అభిమానుల ఉత్సాహం మధ్య...
►తొలి టి20లో వరల్డ్ ఎలెవన్‌పై పాక్ విజయం
►రాణించిన బాబర్ ఆజమ్
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల ఆనందోత్సాహం, కేరింతల మధ్య ఆ జట్టు ఇండిపెండెన్స్ కప్‌లో గుర్తుంచుకునే విజయాన్ని నమోదు చేసింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదుల దాడి తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్లు పాక్‌లో ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో పాక్‌లో సంబరాలు మిన్నంటాయి. రెండేళ్ల క్రితం జింబాబ్వే ఆడినా... ఆ సిరీస్‌కు ఇంతటి ఆకర్షణ లేకపోయింది. మంగళవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాక్ 20 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది.
సొంత మైదానంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 86; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు), షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం వరల్డ్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. స్యామీ (29), డు ప్లెసిస్ (29), ఆమ్లా (26), పైన్ (25) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సొహైల్, రయీస్, షాదాబ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన నాలుగు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాక్ జట్టే గెలుపొందడం విశేషం. రెండో టి20 ఇదే మైదానంలో నేడు జరుగుతుంది.
► నేటి రెండో టి20 మ్యాచ్ సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం