IPL 2023, SRH vs DC: David Warner Return To Uppal After Long Time, Fans Emotional - Sakshi
Sakshi News home page

#David Warner: ఉప్పల్‌లో కింగ్‌.. టైటిల్‌ వీరుడు! అప్పుడు మా వార్నర్‌ అన్న.. ఇప్పుడు..

Published Mon, Apr 24 2023 6:01 PM | Last Updated on Mon, Apr 24 2023 6:20 PM

IPL 2023 SRH Vs DC: Warner Return To Uppal After Long Time Fans Emotional - Sakshi

PC: IPL

IPL 2023 SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌. హైదరాబాద్‌ సారథిగా జట్టును ముందుకు నడిపించి 2016లో సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్‌ అందించాడు.

తెలుగు ప్రేక్షకుల మనసు దోచి
మైదానంలో ఆటతో ఆకట్టుకున్న వార్నర్‌ భాయ్‌.. మైదానం వెలుపల టాలీవుడ్‌ హీరోల రీల్స్‌ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వార్నర్‌తో పాటు అతడి కుటుంబం మొత్తం ఆరెంజ్‌ ఆర్మీలో భాగమైంది. ‘వార్నర్‌ అన్నా’ అంటూ అభిమానులు అతడిని అక్కున చేర్చుకున్నారు.

అవమానకర రీతిలో జట్టును వీడి
కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అవమానకర రీతిలో వార్నర్‌ రైజర్స్‌ను వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ హైదరాబాదీల ప్రేమను నేటికీ పొందుతున్నాడతడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఉప్పల్‌ మైదానంలో వార్నర్‌ అడుగుపెట్టనున్నాడు. 

దాదాపు నాలుగేళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌
రిషభ్‌ పంత్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్‌ స్టార్‌.. సోమవారం నాటి మ్యాచ్‌తో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒ‍కప్పుడు సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌ను గుర్తు చేసుకుని ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఉప్పల్‌లో కింగ్‌ వార్నర్‌
‘‘అన్నా.. నువ్వు ఏ జట్టులో ఉన్నా.. మాకు మాత్రం ఎప్పుడూ హైదరాబాదీవే!’’ అంటూ ట్వీట్లు, మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్‌ పేరు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. కాగా 2014- 21 వరకు వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఆఖరి సీజన్‌ మినహా ప్రతి ఎడిషన్‌లో 500 పైచిలుకు(528, 562, 848, 641, 692, 548, 195) పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్‌ టాప్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఉప్పల్‌ స్టేడియంలో ఆడిన 31 ఇన్నింగ్స్‌లో వార్నర్‌ సాధించిన పరుగులు 1602. ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు, మూడు శతకాలు ఉన్నాయి. 

చదవండి: ధోని కోపంతో బ్యాట్‌ విరగ్గొట్టాడు: హర్భజన్ సింగ్
ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్‌! అంజలి అంతటి త్యాగం చేసిందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement