భలా.... బెంగళూరు
► సమష్టి ప్రదర్శనతో పుణేపై విజయం
► మళ్లీ చెలరేగిన డివిలియర్స్, కోహ్లి
► బంతితో మెరిసిన రిచర్డ్‌సన్, వాట్సన్
► లక్ష్య ఛేదనలో ధోని సేన విఫలం
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసినా దక్కని విజయాలు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు పరిస్థితి ఇది. కానీ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాటింగ్‌కుతోడు బౌలర్లూ రాణించడంతో బెంగళూరు గాడిలో పడింది. లక్ష్య ఛేదనలో పుణే విజృంభించినా... చివర్లో సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు గట్టెక్కింది.
పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పైచేయి సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణే బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించినా... స్లాగ్ ఓవర్లలో తిరుగులేని బౌలింగ్‌తో ధోనిసేనను కోహ్లి బృందం కట్టడి చేసింది. దీంతో ఐపీఎల్-9లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 13 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై నెగ్గింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. డివిలియర్స్ (46 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తర్వాత పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. రహానే (46 బంతుల్లో 60; 8 ఫోర్లు), ధోని (38 బంతుల్లో 41; 3 ఫోర్లు), తిసారా పెరీరా (13 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది.
అద్భుత భాగస్వామ్యం...
ఆర్‌సీబీ ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (7) నిరాశపర్చినా... కెప్టెన్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడో ఓవర్‌లోనే సిక్స్, ఫోర్‌తో జోరు పెంచినా... తొలి 22 బంతుల్లో 27 పరుగులు చేశాక రాహుల్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. పుణే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించాడు. దీంతో పవర్ ప్లేలో 48/1తో ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 79/1కి చేరుకుంది. ఆ తర్వాత మురుగన్ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఏబీ మరింత రెచ్చిపోయాడు.
అతను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో కోహ్లి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో ఏబీ 25; కోహ్లి 47 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఈ ఇద్దరి దెబ్బకు పుణే బౌలర్లు పరుగులు భారీగానే సమర్పించుకున్నారు. 18వ ఓవర్‌లో తొలి సిక్స్ కొట్టిన విరాట్... తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే ఓవర్‌లో డివియర్స్ మరో సిక్సర్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్‌లో వరుస బంతుల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 95 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పెరీరా 3 వికెట్లు తీశాడు.
పెరీరా దూకుడు...
ఓపెనర్లలో రహానే కుదురుగా ఆడినా... డు ప్లెసిస్ (2) నిరాశపరిచాడు. పీటర్సన్ ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (4) పెవిలియన్‌కు చేరడంతో పుణేకు సరైన శుభారంభం లభించలేదు. రహానేతో కలిసి ధోని ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నా రన్‌రేట్ మందగించింది. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 36/2కు చేరుకుంది. ఈ దశలో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపించి మూడు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో ధోని సేన కాస్త కోలుకుంది. ఇక ఇక్కడి నుంచి వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలైనప్పుడు బౌండరీలు సాధించడంతో స్కోరు చకచకా కదిలింది.
ఈ క్రమంలో రహానే 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్‌లో అతను స్టంపౌట్ కావడంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత పెరీరా సిక్స్‌తో కుదురుకున్నా... 16వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధోని వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన దశలో పెరీరా చెలరేగిపోయాడు. మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ 19వ ఓవర్‌లో వాట్సన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. విజయానికి 25 పరుగులు అవసరమైన స్థితిలో... మూడు బంతుల తేడాలో పెరీరా, అశ్విన్ (0)లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో రిచర్డ్‌సన్ మరో రెండు వికెట్లు తీయడంతో పుణే పరుగుల వేటలో వెనుకబడిపోయింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రహానే (బి) పెరీరా 80; రాహుల్ (సి) ఇషాంత్ (బి) పెరీరా 7; డివిలియర్స్ (సి) అంకిత్ (బి) పెరీరా 83; వాట్సన్ నాటౌట్ 1; సర్ఫరాజ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1-27; 2-182; 3-182.
బౌలింగ్: ఇషాంత్ 4-0-47-0; పెరీరా 4-0-34-3; అంకిత్ శర్మ 4-0-31-0; రజత్ భాటియా 3-0-22-0; ఆర్.అశ్విన్ 3-0-22-0; ఎం.అశ్విన్ 2-0-29-0.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (స్టం) రాహుల్ (బి) షమ్సీ 60; డు ప్లెసిస్ (సి) హర్షల్ (బి) రిచర్డ్‌సన్ 2; పీటర్సన్ రిటైర్డ్‌హర్ట్ 0; స్మిత్ రనౌట్ 4; ధోని (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 41; పెరీరా (సి) మన్‌దీప్ (బి) వాట్సన్ 34; భాటియా (సి) వాట్సన్ (బి) రిచర్డ్‌సన్ 21; ఆర్.అశ్విన్ (సి) హర్షల్ (బి) వాట్సన్ 0; అంకిత్ నాటౌట్ 3; ఎం.అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్‌సన్ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1-12; 2-18; 3-109; 4-120; 5-164; 6-165; 7-169; 8-169.
బౌలింగ్: బిన్నీ 2-0-23-0; రిచర్డ్‌సన్ 3-0-13-3.; హర్షల్ పటేల్ 4-0-46-1; వాట్సన్ 4-0-31-2; షమ్సీ 4-0-36-1; ఇక్బాల్ అబ్దుల్లా 3-0-22-0.