విరాట్ విశ్వరూపం
► అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన కోహ్లి
► సీజన్‌లో రెండో శతకంతో సంచలనం
► ఏడు వికెట్లతో పుణే ఓటమి
గేల్‌ను మించిన విధ్వంసం... డివిలియర్స్‌ను మించిన వైవిధ్యం... ఒక సీజన్‌లో ఒక సెంచరీ కొడితేనే అద్భుతం... అలాంటిది ఒకే సీజన్‌లో రెండోసారి కూడా శతకం బాదడం అంటే... మహాద్భుతం. దీనిని చేసి చూపించాడు బెంగళూరు కెప్టెన్ కోహ్లి. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆరంభం నుంచి అత్యంత నిలకడగా ఆడుతున్న విరాట్... పుణే మీద విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో కేవలం 58 బంతుల్లోనే అజేయంగా 108 పరుగులు బాదేశాడు. ఎదురుగా ఉన్న కొండంత లక్ష్యం కూడా కోహ్లి విధ్వంసం ముందు చిన్నబోయింది. బెంగళూరు ఖాతాలో కీలకమైన విజయం చేరింది.
బెంగళూరు: ప్రత్యర్థి జట్టులో ఎంత పెద్ద హిట్టర్ ఉన్నా తన వ్యూహాలతో కట్టడి చేయడం ధోని కెప్టెన్సీ గొప్పతనం. కానీ ధోనికి కూడా కొరుకుడుపడని క్రికెటర్ కోహ్లి. అందుకే విరాట్ (58 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసాన్ని దగ్గరి నుంచి చూడటం మినహా ‘మిస్టర్ కూల్’ ఏం చేయలేకపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పరుగుల ‘వేటగాడు’ బెంగళూరుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అజేయ సెంచరీతో భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదిపారేశాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏడు వికెట్లతో పుణే సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది.
టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానే (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తివారీ (39 బంతుల్లో 52; 9 ఫోర్లు) వేగంగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో వాట్సన్ (3/24) ఆక ట్టుకున్నాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. వాట్సన్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు.
అద్భుత భాగస్వామ్యం
గత మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పుణే ఓపెనర్లు రహానే, ఖవాజా (6 బంతుల్లో 16; 2 పోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వరుసగా సిక్సర్, ఫోర్‌తో జోరును ప్రదర్శించిన ఖవాజా... రహానేతో సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్ తివారీ, రహానే కలిసి వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసే సరికి పుణే వికెట్ నష్టానికి 89 పరుగులతో పటిష్టంగా ఉంది.
37 బంతుల్లో తివారీ, 34 బంతుల్లో రహానే అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించాక చాహల్ బౌలింగ్‌లో తివారీ స్టంపౌట్ అయ్యాడు. అయితే స్లాగ్ ఓవర్లలో వాట్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడంతో పుణే జోరుకు బ్రేక్ పడింది. చివరి ఓవర్లో అశ్విన్ (5 బంతుల్లో 10; 1 సిక్సర్), భాటియా (4 బంతుల్లో 9; 1 సిక్సర్) చెరో సిక్సర్ బాది 16 పరుగులు చేయడంతో పుణే 190 మార్కును అధిగమించింది.
ఓపెనింగ్ అదుర్స్
బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, రాహుల్ (35 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్సర్లు) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి 18 బంతుల్లో కేవలం 10 పరుగులే చేసిన ఈ జోడీ... క్రమంగా జోరు పెంచడంతో పవర్‌ప్లేలో 46 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో రాహుల్‌తో పాటు డివిలియర్స్ (1) కూడా అవుటయ్యాడు. అప్పటికి బెంగళూరు విజయం కోసం 48 బంతుల్లో 95 పరుగులు చేయాలి. ఈ దశలో షేన్ వాట్సన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పెరీరా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఐదు ఫోర్లు కొట్టిన వాట్సన్.. తర్వాత భాటియా ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కానీ 16వ ఓవర్లో ఆర్పీసింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఈ దశలో పుణే పుంజుకున్నట్లు కనిపించింది. కానీ విరాట్ కోహ్లి ఇక్కడి నుంచి ఊచకోత మొదలుపెట్టాడు. విజయానికి మూడు ఓవర్లలో40 పరుగులు అవసరం కాగా... జంపా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్... ఆర్పీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను తేల్చేశాడు. ఈ క్రమంలో 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో దిండా బౌలింగ్‌లో చక్కటి ఫ్లిక్‌తో బౌండరీ కొట్టిన విరాట్ విజయవంతంగా మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (బి) వాట్సన్ 74; ఉస్మాన్ ఖవాజా రనౌట్ 16; తివారీ (స్టం) రాహుల్ (బి) చాహల్ 52; ధోని (సి) రసూల్ (బి) వాట్సన్ 9; పెరీరా (సి) వాట్సన్ (బి) జోర్డాన్ 14; బెయిలీ (సి) రాహుల్ (బి) వాట్సన్ 0; భాటియా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191.
వికెట్ల పతనం: 1-26; 2-132; 3-144; 4-171; 5-171; 6-174.
బౌలింగ్: బిన్నీ 2-0-17-0; రసూల్ 3-0-37-0; జోర్డాన్ 4-0-43-1; వాట్సన్ 4-0-24-3; ఫించ్ 3-0-31-0; చాహల్ 4-0-38-1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి నాటౌట్ 108; రాహుల్ (సి) బెయిలీ (బి) జంపా 38; డివిలియర్స్ (సి) పెరీరా (బి) జంపా 1; వాట్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఆర్పీ సింగ్ 36; హెడ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 195.
వికెట్ల పతనం: 1-94; 2-97; 3-143.
బౌలింగ్: దిండా 3.3-0-26-0; ఆర్పీ సింగ్ 4-0-37-1; పెరీరా 3-0-40-0; జంపా 4-0-35-2; భాటియా 4-0-45-0; అశ్విన్ 1-0-7-0.
►1సీజన్‌లో 500కు పైగా పరుగులు మూడు సార్లు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రికార్డు. గతంలో సచిన్ రెండు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు.
► ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు.