దూకు దూకు దూకుతాడనే టెన్షనూ...!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే గొప్ప కెప్టెన్ అవుతాడు. సినిమా డైలాగ్‌లా అనిపించినా క్రికెట్‌లో ఇది కఠోర వాస్తవం. ఓ మ్యాచ్‌లో నెగ్గడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేయొచ్చు. బ్యాట్‌తో, బంతితో ఎలాంటి దూకుడునైనా చూపించొచ్చు. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం సంయమనం ఉండాలి. ఆటగాడిగా కోహ్లి గతంలో అనేకసార్లు నియంత్రణ కోల్పోయాడు. కెప్టెన్ అయ్యాక కూడా తన శైలి పెద్దగా మారలేదు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌లో మిగిలిన జట్టుకు కూడా ఇదే అలవాటు చేశాడు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేదే ఇప్పుడు టెన్షన్.
తాను చూపించిన మార్గమే...
విరాట్ కోహ్లికి వివాదాలతో అవినాభావ సంబంధం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అతని నోటినుంచి వచ్చే బూతు పురాణం చాలా ప్రసిద్ధికెక్కింది! మూడేళ్ల క్రితం సిడ్నీ టెస్టు సందర్భంగా ప్రేక్షకులకు వేలు చూపించడం, ఐపీఎల్‌లో గంభీర్‌తో గొడవ, హరారేలో అంపైర్లతో వాదన అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మిషెల్ జాన్సన్‌ను ఎదుర్కోవడంలో చూపించిన తెగువకు ఆరంభంలో అభినందనలు అందించినా...అది అతి కావడంతో సమస్యగా మారింది.
అసలు 2008లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ కోహ్లి, ఆ టోర్నీలోనే రూబెల్ హుస్సేన్‌తో దూషణకు దిగిన ఘటన అతని వివాదాలకు బీజం వేసింది. ఇక ఇటీవల వన్డే ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్‌ను కూడా అకారణంగా తిట్టడం, చివరకు ఎలాగోలా దానికి ముగింపు పలకడం ఎవరి మదినుంచీ చెరిగిపోలేదు. ఇదంతా ఆటగాడిగా అతని ట్రాక్ రికార్డు. అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, కోహ్లి అందించిన విజయాలు ఈ ఘటనలను మరచిపోయేలా చేసినా... ఏదో ఒక సమయంలో అవి మళ్లీ బయటకు వస్తున్నాయి.
నాయకుడే ఇలా ఉంటే...
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న కుషాల్ పెరీరా క్యాచ్‌ను మిడాఫ్‌లో అందుకున్న కోహ్లి ఆగ్రహంతో బంతిని ఫుట్‌బాల్‌లా తన్నాడు. నోటినుంచి నాలుగు ‘బూతులు’ కూడా జాలువారాయి. కెప్టెన్‌ను చూశాకేనేమో బౌలర్ ఇషాంత్ కూడా పెరీరాను ఏదో అన్నాడు. ఆ సమయానికి భారత్ టెస్టులో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ హోరాహోరీగా ఏమీ సాగడం లేదు. కానీ విరాట్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు.
‘మాకు గౌరవం ఇవ్వని వారిని మేం గౌరవించాల్సిన పని లేదు’ అంటూ ఆస్ట్రేలియా సిరీస్‌నుంచి కోహ్లి తనను తాను సమర్థించుకుంటూ రావచ్చు గాక... కానీ అన్నింటికి అదే సమాధానం కాబోదు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లి తనలాగే తన జట్టు సభ్యులు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దూకుడు... దూకుడు అంటూ ఒకటే పాఠం వల్లె వేస్తున్నాడు. కోహ్లి దూకుడే సిరీస్ విజయం అందించిందని కొంత మంది చెబుతున్నా, గత కొన్నేళ్లలో అత్యంత బలహీనంగా కనిపించిన ఈ శ్రీలంక జట్టుపై గెలిచేందుకు అది అవసరమా అనిపిస్తుంది.
గంగూలీతో పోలిక
2002లో లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సంబరాలు ఎవరూ మరచిపోలేరు. అంతకు ముందునుంచి కూ డా గంగూలీ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఆస్ట్రేలియాలాంటి జట్టుతో కూడా మాటల యుద్ధానికి సై అనేవాడు. ఇప్పుడు కోహ్లి ప్రవర్తన కొంత వరకు సౌరవ్‌ను గుర్తుకు తెస్తోంది. ‘గాంధీయవాది’లాగే ఉంటే కుదరదు కాబట్టి ‘దూకుడు’ అనే స్టాంప్ అందరికీ ఉండాలి, అప్పుడే వారు ఆటలో దూసుకుపోగలరని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. అయితే నాడు ఒక వైపు అగ్నిలా సౌరవ్ ఉన్నా పరిస్థితిని శాంతపరిచేందుకు జట్టులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లాంటి దిగ్గజాలు ఉండేవారు.
ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లైన వీరి అండ గంగూలీకి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు సహకరించింది. కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నా... సైమండ్స్, హర్భజన్ వివాదాన్ని సాధ్యమైనంత తగ్గించడంలో సచిన్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం మరచిపోలేం. కానీ కోహ్లి పరిస్థితి అలా కాదు. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కొత్త జట్టు. తనకు ఉన్న అనుభవంతోనే జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన పనిలో కోహ్లి ఉన్నాడు. సహజంగానే కెప్టెన్ మాట, అతని ప్రవర్తన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ‘ఓహో... ఇలా ఉండటమే కెప్టెన్‌కు ఇష్టం’ అనే సందేశం ఇప్పుడు ఆటగాళ్లకు వెళుతోంది. అనవసరపు దూకుడుతో ఒక ప్రధాన ఆటగాడిని కీలక మ్యాచ్‌కు జట్టు కోల్పోవడం అర్థం లేనిది. ఇలాంటిదే పునరావృతం అయితే రేపు కోహ్లిపై కూడా నిషేధం పడవచ్చు.
మారాల్సిన సమయం
కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. 2 గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుంది. అప్పుడే అతని పరిణతిపై మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే చెప్పే దూకుడు మాత్రమే జట్టుకు విజయాన్ని అందించలేదని ఇప్పటికే అతనికి అర్థమై ఉండాలి. నిజానికి తన స్వభావాన్ని సరైన దిశలో చూపిస్తే అద్భుతాలు చేయగలనని అతను తన బ్యాటింగ్‌తో చాలా సార్లు నిరూపించాడు. ఆటగాడిగా కోహ్లి అందించిన విజయాలు వెలకట్టలేనివి. మరో వైపు సంగక్కరకు ఫేర్‌వెల్ ఇవ్వడంలో, మూడో టెస్టులో సెంచరీ సాధించిన మ్యాథ్యూస్‌ను భుజంపై తట్టి అభినందించడం చూస్తే ప్రత్యర్థిని గౌరవించగల స్ఫూర్తి కూడా అతనిలో ఉంది.
అయితే అనవసరంగా తెచ్చి పెట్టుకునే ఆవేశాన్ని అతను ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మరీ మెషీన్ తరహాలో బిగదీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.... దూషణలకు దిగే, గొడవలు పెట్టుకునే కెప్టెన్‌ను మనం చూడాలనుకోవడం లేదు. టీవీలో కనిపించే ఈ ఘటనలు అతడి పేరును మరింత చెడగొడతాయి. తన సీనియర్ ధోని నుంచి ఏది నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా... సంయమనంగా ఉండటంలో మాత్రం ‘కెప్టెన్ కూల్’ను అనుసరించాల్సిందే.