గుజరాత్కు సన్ రైజర్స్ మరో షాక్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి షాకిచ్చింది. రెండో క్వాలిఫయర్ లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన హైదరాబాద్ అదే ఫలితాన్ని మరోసారి పునరావృతం చేసి తుదిపోరుకు సిద్ధమైంది. గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ( 58 బంతుల్లో 93 పరుగులు నాటౌట్ ) ఓంటరి పోరు చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ ఏకలవ్య ద్వివేది(5), సురేష్ రైనా(1) వికెట్లను కోల్పోయినా ఆ తరువాత తేరుకుంది. బ్రెండన్ మెకల్లమ్(32;29 బంతుల్లో5 ఫోర్లు), దినేష్ కార్తీక్(26;19 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)తో ఫర్వాలేదనిపించారు.
అటు తరువాత డ్వేన్ స్మిత్(1) నిరాశపరిచినా, అరోన్ ఫించ్(50;32 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా(19 నాటౌట్;15 బంతుల్లో 1ఫోర్), డ్వేన్ బ్రేవో(20; 10 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి గౌరవప్రదమైన స్కోరు చేసింది.