rising pune super giants
-
ధోనికి సీఎస్కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు ఉద్వేగానికి లోనయ్యేవాడు!
MS Dhoni- CSK: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై అన్నా.. అక్కడి మనుషులన్నా మహా ఇష్టమని.. నగరంతో అతడి అనుబంధం విడదీయలేనిదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైనా మిస్టర్ కూల్‌కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నాడు. అదే విధంగా ధోని పట్ల కూడా చెన్నై ప్రజలకు ఉన్న ప్రేమ వెలకట్టలేదని.. చెపాక్‌లో ఆదివారం నాటి దృశ్యాలే ఇందుకు నిదర్శనమని పీటర్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే ఆదివారం తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో.. మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అరుదైన దృశ్యాలు కేకేఆర్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత ధోని ముందుండి నడుస్తుండగా సీఎస్కే బృందం అతడిని అనుసరించింది. ఈ సందర్భంగా ధోని తాను సంతకం చేసిన టెన్నిస్ బంతులను స్టాండ్స్‌లోకి విసరగా.. వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే ఏకంగా తన షర్టు మీద ఆటోగ్రాఫ్ తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ మాట్లాడుతూ ధోనితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ‘‘ధోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కోసమైనా మనమంతా జట్టుగా బాగా ఆడాలి అనే ఫీలింగ్ వస్తుంది. అతడి కెప్టెన్సీ అలా ఉంటుంది మరి! గత కొన్నేళ్లుగా మిస్టర్ కూల్‌ను చూస్తూనే ఉన్నాం. జట్టు పట్ల, ఆటగాళ్ల పట్ల అతడు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు’’ అని పీటర్సన్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోని ఉద్వేగానికి లోనయ్యేవాడు ఇక రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ఆడే సమయంలో ధోనిని దగ్గరగా గమనించానన్న పీటర్సన్.. ధోనికి సీఎస్కే అంటే ఎంతో ఇష్టమని, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అతడు భావోద్వేగానికి లోనయ్యేవాడని గుర్తు చేసుకున్నాడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగా కూడా ధోని ఒక అద్భుతం అంటూ కొనియాడాడు. ‘‘ధోని చూసేందుకు జనాలు ఎలా ఎగబడుతున్నారో చూడండి. తనని తాకేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఓ క్రికెటర్‌గానే కాదు మనిషిగానూ అతడిది అసాధారణ వ్యక్తిత్వం. ఈ అద్భుత దృశ్యాలు ఇందుకు నిదర్శనం. భావోద్వేగ క్షణాలు. చూడటానికి ఎంతో బాగుంది’’ అని పీటర్సన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్కేపై నిషేధం విధించగా.. 2016, 2017 సీజన్లలో ధోని పుణె ఫ్రాంఛైజీకి మారిన ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో పీటర్సన్ ధోనితో కలిసి ఆడాడు. చదవండి: ‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు! 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్ ఆటగాడు, 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా సోమవారం (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. 2014 న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈశ్వర్ పాండే.. భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఈశ్వర్ 2014 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్లో సీఎస్కే అతన్ని 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో 25 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టిన ఈశ్వర్.. 2013, 2016 సీజన్లలో పూణే జట్టుకు ఆడాడు. ఈశ్వర్ 2012-13 రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కెరీర్ మొత్తంలో 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 58 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 71 టీ20లు ఆడిన ఈశ్వర్.. 394 వికెట్లు (263, 63, 68) సాధించాడు. అప్పట్లో ధోని ఈశ్వర్‌కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. అయితే పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. -
హిప్.. హిప్.. పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బ్యాట్స్మన్లలో మెక్కల్లమ్ 45(27 బంతులు, రెండు సిక్సులు, ఐదు ఫోర్లు), దినేశ్ కార్తీక్ 29(26 బంతులు, మూడు ఫోర్లు) సమయోచిత బ్యాటింగ్‌కు గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె 42/4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్ 103 నాటౌట్(63 బంతులు, ఆరు సిక్సులు)కు జత కలిసిన ధోని 26(33 బంతులు, ఒక సిక్సు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోని అవుటయ్యే సమయానికి గెలుపుకు ఇంకా 40కు పైగా పరుగుల అవసరం ఉంది. దీంతో ఒక్కసారిగా విజృంభించిన స్టోక్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో మరో బంతి మిగిలివుండగానే పుణె లక్ష్యాన్ని చేధించింది. కాగా, ఐపీఎల్లో పుణెకు గుజరాత్‌పై ఇదే తొలి విజయం. -
పఠాన్... ఫటాఫట్
► ప్లే ఆఫ్‌కు చేరువైన కోల్‌కతా ► పుణేపై 8 వికెట్లతో నైట్‌రైడర్స్ విజయం కోల్‌కతా: బౌలర్ల సమష్టి కృషికి యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్లతోనెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 14 పాయింట్లకు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 103 పరుగులు చేశాక భారీ వర్షం పడింది. దీంతో కోల్‌కతాకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయానికి 9 ఓవర్లలో 66 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కోల్‌కతా 5 ఓవర్లలోనే రెండు వికెట్లకు 66 పరుగులు చేసి గెలిచింది. పుణేను ఏ దశలోనూ కోల్‌కతా బౌలర్లు కుదురుకోనీయలేదు. జార్జి బెయిలీ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా ఖవాజా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఓమాదిరిగా ఆడాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓపెనర్ రహానే (2) విఫలం కావడం జట్టును ఇబ్బంది పెట్టింది. బెయిలీ, సౌరభ్ తివారీ (12 బంతుల్లో 13; 1 ఫోర్) మూడో వికెట్‌కు జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. బెయిలీ అవుటయ్యే సమయానికి 10.3 ఓవర్లలో 74 పరుగులతో పుణే కాస్త పటిష్టంగానే కనిపించినా ఆ తర్వాత లయ తప్పింది. బంతి విపరీతంగా టర్న్ అవుతుండడంతో కెప్టెన్ ధోని