Babur Azam
-
Babar Azam: నయా నంబర్‌వన్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 94 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు తగిన ప్రతిఫలం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి బాబర్ ఆజమ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. 2015 నుంచి అంతర్జాతీయ వన్డేలు ఆడుతున్న 26 ఏళ్ల ఆజమ్ ఖాతాలో ప్రస్తుతం 865 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆజమ్ టాప్ ర్యాంక్‌లోకి రావడంతో 1,258 రోజుల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 857 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. 2017 అక్టోబర్ నుంచి కోహ్లి వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 825 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, రాస్ టేలర్ (న్యూజిలాండ్–801 పాయింట్లు) నాలుగో స్థానంలో, ఫించ్ (ఆస్ట్రేలియా–791 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన బాబర్ ఆజమ్ 56.83 సగటుతో 3,808 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో బాబర్ ఆజమ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ ఐదు కాగా ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. టి20ల్లో గతంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ఆజమ్ ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. -
పాకిస్తాన్‌దే వన్డే సిరీస్
సెంచూరియన్: ఫఖర్ జమాన్ (104 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (82 బంతుల్లో 94; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇమామ్ ఉల్ హఖ్ (57; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో... దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో పాకిస్తాన్ 28 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2013 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై పాక్ వన్డే సిరీస్ నెగ్గడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది. చివర్లో హసన్ అలీ (11 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. వెరీన్ (62; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫెలుక్వాయో (54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. షాహీన్ అఫ్రిది, నవాజ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. -
పాకిస్తాన్ 139/2
మాంచెస్టర్: ఇంగ్లండ్ టూర్‌ను పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం మొదలైన తొలి టెస్టులో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్, షాన్ మసూద్ ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే నిలిపేయడంతో తొలిరోజు కనీసం 50 ఓవర్లయినా సాగలేదు. బాబర్ (100 బంతుల్లో 69 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో నిలిచాడు. ఓపెనర్ షాన్ మసూద్ (152 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. అబిద్ అలీ (16)ని ఆర్చర్ క్లీన్‌బౌల్డ్ చేయగా... కెప్టెన్ అజార్ అలీ (0)ని వోక్స్ డకౌట్‌గా పంపాడు. దీంతో మసూద్, బాబర్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: షాన్ మసూద్ బ్యాటింగ్ 46; అబిద్ అలీ (బి) ఆర్చర్ 16; అజార్ అలీ ఎల్బీడబ్ల్యూ (బి) వోక్స్ 0; బాబర్ బ్యాటింగ్ 69; ఎక్స్‌ట్రాలు 69; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 139/2. వికెట్ల పతనం: 1–36, 2–43. బౌలింగ్: అండర్సన్ 8–2–32–0; బ్రాడ్ 11–4–24–0, వోక్స్ 8–2–14–1, ఆర్చర్ 10–3–23–1, బెస్ 9–1–30–0, రూట్ 3–0–9–0. -
పాక్ వన్డే, టి20 జట్ల కెప్టెన్‌గా ఆజమ్
లాహోర్: స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను పాకిస్తాన్ వన్డే, టి20 జట్లకు కొత్త కెప్టెన్‌గా నియమించారు. సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వీటిని బాబర్ ఆజమ్‌కు కట్టబెట్టారు. టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా అజహర్ అలీనే కొనసాగుతాడని చీఫ్ సెల క్టర్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. అలాగే 2020–21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. 18 మంది ప్లేయర్ల కాంట్రాక్టులో కొత్తగా ఇద్దరికి చోటు దక్కింది. నసీమ్ షా, ఇఫ్తికార్ అహ్మద్‌లు రాగా... హసన్ అలీ, ఆమిర్, వహాబ్ రియాజ్‌లకు కాంట్రాక్టు దక్కలేదు. ఇమామ్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యాసిర్ షాల కాంట్రాక్టు గ్రేడ్ తగ్గించారు. వీళ్లంతా ‘బి’ కేటగిరీకి పడిపోయారు. ఇప్పుడు ‘ఎ’ కేటగిరీలో కొత్తగా షహీన్ షా అఫ్రిదికి చోటు దక్కగా మొత్తంగా ఈ గ్రేడ్‌లో ఉన్నది ముగ్గురే. మిగతా ఇద్దరు అజహర్ అలీ, బాబర్ ఆజమ్‌లు కాగా... ఈ కాంట్రాక్టు జూలై 1 నుంచి వచ్చే జూన్ దాకా అమల్లో ఉంటుంది. -
ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 64/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లలో 335 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (104; 13 ఫోర్లు) అసాధారణ పోరాటంతో సెంచరీ సాధించాడు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను బాబర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (95; 10 ఫోర్లు)తో కలిసి పాక్ పరువు నిలిపే పోరాటం చేశాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. సెంచరీ పూర్తయిన వెంటనే బాబర్ నిష్క్రమించగా, రిజ్వాన్ శతకం చేజార్చుకున్నాడు. రిజ్వా న్, యాసిర్ షా (42)లను హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ఎం తో సేపు నిలువలేదు. హాజల్‌వుడ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు 29 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది -
దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్
జొహన్నెస్‌బర్గ్: బౌలర్లు మరోసారి విజృంభించడంతో పాకిస్తాన్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 65.4 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 153/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 120 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ ఒలివియర్ వరుస బంతుల్లో బాబర్ ఆజమ్ (29 బంతుల్లో 21; 5 ఫోర్లు), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (0)లను ఔట్ చేసి పాకిస్తాన్‌ను దెబ్బ తీశాడు. క్రీజులో నిలదొక్కుకున్న అసద్ షఫీఖ్ (71 బంతుల్లో 65; 11 ఫోర్లు)ను ఫిలాండర్ ఔట్ చేయడంతో పాక్ కోలుకోలేకపోయింది. షాదాబ్ ఖాన్ (47 నాటౌట్; 7 ఫోర్లు), హసన్ అలీ (22; 2 ఫోర్లు, సిక్స్) కాస్త పోరాడినా దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశారే తప్ప పాక్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒలివియర్, రబడ మూడేసి వికెట్లు తీశారు. సిరీస్ మొత్తంలో 24 వికెట్లు తీసిన ఒలివియర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం... రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించాయి. -
ఆసీస్‌పై పాక్ జయభేరి
అబుదాబి: బాబర్ ఆజమ్ (55 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్స్), ఇమాద్ వసీమ్ (3/20) రాణిం చడంతో పాకిస్తాన్ పొట్టి ఫార్మాట్లో ఆసీస్‌పై భారీ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ జూలైలో హరారేలో 45 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును సవరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బాబర్‌తో పాటు వన్‌డౌన్‌లో దిగిన మొహమ్మద్ హఫీజ్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. 105 పరుగుల వరకు ఒకే వికెట్‌ను కోల్పోయిన పాక్ మరో 28 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్టాన్లేక్, ఆండ్రూ టై మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆసీస్ 16.5 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫించ్ (0), షార్ట్ (4)లను వసీమ్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 22 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూల్టర్‌నీల్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. -
బాబర్ ఆజమ్ సెంచరీ
అబుదాబి: బాబర్ ఆజమ్ (133 బంతుల్లో 101; 6 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీతో పాకిస్తాన్‌ను గెలిపించాడు. సోమవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పాక్ 32 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఒక దశలో పాక్ 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా...ఆజమ్, షాదాబ్ ఖాన్ (52 నాటౌట్) కలిసి జట్టును ఆదుకున్నారు. అనంతరం శ్రీలంక 48 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉపుల్ తరంగ (144 బంతుల్లో 112; 14 ఫోర్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించినా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో లంకకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో వన్డే ఇన్నింగ్స్‌లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఓపెనర్‌గా తరంగ గుర్తింపు పొందాడు. -
అభిమానుల ఉత్సాహం మధ్య...
►తొలి టి20లో వరల్డ్ ఎలెవన్‌పై పాక్ విజయం ►రాణించిన బాబర్ ఆజమ్ లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల ఆనందోత్సాహం, కేరింతల మధ్య ఆ జట్టు ఇండిపెండెన్స్ కప్‌లో గుర్తుంచుకునే విజయాన్ని నమోదు చేసింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదుల దాడి తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్లు పాక్‌లో ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో పాక్‌లో సంబరాలు మిన్నంటాయి. రెండేళ్ల క్రితం జింబాబ్వే ఆడినా... ఆ సిరీస్‌కు ఇంతటి ఆకర్షణ లేకపోయింది. మంగళవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాక్ 20 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. సొంత మైదానంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 86; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... అహ్మద్ షహజాద్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు), షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం వరల్డ్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. స్యామీ (29), డు ప్లెసిస్ (29), ఆమ్లా (26), పైన్ (25) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సొహైల్, రయీస్, షాదాబ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన నాలుగు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాక్ జట్టే గెలుపొందడం విశేషం. రెండో టి20 ఇదే మైదానంలో నేడు జరుగుతుంది. ► నేటి రెండో టి20 మ్యాచ్ సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం