World eleven
-
Ashes 4th Test: క్రికెట్ చరిత్రలో కేవలం రెండో జట్టుగా టీమ్ ఇంగ్లండ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు ఓ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఓ రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. యాషెస్ నాలుగో టెస్ట్‌కు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క జట్టులో మాత్రమే కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగులు చేశారు. ఆ జట్టు కూడా ఏ దేశానికి చెందినది కాదు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్‌లో ఐసీసీ వరల్డ్ ఎలెవెన్ జట్టు ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్‌లోని 10 మంది ఆటగాళ్లు కనీసం 1000 పరుగుల మార్కును దాటారు. నాటి జట్టులో స్టీవ్ హార్మిసన్ (743) మినహా అందరూ 1000 పరుగులు దాటిన వారు ఉన్నారు. అందులో ముగ్గురు తమతమ కెరీర్లు ముగిసే నాటికి ఏకంగా 11000 పరుగుల మార్కును దాటారు. ఆ తర్వాత ఇనాళ్లకు (18 ఏళ్ల తర్వాత) తిరిగి మరో జట్టులో కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటిన వారు ఉన్నారు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని మార్క్ వుడ్ (681) మినహా మిగతా 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. నాటి ప్రత్యర్ధి, నేటి ప్రత్యర్ధి రెండూ ఆస్ట్రేలియానే. యాషెస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (1920), బెన్ డకెట్ (1037), మొయిన్ అలీ (2977), జో రూట్ (11236), హ్యారీ బ్రూక్ (1028), జానీ బెయిర్‌స్టో (5623), క్రిస్ వోక్స్ (1717), మార్క్ వుడ్ (681), స్టువర్ట్ బ్రాడ్ (3641), జేమ్స్ ఆండర్సన్ (1327). 2005లో ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు (ఆటగాళ్ల కెరీర్లు ముగిసిన నాటి స్కోర్లు).. గ్రేమ్ స్మిత్ (9265), వీరేంద్ర సెహ్వాగ్ (8586), రాహుల్ ద్రవిడ్ (13288), బ్రియాన్ లారా (11953), జాక్ కలిస్ (13289), ఇంజమామ్ ఉల్ హాక్ (8830), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845), మార్క్ బౌచర్ (5515), డేనియల్ వెటోరీ (4531), స్టీవ్ హార్మిసన్ (743), ముత్తయ్య మురళీథరన్ (1261). -
వరల్డ్ ఎలెవెన్‌తో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే..?
Azadi Ka Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంబురాల్లో భాగంగా ఓ క్రికెట్ మ్యాచ్‌ను కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా, వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య ఆగస్టు 22న ఈ మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ప్రతిపాదనను బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించారు. మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని, వరల్డ్ ఎలెవెన్ జట్టును బరిలోకి దించాలంటే కనీసం 13 నుంచి 14 మంది అంతర్జాతీయ ఆటగాళ్ల అవసరం ఉంటుందని, వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సీజన్ మొత్తానికి సంబంధించి ఇదివరకే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా దేశాలకు (విదేశీ క్రికెటర్లు) చెందిన క్రికెట్ బోర్డులతో మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం మ్యాచ్ జరపాలనుకుంటున్న సమయానికి ఇంగ్లండ్ దేశవాళీ సీజన్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతాయని, ఇందులో పాల్గొనే ఆటగాళ్లను ఆడించాలనుకుంటే వారికి తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, ఆ విషయమై త్వరలో జరిగే ఐసీసీ సమావేశాల్లో డిస్కస్ చేస్తామని వివరించారు. చదవండి: T20 WC 2022: అసలు తమ అత్యుత్తమ జట్టు ఏదో భారత్‌కు తెలుసా? ఏమిటో! -
వెస్టిండీస్‌దే పైచేయి
లండన్: ప్రపంచ టి20 చాంపియన్ వెస్టిండీస్ ఈ ఫార్మాట్లో తన సత్తా మరోసారి చాటింది. వేర్వేరు దేశాలకు చెందిన ఆటగాళ్లతో కూడిన జట్టుపై కరీబియన్ సేన పైచేయి సాధించింది. లార్డ్స్ మైదానంలో భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన హరికేన్ రిలీఫ్ టి20 చాలెంజ్ మ్యాచ్‌లో విండీస్ 72 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, వరల్డ్ ఎలెవన్ 16.