పాకిస్తాన్‌దే ఇండిపెండెన్స్ కప్
∙ మూడో టి20లో వరల్డ్ ఎలెవన్‌పై విజయం
∙ 2–1తో సిరీస్ సొంతం
లాహోర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై అగ్రశ్రేణి ఆటగాళ్లతో జరిగిన క్రికెట్ సిరీస్ పాకిస్తాన్ అభిమానులకు ఆనందాన్ని పంచింది. వరల్డ్ ఎలెవన్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇండిపెండెన్స్ కప్ పేరుతో నిర్వహించిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ గెలుచుకుంది. శుక్రవారం ఇక్కడి గడాఫీ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్‌ను ఓడించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
అహ్మద్ షహజాద్ (55 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. అనంతరం వరల్డ్ ఎలెవన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులే చేయగలిగింది. తిసార పెరీరా (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్లు మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిదిలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించింది.