లయన్స్ పంజా విసిరింది
► కోల్‌కతాపై విజయం దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ
► వరుస పరాజయాలకు బ్రేక్
కోల్‌కతా: వరుసగా మూడు పరాజయాలతో కుదేలైన గుజరాత్ లయన్స్ ఎట్టకేలకు పంజా విసిరింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి తిరిగి టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ముందుగా బౌలర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయగా అనంతరం బ్యాట్స్‌మెన్ మిగతా పని కానిచ్చారు. ఫలితంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లయన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. షకీబ్ హసన్ (49 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు; 4 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 51; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీకి తోడు చివర్లో ఆరోన్ ఫించ్ (10 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
కోల్‌కతా ఇన్నింగ్స్ మొత్తాన్ని యూసుఫ్ పఠాన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నడిపించారు. ఆరంభంలో బౌన్సీ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న పేసర్ ప్రవీణ్ కుమార్ రెండో ఓవర్‌లో గంభీర్ (5), మనీష్ పాండేను పెవిలియన్‌కు పంపి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 14; 3 ఫోర్లు)... రైనా సూపర్ క్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ (4) కూడా అవుట్ కావడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, యూసుఫ్ జోడి జట్టును అద్భుతంగా ఆడి ఆదుకుంది. ఎలాంటి నిర్లక్ష్యపు షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలు బాదుతూ కోల్‌కతాకు గౌరవప్రద స్కోరును అందించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లయన్స్ తమ తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసినా ఆ తర్వాత పుంజుకుంది. రెండో ఓవర్‌లో రెండు, మూడో ఓవర్‌లో మూడు ఫోర్లతో గేరు మార్చింది. అయితే పరుగుల కట్టడికి స్పిన్నర్లను బరిలోకి దించి గంభీర్ ఫలితం సాధించాడు. దూకుడు మీదున్న డ్వేన్ స్మిత్ (18 బంతుల్లో 27; 4 ఫోర్లు; 1 సిక్స్)ను షకీబ్ బౌల్డ్ చేయగా... పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మెకల్లమ్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) క్యాచ్ అవుటయ్యాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో దినేశ్ కార్తీక్ హ్యాట్రిక్ ఫోర్లతో ఒత్తిడి తగ్గించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 49 పరుగులు జత చేశాడు. 27 బంతుల్లో దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా ఫించ్ వచ్చీ రావడంతోనే బౌండరీల వర్షం కురిపించడంతో లక్ష్యం చిన్నదైపోయింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) దినేశ్ కార్తీక్ (బి) కులకర్ణి 14; గంభీర్ (బి) ప్రవీణ్ 5; మనీష్ పాండే (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రవీణ్ 0; సూర్యకుమార్ యాదవ్ (సి) రైనా (బి) స్మిత్ 4; షకీబ్ నాటౌట్ 66; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1-15, 2-15, 3-21, 4-24.
బౌలింగ్: ప్రవీణ్ 4-1-19-2; కులకర్ణి 4-0-30-1; స్మిత్ 2-0-14-1; బ్రేవో 4-0-39-0; కౌశిక్ 1-0-14-0; జడేజా 3-0-25-0; తాంబే 2-0-15-0.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) షకీబ్ 27; మెకల్లమ్ (సి) పాండే (బి) చావ్లా 29; రైనా (సి) హాగ్ (బి) రసెల్ 14; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 51; ఫించ్ (రనౌట్) 29; జడేజా నాటౌట్ 9; బ్రేవో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో ఐదు వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1-42, 2-67, 3-116, 4-155, 5-158.
బౌలింగ్: రసెల్ 3-0-21-1; మోర్కెల్ 4-0-38-0; షకీబ్ 3-0-38-1; చావ్లా 4-0-30-1; హాగ్ 2-0-19-1; ఉమేశ్ 2-0-18-0.