కూడా భారీ షాట్లకు వెళ్లే సాహసం చేయలేదు. దీంతో 22 బంతులాడిన తను ఒక్క బౌండరీ కూడా లేకుండా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా... షకీబ్, రాజ్‌పుత్, రస్సెల్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా తొలి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఉతప్ప (4), గంభీర్ (0)ల వికెట్లు కోల్పోయింది. అయితే యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే (10 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుని పరుగులు రాబట్టారు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో యూసుఫ్ వరుసగా 6,4,4 బాది... అదే జోరుతో చెలరేగిపోవడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కోల్‌కతా గెలిచింది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) రస్సెల్ 2; ఖవాజా (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) షకీబ్ 21; బెయిలీ (స్టంప్డ్) ఉతప్ప (బి) పీయూష్ చావ్లా 33; సౌరభ్ తివారీ (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 13; ఇర్ఫాన్ (రనౌట్) 7; ధోని నాటౌట్ 8; పెరీరా (సి) పాండే (బి) పీయూష్ చావ్లా 13; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 6 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1-19, 2-26, 3-67, 4-74, 5-87, 6-102. బౌలింగ్: రస్సెల్ 2-0-11-1; మోర్కెల్ 3-0-22-0; షకీబ్ 3-0-21-1; రాజ్‌పుత్ 2-0-14-1; పీయూష్ చావ్లా 4-0-21-2; నరైన్ 3.4-0-10-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 4; గంభీర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 0; మనీష్ పాండే నాటౌట్ 15; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (5 ఓవర్లలో 2 వికెట్లకు) 66. వికెట్ల పతనం: 1-5, 2-8. బౌలింగ్: అశ్విన్ 2-0-30-2; దిండా 1-0-13-0; ఎం.అశ్విన్ 1-0-13-0; జంపా 1-0-8-0. -
విరాట్ విశ్వరూపం
► అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన కోహ్లి ► సీజన్లో రెండో శతకంతో సంచలనం ► ఏడు వికెట్లతో పుణే ఓటమి గేల్‌ను మించిన విధ్వంసం... డివిలియర్స్‌ను మించిన వైవిధ్యం... ఒక సీజన్లో ఒక సెంచరీ కొడితేనే అద్భుతం... అలాంటిది ఒకే సీజన్లో రెండోసారి కూడా శతకం బాదడం అంటే... మహాద్భుతం. దీనిని చేసి చూపించాడు బెంగళూరు కెప్టెన్ కోహ్లి. ఈ సీజన్ ఐపీఎల్లో ఆరంభం నుంచి అత్యంత నిలకడగా ఆడుతున్న విరాట్... పుణే మీద విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో కేవలం 58 బంతుల్లోనే అజేయంగా 108 పరుగులు బాదేశాడు. ఎదురుగా ఉన్న కొండంత లక్ష్యం కూడా కోహ్లి విధ్వంసం ముందు చిన్నబోయింది. బెంగళూరు ఖాతాలో కీలకమైన విజయం చేరింది. బెంగళూరు: ప్రత్యర్థి జట్టులో ఎంత పెద్ద హిట్టర్ ఉన్నా తన వ్యూహాలతో కట్టడి చేయడం ధోని కెప్టెన్సీ గొప్పతనం. కానీ ధోనికి కూడా కొరుకుడుపడని క్రికెటర్ కోహ్లి. అందుకే విరాట్ (58 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసాన్ని దగ్గరి నుంచి చూడటం మినహా ‘మిస్టర్ కూల్’ ఏం చేయలేకపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పరుగుల ‘వేటగాడు’ బెంగళూరుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అజేయ సెంచరీతో భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదిపారేశాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏడు వికెట్లతో పుణే సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానే (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తివారీ (39 బంతుల్లో 52; 9 ఫోర్లు) వేగంగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో వాట్సన్ (3/24) ఆక ట్టుకున్నాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. వాట్సన్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అద్భుత భాగస్వామ్యం గత మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పుణే ఓపెనర్లు రహానే, ఖవాజా (6 బంతుల్లో 16; 2 పోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వరుసగా సిక్సర్, ఫోర్‌తో జోరును ప్రదర్శించిన ఖవాజా... రహానేతో సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్ తివారీ, రహానే కలిసి వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసే సరికి పుణే వికెట్ నష్టానికి 89 పరుగులతో పటిష్టంగా ఉంది. 37 బంతుల్లో తివారీ, 34 బంతుల్లో రహానే అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించాక చాహల్ బౌలింగ్‌లో తివారీ స్టంపౌట్ అయ్యాడు. అయితే స్లాగ్ ఓవర్లలో వాట్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడంతో పుణే జోరుకు బ్రేక్ పడింది. చివరి ఓవర్లో అశ్విన్ (5 బంతుల్లో 10; 1 సిక్సర్), భాటియా (4 బంతుల్లో 9; 1 సిక్సర్) చెరో సిక్సర్ బాది 16 పరుగులు చేయడంతో పుణే 190 మార్కును అధిగమించింది. ఓపెనింగ్ అదుర్స్ బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, రాహుల్ (35 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్సర్లు) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి 18 బంతుల్లో కేవలం 10 పరుగులే చేసిన ఈ జోడీ... క్రమంగా జోరు పెంచడంతో పవర్‌ప్లేలో 46 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో రాహుల్‌తో పాటు డివిలియర్స్ (1) కూడా అవుటయ్యాడు. అప్పటికి బెంగళూరు విజయం కోసం 48 బంతుల్లో 95 పరుగులు చేయాలి. ఈ దశలో షేన్ వాట్సన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పెరీరా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఐదు ఫోర్లు కొట్టిన వాట్సన్.. తర్వాత భాటియా ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కానీ 16వ ఓవర్లో ఆర్పీసింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో పుణే పుంజుకున్నట్లు కనిపించింది. కానీ విరాట్ కోహ్లి ఇక్కడి నుంచి ఊచకోత మొదలుపెట్టాడు. విజయానికి మూడు ఓవర్లలో40 పరుగులు అవసరం కాగా... జంపా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్... ఆర్పీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను తేల్చేశాడు. ఈ క్రమంలో 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో దిండా బౌలింగ్‌లో చక్కటి ఫ్లిక్‌తో బౌండరీ కొట్టిన విరాట్ విజయవంతంగా మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (బి) వాట్సన్ 74; ఉస్మాన్ ఖవాజా రనౌట్ 16; తివారీ (స్టం) రాహుల్ (బి) చాహల్ 52; ధోని (సి) రసూల్ (బి) వాట్సన్ 9; పెరీరా (సి) వాట్సన్ (బి) జోర్డాన్ 14; బెయిలీ (సి) రాహుల్ (బి) వాట్సన్ 0; భాటియా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1-26; 2-132; 3-144; 4-171; 5-171; 6-174. బౌలింగ్: బిన్నీ 2-0-17-0; రసూల్ 3-0-37-0; జోర్డాన్ 4-0-43-1; వాట్సన్ 4-0-24-3; ఫించ్ 3-0-31-0; చాహల్ 4-0-38-1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి నాటౌట్ 108; రాహుల్ (సి) బెయిలీ (బి) జంపా 38; డివిలియర్స్ (సి) పెరీరా (బి) జంపా 1; వాట్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఆర్పీ సింగ్ 36; హెడ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-94; 2-97; 3-143. బౌలింగ్: దిండా 3.3-0-26-0; ఆర్పీ సింగ్ 4-0-37-1; పెరీరా 3-0-40-0; జంపా 4-0-35-2; భాటియా 4-0-45-0; అశ్విన్ 1-0-7-0. ►1సీజన్లో 500కు పైగా పరుగులు మూడు సార్లు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రికార్డు. గతంలో సచిన్ రెండు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు. ► ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు. -
‘పెయినింగ్’ సూపర్ జెయింట్స్
ఏ టోర్నీలో అయినా ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో ఆటగాళ్లు గాయపడటం సాధారణం. దాదాపుగా అన్ని జట్లూ దీనికి సన్నద్ధమయ్యే ప్రణాళికలు రచించుకుంటాయి. కానీ ఈసారి ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మాత్రం గాయాల ‘పెయిన్’ని తట్టుకోలేకపోతోంది. అసలే అంతంతమాత్రం ప్రదర్శనతో గందరగోళంలో ఉన్న ధోని సేనకు మరో షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. సాక్షి క్రీడావిభాగం ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో జట్టు యాజమాన్యం సంబరపడింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లుగా కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్, మిషెల్ మార్ష్ బరిలోకి దిగారు. అందరూ బాగా ఆడటంతో జట్టు తొలి మ్యాచ్‌లోనే బోణీ చేసింది. కానీ సగం సీజన్ అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నలుగురూ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ధోని సేన కేవలం రెండే విజయాలు సాధించింది. దీంతో నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ దశలో స్మిత్‌లాంటి కీలక క్రికెటర్ కూడా దూరం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. ఒకరి వెనక ఒకరు... ముందుగా కెవిన్ పీటర్సన్ గాయంతో పుణేకు షాక్ తగిలింది. మోకాలి కింద వెనకభాగంలో గాయం కారణంగా ఈ ఇంగ్లండ్ మాజీ స్టార్ వైదొలిగాడు. అప్పటికి అతను కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత డు ప్లెసిస్ వేలి గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. మిషెల్ మార్ష్ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పక్కటెముకల గాయంతో తప్పుకున్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. పీటర్సన్, డు ప్లెసిస్ వైదొలిగాక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన జార్జ్ బెయిలీని కూడా తీసుకున్నారు. మే 5న ఢిల్లీతో మ్యాచ్ సమయానికి వీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక మార్ష్, స్మిత్‌ల కోసం ప్రత్యామ్నాయాన్ని చూసుకోలేదు. ప్రదర్శన కూడా అంతంతే ఈ సీజన్ ఆరంభంలో పుణే కూడా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటి. ధోని సారథ్యం, స్టార్ బ్యాట్స్‌మెన్ కారణంగా రేసులో ఉంది. తొలి మ్యాచ్‌లో దీనికి తగ్గట్లే ఆడినా, ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్‌పై గెలిచినా... గుజరాత్, ముంబైల చేతిలో ఓడి అవకాశాలను క్లిష్టం చేసుకుంది. బాగా ఆడుతున్న స్మిత్, డు ప్లెసిస్ టోర్నీకి దూరమవడం, రహానే మినహా మరో బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేకపోవడం ఈ జట్టును తీవ్ర ఆందోళనలో పడేసింది. ఇక బౌలింగ్‌లోనూ ఈ జట్టు దారుణంగా విఫలమయింది. ఆర్పీ సింగ్, ఇషాంత్ శర్మ, అశోక్ దిండా ముగ్గురూ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకూ దారుణంగా నిరాశపరిచాడు. గత నాలుగేళ్లుగా అన్ని రకాల ఫార్మాట్లలో, ఏ జట్టు తరఫున ఆడినా ధోనికి ప్రధాన అస్త్రంగా ఉన్న అశ్విన్... ఈసారి పూర్తి కోటా ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అసలే ఫామ్‌లో లేని ఆటగాళ్లతో తంటాలుపడుతున్న ధోని... ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల గాయాలతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక ఈ సీజన్లో మళ్లీ పుణే పుంజుకుంటుందా అనేది సందేహమే. ప్రతిసారీ ఏదో ఒక ‘మాయ’ చేసే ధోని ఈ సీజన్లో ఏం చేస్తాడనేది ఆసక్తికరం. షాన్ మార్ష్ కూడా... పుణేతో పాటు ఇతర జట్లను కూడా గాయాలు బాధపెడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు షాన్‌మార్ష్ కూడా వెన్నునొప్పితో సీజన్‌కు దూరమయ్యాడు. ఆరు మ్యాచ్‌లాడిన తను పంజాబ్ తరఫున అత్యధికంగా 159 పరుగులు సాధించాడు. -
నాయకుడు గెలిపించాడు
►మరోసారి రాణించిన రోహిత్ శర్మ ► పుణేపై ముంబై ఇండియన్స్ విజయం పుణే: స్టార్ ఆటగాళ్లు... తెరవెనుక అతిపెద్ద మంత్రాంగం... అయినా ఆరంభంలో విజయాలు సాధించడంలో వెనుకబడ్డ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పుంజుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (60 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి జట్టును నడిపిస్తుండటంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో పుణేపై నెగ్గింది. సీజన్ తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఎదురైన పరాజయానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆరంభం అదుర్స్... ఓపెనర్లలో రహానే (4) విఫలమైనా... సౌరభ్ తివారితో కలిసి వన్‌డౌన్‌లో స్మిత్ మోత మోగించాడు. మూడు ఓవర్ల తేడాలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో తివారి రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో స్మిత్ మూడో సిక్సర్ బాదాడు. అయితే వేగంగా ఆడుతున్న ఈ జోడిని పదో ఓవర్లో బుమ్రా విడగొట్టాడు. అద్భుతమైన ఫుల్ లెంగ్త్ బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్ ముగిసేసరికి పుణే స్కోరు 93/2కు చేరింది. అప్పటి వరకు వాయువేగంతో దూసుకుపోయిన పుణే స్కోరు బోర్డుకు హర్భజన్ కళ్లెం వేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ ఓ వికెట్ తీయడంతో పాటు పరుగులూ నిరోధించాడు. దీంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 27 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తివారి, ధోని (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 33 పరుగులు జత చేశాక 18వ ఓవర్లో తివారి అవుటయ్యాడు. చివరి ఓవర్లో ధోని కూడా వెనుదిరిగాడు. మళ్లీ సారథే... తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే రావడంతో కాస్త ఒత్తిడికి లోనైన రోహిత్ మూడో ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన పార్థీవ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. తర్వాత రాయుడు (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) సింగిల్స్‌తో రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడంతో పవర్‌ప్లేలో 51/1 ఉన్న స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 76/1కి చేరింది. వేగంగా ఆడే ప్రయత్నంలో రాయుడు 12వ ఓవర్లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్ ఆ తర్వాత వేగంగా ఆడాడు. రెండోఎండ్‌లో బట్లర్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) క్రునాల్ (బి) మెక్లీనగన్ 4; సౌరభ్ తివారి (సి) హార్దిక్ (బి) బుమ్రా 57; స్మిత్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 45; హాండ్స్‌కాంబ్ (సి) బట్లర్ (బి) హర్భజన్ 6; ధోని (సి) రాయుడు (బి) బుమ్రా 24 ; పెరీరా నాటౌట్ 12; భాటియా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-8; 2-92; 3-105; 4-138; 5-149. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-27- 1; క్రునాల్ 2-0-28-0; బుమ్రా 4-0-29-3; హార్దిక్ 2-0-14-0; హర్భజన్ 4-0-25-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 85; పార్థీవ్ (సి) ధోని (బి) దిండా 21; రాయుడు (సి) రహానే (బి) అశ్విన్ 22; బట్లర్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-39; 2-91. బౌలింగ్: పెరీరా 4-0-35-0; దిండా 3-0-33-1; బొలాండ్ 3-0-23-0; భాటియా 3-0-20-0; ఆర్. అశ్విన్ 3-0-21-0; ఎం.అశ్విన్ 2.3-0-25-0. -
మిచెల్ మార్ష్ కూడా...
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్ గాయాల కారణంగా ఐపీఎల్-9 నుంచి వైదొలగగా... వీరిద్దరి సరసన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా చేరాడు. పక్కటెముకల గాయంతో మార్ష్ ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. -
బౌలింగ్‌తోనే ముంబై విజయాలు
హర్షా భోగ్లే ఐపీఎల్ సగభాగం పూర్తవగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేటి (ఆదివారం) మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇది నిజమూ కావచ్చు.. లేదా కాకుండా పోవచ్చు. అయితే ఇలాంటి చర్చ అంతటా జరుగుతూనే ఉంటుంది. ఇక మరో మ్యాచ్‌లో గుజరాత్‌తో... ఓడితే దాదాపు ఇంటికి బయలుదేరే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆడబోతోంది. నిజానికి పుణే జట్టు ఎంత భారీ స్కోరు చేసినా కూడా తమ విజయంపై నమ్మకం పెట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఆ స్కోరును కాపాడుకునేందుకు వారి దగ్గర అంత నాణ్యమైన బౌలింగ్ సామర్థ్యం కనిపించడం లేదు. పుణే ప్రధాన బౌలర్ ఆర్.అశ్విన్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ప్రారంభంలో... చివర్లో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్ల కొరత కూడా ఉంది. ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ పటిష్ట బౌలింగ్ విభాగం కలిగిన జట్టుగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆరు మ్యాచ్‌ల్లో వారు నాలుగు గెలవగలిగారు. ఇక బ్యాటింగ్ లో వారికి మాంచి కండ పుష్టి కలిగిన ఆటగాళ్లున్నారు. పుణే స్టేడియంలో ఈ విషయం మరోసారి నిరూపితమవ్వచ్చు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోవడంతో అభిమానులకు కనువిందు ఖాయం. మరోవైపు రాజ్‌కోట్‌లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరాజయాలతో కుదేలైన పంజాబ్ కింగ్స్.. పవర్ఫుల్ లయన్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ కనుక వారు ఓడితే క్వాలిఫయర్‌కు వెళ్లడం కష్టమే! -
వైజాగ్‌లో ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లు
► ముంబై, పుణేల సొంత వేదిక ► మే 8, 10, 13, 15, 17, 21 తేదీల్లో మ్యాచ్‌లు న్యూఢిల్లీ: ఐపీఎల్-9 సీజన్లో అనూహ్యంగా ఆరు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం విశాఖపట్నం దక్కించుకుంది. నీటి ఎద్దడి కారణంగా మే 2 తర్వాతి నుంచి మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో రాష్ట్రానికి తరలించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు సంయుక్తంగా ‘సొంత వేదిక’గా విశాఖ ఉంటుంది. ఇరు జట్లకు చెందిన చెరో మూడు మ్యాచ్‌లు కలిపి మొత్తం ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నిర్వహిస్తారు. తాజా మార్పు అనంతరం ఐపీఎల్ షెడ్యూల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ల వేదికను మార్చారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బదులుగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం ఈ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. -
లయన్స్ ‘సిక్సర్’
► గుజరాత్‌కు ఆరో విజయం ► భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు ► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్ ► పుణేకు తప్పని ఓటమి స్మిత్ సెంచరీ వృథా పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. భారీ భాగస్వామ్యం... స్టార్ ఆటగాళ్లు పీటర్సన్, డు ప్లెసిస్‌లు దూరంకావడంతో పుణే కొత్త కూర్పుతో బరిలోకి దిగింది. రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరభ్ తివారి (1) మూడో ఓవర్లోనే రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన స్మిత్... యాంకర్ పాత్రతో అదరగొట్టాడు. ఐదో ఓవర్లో వరుస బౌండరీలతో కుదురుకున్న అతను ఆ తర్వాతి దశల్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే నెమ్మదిగా ఆడినా... స్మిత్ మాత్రం లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ తీస్తూ... ఆపై బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదం తొక్కించాడు. దీంతో పవర్‌ప్లేలో 48/1 ఉన్న పుణే స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 85/1కు చేరింది. ఈ క్రమంలో స్మిత్ 29, రహానే 43 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. 13వ ఓవర్లో రెండో సిక్స్, ఫోర్‌తో స్మిత్ 14 పరుగులు రాబట్టినా... 14వ ఓవర్లో రహానే అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ధోని... స్మిత్‌కు స్ట్రయిక్ ఇవ్వడంతో మరో రెండు సిక్సర్లు బాదేశాడు. 17వ ఓవర్లో ధోని కూడా వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి జోరుతో తర్వాతి రెండు ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ రెండో బంతికి సెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ వెంటనే అవుటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 64 పరుగులు జతయ్యాయి. ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే డికాక్ (ఢిల్లీ), విరాట్ కోహ్లి (బెంగళూరు) ఒక్కో సెంచరీ చేశారు. మెకల్లమ్ మోత... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెకల్లమ్ భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే రాగా... మూడో ఓవర్లో మెకల్లమ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లలో 39 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో లయన్స్ 72 పరుగులు చేసింది. తర్వాత మరో సిక్స్ బాదిన మెకల్లమ్ 9వ ఓవర్లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ తర్వాత అశ్విన్‌ను ఫోర్లతో మడత పెట్టేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో లయన్స్ స్కోరు 112/1కి చేరింది. కానీ 11వ ఓవర్లో స్మిత్ అవుట్ కావడంతో పుణే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత కెప్టెన్ రైనా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. దీంతో ఐదు ఓవర్లలో 35 పరుగులు సమకూరాయి. తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 17వ ఓవర్లో కార్తీక్ అవుటయ్యాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో బ్రేవో (7), జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ స్థితిలో వరుస బంతుల్లో రైనా, ఇషాన్ కిషన్ (0) అవుటైనా చివరి బంతికి ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 53; సౌరభ్ తివారి రనౌట్ 1; స్మిత్ (బి) బ్రేవో 101; ధోని నాటౌట్ 30; పెరీరా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-13; 2-124; 3-188. బౌలింగ్: ప్రవీణ్ 4-0-37-0; ధవల్ కులకర్ణి 3-0-25-0; జడేజా 4-0-37-0; కౌశిక్ 3-0-32-0; ఫాల్క్‌నర్ 2-0-22-0; బ్రేవో 4-0-40-1. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) పెరీరా 63; మెకల్లమ్ (సి) మోర్కెల్ (బి) భాటియా 43; రైనా (బి) పెరీరా 34; దినేశ్ కార్తీక్ (సి) రహానే (బి) దిండా 33; బ్రేవో (సి) ధోని (బి) దిండా 7; జడేజా రనౌట్ 0; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఇషాన్ కిషన్ రనౌట్ 0; ప్రవీణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-93; 2-115; 3-166; 4-180; 5-180; 6-193; 7-193. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-30-0; అశోక్ దిండా 4-0-40-2; పెరీరా 4-0-41-2; ఆర్.అశ్విన్ 4-0-37-0; రజత్ భాటియా 3-0-26-1; ఎం.అశ్విన్ 3-0-22-0. -
రైజింగ్ పుణే కూర్పులో స్పష్టత
హర్షా భోగ్లే బ్యాటింగ్ ఆర్డర్‌పై రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. అయితే తమ ఉత్తమ కూర్పు విషయంలో ఓ అంచనాకు రావడానికి వీరికి కొంచెం సమయం పట్టింది. నిజానికి ధోని సేన తాజా సీజన్లో ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదనే చెప్పాలి. రహానే, డు ప్లెసిస్, పీటర్సన్, స్టీవ్ స్మిత్, ధోనిలతో టాప్-5 గట్టిగానే ఉంది. ఇందులో ఎవరో ఒకరు తమ జట్టు ప్రణాళికలను అమలుపరచగలుగుతున్నారు. కానీ పీటర్సన్ టోర్నీ నుంచి వైదొలగడంతో స్మిత్ తనకిష్టమైన మూడో నంబర్ స్థానంలో రాగలుగుతున్నాడు. అతడి జాతీయ జట్టులో వార్నర్, ఫించ్లాగా స్మిత్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కాకపోయినా కళాత్మక షాట్లతో పాటు వినూత్నంగా ఆడగలడు. ధోని నంబర్ఫోర్లో రావాల్సి ఉంటుంది. ఫినిషర్స్‌గా మిషెల్ మార్ష్, తిసారా పెరీరాలను ఉపయోగించుకోవచ్చు. ఇక వికెట్ కీపర్, ఇద్దరు బౌలర్లతో టాప్-7లో పుణే కూర్పు పర్ఫెక్ట్గా ఉంది. మరోవైపు చివరి నలుగురిలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించుకుంటే సరిపోతుంది. ఒకవేళ నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉంటే జట్టు పూర్తి సంతృప్తిగా ఉన్నట్టే. ఈ విషయంలో అశోక్ దిండా సరిపోతాడు. మరో జట్టు గుజరాత్ లయన్స్ మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌తో కాస్త ఇబ్బంది పడుతోంది. వీరికి డ్వేన్ స్మిత్, మెకల్లమ్, ఫించ్‌ల రూపంలో ముగ్గురు సూపర్ విదేశీ ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ సురేశ్ రైనా మూడో నంబర్లో రావాలనుకుంటే వీరిలో ఒకరు నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. కానీ ఫించ్ గైర్హాజరీతో గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక విజయాలు అందించిన డ్వేన్ స్మిత్, మెకల్లమ్ జోడి ఢిల్లీపై శుభారంభాన్ని ఇచ్చింది. ఫించ్ ఆడినా లోయర్ ఆర్డర్లో దిగాల్సి ఉంటుందేమో.. నిజానికి మెకల్లమ్ మూడు, రైనా నాలుగో స్థానంలో దిగాలని గుజరాత్ భావిస్తే బావుంటుంది. -
మరోపోరుకు ‘సన్’సిద్ధం
► నేడు పుణేతో మ్యాచ్ ► సూపర్ ఫామ్‌లో వార్నర్ సాక్షి, హైదరాబాద్: ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా పుణేతో సమరానికి సై అంటోంది. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో సన్ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రైజర్స్ అనూహ్యంగా పుంజుకొని మూడు వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టు ముందంజ వేస్తోంది. మరోవైపు రైజింగ్ పుణేది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యాలతో సాదాసీదా జట్టుగా మిగిలిపోయింది. ఆత్మ విశ్వాసంతో వార్నర్ సేన ఫామ్ కోసం తంటాలు పడిన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇప్పుడు టచ్‌లోకి వచ్చాడు. మరోవైపు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో కీలక ఆటగాళ్లు యువరాజ్, ఆశిష్ నెహ్రా గాయాల బారిన పడినా... జట్టు విజయాలకు ఢోకా లేకుండా పోయింది. యువీ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. నెహ్రా ఫిట్నెస్ను బట్టి మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు సొంతగడ్డపై మరో విజయం ఏమంత కష్టం కాకపోవచ్చు. గాడిన పడని సూపర్ జెయింట్స్ పుణేను పరాజయాల భారం కుంగదీస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన ధోని సేన ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. జట్టు కూర్పు కూడా పుణేకు సమస్యగా మారింది. ఇప్పటి వరకు ప్రధాన ఆటగాళ్లెవరూ జట్టును గాడిన పెట్టే ప్రయత్నం చేయలేకపోవడం కోచ్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనిలను కలవరపెడుతోంది. నాలుగు ఓటమిలతో ఉన్న ధోని సేన ప్లే ఆఫ్‌కు చేరాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో సమష్టి కృషితో దూసుకెళ్లాల్సిందే. స్టీవ్ స్మిత్, డుప్లెసిస్, రహానే, పెరీరా, ధోనిలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కాగితాలపై బలంగా కనిపిస్తున్నప్పటికీ మైదానం చేరేసరికి డీలాపడుతోంది. టాప్ ఆర్డర్లో ఒకరిద్దరు రాణించడంతో ఫలితాల్లో భారీమూల్యమే చెల్లించుకుంటోంది. ఐదు మ్యాచ్‌లైనా... స్టీవ్ స్మిత్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ధోనీ మెరుపులు అంతంతే. ఇక పేస్ బౌలింగ్‌లో మీడియం పేసర్ రజత్ భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కూడా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రభావమే చూపలేదు. రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్‌లు దీనిపై దృష్టి పెట్టాలి. -
కోల్‌కతా తీన్మార్
► వరుసగా మూడో విజయం ► రాణించిన సూర్యకుమార్, యూసుఫ్ ► రహానే శ్రమ వృథా పుణే: జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న ఓపెనర్లు తొలిసారి విఫలమైనా... చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతంగా కాపాడుకుంది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పుణేను ఓడించి వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. రహానే (52 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 31; 2 ఫోర్లు) రాణించారు. ఆరంభంలో నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించడంతో నాలుగో ఓవర్లోనే డు ప్లెసిస్ (4) వికెట్ కోల్పోయింది. అయితే స్మిత్, రహానే నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు రాణించడంతో పుణే తొలి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ దశలో పెరీరా (9 బంతుల్లో 12; 1 సిక్స్) నిరాశపర్చినా.... ఆల్బీ మోర్కెల్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు), రహానేలు భారీ సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచారు. ఆఖర్లో ధోని (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు సమకూరడంతో పుణే భారీ స్కోరు సాధించింది. తర్వాత కోల్‌కతా 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కాడు. మూడు ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు ఉతప్ప (0), గంభీర్ (11) అవుట్‌కాగా, వన్‌డౌన్‌లో షకీబ్ (3) కూడా నిరాశపర్చాడు. దీంతో కోల్‌కతా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్, యూసుఫ్ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించినా...వరుస ఓవర్లలో అవుట్ కావడం దెబ్బతీసింది. తర్వాత రసెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) వేగంగా ఆడినా వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో సతీష్ (10) సిక్స్ కొట్టి అవుట్ కావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో చావ్లా (8) కూడా అవుటైనా... ఉమేశ్ (7 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి అండ్ బి) నరైన్ 67; డు ప్లెసిస్ (బి) షకీబ్ 4; స్మిత్ రనౌట్ 31; పెరీరా (బి) సతీష్ 12; ఆల్బీ మోర్కెల్ (బి) ఉమేశ్ 16; ధోని నాటౌట్ 23; భాటియా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-24; 2-80; 3-99; 4-119; 5-133. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 3-0-30-0; రసెల్ 2-0-16-0; షకీబ్ 3-0-14-1; నరైన్ 4-0-32-1; చావ్లా 3-0-26-0; సతీష్ 3-0-20-1; ఉమేశ్ 2-0-16-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 0; గంభీర్ రనౌట్ 11; సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యు (బి) ఎం.అశ్విన్ 60; షకీబ్ (బి) భాటియా 3; యూసుఫ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 36; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 17; సతీష్ (బి) మోర్కెల్ 10; చావ్లా (సి) స్మిత్ (బి) పెరీరా 8; ఉమేశ్ నాటౌట్ 7; నరైన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-0; 2-31; 3-60; 4-111; 5-119; 6-139; 7-151, 8-156. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 3-0-36-2; పెరీరా 3.3-0-28-2; ఆర్.అశ్విన్ 2-0-21-0; భాటి యా 4-0-19-2; అంకిత్ శర్మ 3-0-26-0; ఎం.అశ్విన్ 4-0-32-1. -
భలా.... బెంగళూరు
► సమష్టి ప్రదర్శనతో పుణేపై విజయం ► మళ్లీ చెలరేగిన డివిలియర్స్, కోహ్లి ► బంతితో మెరిసిన రిచర్డ్సన్, వాట్సన్ ► లక్ష్య ఛేదనలో ధోని సేన విఫలం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసినా దక్కని విజయాలు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు పరిస్థితి ఇది. కానీ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాటింగ్కుతోడు బౌలర్లూ రాణించడంతో బెంగళూరు గాడిలో పడింది. లక్ష్య ఛేదనలో పుణే విజృంభించినా... చివర్లో సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు గట్టెక్కింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పైచేయి సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణే బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించినా... స్లాగ్ ఓవర్లలో తిరుగులేని బౌలింగ్‌తో ధోనిసేనను కోహ్లి బృందం కట్టడి చేసింది. దీంతో ఐపీఎల్-9లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 13 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై నెగ్గింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. డివిలియర్స్ (46 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తర్వాత పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. రహానే (46 బంతుల్లో 60; 8 ఫోర్లు), ధోని (38 బంతుల్లో 41; 3 ఫోర్లు), తిసారా పెరీరా (13 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అద్భుత భాగస్వామ్యం... ఆర్సీబీ ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (7) నిరాశపర్చినా... కెప్టెన్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడో ఓవర్లోనే సిక్స్, ఫోర్‌తో జోరు పెంచినా... తొలి 22 బంతుల్లో 27 పరుగులు చేశాక రాహుల్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. పుణే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించాడు. దీంతో పవర్ ప్లేలో 48/1తో ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 79/1కి చేరుకుంది. ఆ తర్వాత మురుగన్ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఏబీ మరింత రెచ్చిపోయాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో కోహ్లి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో ఏబీ 25; కోహ్లి 47 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఈ ఇద్దరి దెబ్బకు పుణే బౌలర్లు పరుగులు భారీగానే సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో తొలి సిక్స్ కొట్టిన విరాట్... తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే ఓవర్లో డివియర్స్ మరో సిక్సర్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 95 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పెరీరా 3 వికెట్లు తీశాడు. పెరీరా దూకుడు... ఓపెనర్లలో రహానే కుదురుగా ఆడినా... డు ప్లెసిస్ (2) నిరాశపరిచాడు. పీటర్సన్ ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (4) పెవిలియన్‌కు చేరడంతో పుణేకు సరైన శుభారంభం లభించలేదు. రహానేతో కలిసి ధోని ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నా రన్‌రేట్ మందగించింది. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 36/2కు చేరుకుంది. ఈ దశలో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపించి మూడు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో ధోని సేన కాస్త కోలుకుంది. ఇక ఇక్కడి నుంచి వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలైనప్పుడు బౌండరీలు సాధించడంతో స్కోరు చకచకా కదిలింది. ఈ క్రమంలో రహానే 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్లో అతను స్టంపౌట్ కావడంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత పెరీరా సిక్స్‌తో కుదురుకున్నా... 16వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధోని వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన దశలో పెరీరా చెలరేగిపోయాడు. మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ 19వ ఓవర్లో వాట్సన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. విజయానికి 25 పరుగులు అవసరమైన స్థితిలో... మూడు బంతుల తేడాలో పెరీరా, అశ్విన్ (0)లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో రిచర్డ్సన్ మరో రెండు వికెట్లు తీయడంతో పుణే పరుగుల వేటలో వెనుకబడిపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రహానే (బి) పెరీరా 80; రాహుల్ (సి) ఇషాంత్ (బి) పెరీరా 7; డివిలియర్స్ (సి) అంకిత్ (బి) పెరీరా 83; వాట్సన్ నాటౌట్ 1; సర్ఫరాజ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-27; 2-182; 3-182. బౌలింగ్: ఇషాంత్ 4-0-47-0; పెరీరా 4-0-34-3; అంకిత్ శర్మ 4-0-31-0; రజత్ భాటియా 3-0-22-0; ఆర్.అశ్విన్ 3-0-22-0; ఎం.అశ్విన్ 2-0-29-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (స్టం) రాహుల్ (బి) షమ్సీ 60; డు ప్లెసిస్ (సి) హర్షల్ (బి) రిచర్డ్సన్ 2; పీటర్సన్ రిటైర్డ్‌హర్ట్ 0; స్మిత్ రనౌట్ 4; ధోని (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 41; పెరీరా (సి) మన్దీప్ (బి) వాట్సన్ 34; భాటియా (సి) వాట్సన్ (బి) రిచర్డ్సన్ 21; ఆర్.అశ్విన్ (సి) హర్షల్ (బి) వాట్సన్ 0; అంకిత్ నాటౌట్ 3; ఎం.అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-12; 2-18; 3-109; 4-120; 5-164; 6-165; 7-169; 8-169. బౌలింగ్: బిన్నీ 2-0-23-0; రిచర్డ్సన్ 3-0-13-3.; హర్షల్ పటేల్ 4-0-46-1; వాట్సన్ 4-0-31-2; షమ్సీ 4-0-36-1; ఇక్బాల్ అబ్దుల్లా 3-0-22-0. -
పుణే స్పిన్ బాగుంది
హర్షా భోగ్లే ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన 14 రోజులకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ సొంత వేదికకు చేరింది. అయితే ఆ జట్టుకిది ఇప్పుడు సొంత మైదానం అని చెప్పుకోవడానికి లేదు. మారిన పరిస్థితుల కారణంగా కేవలం తాత్కాలిక శిబిరంగానే ఉపయోగపడనుంది. ఇక లీగ్‌లో వారు కాస్త కఠినమైన దశకు చేరుకున్నారు. రానున్న పది రోజుల్లో ఐదు మ్యాచ్‌లు ఆడబోతున్నారు. వీటి తర్వాత తాజా లీగ్‌లో వారి అవకాశాలేమిటో అంచనా వేయవచ్చు. పుణే పిచ్‌పై నాకు ఆసక్తిగా ఉంది. ఎందుకంటే క్రితంసారి నేను చూసినప్పుడు ఇది మంచి సలాడ్ బౌల్‌లాగా అనిపించింది. ఎందుకంటే ఇది భారత్‌లోనే అత్యంత అందమైన స్టేడియాల్లో ఒకటి. పుణే జట్టు ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మురుగన్ అశ్విన్ ప్రభావం చూపిస్తున్నాడు. పేస్‌లో ఇషాంత్ శర్మ ముంబైతో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లను కెప్టెన్ ధోని వేయనిస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వికెట్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ జట్టు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ డు ప్లెసిస్ వేగవంతమైన ఆటతో ఒత్తిడి లేకుండా చూస్తున్నాడు. ఒక ఓపెనర్ స్ట్రయిక్ రేట్ 145-150 మధ ్య ఉంటే మంచిది. మరోవైపు మొత్తం పోస్టర్ బాయ్స్‌తో నిండిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని ఓడింది. ఇందులో ఓడిన రెండు మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసినవే. అయితే ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది కాబట్టి కెప్టెన్ విరాట్ కోహ్లి తమ తుది కూర్పు ఎలా ఉండాలో తెలుసుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఏకంగా వారు ఆరు మార్పులతో బరిలోకి దిగారు. ఇది తమ శిబిరంలో అనిశ్చితిని తెలియజేసింది. అయితే రిచర్డ్సన్, అబ్దుల్లాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నావరకైతే స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై బెంగళూరు మరోసారి చేజ్ చేయడంతో పాటు ఆర్.అశ్విన్.. కోహ్లికి బౌలింగ్ వేస్తే చూడాలని ఉంది. -
