పాక్ పర్యటనకు మరిన్ని జట్లు రావాలి
►ఐసీసీ చైర్మన్ మనోహర్ ఆకాంక్ష
►నేటి నుంచి వరల్డ్ ఎలెవెన్‌తో పాక్ టి20 సిరీస్
దుబాయ్: పాకిస్తాన్‌లో ఎనిమిదేళ్ల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు మార్గం సుగమం కావడంపై ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. నేడు, రేపు ఈనెల 15న లాహోర్‌లో వరల్డ్ ఎలెవన్, పాకిస్తాన్ జట్ల ఇండిపెండెన్స్ కప్ కోసం మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లకు ఐసీసీ అంతర్జాతీయ హోదా కూడా ఇచ్చింది. ఇప్పటికే డు ప్లెసిస్ నేతృత్వంలోని 14 మందితో కూడిన జట్టు కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్‌లో అడుగుపెట్టింది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి అనంతరం పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ఆసక్తి ప్రదర్శించలేదు. ‘ప్రపంచ క్రికెట్‌కు ఇది మంచి రోజు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు ఎంతో ఆతృతగా ఈ రోజు కోసం ఎదురుచూశారు. పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు ఐసీసీ ఎంతగానో తోడ్పడింది.
దీంట్లో భాగంగా పాకిస్తాన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఈ సిరీస్ అనంతరం పాక్‌లో విరివిగా మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నాను’ అని శశాంక్ తెలిపారు. మరోవైపు కేవలం ఇది క్రికెట్ కోసం సాగే పర్యటన మాత్రమే కాదని, అభిమానుల దృష్టితో చూస్తే అంతకుమించి అని వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ‘సుదీర్ఘ కాలం తర్వాత పాక్ అభిమానులు ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను చూడబోతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పాక్‌లో తిరిగి క్రికెట్‌ను తెచ్చేందుకు నా వంతు పాత్ర కూడా ఉందని గుర్తుచేసుకుంటా’ అని అన్నాడు.
► నేటి తొలి టి20 మ్యాచ్‌సాయంత్రం గం. 6.30 నుంచి డి–స్పోర్ట్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం