
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఉద్దేశించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక్కడ క్యూరేటర్‌గా ఉన్నంత కాలం పిచ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. పిచ్ రూపకల్పన గురించి సలహాలు ఇచ్చే అధికారం ఫ్రాంఛైజీలకు లేదని పేర్కొన్నాడు.
ఏడు వికెట్ల తేడాతో ఓటమి
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చేతులెత్తేసింది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు.
కృనాల్ పాండ్యాకు మూడు
ఇక ఆర్బీసీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా మూడు, సూయశ్ శర్మ ఒక వికెట్ తీయగా.. పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ రెండు, యశ్ దయాళ్, రసిఖ్ ధార్ సలాం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34) రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు.
రహానే కామెంట్స్
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి పిచ్‌ను కవర్లతో కప్పేసి ఉంచారు.
నిజానికి మా జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అద్భుతంగా ఆడతారు. ఎలాంటి వికెట్ మీదైనా రాణిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి అంతగొప్పగా లేదు’’ అని పేర్కొన్నాడు.
రహానే వ్యాఖ్యలపై ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తాజాగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్ ఎలా ఉండాలో చెప్పే అధికారం ఫ్రాంఛైజీలకు లేదు.
ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?
నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నాను. అందుకే మరీ మరీ చెప్తున్నా.. ఈడెన్ గార్డెన్స్ వికెట్‌లో ఇప్పుడు.. అదే విధంగా భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు.
అయినా ఆర్సీబీ స్పిన్నర్లు మొత్తంగా నాలుగు వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారు? ఆర్సీబీలో కృనాల్ మూడు, సూయశ్ ఒక వికెట్ పడగొట్టారు’’ అని సుజన్ ముఖర్జీ కేకేఆర్ స్పిన్నర్ల తీరును విమర్శించాడు.
ఇక ఈ సీజన్‌లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు కేకేఆర్ గువాహతికి పయనమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి పోరులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. అనంతరం వాంఖడేలో మార్చి 31న ముంబైతో తలపడుతుంది. మళ్లీ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్.. ఏప్రిల్ 3న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్