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఎనిమిది నెలల క్రితం ఇర్మా, మారియా తుఫాన్ల కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న వెస్టిండీస్ స్టేడియాలను పునరుద్ధరించేందుకు నిధుల సేకరణ నిమిత్తం నిర్వహించిన ఈ మ్యాచ్‌కు ఐసీసీ అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చింది. వెస్టిండీస్ ఓపెనర్లలో ఎవిన్ లూయీస్ (26 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోగా, క్రిస్ గేల్ (28 బంతుల్లో 18; 1 ఫోర్) తన శైలికి భిన్నంగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జోడించిన అనంతరం లూయీస్‌ను రషీద్ ఎల్బీగా వెనక్కి పంపించాడు. ఆ వెంటనే ఆఫ్రిది బౌలింగ్‌లో ఫ్లెచర్ (7) స్టంపౌటయ్యాడు. ఈ దశలో మార్లోన్ శామ్యూల్స్ (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ రామ్‌దిన్ (25 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడి పరుగులు సాధించారు. శామ్యూల్స్ వెనుదిరిగినా... రామ్‌దిన్, ఆండ్రీ రసెల్ (10 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) కలిసి ఐదో వికెట్‌కు 19 బంతుల్లోనే 47 పరుగులు జోడించడంలో విండీస్ భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో వరల్డ్ ఎలెవన్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్ (2), ల్యూక్ రోంచి (0), బిల్లింగ్స్ (4), దినేశ్ కార్తీక్ (0) విఫలమయ్యారు. షోయబ్ మాలిక్ (12), షాహిద్ ఆఫ్రిది (11) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తిసారా పెరీరా (37 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే పోరాడి అర్ధ సెంచరీ సాధించినా లాభం లేకపోయింది. 20 బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. నిబంధనలు సడలించి... పేరుకు అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఇక్కడ రెండు అంశాలపై అందరి దృష్టీ నిలిచింది. మ్యాచ్ నడుస్తున్న సమయంలో మైదానంలో కామెంటేటర్‌ను నిలబెట్టి (రోవింగ్ రిపోర్టర్ పేరుతో) ప్రసారకర్త స్కై స్పోర్ట్స్ ప్రయోగాత్మకంగా వ్యాఖ్యానం వినిపించింది. రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన షాహిద్ ఆఫ్రిది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రన్నర్ సహాయంతో బ్యాటింగ్ కొనసాగించాడు. మరోవైపు ‘ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్’గా ఇక్కడ సహచరుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్న ఆఫ్రిది, ఛారిటీ కోసం తన ఫౌండేషన్ తరఫు నుంచి 20 వేల డాలర్లు విరాళం అందించాడు. -
ఐసీసీ ప్రపంచ ఎలెవన్‌లో పాండ్యా, కార్తీక్
దుబాయ్: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లు ఐసీసీ ప్రపంచ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ జట్టు ఈ నెల 31న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లో తలపడుతుంది. గతేడాది హరికేన్ బీభత్సంతో కరీబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరఫున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు. -
పాకిస్తాన్‌దే ఇండిపెండెన్స్ కప్
∙ మూడో టి20లో వరల్డ్ ఎలెవన్‌పై విజయం ∙ 2–1తో సిరీస్ సొంతం లాహోర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై అగ్రశ్రేణి ఆటగాళ్లతో జరిగిన క్రికెట్ సిరీస్ పాకిస్తాన్ అభిమానులకు ఆనందాన్ని పంచింది. వరల్డ్ ఎలెవన్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇండిపెండెన్స్ కప్ పేరుతో నిర్వహించిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ గెలుచుకుంది. శుక్రవారం ఇక్కడి గడాఫీ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌ను ఓడించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అహ్మద్ షహజాద్ (55 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. అనంతరం వరల్డ్ ఎలెవన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులే చేయగలిగింది. తిసార పెరీరా (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్లు మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిదిలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించింది. -
గెలిపించిన ఆమ్లా, పెరీరా
రెండో టి20లో వరల్డ్ ఎలెవన్ విజయం లాహోర్: పాకిస్తాన్‌తో రెండో టి20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ విజయ లక్ష్యం 175... చివరి 4 ఓవర్లలో గెలిచేందుకు 51 పరుగులు చేయాలి. హషీం ఆమ్లా (55 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాగానే ఆడుతున్నా, జట్టు విజయంపై సందేహాలు ఉన్నాయి. అయితే ఈ దశలో తిసార పెరీరా (19 బంతుల్లో 47 నాటౌట్; 5 సిక్సర్లు) ఒక్కసారిగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో విరుచుకుపడి చేయాల్సిన 51లో తానొక్కడే 43 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు), అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో పెరీరా, బద్రీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఎప్పుడో ఆరున్నరేళ్ల క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ఈ సిరీస్ కారణంగా 41 ఏళ్ల వయసులో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగగా... పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ నిలిచాడు. -
అభిమానుల ఉత్సాహం మధ్య...
►తొలి టి20లో వరల్డ్ ఎలెవన్‌పై పాక్ విజయం ►రాణించిన బాబర్ ఆజమ్ లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల ఆనందోత్సాహం, కేరింతల మధ్య ఆ జట్టు ఇండిపెండెన్స్ కప్‌లో గుర్తుంచుకునే విజయాన్ని నమోదు చేసింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదుల దాడి తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్లు పాక్‌లో ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో పాక్‌లో సంబరాలు మిన్నంటాయి. రెండేళ్ల క్రితం జింబాబ్వే ఆడినా... ఆ సిరీస్‌కు ఇంతటి ఆకర్షణ లేకపోయింది. మంగళవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాక్ 20 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. సొంత మైదానంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 86; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు), షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం వరల్డ్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. స్యామీ (29), డు ప్లెసిస్ (29), ఆమ్లా (26), పైన్ (25) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సొహైల్, రయీస్, షాదాబ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన నాలుగు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాక్ జట్టే గెలుపొందడం విశేషం. రెండో టి20 ఇదే మైదానంలో నేడు జరుగుతుంది. ► నేటి రెండో టి20 మ్యాచ్ సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్ పర్యటనకు మరిన్ని జట్లు రావాలి
►ఐసీసీ చైర్మన్ మనోహర్ ఆకాంక్ష ►నేటి నుంచి వరల్డ్ ఎలెవెన్‌తో పాక్ టి20 సిరీస్ దుబాయ్: పాకిస్తాన్లో ఎనిమిదేళ్ల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు మార్గం సుగమం కావడంపై ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. నేడు, రేపు ఈనెల 15న లాహోర్‌లో వరల్డ్ ఎలెవన్, పాకిస్తాన్ జట్ల ఇండిపెండెన్స్ కప్ కోసం మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ అంతర్జాతీయ హోదా కూడా ఇచ్చింది. ఇప్పటికే డు ప్లెసిస్ నేతృత్వంలోని 14 మందితో కూడిన జట్టు కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్‌లో అడుగుపెట్టింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి అనంతరం పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ఆసక్తి ప్రదర్శించలేదు. ‘ప్రపంచ క్రికెట్‌కు ఇది మంచి రోజు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు ఎంతో ఆతృతగా ఈ రోజు కోసం ఎదురుచూశారు. పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు ఐసీసీ ఎంతగానో తోడ్పడింది. దీంట్లో భాగంగా పాకిస్తాన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఈ సిరీస్ అనంతరం పాక్‌లో విరివిగా మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నాను’ అని శశాంక్ తెలిపారు. మరోవైపు కేవలం ఇది క్రికెట్ కోసం సాగే పర్యటన మాత్రమే కాదని, అభిమానుల దృష్టితో చూస్తే అంతకుమించి అని వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ‘సుదీర్ఘ కాలం తర్వాత పాక్ అభిమానులు ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను చూడబోతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పాక్‌లో తిరిగి క్రికెట్‌ను తెచ్చేందుకు నా వంతు పాత్ర కూడా ఉందని గుర్తుచేసుకుంటా’ అని అన్నాడు. ► నేటి తొలి టి20 మ్యాచ్సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం -
ట్వంటీ 20 సిరీస్ కు దూరం!
కరాచీ: వరల్డ్ ఎలెవన్ తో మంగళవారం నుంచి ఆరంభమయ్యే మూడు ట్వంటీ 20ల సిరీస్ కు పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చేవారం ఆమిర్ భార్య లండన్ లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమిర్ తన భార్య వద్ద ఉండాలనుకుంటున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతి తీసుకుని లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. మరొకవైపు ట్వంటీ 20 సిరీస్ ఆడేందుకు ప్రపంచ ఎలెవన్ జట్టు పాక్ కు చేరుకుంది. డుప్లెసిస్ సారథ్యంలోని జట్టు లాహోర్ లో అడుగుపెట్టింది. ట్వంటీ 20 సిరీస్ కు దాదాపు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. మూడు ట్వంటీ 20లు లాహోర్ లో జరుగనున్నాయి. తొలి మ్యాచ్ మంగళవార జరుగనుండగా, రెండో మ్యాచ్ బుధవారం జరుగనుంది. శుక్రవారం మూడో మ్యాచ్ ను నిర్వహించనున్నారు.