నాయకుడు గెలిపించాడు
►మరోసారి రాణించిన రోహిత్ శర్మ
► పుణేపై ముంబై ఇండియన్స్ విజయం
పుణే: స్టార్ ఆటగాళ్లు... తెరవెనుక అతిపెద్ద మంత్రాంగం... అయినా ఆరంభంలో విజయాలు సాధించడంలో వెనుకబడ్డ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పుంజుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (60 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి జట్టును నడిపిస్తుండటంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో పుణేపై నెగ్గింది. సీజన్ తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఎదురైన పరాజయానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
ఆరంభం అదుర్స్...
ఓపెనర్లలో రహానే (4) విఫలమైనా... సౌరభ్ తివారితో కలిసి వన్‌డౌన్‌లో స్మిత్ మోత మోగించాడు. మూడు ఓవర్ల తేడాలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌లో తివారి రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో స్మిత్ మూడో సిక్సర్ బాదాడు. అయితే వేగంగా ఆడుతున్న ఈ జోడిని పదో ఓవర్‌లో బుమ్రా విడగొట్టాడు. అద్భుతమైన ఫుల్ లెంగ్త్ బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్ ముగిసేసరికి పుణే స్కోరు 93/2కు చేరింది.
అప్పటి వరకు వాయువేగంతో దూసుకుపోయిన పుణే స్కోరు బోర్డుకు హర్భజన్ కళ్లెం వేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ ఓ వికెట్ తీయడంతో పాటు పరుగులూ నిరోధించాడు. దీంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 27 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తివారి, ధోని (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 33 పరుగులు జత చేశాక 18వ ఓవర్‌లో తివారి అవుటయ్యాడు. చివరి ఓవర్‌లో ధోని కూడా వెనుదిరిగాడు.
మళ్లీ సారథే...
తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే రావడంతో కాస్త ఒత్తిడికి లోనైన రోహిత్ మూడో ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదిన పార్థీవ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. తర్వాత రాయుడు (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) సింగిల్స్‌తో రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడంతో పవర్‌ప్లేలో 51/1 ఉన్న స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 76/1కి చేరింది. వేగంగా ఆడే ప్రయత్నంలో రాయుడు 12వ ఓవర్‌లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్ ఆ తర్వాత వేగంగా ఆడాడు. రెండోఎండ్‌లో బట్లర్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం ఖాయమైంది.
స్కోరు వివరాలు
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) క్రునాల్ (బి) మెక్లీనగన్ 4; సౌరభ్ తివారి (సి) హార్దిక్ (బి) బుమ్రా 57; స్మిత్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 45; హాండ్స్‌కాంబ్ (సి) బట్లర్ (బి) హర్భజన్ 6; ధోని (సి) రాయుడు (బి) బుమ్రా 24 ; పెరీరా నాటౌట్ 12; భాటియా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1-8; 2-92; 3-105; 4-138; 5-149.
బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-27- 1; క్రునాల్ 2-0-28-0; బుమ్రా 4-0-29-3; హార్దిక్ 2-0-14-0; హర్భజన్ 4-0-25-1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 85; పార్థీవ్ (సి) ధోని (బి) దిండా 21; రాయుడు (సి) రహానే (బి) అశ్విన్ 22; బట్లర్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1-39; 2-91.
బౌలింగ్: పెరీరా 4-0-35-0; దిండా 3-0-33-1; బొలాండ్ 3-0-23-0; భాటియా 3-0-20-0; ఆర్. అశ్విన్ 3-0-21-0; ఎం.అశ్విన్ 2.3-0-25-0.