పుణే ఫటాఫట్
► 9 వికెట్లతో ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం ► తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ► సమష్టిగా రాణించిన ధోని బృందం అదరగొట్టిన అజింక్య రహానే కొత్త ఆశలతో... కొంగొత్త ఆశయాలతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఐపీఎల్-9 సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ... టి20 స్టార్లు, తలపండిన అనుభవజ్ఞులతో కూడిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో ధోని సేన 9 వికెట్లతో రోహిత్ బృందంపై నెగ్గి శుభారంభం చేసింది. ముంబై: భారీ హిట్టర్లతో కూడిన ముంబై ఇండియన్స్‌ను... రైజింగ్ పుణే రఫ్ఫాడించింది. బంతితో నిప్పులు చెరుగుతూ స్టార్ బలగాన్ని ఓ మాదిరి స్కోరుకే కట్టిపడేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోని బృందం 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. హర్భజన్ (30 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), అంబటి తిరుపతి రాయుడు (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అజింక్య రహానే (42 బంతుల్లో 66 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. డు ప్లెసిస్ (33 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. చకచకా వికెట్లు.... ఆరంభం నుంచే పుణే బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో ముంబై చకచకా వికెట్లు కోల్పోయింది. అడపాదడపా ఫోర్లు బాదినా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. రెండో ఓవర్లో రోహిత్ శర్మ (7), నాలుగో ఓవర్లో సిమన్స్ (8) అవుట్‌కాగా, ఐదో ఓవర్లో మార్ష్.... హార్దిక్ (9), బట్లర్ (0)లను పెవిలియన్‌కు పంపి షాకిచ్చాడు. పవర్‌ప్లేలో 4 వికెట్లకు 37 పరుగులు చేసిన ముంబైని మ్యాచ్ మధ్యలోనూ రజత్ భాటియా, మురుగన్ అశ్విన్‌లు కుదురుగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. క్రీజులో పాతుకుపోయిన రాయుడు సింగిల్స్‌కు పరిమితమైతే... రెండో ఎండ్‌లో భారీ హిట్టర్ పొలార్డ్ (1), గోపాల్ (2)లను అవుట్ చేయడంతో రన్‌రేట్ పడిపోయింది. 16వ ఓవర్లో రాయుడు అవుటైన తర్వాత హర్భజన్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో చివరి మూడు ఓవర్లలో 41 పరుగులు రాబట్టడంతో ముంబై స్కోరు 120 పరుగులు దాటగలిగింది. పుణే బౌలర్లలో ఇషాంత్, మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు. రహానే అదుర్స్... తొలి బంతి నుంచే దూకుడు చూపెట్టిన ఓపెనర్లు రహానే, డు ప్లెసిస్‌లు శుభారంభాన్నిచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదిన ఈ జోడి... ఐదో ఓవర్లో మాత్రం చెరో సిక్సర్ కొట్టింది. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో డు ప్లెసిస్ మరో రెండు సిక్సర్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 57/0కు చేరుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించినా.. ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగులు జోడించాక డు ప్లెసిస్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన పీటర్సన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) హర్భజన్ వేసిన వరుస ఓవర్లలో లాంగాన్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక 36 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో అజింక్య రహానే రెండు సిక్సర్లు సాధించాడు. దాంతో 32 బంతులు మిగిలి ఉండగానే పుణేకు విజయం దక్కింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) ఇషాంత్ 8; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 7, హార్దిక్ పాండ్యా (సి) ధోని (బి) మార్ష్ 9; బట్లర్ (సి) ఆర్.అశ్విన్ (బి) మార్ష్ 0; రాయుడు (సి) డు ప్లెసిస్ (బి) ఆర్.అశ్విన్ 22; పొలార్డ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 1; గోపాల్ (సి) రహానే (బి) ఎం.అశ్విన్ 2; హర్భజన్ నాటౌట్ 45; వినయ్ (సి) స్మిత్ (బి) ఆర్పీ సింగ్ 12; మెక్లీంగన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1-8; 2-29; 3-29; 4-30; 5-40; 6-51; 7-68, 8-96. బౌలింగ్: ఆర్పీ సింగ్ 3-0-30-1; ఇషాంత్ శర్మ 4-0-36-2; మిషెల్ మార్ష్ 4-0-21-2; రజత్ భాటియా 4-1-10-1; మురుగన్ అశ్విన్ 4-0-16-1; రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-1. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 66; డు ప్లెసిస్ (బి) హర్భజన్ 34; పీటర్సన్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (14.4 ఓవర్లలో 1 వికెట్‌కు) 126. వికెట్ల పతనం: 1-78. బౌలింగ్: మెక్లీంగన్ 3-0-27-0; బుమ్రా 3-0-30-0; వినయ్ కుమార్ 2-0-14-0; గోపాల్ 3-0-18-0; హర్భజన్ 3-0-24-1; హార్దిక్ పాండ్యా 0.4-0-12-0. ► 1 ముంబై ఇండియన్స్ జట్టులో టాప్-4 బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే ప్రథమం. ► 1 ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు (ఇషాంత్, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, అశ్విన్) ఇన్నింగ్స్‌లో తాము వేసిన తొలి బంతికే వికెట్‌ను తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ► 300 ఈ మ్యాచ్‌తో కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) తన కెరీర్లో 300వ టి20 మ్యాచ్‌ను ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పొలార్డ్ గుర్తింపు పొందాడు. ఇదే మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ 100వ టి20 మ్యాచ్‌ను... వినయ్ కుమార్ 100వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడారు. ► ఇంతకంటే మంచి ఆరంభం లభిస్తుందని అనుకోను. ఈ ఘనత బౌలర్లకే చెందుతుంది. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్థులు కూడా బాగానే పోరాడారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. వికెట్ ఎలా ఉన్నా... రహానే అద్భుతంగా ఆడతాడు. ఫినిషింగ్ కూడా బాగుంది. - ధోని (పుణే కెప్టెన్)