లయన్స్ ‘సిక్సర్’
► గుజరాత్‌కు ఆరో విజయం
► భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు
► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్
► పుణేకు తప్పని ఓటమి స్మిత్ సెంచరీ వృథా
పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్‌లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు.
భారీ భాగస్వామ్యం...
స్టార్ ఆటగాళ్లు పీటర్సన్, డు ప్లెసిస్‌లు దూరంకావడంతో పుణే కొత్త కూర్పుతో బరిలోకి దిగింది. రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరభ్ తివారి (1) మూడో ఓవర్‌లోనే రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన స్మిత్... యాంకర్ పాత్రతో అదరగొట్టాడు. ఐదో ఓవర్‌లో వరుస బౌండరీలతో కుదురుకున్న అతను ఆ తర్వాతి దశల్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే నెమ్మదిగా ఆడినా... స్మిత్ మాత్రం లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ తీస్తూ... ఆపై బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదం తొక్కించాడు. దీంతో పవర్‌ప్లేలో 48/1 ఉన్న పుణే స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 85/1కు చేరింది. ఈ క్రమంలో స్మిత్ 29, రహానే 43 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు.
13వ ఓవర్‌లో రెండో సిక్స్, ఫోర్‌తో స్మిత్ 14 పరుగులు రాబట్టినా... 14వ ఓవర్‌లో రహానే అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ధోని... స్మిత్‌కు స్ట్రయిక్ ఇవ్వడంతో మరో రెండు సిక్సర్లు బాదేశాడు. 17వ ఓవర్‌లో ధోని కూడా వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి జోరుతో తర్వాతి రెండు ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ రెండో బంతికి సెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ వెంటనే అవుటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 64 పరుగులు జతయ్యాయి. ఐపీఎల్‌లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే డికాక్ (ఢిల్లీ), విరాట్ కోహ్లి (బెంగళూరు) ఒక్కో సెంచరీ చేశారు.
మెకల్లమ్ మోత...
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెకల్లమ్ భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే రాగా... మూడో ఓవర్‌లో మెకల్లమ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లలో 39 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో లయన్స్ 72 పరుగులు చేసింది. తర్వాత మరో సిక్స్ బాదిన మెకల్లమ్ 9వ ఓవర్‌లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ తర్వాత అశ్విన్‌ను ఫోర్లతో మడత పెట్టేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో లయన్స్ స్కోరు 112/1కి చేరింది.
కానీ 11వ ఓవర్‌లో స్మిత్ అవుట్ కావడంతో పుణే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత కెప్టెన్ రైనా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. దీంతో ఐదు ఓవర్లలో 35 పరుగులు సమకూరాయి. తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 17వ ఓవర్‌లో కార్తీక్ అవుటయ్యాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో బ్రేవో (7), జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ స్థితిలో వరుస బంతుల్లో రైనా, ఇషాన్ కిషన్ (0) అవుటైనా చివరి బంతికి ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 53; సౌరభ్ తివారి రనౌట్ 1; స్మిత్ (బి) బ్రేవో 101; ధోని నాటౌట్ 30; పెరీరా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 195.
వికెట్ల పతనం: 1-13; 2-124; 3-188.
బౌలింగ్: ప్రవీణ్ 4-0-37-0; ధవల్ కులకర్ణి 3-0-25-0; జడేజా 4-0-37-0; కౌశిక్ 3-0-32-0; ఫాల్క్‌నర్ 2-0-22-0; బ్రేవో 4-0-40-1.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) పెరీరా 63; మెకల్లమ్ (సి) మోర్కెల్ (బి) భాటియా 43; రైనా (బి) పెరీరా 34; దినేశ్ కార్తీక్ (సి) రహానే (బి) దిండా 33; బ్రేవో (సి) ధోని (బి) దిండా 7; జడేజా రనౌట్ 0; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఇషాన్ కిషన్ రనౌట్ 0; ప్రవీణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1-93; 2-115; 3-166; 4-180; 5-180; 6-193; 7-193.
బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-30-0; అశోక్ దిండా 4-0-40-2; పెరీరా 4-0-41-2; ఆర్.అశ్విన్ 4-0-37-0; రజత్ భాటియా 3-0-26-1; ఎం.అశ్విన్ 3-0-22-0.