Pereira
-
కొండ చరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయి 14 మంది మృతి
Mudslide In Western Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురదనీరు చేరడంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చరియాలు విరిగిపడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండచరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అయ్యో జగదీశ్ ! చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావే!!) -
ఉత్కంఠపోరులో శ్రీలంక గెలుపు
కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో శ్రీలంక వికెట్ తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. షై హోప్ (115; 10 ఫోర్లు) శతకంతో రాణించాడు. ఇసురు ఉదానకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్‌లో అవిష్క ఫెర్నాండో (50; 5 ఫోర్లు, సిక్స్), దిముత్ కరుణరత్నే (52; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (42; 4 ఫోర్లు) రాణించారు. మిడిలార్డర్ తడబడ్డా... చివర్లో తిసారా పెరీరా (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వనిందు హసరంగ డిసిల్వా (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడి మిగతా పనిని పూర్తి చేశారు. రెండో వన్డే ఈ నెల 26న జరుగుతుంది. -
గెలిపించిన ఆమ్లా, పెరీరా
రెండో టి20లో వరల్డ్ ఎలెవన్ విజయం లాహోర్: పాకిస్తాన్‌తో రెండో టి20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ విజయ లక్ష్యం 175... చివరి 4 ఓవర్లలో గెలిచేందుకు 51 పరుగులు చేయాలి. హషీం ఆమ్లా (55 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాగానే ఆడుతున్నా, జట్టు విజయంపై సందేహాలు ఉన్నాయి. అయితే ఈ దశలో తిసార పెరీరా (19 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) ఒక్కసారిగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడి చేయాల్సిన 51లో తానొక్కడే 43 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో పెరీరా, బద్రీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఎప్పుడో ఆరున్నరేళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ఈ సిరీస్ కారణంగా 41 ఏళ్ల వయసులో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగగా... పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ నిలిచాడు. -
భలా.... బెంగళూరు
► సమష్టి ప్రదర్శనతో పుణేపై విజయం ► మళ్లీ చెలరేగిన డివిలియర్స్, కోహ్లి ► బంతితో మెరిసిన రిచర్డ్సన్, వాట్సన్ ► లక్ష్య ఛేదనలో ధోని సేన విఫలం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసినా దక్కని విజయాలు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు పరిస్థితి ఇది. కానీ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాటింగ్కుతోడు బౌలర్లూ రాణించడంతో బెంగళూరు గాడిలో పడింది. లక్ష్య ఛేదనలో పుణే విజృంభించినా... చివర్లో సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు గట్టెక్కింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పైచేయి సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణే బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించినా... స్లాగ్ ఓవర్లలో తిరుగులేని బౌలింగ్‌తో ధోనిసేనను కోహ్లి బృందం కట్టడి చేసింది. దీంతో ఐపీఎల్-9లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 13 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై నెగ్గింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. డివిలియర్స్ (46 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తర్వాత పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. రహానే (46 బంతుల్లో 60; 8 ఫోర్లు), ధోని (38 బంతుల్లో 41; 3 ఫోర్లు), తిసారా పెరీరా (13 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అద్భుత భాగస్వామ్యం... ఆర్సీబీ ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (7) నిరాశపర్చినా... కెప్టెన్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడో ఓవర్లోనే సిక్స్, ఫోర్‌తో జోరు పెంచినా... తొలి 22 బంతుల్లో 27 పరుగులు చేశాక రాహుల్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. పుణే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించాడు. దీంతో పవర్ ప్లేలో 48/1తో ఉన్న స్కోరు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 79/1కి చేరుకుంది. ఆ తర్వాత మురుగన్ అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఏబీ మరింత రెచ్చిపోయాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో కోహ్లి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో ఏబీ 25; కోహ్లి 47 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఈ ఇద్దరి దెబ్బకు పుణే బౌలర్లు పరుగులు భారీగానే సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో తొలి సిక్స్ కొట్టిన విరాట్... తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే ఓవర్లో డివియర్స్ మరో సిక్సర్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 95 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పెరీరా 3 వికెట్లు తీశాడు. పెరీరా దూకుడు... ఓపెనర్లలో రహానే కుదురుగా ఆడినా... డు ప్లెసిస్ (2) నిరాశపరిచాడు. పీటర్సన్ ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్ (4) పెవిలియన్‌కు చేరడంతో పుణేకు సరైన శుభారంభం లభించలేదు. రహానేతో కలిసి ధోని ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నా రన్‌రేట్ మందగించింది. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 36/2కు చేరుకుంది. ఈ దశలో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపించి మూడు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో ధోని సేన కాస్త కోలుకుంది. ఇక ఇక్కడి నుంచి వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలైనప్పుడు బౌండరీలు సాధించడంతో స్కోరు చకచకా కదిలింది. ఈ క్రమంలో రహానే 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే 15వ ఓవర్లో అతను స్టంపౌట్ కావడంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత పెరీరా సిక్స్‌తో కుదురుకున్నా... 16వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధోని వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన దశలో పెరీరా చెలరేగిపోయాడు. మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ 19వ ఓవర్లో వాట్సన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. విజయానికి 25 పరుగులు అవసరమైన స్థితిలో... మూడు బంతుల తేడాలో పెరీరా, అశ్విన్ (0)లను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో రిచర్డ్సన్ మరో రెండు వికెట్లు తీయడంతో పుణే పరుగుల వేటలో వెనుకబడిపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రహానే (బి) పెరీరా 80; రాహుల్ (సి) ఇషాంత్ (బి) పెరీరా 7; డివిలియర్స్ (సి) అంకిత్ (బి) పెరీరా 83; వాట్సన్ నాటౌట్ 1; సర్ఫరాజ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-27; 2-182; 3-182. బౌలింగ్: ఇషాంత్ 4-0-47-0; పెరీరా 4-0-34-3; అంకిత్ శర్మ 4-0-31-0; రజత్ భాటియా 3-0-22-0; ఆర్.అశ్విన్ 3-0-22-0; ఎం.అశ్విన్ 2-0-29-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (స్టం) రాహుల్ (బి) షమ్సీ 60; డు ప్లెసిస్ (సి) హర్షల్ (బి) రిచర్డ్సన్ 2; పీటర్సన్ రిటైర్డ్‌హర్ట్ 0; స్మిత్ రనౌట్ 4; ధోని (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 41; పెరీరా (సి) మన్దీప్ (బి) వాట్సన్ 34; భాటియా (సి) వాట్సన్ (బి) రిచర్డ్సన్ 21; ఆర్.అశ్విన్ (సి) హర్షల్ (బి) వాట్సన్ 0; అంకిత్ నాటౌట్ 3; ఎం.అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-12; 2-18; 3-109; 4-120; 5-164; 6-165; 7-169; 8-169. బౌలింగ్: బిన్నీ 2-0-23-0; రిచర్డ్సన్ 3-0-13-3.; హర్షల్ పటేల్ 4-0-46-1; వాట్సన్ 4-0-31-2; షమ్సీ 4-0-36-1; ఇక్బాల్ అబ్దుల్లా 3-0-22-0. -
కసితీరా కొట్టారు
► రెండో టి20లో భారత్ ఘన విజయం ► రాణించిన ధావన్, రోహిత్, రైనా ► పెరీరా ‘హ్యాట్రిక్’ వృథా ► మూడో మ్యాచ్ రేపు వైజాగ్‌లో తొలి టి20లో ఘోర ఓటమి కసి పెంచిందేమో... భారత క్రికెటర్లు రెచ్చిపోయారు. వికెట్ కాస్త ఫ్లాట్‌గా కనిపించగానే వీర బాదుడు బాదేశారు. ఇక తమ శైలికి సరిగ్గా సరిపోయే పిచ్‌పై భారత స్పిన్నర్లూ పండగ చేసుకున్నారు. వెరసి... శ్రీలంకను కసితీరా కొట్టారు. రెండో టి20లో ఏకంగా 69 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి టి20 రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. రాంచీ: సొంతగడ్డపై తమ బ్యాటింగ్ బలాన్ని చూపెట్టిన భారత్... ప్రతీకార మ్యాచ్‌లో రెచ్చిపోయింది. శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. చండిమల్ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు), షనక (18 బంతుల్లో 27; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడారు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్‌లో జరుగుతుంది. ధావన్ జోరు భారత్‌కు రోహిత్, ధావన్ చక్కని శుభారంభం ఇచ్చారు. తొలి బంతిని రోహిత్ బౌండరీకి తరలిస్తే.. తర్వాతి రెండు ఓవర్లలో ధావన్ రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో ఓవర్లో రజిత నాలుగు ఫోర్లు సమర్పించుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 70 పరుగులు చేసింది. అయితే 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్‌ను ఏడో ఓవర్లో చమీరా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే, రోహిత్ మంచి సమన్వయంతో ఆడినా.. లంక బౌలర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో రోహిత్ ఒక్క సిక్సర్ బాదితే... తర్వాతి ఓవర్లో రహానే ఓ రెండు ఫోర్లతో అలరించాడు. అయితే ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్‌కావడంతో భారత్ స్కోరు 127/3గా మారింది. ఈ దశలో రైనా, పాండ్యాల జోరుతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 17వ ఓవర్లో పాండ్యా రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్లో రైనా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కానీ 19వ ఓవర్లో పెరీరా మ్యాజిక్ చేశాడు. వరుసగా మూడు బంతుల్లో పాండ్యా, రైనాతో పాటు యువరాజ్ (0)నూ అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. రైనా, పాండ్యా నాలుగో వికెట్‌కు 4.2 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. చివర్లో ధోని (9 నాటౌట్), జడేజా (1 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. పెరీరా 3, చమీరా 2 వికెట్లు తీశారు. చకచకా వికెట్ల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంకేయులు ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. ఓపెనర్లు గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాక వరుస బంతుల్లో అవుటయ్యారు. దీంతో లంక 68 పరుగులకు సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సిరివర్ధన (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ యువరాజ్, జడేజాలు నాణ్యమైన బంతులతో ఈ ఇద్దరినీ నిలువరించారు. ఆరో వికెట్‌కు 48 పరుగులు జత చేశాక షనక అవుటయ్యాడు. ఆ తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలో పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. ‘భారత క్రికెట్లో ప్రయోగాలు అనే మాటను నిషేధించాం. టాప్ ఆర్డర్లో అందరూ నిలకడగా ఆడుతున్నారు. కాబట్టి మిగిలిన వాళ్లకి అవకాశాలు కల్పించాలని అనుకున్నాం. ఈ మ్యాచ్ లో అందరూ అన్ని విభాగాల్లో రాణించారు.’ - ధోని స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186. బౌలింగ్: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన 1-0-6-0; షనక 1-0-12-0 శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0. -
దూకు దూకు దూకుతాడనే టెన్షనూ...!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే గొప్ప కెప్టెన్ అవుతాడు. సినిమా డైలాగ్‌లా అనిపించినా క్రికెట్లో ఇది కఠోర వాస్తవం. ఓ మ్యాచ్‌లో నెగ్గడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేయొచ్చు. బ్యాట్‌తో, బంతితో ఎలాంటి దూకుడునైనా చూపించొచ్చు. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం సంయమనం ఉండాలి. ఆటగాడిగా కోహ్లి గతంలో అనేకసార్లు నియంత్రణ కోల్పోయాడు. కెప్టెన్ అయ్యాక కూడా తన శైలి పెద్దగా మారలేదు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌లో మిగిలిన జట్టుకు కూడా ఇదే అలవాటు చేశాడు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేదే ఇప్పుడు టెన్షన్. తాను చూపించిన మార్గమే... విరాట్ కోహ్లికి వివాదాలతో అవినాభావ సంబంధం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అతని నోటినుంచి వచ్చే బూతు పురాణం చాలా ప్రసిద్ధికెక్కింది! మూడేళ్ల క్రితం సిడ్నీ టెస్టు సందర్భంగా ప్రేక్షకులకు వేలు చూపించడం, ఐపీఎల్లో గంభీర్‌తో గొడవ, హరారేలో అంపైర్లతో వాదన అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మిషెల్ జాన్సన్‌ను ఎదుర్కోవడంలో చూపించిన తెగువకు ఆరంభంలో అభినందనలు అందించినా...అది అతి కావడంతో సమస్యగా మారింది. అసలు 2008లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ కోహ్లి, ఆ టోర్నీలోనే రూబెల్ హుస్సేన్‌తో దూషణకు దిగిన ఘటన అతని వివాదాలకు బీజం వేసింది. ఇక ఇటీవల వన్డే ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్‌ను కూడా అకారణంగా తిట్టడం, చివరకు ఎలాగోలా దానికి ముగింపు పలకడం ఎవరి మదినుంచీ చెరిగిపోలేదు. ఇదంతా ఆటగాడిగా అతని ట్రాక్ రికార్డు. అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, కోహ్లి అందించిన విజయాలు ఈ ఘటనలను మరచిపోయేలా చేసినా... ఏదో ఒక సమయంలో అవి మళ్లీ బయటకు వస్తున్నాయి. నాయకుడే ఇలా ఉంటే... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న కుషాల్ పెరీరా క్యాచ్‌ను మిడాఫ్‌లో అందుకున్న కోహ్లి ఆగ్రహంతో బంతిని ఫుట్బాల్లా తన్నాడు. నోటినుంచి నాలుగు ‘బూతులు’ కూడా జాలువారాయి. కెప్టెన్‌ను చూశాకేనేమో బౌలర్ ఇషాంత్ కూడా పెరీరాను ఏదో అన్నాడు. ఆ సమయానికి భారత్ టెస్టులో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ హోరాహోరీగా ఏమీ సాగడం లేదు. కానీ విరాట్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. ‘మాకు గౌరవం ఇవ్వని వారిని మేం గౌరవించాల్సిన పని లేదు’ అంటూ ఆస్ట్రేలియా సిరీస్‌నుంచి కోహ్లి తనను తాను సమర్థించుకుంటూ రావచ్చు గాక... కానీ అన్నింటికి అదే సమాధానం కాబోదు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లి తనలాగే తన జట్టు సభ్యులు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దూకుడు... దూకుడు అంటూ ఒకటే పాఠం వల్లె వేస్తున్నాడు. కోహ్లి దూకుడే సిరీస్ విజయం అందించిందని కొంత మంది చెబుతున్నా, గత కొన్నేళ్లలో అత్యంత బలహీనంగా కనిపించిన ఈ శ్రీలంక జట్టుపై గెలిచేందుకు అది అవసరమా అనిపిస్తుంది. గంగూలీతో పోలిక 2002లో లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సంబరాలు ఎవరూ మరచిపోలేరు. అంతకు ముందునుంచి కూ డా గంగూలీ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఆస్ట్రేలియాలాంటి జట్టుతో కూడా మాటల యుద్ధానికి సై అనేవాడు. ఇప్పుడు కోహ్లి ప్రవర్తన కొంత వరకు సౌరవ్‌ను గుర్తుకు తెస్తోంది. ‘గాంధీయవాది’లాగే ఉంటే కుదరదు కాబట్టి ‘దూకుడు’ అనే స్టాంప్ అందరికీ ఉండాలి, అప్పుడే వారు ఆటలో దూసుకుపోగలరని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. అయితే నాడు ఒక వైపు అగ్నిలా సౌరవ్ ఉన్నా పరిస్థితిని శాంతపరిచేందుకు జట్టులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లాంటి దిగ్గజాలు ఉండేవారు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లైన వీరి అండ గంగూలీకి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు సహకరించింది. కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నా... సైమండ్స్, హర్భజన్ వివాదాన్ని సాధ్యమైనంత తగ్గించడంలో సచిన్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం మరచిపోలేం. కానీ కోహ్లి పరిస్థితి అలా కాదు. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కొత్త జట్టు. తనకు ఉన్న అనుభవంతోనే జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన పనిలో కోహ్లి ఉన్నాడు. సహజంగానే కెప్టెన్ మాట, అతని ప్రవర్తన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ‘ఓహో... ఇలా ఉండటమే కెప్టెన్‌కు ఇష్టం’ అనే సందేశం ఇప్పుడు ఆటగాళ్లకు వెళుతోంది. అనవసరపు దూకుడుతో ఒక ప్రధాన ఆటగాడిని కీలక మ్యాచ్‌కు జట్టు కోల్పోవడం అర్థం లేనిది. ఇలాంటిదే పునరావృతం అయితే రేపు కోహ్లిపై కూడా నిషేధం పడవచ్చు. మారాల్సిన సమయం కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. 2 గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుంది. అప్పుడే అతని పరిణతిపై మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే చెప్పే దూకుడు మాత్రమే జట్టుకు విజయాన్ని అందించలేదని ఇప్పటికే అతనికి అర్థమై ఉండాలి. నిజానికి తన స్వభావాన్ని సరైన దిశలో చూపిస్తే అద్భుతాలు చేయగలనని అతను తన బ్యాటింగ్‌తో చాలా సార్లు నిరూపించాడు. ఆటగాడిగా కోహ్లి అందించిన విజయాలు వెలకట్టలేనివి. మరో వైపు సంగక్కరకు ఫేర్వెల్ ఇవ్వడంలో, మూడో టెస్టులో సెంచరీ సాధించిన మ్యాథ్యూస్‌ను భుజంపై తట్టి అభినందించడం చూస్తే ప్రత్యర్థిని గౌరవించగల స్ఫూర్తి కూడా అతనిలో ఉంది. అయితే అనవసరంగా తెచ్చి పెట్టుకునే ఆవేశాన్ని అతను ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మరీ మెషీన్ తరహాలో బిగదీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.... దూషణలకు దిగే, గొడవలు పెట్టుకునే కెప్టెన్‌ను మనం చూడాలనుకోవడం లేదు. టీవీలో కనిపించే ఈ ఘటనలు అతడి పేరును మరింత చెడగొడతాయి. తన సీనియర్ ధోని నుంచి ఏది నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా... సంయమనంగా ఉండటంలో మాత్రం ‘కెప్టెన్ కూల్’ను అనుసరించాల్సిందే.