
విరాట్ కోహ్లి (Photo Courtesy: BCCI/IPL)
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.
భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.
ఒకరోజు జైలులో
ఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం.
అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు.

PC: BCCI/IPL
పశ్చాత్తాపం లేదు
అయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.
ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.
ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెద్ద మనసుతో క్షమించండి
అయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.
వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్‌లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.
శుక్లా తీరుపై విమర్శలు
‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.
కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.
ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు
👉కోల్‌కతా- 174/8 (20)
👉ఆర్సీబీ- 177/3 (16.2)
👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపు
చదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
Comments
Please login to add a commentAdd a comment