషయమే. -
లయన్స్ పంజా విసిరింది
► కోల్‌కతాపై విజయం దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ ► వరుస పరాజయాలకు బ్రేక్ కోల్‌కతా: వరుసగా మూడు పరాజయాలతో కుదేలైన గుజరాత్ లయన్స్ ఎట్టకేలకు పంజా విసిరింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి తిరిగి టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ముందుగా బౌలర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయగా అనంతరం బ్యాట్స్‌మెన్ మిగతా పని కానిచ్చారు. ఫలితంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లయన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. షకీబ్ హసన్ (49 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు; 4 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 51; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీకి తోడు చివర్లో ఆరోన్ ఫించ్ (10 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొత్తాన్ని యూసుఫ్ పఠాన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నడిపించారు. ఆరంభంలో బౌన్సీ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న పేసర్ ప్రవీణ్ కుమార్ రెండో ఓవర్లో గంభీర్ (5), మనీష్ పాండేను పెవిలియన్‌కు పంపి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 14; 3 ఫోర్లు)... రైనా సూపర్ క్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ (4) కూడా అవుట్ కావడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, యూసుఫ్ జోడి జట్టును అద్భుతంగా ఆడి ఆదుకుంది. ఎలాంటి నిర్లక్ష్యపు షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలు బాదుతూ కోల్‌కతాకు గౌరవప్రద స్కోరును అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లయన్స్ తమ తొలి ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసినా ఆ తర్వాత పుంజుకుంది. రెండో ఓవర్లో రెండు, మూడో ఓవర్లో మూడు ఫోర్లతో గేరు మార్చింది. అయితే పరుగుల కట్టడికి స్పిన్నర్లను బరిలోకి దించి గంభీర్ ఫలితం సాధించాడు. దూకుడు మీదున్న డ్వేన్ స్మిత్ (18 బంతుల్లో 27; 4 ఫోర్లు; 1 సిక్స్)ను షకీబ్ బౌల్డ్ చేయగా... పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మెకల్లమ్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) క్యాచ్ అవుటయ్యాడు. అయితే తొమ్మిదో ఓవర్లో దినేశ్ కార్తీక్ హ్యాట్రిక్ ఫోర్లతో ఒత్తిడి తగ్గించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 49 పరుగులు జత చేశాడు. 27 బంతుల్లో దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా ఫించ్ వచ్చీ రావడంతోనే బౌండరీల వర్షం కురిపించడంతో లక్ష్యం చిన్నదైపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) దినేశ్ కార్తీక్ (బి) కులకర్ణి 14; గంభీర్ (బి) ప్రవీణ్ 5; మనీష్ పాండే (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రవీణ్ 0; సూర్యకుమార్ యాదవ్ (సి) రైనా (బి) స్మిత్ 4; షకీబ్ నాటౌట్ 66; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-15, 2-15, 3-21, 4-24. బౌలింగ్: ప్రవీణ్ 4-1-19-2; కులకర్ణి 4-0-30-1; స్మిత్ 2-0-14-1; బ్రేవో 4-0-39-0; కౌశిక్ 1-0-14-0; జడేజా 3-0-25-0; తాంబే 2-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) షకీబ్ 27; మెకల్లమ్ (సి) పాండే (బి) చావ్లా 29; రైనా (సి) హాగ్ (బి) రసెల్ 14; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 51; ఫించ్ (రనౌట్) 29; జడేజా నాటౌట్ 9; బ్రేవో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో ఐదు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-42, 2-67, 3-116, 4-155, 5-158. బౌలింగ్: రసెల్ 3-0-21-1; మోర్కెల్ 4-0-38-0; షకీబ్ 3-0-38-1; చావ్లా 4-0-30-1; హాగ్ 2-0-19-1; ఉమేశ్ 2-0-18-0. -
రవీంద్ర జడేజాకు మందలింపు
గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తను అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్ 1 నిబంధనకు వ్యతిరేకం. జడేజా తన తప్పును అంగీకరించడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు. -
అక్షర్ అదరహో
► ‘హ్యాట్రిక్’తో మలుపు తిప్పిన స్పిన్నర్ ► పంజాబ్ అనూహ్య విజయం ► 23 పరుగులతో ఓడిన గుజరాత్ లయన్స్ విజయ లక్ష్యం 155 పరుగులు... భారీ హిట్టర్లతో పాటు మంచి ఫామ్‌లో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టుకు సొంతగడ్డపై దీనిని ఛేదించడం అంత కష్టమైన పనేం కాదు. అవతలివైపు ఉన్నదేమో వరుస పరాజయాలతో కునారిల్లి అట్టడుగున నిలిచిన పంజాబ్ జట్టు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో సునాయాసం అనుకున్న లక్ష్యం కాస్తా పెద్దదిగా మారి గుజరాత్‌కు షాక్ తగిలింది. రెండు ‘సింహా’ల పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్‌దే పైచేయి అయింది. తన రెండో ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, తర్వాతి ఓవర్ తొలి బంతితో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫలితంగా మూడు వరుస పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్‌కు గెలుపుతో ఊరట లభించింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మురళీ విజయ్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజ్‌కోట్: వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు ఓటమి ఎదురైంది. పేలవ ప్రదర్శనతో సీజన్లో ఆకట్టుకోలేకపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా చెలరేగి లయన్స్‌కు అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు) రాణించగా, వృద్ధిమాన్ సాహా (19 బంతుల్లో 33; 4 ఫోర్లు), మిల్లర్ (27 బంతుల్లో 31; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శివిల్ కౌశిక్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాల్క్‌నర్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (4/21) సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. మోహిత్ 3 వికెట్లు పడగొట్టాడు. నాయకుడు నడిపించగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న మురళీ విజయ్, ప్రవీణ్ కుమార్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. మరోవైపు స్టొయినిస్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో ఈ జోడి తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 65 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాత ఎనిమిది పరుగుల వ్యవధిలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. స్టొయినిస్‌ను జడేజా అవుట్ చేయగా, కౌశిక్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షాన్ మార్ష్ (1), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే గుర్కీరత్ (0) రనౌటయ్యాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, కౌశిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రేవో చేతికి చిక్కాడు. ఈ దశలో మిల్లర్, సాహా భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జత చేశారు. మిల్లర్‌ను ధవల్ అవుట్ చేయగా... 19, 20 ఓవర్లలో పంజాబ్ రెండేసి వికెట్లను కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ ఒక్క ఫోర్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. అంతా కలిసికట్టుగా... తన తొలి ఓవర్లోనే మెకల్లమ్ (1)ను బౌల్డ్ చేసి మోహిత్ పంజాబ్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రైనా (15 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా చక్కటి బంతితో మోహిత్ పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అసలు మ్యాజిక్ ఏడో ఓవర్లో ప్రారంభమైంది. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను ‘హ్యాట్రిక్’ వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. 57 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేదు. చివర్లో ఫాల్క్‌నర్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) పోరాడినా లక్ష్యానికి లయన్స్ చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బ్రేవో (బి) కౌశిక్ 55; స్టొయినిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) జడేజా 27; షాన్ మార్ష్ (సి) రైనా (బి) కౌశిక్ 1; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 0; గుర్కీరత్ సింగ్ (రనౌట్) 0; మిల్లర్ (సి) డ్వేన్ స్మిత్ (బి) ధావల్ 31; సాహా (బి) బ్రేవో 33; అక్షర్ (సి) కిషన్ (బి) బ్రేవో 0; మోహిత్ (బి) ప్రవీణ్ కుమార్ 1; కరియప్ప (బి) ప్రవీణ్ కుమార్ 1; సందీప్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1-65; 2-70; 3-70; 4-73; 5-100; 6-139; 7-145; 8-151; 9-153; 10-154. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 2.5-0-25-2; ధవల్ 4-0-28-1; జడేజా 3-0-28-1; కౌశిక్ 4-0-20-3; బ్రేవో 4-0-33-2; ఫాల్క్‌నర్ 2-0-19-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) గుర్కీరత్ (బి) అక్షర్ 15; మెకల్లమ్ (బి) మోహిత్ 1; రైనా (బి) మోహిత్ 18; కార్తీక్ (బి) అక్షర్ 2; జడేజా (సి) సాహా (బి) అక్షర్ 11; బ్రేవో (బి) అక్షర్ 0; కిషన్ (రనౌట్) 27; ఫాల్క్‌నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 32; ప్రవీణ్ కుమార్ (సి) కరియప్ప (బి) మోహిత్ 15; ధవల్ (నాటౌట్) 6; కౌశిక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-34; 3-38; 4-39; 5-39; 6-57; 7-86; 8-125; 9-125. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-31-1; మోహిత్ 4-0-32-3; స్టొయినిస్ 4-0-23-0; అక్షర్ 4-0-21-4; కరియప్ప 3-0-15-0; గుర్కీరత్ 1-0-8-0. -
లయన్స్ ‘సిక్సర్’
► గుజరాత్‌కు ఆరో విజయం ► భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు ► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్ ► పుణేకు తప్పని ఓటమి స్మిత్ సెంచరీ వృథా పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. భారీ భాగస్వామ్యం... స్టార్ ఆటగాళ్లు పీటర్సన్, డు ప్లెసిస్‌లు దూరంకావడంతో పుణే కొత్త కూర్పుతో బరిలోకి దిగింది. రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరభ్ తివారి (1) మూడో ఓవర్లోనే రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన స్మిత్... యాంకర్ పాత్రతో అదరగొట్టాడు. ఐదో ఓవర్లో వరుస బౌండరీలతో కుదురుకున్న అతను ఆ తర్వాతి దశల్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే నెమ్మదిగా ఆడినా... స్మిత్ మాత్రం లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ తీస్తూ... ఆపై బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదం తొక్కించాడు. దీంతో పవర్‌ప్లేలో 48/1 ఉన్న పుణే స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 85/1కు చేరింది. ఈ క్రమంలో స్మిత్ 29, రహానే 43 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. 13వ ఓవర్లో రెండో సిక్స్, ఫోర్‌తో స్మిత్ 14 పరుగులు రాబట్టినా... 14వ ఓవర్లో రహానే అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ధోని... స్మిత్‌కు స్ట్రయిక్ ఇవ్వడంతో మరో రెండు సిక్సర్లు బాదేశాడు. 17వ ఓవర్లో ధోని కూడా వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి జోరుతో తర్వాతి రెండు ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ రెండో బంతికి సెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ వెంటనే అవుటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 64 పరుగులు జతయ్యాయి. ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే డికాక్ (ఢిల్లీ), విరాట్ కోహ్లి (బెంగళూరు) ఒక్కో సెంచరీ చేశారు. మెకల్లమ్ మోత... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెకల్లమ్ భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే రాగా... మూడో ఓవర్లో మెకల్లమ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లలో 39 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో లయన్స్ 72 పరుగులు చేసింది. తర్వాత మరో సిక్స్ బాదిన మెకల్లమ్ 9వ ఓవర్లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ తర్వాత అశ్విన్‌ను ఫోర్లతో మడత పెట్టేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో లయన్స్ స్కోరు 112/1కి చేరింది. కానీ 11వ ఓవర్లో స్మిత్ అవుట్ కావడంతో పుణే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత కెప్టెన్ రైనా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. దీంతో ఐదు ఓవర్లలో 35 పరుగులు సమకూరాయి. తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 17వ ఓవర్లో కార్తీక్ అవుటయ్యాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో బ్రేవో (7), జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ స్థితిలో వరుస బంతుల్లో రైనా, ఇషాన్ కిషన్ (0) అవుటైనా చివరి బంతికి ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 53; సౌరభ్ తివారి రనౌట్ 1; స్మిత్ (బి) బ్రేవో 101; ధోని నాటౌట్ 30; పెరీరా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-13; 2-124; 3-188. బౌలింగ్: ప్రవీణ్ 4-0-37-0; ధవల్ కులకర్ణి 3-0-25-0; జడేజా 4-0-37-0; కౌశిక్ 3-0-32-0; ఫాల్క్‌నర్ 2-0-22-0; బ్రేవో 4-0-40-1. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) పెరీరా 63; మెకల్లమ్ (సి) మోర్కెల్ (బి) భాటియా 43; రైనా (బి) పెరీరా 34; దినేశ్ కార్తీక్ (సి) రహానే (బి) దిండా 33; బ్రేవో (సి) ధోని (బి) దిండా 7; జడేజా రనౌట్ 0; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఇషాన్ కిషన్ రనౌట్ 0; ప్రవీణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-93; 2-115; 3-166; 4-180; 5-180; 6-193; 7-193. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-30-0; అశోక్ దిండా 4-0-40-2; పెరీరా 4-0-41-2; ఆర్.అశ్విన్ 4-0-37-0; రజత్ భాటియా 3-0-26-1; ఎం.అశ్విన్ 3-0-22-0. -
నేడు జడేజా వివాహం
రాజ్‌కోట్: గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నేడు (ఆదివారం) ఓ ఇంటివాడు కానున్నా డు. స్థానిక వ్యాపారి కూతురు అయిన రీవా సోలంకిని తను వివాహమాడనున్నాడు. దీంతో శనివారం నాటి మ్యాచ్‌కు అందుబాటులో లేక పోగా 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమానమేనని గుజరాత్ లయన్స్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆ మ్యాచ్ రాజ్‌కోట్‌లోనే జరుగుతుంది కాబట్టి ఏవిషయమూ చెప్పలేమని కూడా అన్నారు. ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు లయన్స్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది.