
కోహ్లి నాయకత్వానికి పరీక్ష
♦ నేటినుంచి భారత్, శ్రీలంక తొలి టెస్టు
♦ రెండూ యువ జట్లే
భారత జట్టు ఉపఖండంలో అద్భుతంగా ఆడుతుంది కానీ బయట రికార్డు గొప్పగా లేదు అనేది తరచుగా వినిపించే మాట. కానీ ఉపఖండంలో కూడా శ్రీలంకలో టీమిండియా ప్రదర్శన పేలవమే. 22 ఏళ్లుగా అక్కడ భారత్ సిరీస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఇరు జట్లలో ఎక్కువ భాగం యువ ఆటగాళ్లే ఉండగా... ఇటీవలి ప్రదర్శనతో మొగ్గు మన వైపే కనిపిస్తోంది. టెస్టు కెప్టెన్‌గా కోహ్లి తన ముద్ర వేయగలడా అనేది కూడా ఆసక్తికరం.
గాలే : కొంత విశ్రాంతి తర్వాత సుదీర్ఘ సీజన్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. శ్రీలంక రూపంలో జట్టుకు తొలి సవాల్ ఎదురు కానుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, లంక మధ్య నేటినుంచి (బుధవారం) మొదటి టెస్టు జరుగుతుంది. కెప్టెన్‌గా కోహ్లి తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఇటీవల అనూహ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓడిన లంక కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఆటగాళ్ల ఫామ్, ఓవరాల్‌గా జట్టు ప్రదర్శన చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే సొంతగడ్డపై బలమైన జట్టయిన లంక తమ దిగ్గజం సంగక్కర వీడ్కోలు సిరీస్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది.
ఐదుగురు బౌలర్లతోనే
కెప్టెన్ అయిననాటినుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహానికే కట్టుబడ్డానని పదే పదే చెబుతున్న విరాట్ కోహ్లి మరోసారి దానినే అమలు చేసే అవకాశం ఉంది. పేసర్లుగా ఇషాంత్, ఉమేశ్... ముగ్గురు స్పిన్నర్లుగా హర్భజన్, అశ్విన్, మిశ్రా తుది జట్టులో ఉండొచ్చు. గాయంతో విజయ్ దూరం కావడంతో జట్టుకు ఓపెనింగ్ సమస్య తొలగిపోయింది. ధావన్, రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. రాహుల్‌కు జట్టులో అందరికంటే తక్కువ అనుభవం ఉన్నా... అతనూ ఇప్పటికే ఆస్ట్రేలియాలో సెంచరీ చేసేశాడు. కోహ్లి, రహానేలు మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు.
పుజారాను కాదని తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత రోహిత్ శర్మపై ఉంది. మూడో స్థానంలో అతను ఇప్పటికైనా రాణిస్తేనే టెస్టుల్లో భవిష్యత్తు ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్ తగ్గడంతో కీపర్ సాహా కూడా బాగా ఆడితే భారీస్కోరు సాధ్యమవుతుంది. పేరుకు యువ జట్టుగా కనిపిస్తున్నా ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఆడి చాలా మంది ఆటగాళ్లు రాటుదేలారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తాత్కాలికంగా రెండు మ్యాచ్‌లు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు కెప్టెన్సీ చేసిన కోహ్లి తన సామర్థ్యం నిరూపించుకునేందుకు ఇది తగిన అవకాశంగా భావిస్తున్నాడు. భారత టాప్-6 ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు శ్రీలంకలో ఆడలేదు.
మ్యాథ్యూస్‌పై ఒత్తిడి
టెస్టుల్లో నిలకడ లేని జట్టు పాకిస్తాన్ చేతిలో కూడా సిరీస్ పరాజయం, భవిష్యత్తులో ఎక్కువ మంది కుర్రాళ్లతో నిండిన జట్టును నడిపించాల్సిన బాధ్యత వల్ల లంక కెప్టెన్ మ్యాథ్యూస్ ఒత్తిడిలో ఉన్నాడు. వెటరన్ సంగక్కర మార్గనిర్దేశనంలో తొలి రెండు టెస్టుల్లోనే సిరీస్ ఫలితాన్ని తేల్చాలని అతను భావిస్తున్నాడు. అయితే ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగతా వారంతా అనుభవశూన్యుల కిందే లెక్క! కౌశల్ సిల్వ, కరుణరత్నే ఇటీవల మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించారు. వారిపైనే జట్టు మరోసారి ఆధారపడుతోంది. దమ్మిక ప్రసాద్, ప్రదీప్‌లు పేస్ భారం మోస్తున్నారు. స్పిన్‌లో ఆ జట్టు విజయావకాశాలు రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. మరో స్పిన్నర్‌గా కౌశల్ ఉంటాడు.
జట్లు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, ఇషాంత్, ఉమేశ్, మిశ్రా.
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కౌశల్, కరుణరత్నే, సంగక్కర, తరంగ, చండీమల్, ముబారక్, దమ్మిక ప్రసాద్, తరిందు, హెరాత్, ప్రదీప్.