గెలిపించిన ఆమ్లా, పెరీరా
రెండో టి20లో వరల్డ్ ఎలెవన్ విజయం
లాహోర్: పాకిస్తాన్‌తో రెండో టి20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ విజయ లక్ష్యం 175... చివరి 4 ఓవర్లలో గెలిచేందుకు 51 పరుగులు చేయాలి. హషీం ఆమ్లా (55 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాగానే ఆడుతున్నా, జట్టు విజయంపై సందేహాలు ఉన్నాయి. అయితే ఈ దశలో తిసార పెరీరా (19 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) ఒక్కసారిగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడి చేయాల్సిన 51లో తానొక్కడే 43 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో పెరీరా, బద్రీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
ఎప్పుడో ఆరున్నరేళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ఈ సిరీస్ కారణంగా 41 ఏళ్ల వయసులో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగగా... పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ నిలిచాడు.