పఠాన్... ఫటాఫట్
► ప్లే ఆఫ్‌కు చేరువైన కోల్‌కతా
► పుణేపై 8 వికెట్లతో నైట్‌రైడర్స్ విజయం
కోల్‌కతా: బౌలర్ల సమష్టి కృషికి యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్లతోనెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 14 పాయింట్లకు చేరింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 103 పరుగులు చేశాక భారీ వర్షం పడింది. దీంతో కోల్‌కతాకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయానికి 9 ఓవర్లలో 66 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కోల్‌కతా 5 ఓవర్లలోనే రెండు వికెట్లకు 66 పరుగులు చేసి గెలిచింది.
పుణేను ఏ దశలోనూ కోల్‌కతా బౌలర్లు కుదురుకోనీయలేదు. జార్జి బెయిలీ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా ఖవాజా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఓమాదిరిగా ఆడాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓపెనర్ రహానే (2) విఫలం కావడం జట్టును ఇబ్బంది పెట్టింది. బెయిలీ, సౌరభ్ తివారీ (12 బంతుల్లో 13; 1 ఫోర్) మూడో వికెట్‌కు జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. బెయిలీ అవుటయ్యే సమయానికి 10.3 ఓవర్లలో 74 పరుగులతో పుణే కాస్త పటిష్టంగానే కనిపించినా ఆ తర్వాత లయ తప్పింది. బంతి విపరీతంగా టర్న్ అవుతుండడంతో కెప్టెన్ ధోని కూడా భారీ షాట్లకు వెళ్లే సాహసం చేయలేదు. దీంతో 22 బంతులాడిన తను ఒక్క బౌండరీ కూడా లేకుండా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా... షకీబ్, రాజ్‌పుత్, రస్సెల్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా తొలి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఉతప్ప (4), గంభీర్ (0)ల వికెట్లు కోల్పోయింది. అయితే యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే (10 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుని పరుగులు రాబట్టారు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో యూసుఫ్ వరుసగా 6,4,4 బాది... అదే జోరుతో చెలరేగిపోవడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కోల్‌కతా గెలిచింది.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) రస్సెల్ 2; ఖవాజా (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) షకీబ్ 21; బెయిలీ (స్టంప్డ్) ఉతప్ప (బి) పీయూష్ చావ్లా 33; సౌరభ్ తివారీ (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 13; ఇర్ఫాన్ (రనౌట్) 7; ధోని నాటౌట్ 8; పెరీరా (సి) పాండే (బి) పీయూష్ చావ్లా 13; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 6 వికెట్లకు) 103.
వికెట్ల పతనం: 1-19, 2-26, 3-67, 4-74, 5-87, 6-102.
బౌలింగ్: రస్సెల్ 2-0-11-1; మోర్కెల్ 3-0-22-0; షకీబ్ 3-0-21-1; రాజ్‌పుత్ 2-0-14-1; పీయూష్ చావ్లా 4-0-21-2; నరైన్ 3.4-0-10-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 4; గంభీర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 0; మనీష్ పాండే నాటౌట్ 15; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (5 ఓవర్లలో 2 వికెట్లకు) 66.
వికెట్ల పతనం: 1-5, 2-8.
బౌలింగ్: అశ్విన్ 2-0-30-2; దిండా 1-0-13-0; ఎం.అశ్విన్ 1-0-13-0; జంపా 1-0-8-0.