కసితీరా కొట్టారు | india won second T20 match | Sakshi
Sakshi News home page

కసితీరా కొట్టారు

Published Fri, Feb 12 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

కసితీరా కొట్టారు

కసితీరా కొట్టారు

రెండో టి20లో భారత్ ఘన విజయం
రాణించిన ధావన్, రోహిత్, రైనా
►  పెరీరా ‘హ్యాట్రిక్’ వృథా
మూడో మ్యాచ్ రేపు వైజాగ్‌లో

 
తొలి టి20లో ఘోర ఓటమి కసి పెంచిందేమో... భారత క్రికెటర్లు రెచ్చిపోయారు. వికెట్ కాస్త ఫ్లాట్‌గా కనిపించగానే వీర బాదుడు బాదేశారు. ఇక తమ శైలికి సరిగ్గా సరిపోయే పిచ్‌పై భారత స్పిన్నర్లూ పండగ చేసుకున్నారు. వెరసి... శ్రీలంకను కసితీరా కొట్టారు. రెండో టి20లో ఏకంగా 69 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి టి20 రేపు విశాఖపట్నంలో జరుగుతుంది.     
 
 రాంచీ: సొంతగడ్డపై తమ బ్యాటింగ్ బలాన్ని చూపెట్టిన భారత్... ప్రతీకార మ్యాచ్‌లో రెచ్చిపోయింది. శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. చండిమల్ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు), షనక (18 బంతుల్లో 27; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడారు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్‌లో జరుగుతుంది.

ధావన్ జోరు  
భారత్‌కు రోహిత్, ధావన్ చక్కని శుభారంభం ఇచ్చారు. తొలి బంతిని రోహిత్ బౌండరీకి తరలిస్తే.. తర్వాతి రెండు ఓవర్లలో ధావన్ రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో ఓవర్‌లో రజిత నాలుగు ఫోర్లు సమర్పించుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 70 పరుగులు చేసింది. అయితే 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్‌ను ఏడో ఓవర్‌లో చమీరా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే, రోహిత్ మంచి సమన్వయంతో ఆడినా.. లంక బౌలర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్‌లో రోహిత్ ఒక్క సిక్సర్ బాదితే... తర్వాతి ఓవర్‌లో రహానే ఓ రెండు ఫోర్లతో అలరించాడు. అయితే ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్‌కావడంతో భారత్ స్కోరు 127/3గా మారింది. ఈ దశలో రైనా, పాండ్యాల జోరుతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 17వ ఓవర్‌లో పాండ్యా రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్‌లో రైనా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కానీ 19వ ఓవర్‌లో పెరీరా మ్యాజిక్ చేశాడు. వరుసగా మూడు బంతుల్లో పాండ్యా, రైనాతో పాటు యువరాజ్ (0)నూ అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. రైనా, పాండ్యా నాలుగో వికెట్‌కు 4.2 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. చివర్లో ధోని (9 నాటౌట్), జడేజా (1 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. పెరీరా 3, చమీరా 2 వికెట్లు తీశారు.

చకచకా వికెట్ల
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంకేయులు ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. ఓపెనర్లు గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాక వరుస బంతుల్లో అవుటయ్యారు. దీంతో లంక 68 పరుగులకు సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సిరివర్ధన  (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ యువరాజ్, జడేజాలు నాణ్యమైన బంతులతో ఈ ఇద్దరినీ నిలువరించారు. ఆరో వికెట్‌కు 48 పరుగులు జత చేశాక షనక అవుటయ్యాడు. ఆ తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలో పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు.
 
‘భారత క్రికెట్‌లో ప్రయోగాలు అనే మాటను నిషేధించాం. టాప్ ఆర్డర్‌లో అందరూ నిలకడగా ఆడుతున్నారు. కాబట్టి మిగిలిన వాళ్లకి అవకాశాలు కల్పించాలని అనుకున్నాం. ఈ మ్యాచ్ లో అందరూ అన్ని విభాగాల్లో రాణించారు.’ - ధోని
 
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా  (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196.

 వికెట్ల పతనం: 1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186.

బౌలింగ్
: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన  1-0-6-0; షనక 1-0-12-0

శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127.

వికెట్ల పతనం: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement